పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

204

అబలాసచ్చరిత్ర రత్నమాల.

నను వదలియిటకు వచ్చునేని నాకు కారాగృహ వాసమో, స్వర్గవాసమో కలిగెనని తెలిసికొనుము."

ఇట్లాయన తనపత్నిని వీడ్కొని అశ్వారోహణముచేసి మితపరివారముతో జేసోరునకుఁ బయలుదేరెను. ఇంతలో నాతని నెదుర్కొనుటకయి ప్రతాపాదిత్యుఁడు పంపిన సేన లాతనిని దారి తప్పించి యొకయరణ్యమధ్యమునకుఁ గొని చని యచట నతనిని జంపిరి. ఆయనప్రాణము విడిచినతోడనే పావుర మాతని భార్యసన్నిధి కరిగెను. ఆపక్షినిం గనినతోడనే యాసతి మానహానికి వెఱచి తనపరివారముతో సమీపమునందున్న చెఱువునంబడి ప్రాణములు విడిచెను. ఆమె పుత్రుఁడుమాత్రము జసరేశ్వరియొక్క సంరక్షణలో సురక్షితుఁడై యుండెను.

పినతండ్రినిఁ జంపి తాను సుఖింతునని ప్రతాపాదిత్యుఁడు తలఁచెను. కాని యాతని పాపఫల మధికమైనందున నాతని కట్టిసుఖము దొరకదయ్యెను. వసంతరాయుల మరణానంతర మల్పకాలములోనే రాజామానసింహుఁడను అగ్బరు సేనాధిపతి విపులసైన్యముతో ప్రతాపాదిత్యునిపై యుద్ధయాత్ర వెడలెను. ప్రతాపాదిత్యుఁ డును ఆతనితోడఁ బోరుటకు శక్తుఁడుగా నుండుటవలన యుద్ధసన్నద్ధుఁడయ్యెను. ఆసమయమున నాతనియొద్ద నెనుబదివేల కాల్బలములును, పదివేల అశ్వములును, ఇన్నూరు గజములును నూరుతోపులు యుద్ధమునకయి సిద్ధముగానుండెను. ఇదిగాక బుడతకీచులును ఆతనికి సహాయులైయుండిరి. కానియింత కలిగియుఁ దుద కాతనికే యపజయము కలిగెను. దీనికొక కారణము కలదు. అచటి గ్రామదేవతయగు జసరేశ్వరియొక్క ముఖము మఱియొకవైపునకుఁ దిరిగెనఁట. యుద్ధసమయమున