పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

అబలాసచ్చరిత్ర రత్నమాల.

ఈప్రకార ముభయసైన్యములును యుద్ధసన్నద్ధములై 23 వ తేదిని సంగ్రామమున కారంభించిరి. ఆదినము శత్రువులు ఝాఁశీకిల్లాను సమీపింప యత్నించిరి. కాని కోటలోని వారి యాగ్నేయ బాణప్రవృష్టి వారి కసహ్యమయినందున సమీపింపఁజాలక పోయిరి. ఆరాత్రి యింగ్లీషు సైనికులు కొందఱు గ్రామము సమీపించి యచట నాలుగుస్థలముల బురుజు లేర్పఱచి వానిపై పిరంగుల నునిచిరి. ఝాఁశీలోనివారును ఆరాత్రి యంతయు యుద్ధప్రయత్నమే చేయుచుండిరి. 24 వ తేదినాఁడు సహిత మింగ్లీషుసైన్యంబులే దైన్యంబు నొందెను. 25 వ తేది ప్రాత:కాలముననే యింగ్లీషు సైన్యంబులనుండి కిల్లాపైనిని, పురముపైనిని శతముఖ బాణవృష్టి కాసాఁగెను. ఆగోళమొకటి వచ్చి శత్రుసైన్యములోఁబడి పగిలి నలుగు రైదుగురినిఁజంపి పదిమందిని గాయపఱచుచుండెను. కాన నాదిన మాపట్టణము నందెచటఁజూచినను హాహాకారములే వినఁబడుచుండెను. ప్రజలన్నాహారములకై తిరుగఁ జాలకుండిరి. వారి దైన్యమును గని రాణిగారు వారికొఱ కొకయన్నసత్రము నేర్పఱిచిరి. ఆంగ్లేయ సైన్యంబులనుండి నారాయణాస్త్ర తుల్యములగు గోరమువలన తనసైన్యంబులు దీనముఖంబు లగ్టఁగని లక్ష్మీబాయి యింతటితో ధైర్యమువదలక సైనికుల కుత్సాహమును గలుగఁజేసి యాంగ్లేయసైన్యములను ధిక్కరించెను. ఇట్లీయుభయ సైన్యములును బీరువోవక మార్చి 30 వ దేదివఱకును సంగ్రామం బొనర్చుచుండెను. ప్రతిపక్షులగు ఆంగ్లేయసైన్యమున కనేక సేనానాయకులుండి నడుపుటవలనను, సైనికు లదివఱకే