పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒక్కవంతును, మరియొక గ్రామములో నొకవంతును మరికొన్ని గ్రామములలో ఈనాములు, ఇండ్లుమొదలగునవి యుండెను. కృష్ణమూర్తిగారే వారికుటుంబము కలసియున్నప్పుడు వారి జమీను ఎనిమిదిగ్రామముల వ్యవహారములను నడుపుచు వ్యవహర్తయు, కార్యదక్షుడును, పలుకుబడికలవాడుగా నుండెను. వారితో పోల్చినచో మాస్థితి చాలచిన్నది. మేము ముందు ముందు హెచ్చుస్థితికి రాగలమని వారిఆశ. అసమానమైన వియ్యమైనను, వివాహము మొత్తమునకు మర్యాదతోనడిచినది.

వేసవిసెలవులు ముగిసి, కోర్టులు తిరుగ తెరచుసమయమున నేను నాకుటుంబమును తీసుకొని బందరు వెళ్ళవలెనని యుద్దేశించుకొని, అంతకుముందే బందరులో హనుమంతరావున్న ఇంటిప్రక్కనే యొకభాగము తీసికొంటిని. ఆ ఇంటివారే నాకు వండిపెట్టుటకు ఏర్పాటుచేసుకొని కొన్నిమాసములు గడిపితిని. ఇప్పుడు ఆయింటనే కాపురము పెట్టితిమి. మొట్ట మొదట బందరులో న్యాయవాదిగా జేరుటకు వచ్చునపుడు ఖర్చుల నిమిత్తము మాతండ్రిగారు ముప్పదిరూపాయలు మాత్ర మిచ్చిరి. పిమ్మట నేను వారియొద్దనుండి ఏమియు తీసికొనలేదు. ఇప్పుడు నాభార్యను పిల్లను తీసుకొని బందరులో కాపురముచేయుటకు బయలుదేరుచు నొకబిందెయు, అన్నమువండుకొనుట కొకగిన్నెయు, కూరగిన్నె, రెండుచెంబులు మొదలగునవి మాచిన్న కాపురమునకు మిక్కిలి అవసరమైన పాత్రలుమాత్రమే తెచ్చుకొంటిమి. మాతండ్రిగారు, మేనత్తగారు, నాతమ్ములును గుంటూరులోనే భూముల అజమాయిషీతో కాలక్షేపము