పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృపాబాయి

41

1886 వ సంవత్సరమునం దామెభర్తను చెన్నపట్టణమునకు మార్చిరి; యచటికి వచ్చిన యనంతరము పత్రికలకు వ్యాసములు వ్రాయుటలోనే కాలము గడపక ప్రబంధరచన చేయుట మంచిదియని యామె భర్త సూచించెను. అందుపై నామె తనబాల్యము నందలి యనేక సంగతులను జ్ఞప్తికిఁదెచ్చుకొని వానితోఁ దన కల్పనలను గూర్చి 'సగుణమ్మ' యనుప్రబంధము నొకదాని నింగ్లీషునందు వ్రాసెను. అది ప్రస్తుతము తెలుఁగునందు భాషాంతరీకరింపఁబడి యున్నది. దానిలో నీదేశపు క్రీస్తుమతస్థుల గృహస్థితులును నదీపర్వతారణ్యముల సౌందర్యమును మిగుల చక్కఁగా వర్ణింపఁబడియున్నవి. ఈ గ్రంథము వ్రాసి ముగించినపిదప నామె కొకకొమార్తె గలిగెను. ఆబిడ్డ విస్తారదినములు జీవింపకయే చనిపోవుటవలనఁ గృపాబాయికి దు:ఖము ప్రాప్తమయ్యెను. అందుచే నామె కదివఱకుఁగల యుత్సాహము తగ్గిపోయెను. కాని కృపాబాయి యంతతోఁ దనప్రయత్నమును మాని సదాదు:ఖింపుచునుండక తా నెటులనైన నితరులకు నుపకార మొనర్చి యందువలనఁ దనదు:ఖమును నుపశమింపఁ జేసికొనవలయునని సదా ప్రయత్నింపుచుండెను. ఆ సమయమునం దామె శరీరముసహితము అస్వస్థముగా నుండినందున మి. సత్యనాధనుగారామెను బొంబాయినగరమునకుఁ గొనిపోయిరి. అచటి గాలివలన నామెశరీర మించుక స్వస్థపడునని వారు తలఁచిరి; కాని ప్రయాణశ్రమవలన నారుగ్ణత హెచ్చుకాఁగా నామెను వెంటనే మరల మద్రాసునకుఁ గొనిపోవలసివచ్చెను. అచట నామె బహుదినము లాంగ్లేయవైద్యశాలలో నుంచఁ