1. ముగ్గురు మనువుల వృత్తాంతము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

క.శ్రీమన్నామ! పయోద, శ్యామ! ధరాభ్రుల్లలామ! జగదభిరామా!

రామాజనకామ! మహో, ద్దామ! గుణస్తోమధామ! దశరథ రామా!


అధ్యాయము - ౧

వ. మహనీయ గుణగరిష్టులగు నమ్మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణవ్యాఖ్యాన వైఖరీసమేతుండయిన సూతుండిట్లనియె. అట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రుడు శుక యోగీంద్రుని గనుంగొని.

క.వినఁబడియెను స్వాయంభువ, మనువంశము వర్ణ ధర్మ మర్యాదలతో

మనుజుల దనుజుల వేల్పుల, జననంబులు స్రష్ట లెల్ల జనియించుటయు౯.


ఉ.ఏ మనుకాలమందు హరి ఈశ్వరుఁడేటికి సంభవించె నే

మేమి యొనర్ఛె నమ్మనువు లే రతఁ డేక్రియఁ జేయుచున్న వాఁ

డేమి నటించు మీఁద గత మెయ్యది సజ్జను లైన వారు ము

న్నేమని చెప్పుచుందురు మునీశ్వర! నా కెఱుఁగింపవే! దయ౯


వ.అనిన శుకుం డి ట్లనియె.


క.ఈ కల్పంబున మనువులు, ప్రాకటముగ నార్వు రైరి పదునలువురలో

లోకముల జనుల పుట్టువు, లాకథితము లయ్యె వరుస నఖిలములు నృపా!


వ.ప్రథమమను వైన స్వాయంభువునకు నాకూతి, దేవహూతు లను నిరువురు కూఁతులు గలరు. వారికిఁ గ్రమంబునఁ గపిల, యజ్ఙ నామంబుల లోకంబులకు ధర్మజాఞన బోధంబులు సేయుకొఱకు హరి పుత్రత్వంబు నొందె.అందుఁ గపిలుని చరిత్రంబు మున్ను చెప్పంబడియె. యజుఞని చరిత్రంబు చెప్పెద వినుము.