పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

అబలాసచ్చరిత్ర రత్నమాల.

బోసి నీ కిచ్చెదను. నీవు దానినిఁ గొనిచని సురక్షిత మగుచోటనుంచు నంతలోనే నచటికివత్తును," మంగలి "బనబీరుఁ డింతలో నిచటికి రాఁగలఁడు. వచ్చువఱ కిచట రాజపుత్రుఁడు లేకుండె నేని తత్క్షణము చారులచే వెతకించి పిల్లనిఁ దెప్పించును. అటులైన రాజపుత్రుని ప్రాణములను మనము కాపాడ నేరము." పన్నా కొంచెముయోచించి మిగులఁ గాంభీర్యముగా "ఇందు కంతగా విచారింపనేల? వాఁడిచటికి వచ్చిన యెడల రాజపుత్రుఁ డిచట లేఁడనుమాటనే వానికి దెలియనియ్యను. రాజబాలుని నగలను బట్టలను నాబిడ్డనికి నలంకరించి యాప్రక్కమీఁదనే పరుండఁ బెట్టెదను ! నాపుత్రుని మరణమువలన మేవాడదేశపురాజును మాప్రభుఁవునునగు నీబాలుడు రక్షింపఁబడును కాన నాకదియే పరమసమ్మతము." పన్నా దృఢనిశ్చయముగాఁ బల్కినవాక్యములను విని యానాపితుఁడు మిగుల నాశ్చర్యముతో నేమియు ననక నిలువఁబడి యుండెను. ఇంతలో పన్నా రాజపుత్రుని నొకతట్టలో నునిచి పైన పుల్లాకులు, పెంట మొదలయినవిపోసి యాతట్టత్వరగాఁ గొని చనుమని యాసేవకుని తొందర పఱుపసాగెను. దీని నంతనుగని పన్నా ధైర్యమునకును రాజభక్తికిని వింతపడిదాని యందధిక దయగలవాఁడై యాభృత్యుఁడు "పన్నా ! నీవింత సాహసకార్య మేలచేసెదవు? ఇంకను నీమనంబునం దించుక విచారింపుము." పన్నా "విచారింపవలసిన దే మున్నది? నాకర్తవ్యము నేను చేయుటకుఁ దగినవిచారము చేసినాను. నీవిట్టియాటంకములనే చెప్పుచు నిచట నాలస్యము సేయకు."