పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106

అబలాసచ్చరిత్ర రత్నమాల.

తమయినసుఖమును బడయఁగలమా యనుశంకను నివృత్తిచేసికొనుట కీప్రపంచము మన కవకాశ మెన్నఁడును గలుగఁజేయనేరదు. కాని పయికగుపడుచున్న సాధనముల యంతరములకుఁ దగిన సౌఖ్యమును మనుజు లెల్లప్పుడును బొందుచుండుట లేదనిమాత్రము మనము చెప్పవచ్చును. అసౌఖ్య మనునది కొందఱు చేరి తమలోతాము విభాగించుకొనఁ దగినపదార్థము గాదు. అది మనమనసునుబట్టి యుండును. దురవస్థలలో కెల్ల మరణమే గొప్పదని యెంచెద మంటిమా కొందఱు దానిరాక కేల సంతోషింపరు? మఱికొంద ఱేల దు:ఖింతురు? వేయేల? మృత్యువును, దుర్దశయును, మంచివారికిని, పున్యాత్ములకును, పాపాత్ములకును, భాగ్యవంతులకును, దరిద్రులకును, దేశద్రిమ్మరులకును, గృహస్థులకును సమానముగనే వచ్చుచుండును. ఆపత్ కాలమున నందఱు వివశులగుటయు, కక్ష్యావేశముచే నెవ్వరు ప్రతిభావంతులు గాకుండుటయును సుప్రసిద్ధమే. రానున్న విపత్తు నెంతటి మనుజుఁడైన నడ్డగింపలేఁడు. ఆపదలును, నెల్లప్పుడు మనల ననుసరించియే యున్నవి. కాఁబట్టి వానిరాకకు ప్రతిమనుష్యుఁడును నిరీక్షించియే యున్నాఁడు. ఏదియయిన నొక యుత్కృష్టమైన పనియొక్కఫలిత మనుకూలముగానుండెనా, దానిని పూనికతో నెరవేర్చినవారి పరిశ్రమమును ఘనముగా ప్రశంసింతుము. లేక యది ప్రతికూలముగా పరిసమాప్తి నొందెనా తత్కార్యవాహుల యనజ్ఞనను నిందింతుము. ఈతీరుననే యదృష్టము మాఱి, ఫలము విఫలమయినచో లోక మది యవివేక మని చాటుటకు సిద్ధమయి యుండును.