పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాక్పుష్టా.

169

కును నిఁక నెవ్వరును లేనిసమయమున నగ్నియందు ప్రాణముల నాహుతిచేసినఁ జేయవచ్చును."

ఈవాక్యముల నుడువునప్పుడు వాక్పుష్ట శరీరమునం దొకకాంతి కలిగి మిగుల ప్రకాశించెను. అప్పు డామెకు మిగుల నుత్సాహము కలిగెను. ఆమె యేకాగ్రచిత్తముతోఁ బరమేశ్వరునిఁ బ్రార్థించి పతితో మరల "లెండి తమ రిఁక చింతింపఁ బనిలేదు. మనప్రజ లిఁక కాటకమునుండి రక్షింపఁబడియెద రని నాకుఁ దోఁచె." అనిచెప్పెను.

పరమపతివ్రత వాక్య మెప్పుడు నసత్యము కాఁజాలదనియెదరు. అట్లే పవిత్రురాలగు వాక్పుష్ట నుడువులును నసత్యములు కావయ్యె. మఱునాఁడు వేలకొలఁది పావురములు చచ్చి యాపురమునఁ బడియెను. అందువలన లోకులు వానినే తిని బ్రతికిరి. ఇతిహాసజ్ఞులగువారు స్కాట్‌లండ్ చరిత్రమునం దిట్టి యద్భుతము జరుగుట నెఱిఁగియుందురు. కాన నిది వారి కసంభవమని తోఁచకుండెడిని. రాజు తనభార్యయం దిట్టి యసామాన్యసద్గుణములు వసియించుటఁ గని యాత్మహత్య చేసికొనుట మానెను. కాశ్మీరవాసులు సుస్థిరులైరి. వాక్పుష్ట యొక్క పుణ్యచరితమువలన కాశ్మీరదేశము త్వరలోనే ధనధాన్యసమృద్ధంబై యచటఁ బ్రజలు సుఖసంపద నొప్పియుండిరి.

తుంజీనుఁడు బహుదినములు రాజ్యభోగముల ననుభవింపక ముప్పదియాఱవ యేటనే కాలధర్మము నొందెను. వాక్పుష్ట సహగమనము చేసెను.