పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డాక్టరు ఆనందీబాయి జోశి

97

కాని యుద్యోగములోఁబ్రవేశించి స్వతంత్రతను పోఁగొట్టుకొనుట కిష్టములేక యామె దానిని స్వీకరించకుండెను. తదనంతర మామెకు నమేరికాలో వైద్యవిద్య నభ్యసించుకోరిక యధికమయ్యెను.

కలకత్తానుండి శ్రీరామపురమనుస్థలమునకు మార్చినందున నాదంపతు లచటికరిగిరి. అచటి కరిగినపిదపఁ గొన్నిదినములు సెలవుతీసికొని వారు సమీపమునందుఁగల జయపూర్, ఆగ్రా, గ్వాలియర్, లఖనొ, కాన్‌పూర్, డిల్లి, ప్రయాగ, కాశీ మొదలగు ప్రసిద్ధపట్టణములను జూడనరిగిరి. అందువలన ఆనందీబాయికిఁగొంతవరకు ప్రవాసస్థితి తెలిసెను. వారుమరలి శ్రీరామపురమునకు వచ్చినకొద్దిదినములలోనే రెండు సంవత్సరముల సెలవుతీసికొని అమేరికాదేశమున కరుగ నిశ్చయించిరి. కాని యింతలో నీకు సెలవియ్యఁజాలమని పైనుండి యుత్తరువు వచ్చెను. అందువలన ఆనందీబాయి నొకర్తనే యమేరికాకుఁ బంపఁదలఁచి గోపాలరావుగా రామెతో నొకదిన మిట్లు ప్రసంగించిరి : _

గోపాలరావు (చింతతో) నీఒంటిరిగానే అమేరికాకు వెళ్ళెదవా? నాకిప్పుడు సెలవుదొరకదు. నీకిచటనుండిన విద్యాభ్యాసము కానేరదు. కాన నొంటరిగానైన నరుగుట యావశ్యకము. మనమిరవురము కలసి వెళ్ళవలెననినచో నింకను రెండుసంవత్సరముల వ్యవధిపట్టును. ఇంతలో నీచదు వచటఁ జాలవఱకగును.

ఆనందీబాయి ఏమియు ననక భర్తవంకచూచి మీరేమనెదరని యడిగినటుల నగుపడెను, దానింగని