పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మేము చెన్నపట్టణము చదువునిమిత్తము పోవకముందే భారతదేశమున ఆసేతుహిమాచలము కూడ మదాంబ్లావట్‌స్కీ, కల్నల్ఆల్‌కాట్‌గార్లు సంచారముచేసి, భారతీయసంస్కృతిని గూర్చియు, ఆర్యమతసాంప్రదాయములనుగూర్చియు మహోపన్యాసముల నిచ్చుచు ప్రముఖులతో సంభాషణలుగావించుచుండిరి. పాశ్చాత్యవిద్యలపైనను పాశ్చాత్యాచారసాంప్రదాయములందును వ్యామోహము ప్రబలి మన పూర్వపుటున్నతిని గుర్తెరుంగని భారతీయులందు సంచలనము గల్పించి, భారతదేశ పూర్వచారిత్రమునందును సంస్కృతియందును, అభిమానము నంకురింపజేసిరి. ఒకప్పుడు చెన్నపట్టణములో కల్నల్‌ఆల్కాట్ ఇంగ్లీషులో గావించిన మహోపన్యాసము మహోన్నతహిమాలయశృంగాలనుండి అతివేగముగా దిగబారు గంగాప్రవాహము వలె వీనులవిందై ఆశ్చర్యముగూర్చెను. పదసౌష్ఠవమును ఉదారభావములు నటులుండ మనపూర్వశాస్త్రములు కళలులోనగు వానివివరణలు, యోగశాస్త్రాభ్యాసములవలన మహాపురుషులు పొందిన అద్భుతశక్తులు, మనపూర్వపుటౌన్నత్యమును, ఇప్పటి పతనమును వర్ణించుటలో సభ్యులహృదయములు నూతనోత్సాహభరితములయ్యెను. మదామ్ బ్లావట్‌స్కీ రుషియా దేశపుస్త్రీ యగుటవలన ఆంగ్లేయభాషలో ఉపన్యసింపజాలకుండెను. ఆమె హిమాలయములలో నివాసముచేసి, అద్భుతమైన శక్తులు సమకూర్చుకొనెనని ప్రజలలో గాఢమగు విశ్వాసముండెను. వారు అడయారులో నెలకొల్పిన దివ్యజ్ఞానసమాజమను సంస్థ భారతదేశములోనే గాక, లోకమున అనేక దేశములలో పిమ్మట స్థాపించబడిన దివ్యజ్ఞానసమాజములకు, కేంద్ర