పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

234

అబలాసచ్చరిత్ర రత్నమాల.

రాణా కిచ్చినయెడల నేను మానసింహునకుఁ దోడుపోయి నీతో యుద్ధముచేయుదును" ఈవార్త విన్నంతమాత్రమున భీమసింహుఁడు తననిశ్చయమును మరల్పకుండెను. తనమాటను ఉదేపూరు రాణా లక్ష్యపెట్టకుండుటఁ గని సిందే మిగులకోపించి యుద్ధసన్నాహముతో బయలుదేరి యుదయపురమును సమీపించెను. సిందే ఉదయపుర ప్రాంతమున విడిసినపిదప కొన్నిదినములకు భీమసింగుఁడును సిందేయును నొక దేవాలయములోఁ గలిసి యేమో యాలోచించి జయసింహునకుఁ నియ్యనని భీమసింగు వర్తమానమంపెను. జయపురాధిపతి తనయాస లన్నియు నిరాశ లగుటవలన మిగుల కోపగించుకొని మానసింహునితో యుద్ధము చేయుటకై సైన్యము సిద్ధపఱుప నాజ్ఞాపించెను. మానసింహుఁడును యుద్ధమునకు కాలుద్రవ్వుచునే యుండెను. అతని శత్రువులు కొందఱు లక్ష యిరువదివేల సైన్యము పోగుచేసి జయసింహునకు సహాయులయిరి. అప్పుడారాజుల కిరువురకును పర్వతశిఖర మనుస్థలమున ఘోరసంగ్రామము జరిగెను. ఆ యుద్ధమునందు మానసింహుని సైనికులనేకులు జయసింహునితోఁ గలియుటవలన మానసింహుఁడు యుద్ధమునుండి పలాయితుఁ డయ్యెను. ఇట్లు పాఱిపోయి యాతఁడు యోధగడయను దుర్గములో దాఁగియుండెను. జయసింహునిసేన యోధగడను ముట్టడించి భేదింపఁ దొడఁగెను. కాని యాదుర్గ మబేద్య మగుటచే వారు దానిని భేదింపనేరక మరలిపోయిరి. ఈయుద్ధమునందు జయసింహుని సైన్యము మిగుల నాశమొందెను. కాన జయపురాధీశ్వరుఁడు తనపురమునకుఁ బాఱిపోయెను. మానసింహుని శత్రుఁడయిన రాజొకఁడు