పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

294

అబలాసచ్చరిత్ర రత్నమాల.

బిలిచి "నాయనా! నాశరీరమున రోగము హెచ్చెను. అది యిచటఁ బాగుకాదు. నేనుపరమేశ్వరుని సన్నిధికరిగిన నాబాధ నివారణమగును. తదనంతరము బాగయి వచ్చెదను. నేను పోవునపుడు నీవు ఏడ్వక సంతోషముగా బుద్ధి కలిగియుండుము." అని చెప్పఁగా నాబాలుఁ డౌననియెను! తదనంతర మామె 1900 వ సంవత్సరము నవంబరు 3 వ తేది రాత్రి స్వర్గస్థయయ్యెను. ఆమెకొఱకై యామెబంధువు లందఱును విలపించుచుండిరి. అప్పు డాశిశువు తల్లిమాటల యందలి విశ్వాసము వలన నెంతమాత్రము నేడువక గులాభిమొదలగు పూవులను దెచ్చి తల్లిశవముపై నుంచి "యమ్మా దేవునివద్దికిఁ బొమ్ము బాగయిరమ్ము" అని చెప్పి యామెను గొనిపోయిన పిదప నేడ్చువారినిఁ గని "మీరేలయేడ్చెదరు? మాయమ్మరోగ మిచట కుదురనందున దేవునికడకరిగెను. అచట బాగయి మరల రాఁగలదు. ఇట్లని నాతోఁ జెప్పిపోయినది" యని తన ముద్దుమాటలతోఁ జెప్పెను. ఈవనలతాదేవి మరణము కామె బంధువులేకాక యామెను గనినవారును, నామె సద్గుణములను వినినవా రందఱును మిగుల దు:ఖింపుచున్నారు. ఈమెకు మరణసమయమున నిరువదియొకటవసంవత్సరము. ఈమె యింత యల్పవయస్సునచే మృతినొందుట దేశముయొక్క దురదృష్టమనియే చెప్పవలయును.