పుట:Dhruvopakhyanamu.djvu/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పర్వమునుండి గ్రంథముముగింప నరణ్యపర్వ శేషము నెర్రప్రెగ్గడ తెనిగించెను. ఇట్లే భాస్కరుడు ప్రారంభించిన భాస్కర రామాయణము శిథిలము కాగా నారణ్యకాండ యుద్ధకాండ పూర్వభాగములుదక్క దక్కిన కాండములు మల్లికార్జునాదులచే బూరింపబడియె. భాగవతము సైతము పోతనకృత స్కంధములు కొన్ని శిథిలము కాగా గంగన బొప్పన నారనసింగనాదులు పూరించిరి. ఇట్లు శిథిలమగుటకు ముఖ్యహేతువేమి? రాజరాజనరేంద్రుడు క్రీ.శ. లో జనిపోవగా నతనిపుత్రుడు కులోత్తుంగుడు చోళదేశము పరిపాలించుచుండెను. రాజనరేంద్రుని తమ్ముడు విద్వత్పక్షపాతిగాక క్రూరుడగుట చేతను నన్నయ ప్రవయస్కుడగుటచే భారతరచన నిలిచియుండును. భాస్కరుడు ప్రతాపరుద్రుని సేనాని యగుమారని కంకితమిచ్చి రచించెను. 1335 కాలమున నోరుగల్లు తురకలచే -- నందున భాస్కర రామాయణము నష్టమయ్యె. నష్టభాగముల దత్పుత్రాదులు పూరించిరి. ఇట్లే 1430 ప్రాంతమున నోరుగల్లు తురకలచే నాక్రమింపబడినప్పుడు భాగవతము సైతము లోకవ్యాప్తము కాకమున్నే కొన్ని స్కంధ భాగములు నష్తములయ్యె ననుట సత్యమునకు దూరము కాదు. కాకతీయ రాజ్యము మహోన్నతదశలో నున్న కాలమున ననగా క్రీ. శ. 1000 నుండి 1440 వరకు రచింపబడిన గ్రంథసహస్రములలో నుభయభాషలలోను 20-30 కంటె నెక్కువగా మనకాలమునకు నిలిచినవి కావు. రాజ్యవిప్లవముల వలన బ్రజలు దేశభ్రష్టులై ప్రాణమానములు దక్కించుకొన బారిపోవునప్పుడు తాళపత్ర సంపుటముల గొనిపోవుదురనుట బసంభవము. అట్టి కాలములోని గ్రంథమగు భాగవతము కొంతభాగమైనను లభించుట మన భాగ్యమే యని సంతుష్టి సెందదగు. భాగవతములో 1, 2, 7, 10 (పూర్వ భాగము) స్కంధములు మాత్రమే పోతన కవిత్వమనియు 3, 4, 5, 8, టిలో గొన్ని భాగములు పరపూరితములనియు 6, 12 (ఉత్తరభాగము), 11, 12, స్కంధములు పోతన కవితగాదనియు బెద్దలు నిశ్చయించిరి. ఏప్చూరి సంగన షష్ఠస్కంధము మొదలుపెట్టెను. సింగనాదులు తృతీయ చతుర్థ పంచమ స్కంధములు పూరించిరి. అష్టమశేష నవమ స్కంథముల నేకాదశ ద్వాదశ స్కంథముల నారయాదులు ముగించిరి. పోతన కవిత శ్రేష్ఠమైనది