పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

అబలాసచ్చరిత్ర రత్నమాల.

కాలములో పేష్వాలరాజ్యాధికార మెల్ల నింగ్లీషువారి యధీన మయినందున ఝాశీ సంస్థానాధీశునితో నాంగ్లేయ ప్రభుత్వము వారికి విశేష స్నేహభావము గలిగెను. ఈయన పుత్రహీనుఁ డగుటవలన నాయనంతర మాయన పినతండ్రియగు రఘునాధరావు, ఆయన యనంతర మాయనతమ్ముఁ డగుగంగాధరరావును రాజ్యమును పాలించిరి. ఈగంగాధరరావు చరిత్రనాయిక యొక్క భర్త.

మోరోవంతు తాంబే యనుక రాడే బ్రాహ్మణుఁడు పూనానగరమున వసియింపుచుండెను. ఆయనయందు రెండవ బాజీరావు సహోదరుఁ డగు చిమాజీయప్పాగారికి మిగుల విశ్వాసమును స్నేహమును గలిగియుండెను. 1818 వ సంవత్సరమున 8 లక్షల పించెను పుచ్చుకొని స్వరాజ్యమును ఇంగ్లీషువారి కిచ్చినట్టు పత్రము వ్రాసియిచ్చి రెండవ బాజీరావు బ్రహ్మావర్తమున వాసము చేయఁ జనెను. ఆసమయమునం దాయన తమ్ముఁడగు అప్పాగారును తమకుఁ దొరకు పింఛనును సేవకులను తీసికొని కాశీక్షేత్రమున వసియింపఁ దలఁచి దొరతనమువారి యనుజ్ఞవడసి కాశికిఁ బోయిరి. ఆయన పరివారములోనివాఁడు, కాన మోరాపంతుతాంబే సహిత మచటికే చనెను. ఈతనిని శ్రీమంతులగు నప్పాగారికి దివానుగా నుంచి, తత్ప్రీత్యర్థము నెలకు ఏఁబదిరూపాయల వేతన మొసంగుచుండిరి.

మోరోపంతుగారి భార్యయగు భాగిరధీబాయి సద్గుణమునందును సౌశీల్యమునందునుమిగుల ప్రఖ్యాతివడసెను. భార్య యిట్టి దగుటవలననే మోరోపంతుగారికి సంసారయాత్ర