పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

256

అబలాసచ్చరిత్ర రత్నమాల.

ఇ ట్లహోరాత్రములు పదియేడుదినముల వఱకును అసమాన విద్యావంతులగు సరసవాణీ శంకరులకు ఘోరమయిన వాదము జరిగి తుదకు సరసవాణి యడిగినప్రశ్న కుత్తరము చెప్పఁజాలక శంకరు లామెను నాఱునెలల వ్యవధి యడఁగిపోయి మఱికొంతవిద్య నభ్యసించి మరలవచ్చి యామెకు సమాధానము చెప్పెను. అందుపై మండనమిశ్రుఁడు సన్యసింపఁగా సరసవాణి దివి కరిగెను.

ఈసరసవాణి చరితమువలన నామె కాలమునందలి హిందూసుందరులు గొప్పవిద్య నభ్యసింపుచుండి రనియును, వారు గొప్పపండితులతో సహితము వాదవివాదములు చేయుచుండిరనియును దెలియఁబడుచున్నది. ఆకాలమునందు నో రెఱుఁగని పసిపాపలకుఁ దల్లిదండ్రులు తమసమ్మతితో వివాహములు చేయు నాచారములేక కన్యావరులు యుక్తవ యస్కులయినపిదప వారి యనుమతి ననుసరించియే వివాహములు జరుగుచుండె ననియును స్పష్టముగాఁ దెలియుచున్నది. అప్పటి సంఘస్థితినిఁబట్టి చూడఁగా నప్పటిస్త్రీ లత్యంతోచ్చదశయందుండినట్టు తేలుచున్నది. కాని ఆకాలమునం దట్టియుచ్చపదవియం దుండిన హిందూసుందరులు ప్రస్తుత మత్యంత హీనస్థితికి వచ్చి తమదుర్దశనే తెలిసికోఁజాలనంతటి యజ్ఞానిను లగుట మిగుల దు:ఖకరము. పూర్వకాలము నందలి స్త్రీలకును, ఈ కాలపు స్త్రీలకును గలతారతమ్యము సతీహితబోధినీ పత్రికోక్తముగా నిం దుదాహరించి యీ చరితము ముగించెదను.

"ఈభరతఖండమునం దిప్పుడున్న స్త్రీలస్థితికిని పూర్వకాలమునం దుండిన స్త్రీలస్థితికిని మిక్కిలి వ్యత్యాసము గలదు.