పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

248

అబలాసచ్చరిత్ర రత్నమాల.

యేలేశ్వరోపాధ్యాయులవా రామెకు విద్యనేర్ప మొదలుపెట్టిరి. కాని విద్య త్వరగా రాకుండినందుల కామె మిగుల చింతించి విద్యార్థులకు బుద్ధివైభవము కలుగుటకై తండ్రి చేసియుంచిన జ్యోతిష్మతియను తైలము నెవ్వరికినిఁ జెప్పక త్రాగెను. అందుపై నామెకు దేహతాప మతిశయిల్ల నింటిలోనుండిన బావిలోఁ దుమికెను. తదనంతరమున నింటిలోనివా రామెను వెదకి యెందునుగానక తుదకు బావిలో చూచిరి. అప్పటి కామె తాపము కొంత చల్లారినందున నామెకుఁ దెలివి వచ్చి వారికిఁ దనవృత్తాంతమునంతను జెప్పెను. అదివిని తండ్రి యామె నాబావిలో మరి కొన్నిగడియలుంచి బైటికిఁ దీసెను. నాఁడు మొద లామెకు విశేషమైన తెలివియు జ్ఞాపకశక్తియుఁ గలిగినందున నాచి తండ్రియొద్దఁగల సంస్కృత విద్యనంతను నేర్పెను.

విద్యావతియైనపిదప నీమెకు దీర్థయాత్రలు చేయవలయుననిబుద్ధి పొడమఁగాఁ దండ్రియందున కంగీకరించి యామెను యాత్రలకంపెను. నాచియుఁ దీర్థాటనమునుఁ జక్కఁగాఁ జేసికొని వచ్చుచుండెను. అప్పుడు కాశీ మొదలగుస్థలములయం దీమెకు పండితులతో వాదముచేయుట సంభవించెను. అప్పు డా విద్యావతి వారి నోడించి మిగుల మెప్పుగాంచెను. ఇదిగాక యాపండిత డిల్లీ యాగ్రా మొదలగు స్థలముల కరిగి రాజసభల యందు విద్వాంసులతో వాదముచేసి గెలిచి విశేష బహుమతులందెను. ఆమె యాకానుక లన్నియుఁ దీసికొనివచ్చి తండ్రికిఁజూపి యతనకిఁ దన యాత్రా వృత్తాంతమంతయు వినిపించెను. బ్రాహ్మణుఁడు కొమార్తెకుంగల వైధవ్యదు:ఖమునం