పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహారాణీఝాశీ లక్ష్మీబాయి

141

పోవ ప్రయత్నించెనుగాని యాపని సిద్ధించినదికాదు. ఇంతలో శత్రుసైనికులు కొంద ఱామెను చేర రాఁగా నాయువతి మిగుల శౌర్యముతో వారిలో ననేకుల నంతకపురంబున కనిచెను !! వారు బహు జనులును ఈమె యొంటరిది, కాన వారిలో నొకఁ డామె వాలునకు జంకక పక్కగా నిలిచి యామె తలకుడివైపుగా నఱికెను. బంధింపఁబడిన సింహముపై మత్త గజమాడు నట్లాభటుఁడు చేసిన ఖడ్గప్రహారమువలన నామె తల కుడివైపంతయు తరగఁబడి రక్తము ప్రవహింపసాగెను. ఇంతలో నాయాశ్వికుఁడు తన ఖడ్గము రాణిగారి యురమునందు గ్రుచ్చెను. పురుష వేషముతో నుండుటవలన నీమె రాణిగారని పగవారికి గుర్తింప రాకున్నను, శత్రుపక్షమునందలి యొకా నొకసైన్యాధిపతియగునని వారికిఁ దోఁచెను. ఈదెబ్బతో రాణిగా రాసన్నస్థితిని బొందెను. కాని యావీరయువతి యట్టి సమయమునందును ధైర్యము విడువక తన నట్టిస్థితికి దెచ్చిన యాశ్వికునిఁ బరలోకమున కనిచెను !

ఇట్లామె వానినిఁజంపి బొత్తుగా శక్తిహీన మయ్యెను. అంతవఱ కామెను విడువకున్న రామచంద్రరావు దేశముఖు సగము ముఖము కోయఁబడిన రాణిగారిని శత్రువులచేతఁ బడకుండ సమీపమునందున్న పర్ణకుటిలోనికిఁ గొని చనెను. ఆయన మిగుల దు:ఖించి రాణిగారికి నుపచారములు చేయు చుండెను. కాని 1858 వ సంవత్సరము జూను నెల 18 వ తేదిని అద్వితీయశౌర్యగుణ మండితురాలగు ఝాఁశీ మహారాణి లక్ష్మీబాయిగా రీలోకమును విడిచి శాశ్వతసుఖప్రదమగు లోకమున కరిగెను! రామచంద్రరావు దేశముఖగారును