పుట:2015.328620.Musalamma-Maranam.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ii

కాదర్శమయినాడు. కావున 1914 ప్రాంతముల ఆరంభమయిన మాగ్రంథాలయోద్యమము సిరులకొరవడినను ప్రజాభక్తి ప్రజాసేవల కొరవడక పనిచేసికొనివచ్చినది. నూర్లకొలది గ్రంథాలయములు స్థాపితమయినవి. నడచినవి. నడచుచున్నవి. పత్రికాపఠనము ప్రముఖముగా సాగినది. పల్లెటూరి గ్రంథాలయముల స్థాపన నిర్వహణములలో భారతభూమిలో తక్కిన యన్నిప్రాంతములకును ఆంధ్రభూమి యొజ్జయనిపించుకొనినది. ఆంధ్రభూమిలో జీవకళ యున్నదనిన నీ యుద్యమప్రభావమని చెప్పిన నది యతిశయోక్తి కాజాలదు. ప్రజాసామాన్యమును వారియిండ్లవద్ద కలుసుకొని వారి హృదయములను చూఱగొను ప్రయత్నములు ఎచ్చటనులేని విచ్చట జరిగినవి. మొదటి 25 ఏండ్ల కార్యదర్శి ఏకైక కార్యనిర్వాహకుడు శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య మెదడున గ్రంథాలయ యాత్రస్వరూపము మొదలినది. అది కార్యరూపము దాల్చి కొన్నిప్రాంతముల దివ్యమైన పనిసాగినది. అతడు ‘గ్రంధాలయ సర్వస్వము’ పత్రికను ఏకైకవీరుడై సాగించినాడు. కన్నబిడ్డకంటె గారాబముగ నీ యుద్యమమును సాకినాడు. అతనిపిదప కార్యభారము తలదాల్చిన మా నాగభూషణ మతనిని మించువాడు. ఈతని మెదడున బోటుగ్రంథాలయము మెదలినది. అది ఇతర ప్రాంతముల కుదాహరణప్రాయమైనది. వయోజన విద్యార్హ గ్రంథరచనప్రచురణము లితని వాంఛ దగిలినవి. పెదపాలెములోని ఇతని సేవాశ్రమము— పదులఏండ్లుగా పదిలముగా పనినడుపుకొని వచ్చిన పలుకుదంభములేని పట్టుదలసంస్థ—ఈపని నారంభించినది. అటు తాడేపల్లిగూడెమున గ్రామసేవాసమితి యనుపేర గ్రంథాలయోద్యమ సేవకులు—డాక్టరు తేతలి సత్యనారాయణమూర్తి ప్రభృతులు—చక్కని చిన్నిప్రచురణములు బయల్వరచు చున్నారు.