పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహారాణీఝాశీ లక్ష్మీబాయి

125

ప్రయత్నములవలనఁ దనకు రాజ్యము మరల ప్రాప్తించుననియు రాణిగారికి మిగుల నమ్మక ముండెను.

1855 వ సంవత్సరమున దామోదరరావుగారికి నుపనయనము చేయఁదలఁచి ఆపిల్లనిపేర దొరతనమువారు దాఁచియుంచిన 6 లక్షల రూపాయలలోనుండి యొకలక్ష రూపాయలిండని రాణిగారు దొరతనమువారిని నడిగిరి. అందుకువారు నీవు దీనికొఱ కెవరినైన జామీనుంచినంగాని యియ్యమనఁగా నదేప్రకారము వారుకోరినవారి జామీనిచ్చి లక్షరూపాయలు తీసికొని, యాసంవత్సర మాఘమాసమునందు మహావైభవముతోఁ గుమారుని యుపనయనము చేసెను. తన భర్త సొత్తు పుత్రుని యుపనయనమునకుఁ దీసికొనుటకుఁగాను పరుల జామీను కావలసినందుకు రాణిగారి మనస్సెంత ఖేదపడి యుండెనో చదువరులే యోచింపఁగలరు.

ఇట్లు రాణిగా రత్యంతదు:ఖముతోఁగాలము గడుపు చుండఁగా 1857 వ సంవత్సరమున హిందూపటాలము లింగ్లీషువారిపైఁ దిరుగఁబడిన భయంకరకాలము ప్రాప్తించెను. ఈ యుద్ధ మితిహాససిద్ధమేగానతిహాజ్ఞుల కందఱకు విదితమే.

పటాలములు తిరగఁబడిన యీవర్తమానము ఝాశీలోని హిందూపటాలములకుఁ దెలిసి యదివఱకడఁగియున్న ద్వేషాగ్ని ప్రజ్వలింప జూన్ నెల 1 వ తేదిని వారును బందిపోటునకు బ్రారంభించిరి. వారి సేనానాయకుఁడు వారిని సన్మార్గమునకుఁ ద్రిప్ప నెంతయత్నించినను వారుతిరుగకుండిరి. అదిగని యతఁడు గ్రామమునందలి యాంగ్లేయుల నందఱును మిగుల భద్రమగు కిల్లాలోని కరుగుఁడని గుప్తరీతినిఁ దెలుపఁగా వారా