పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుద్రమదేవి.

ఈసతీరత్న మాంధ్రదేశమునందలి యోరుగంటిరాజ్యమును మిక్కిలి చక్కఁగా నేలిన శూరవనిత. ఈమె కాకతీయగణపతిరాజుభార్య. దేవగిరిరాజు కూఁతురు. రుద్రమదేవి తనభర్త మరణానంతరము క్రీ. శ. 1257 వ సంవత్సరము నుండి 1295 వ సంవత్సరమువఱకును ముప్పదియెనిమిది సంవత్సరములు రాజ్యపాలనము చేసినట్లు దాన శాసనములవలనను, చరిత్రకారులు వ్రాసినదానివలనను స్పష్టముగాఁ దెలియుచున్నది. సోమదేవరాజీయమునందును రుద్రమదేవి ముప్పది యెనిమిదిసంవత్సరములు రాజ్యపాలనము చేసిన ట్లీక్రిందిపద్యమునఁ జెప్పఁబడినది.

                 గీ. ఆ యనకు నప్పగించి యయ్యమ్మ యట్లు
                     బుధజనంబులుఁ బ్రజలును బొగడ నవని
                     ముప్పదియు నెన్మిదేఁడులు మోద మొదవ
                     నేలి కైలాసశిఖరి నేఁగుటయును.

కాకతీయగణపతి మరణానంతర మాతనిభార్య యగు రుద్రమదేవి దు:ఖసముద్రమున మునిఁగి యుండెను. అప్పుడు మంత్రియయిన శివదేవయ్యగారి హితవచనముల వలన నామె దు:ఖమును మఱచి రాజ్యమునకు వారసు లెవ్వరును లేకయుండినను కూఁతురగు ఉమ్మక్కకుఁ గలుగుసంతానమే సింహా