పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేయుచుండిరి. కొన్నిరోజులకు నాతమ్ముడు బందరులో మెట్రిక్యులేషన్‌చదువుటకు వచ్చి నాదగ్గరనే యుండెను.

మా మేనత్తగారికుమారుడు రావూరి కృష్ణయ్య, అతని చెల్లెలు మాయింటనే యుంటూయుండిరి. ఆ చిన్నదానికి వివాహమై కాపురమునకు వెళ్ళినది. ఆపిల్లలకు తలిదండ్రులు గతించిరి. కనుక కృష్ణయ్యకు మాఅత్తగారే ఆధారము. ఇట్లుండగా మానాన్నగారికిని ఆమెకును ఏదోమనస్పర్థ లేర్పడినందునను, ఆమె మనుమడు కోమట్లవద్ద గుమాస్తాగా చేరి కొంచెము జీతము తెచ్చుకొనుచుండుటచేతను ఆమెయు, అతడును మాయింటినుండి లేచిపోయి వేరొకచోట కాపురముండిరి. అప్పుడు నాభార్యయే ఇంటిపను లన్నియు చేసి వంటవండి, తక్కినవారికి భోజనములుపెట్టి తాను భోజనముచేయుచు, భార మంతయు వహించుచుండెను. చిన్నతనమునుండి పుట్టినింట పనిపాటలు చేసియుండకపోయినను దురభిమానముందుకొనక అన్నిపనులు తానే చేయుచుండెను. అందువలన మానాన్నగారు, కడుపున బుట్టిన కుమార్తెవలె కోడలిని ప్రేమతో చూచుచుండిరి. ఇట్లు కొలదికాలము జరిగెను. ఇంతలో మామేనత్తగారి మనుమడు కృష్ణయ్య జబ్బుచేసి దైవవశమున చనిపోయెను. కాన ఆమెను మాతండ్రిగారు మరల మాఇంటికి తీసుకొనివచ్చిరి. కనుక నేను నాభార్యను బందరు తీసుకొనివచ్చినను పూర్వమువలెనే మా మేనత్తగారు వండిపెట్టుటమొదలగు ఇంటిపనులు చేయుచుండిరి.

నేనిట్లు బందరులో నావ్యవహారములు చూచుకొనుకాలములోనే బాపట్ల చెరువులోతట్టుభూములు పల్లపుసాగునిమిత్తము