పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆవడాబాయి

75

1880 వ సంవత్సరమునందు సోలాపురమునందుండు దాదా సాహెబుజోగుగారి జేష్ఠపుత్రుఁడగు అప్పాసాహెబు అను నాతనిని ఆవడాబాయి వివాహమయ్యెను. వివిహానంతర మాఱుమాసములలోనే యత్తమామలు లోకాంతరగతులైరి. కాన ఆవడాబాయి పాదగుణఫల మిదియని లోకు లామెను నిందింపసాగిరి. ఇట్టి నిందనలను లెక్కింపక యాయబల పరమేశ్వరుని నమ్మియుండెను. తదనంతరము 1886 వ సంవత్సరమునం దామెకు దు:ఖసహమగు వైధవ్యము ప్రాప్తించెను. పతిమరణసమయమునం దామెకు పదియేడేండ్ల ప్రాయముండెను ఇంత చిన్నతనమునందుఁ గూఁతున కిట్టిదురవస్థ ప్రాప్తించి నందున రావుబహద్దరు భీడేగారు ఆవడాబాయికి విద్యనేర్పి ఆవిద్యవలనఁ గలుగు ఆనందములో నామె వైధవ్యదు:ఖమును లోపింపఁదలఁచిరి.

హిందూదేశ హితచింతకులగు సర్ విల్యమ్ వేడర్ బర్నుదొరగారు పూనానివాసులను ప్రోత్సాహపఱచి వారికి ననేక విధసహాయములఁ జేసి స్త్రీలకొఱకు స్థాపించిన హయిస్కూలులో ప్రధమమునం దావాడాబాయియే విద్యార్థిని యయ్యెను. ఈమె యంతకుఁ బూర్వమె మహారాష్ట్రభాష యందు నాలుగుపుస్తకములును, ఇంగ్లీషు మొదటిపుస్తకమును ఇంటనే చదివినదేగాన, పాఠశాలాధ్యక్షురాలామెను పరీక్షించి యింగ్లీషు రెండవతరగతిలోఁ జేర్చుకొనెను. అచట విద్య నభ్యసించుకాలమునం దామె తనసత్ప్రవర్తనవలనను, విద్యాభిరుచివలనను సహాధ్యాయినులకును, ఉపాధ్యాయినులకును మిగుల ప్రియురా లాయెను.