స్వీయ చరిత్రము - ప్రథమ భాగము/అవతారిక

వికీసోర్స్ నుండి

అవతారిక.

పనిచేసి చూపవలయునన్న చింతయేకాని నన్నుఁగూర్చి నేను చెప్పుకోవలయునన్న యభిలాషము మొదటినుండియు నాకంతగా లేకుండెను. 1888-వ సంవత్సరమున వేసవికాలపు సెలవులకు ముందు నాప్రాణమిత్రులయి యుండిన బసవరాజు గవర్రాజుగా రొకనాఁడు నాయొద్దకువచ్చి యింగ్లీషుభాషలో నాజీవితమును తాను వ్రాయ నుద్దేశించుకొన్నట్టు చెప్పి దానికిఁ గావలసిన సాధన సముదాయమును తన కియ్యవలసినదని నన్నడిగిరి. నేనాయన యుద్యమమును బ్రోత్సాహపఱుపక శ్వాసకాసాది రోగపీడలచే దుర్బల శరీరుఁడయి యున్న నేను చిరకాలము జీవింపననియు, దృఢగాత్రులయి యున్న మీరు చిరకాలము జీవింతురు గనుక నా మరణానంతరమున నాజీవితచరిత్రమువ్రాయఁదగినదిగాతోఁచినపక్షమున నప్పుడు వ్రాయవచ్చుననియు, చెప్పి, నామిత్రుని నప్పటి ప్రయత్నమునుండి మరలించితిని. ఈశ్వరచిత్త మెవ్వరికిని దురవగాహమైనది. ఏమి మాయయోకాని వ్యాధి బాధితమగు చున్న దుర్బలకాయముగల నేనిప్పటికి నీ ప్రకారముగానే యుండఁగా, దృఢకాయముగల యాతఁడే యల్పకాలములో నాకస్మికముగా నకాలమరణము పాలగుటచే నాతనిజీవితచరిత్రమును నేనే వ్రాయవలసిన యవస్థ నాలుగుమాసముల లోపలనే తటస్థమయ్యెను. తరువాత కొన్ని సంవత్సరములకు మాముద్రాశాలలో కార్యనిర్వాహకుఁడుగానుండిన తోలేటి వేంకటసుబ్బారావుగారు నాకు తెలుపకయే నాచరిత్రము నొకదానినివ్రాసి వేసవికాలపు సెలవులలో నేను చెన్నపురికిఁ బోయి యుండినప్పుడు 1894-వ సంవత్సరమునందు మాముద్రాశాలలోనే దానిని ముద్రింపించెను. అటుతరువాత కొన్ని సంవత్సరములకు నేను చెన్నపురినివాసముగా నేర్పఱుచుకొని యచ్చటనున్న కాలములో నామిత్రు లనేకులు స్వీయచరిత్రమును వ్రాయవలసినదని నన్ను నిర్బంధపఱుపఁ జొచ్చిరి. వారి నిర్బంధమును మానుపుకోఁజాలక నాకంతగా నిష్టములేకపోయినను 1903.వ సంవత్సరమునందు స్వీయచరిత్రమును వ్రాయ నారంభించి వ్రాసినదాని నెప్పటికప్పుడే 112 పుటలు మాచింతామణి ముద్రా యంత్రములోనే ముద్రింపించితిని ఇంతలో నన్ను ప్రోత్సాహపఱుచుచునిర్బంధపఱచుచువచ్చిన వారిలో ముఖ్యులయిన నామిత్రులు సీ. వై. చింతామణిశాస్త్రి గారు చెన్నపురిని విడుచుట తటస్థించినందున వారిపోకతోనే నేనును నాపూనిన పనినప్పటికి విడిచితిని. అయినను ముద్రితమయిన పుస్తకభాగమును నామిత్రులనేకులు చూచుట తటస్థించెను. వారు గ్రంథమును ముగింపవలసినదని పలుమాఱు నన్ను కోరుచువచ్చిరికాని యప్పటికాలాగుననేయని వారితో చెప్పి తప్పించుకొనుచు వచ్చినను పనికిమాత్రము పూనక స్వాభావిక మాంద్యముచేత నశ్రద్ధచేయుచు వచ్చితిని. ఇట్లుం డఁగా నా స్వీయచరిత్ర భాగమును చదివినమిత్రులలో నొక్కరగు కే. వి. లక్ష్మణరావుగారు నా స్వీయచరిత్రమును తమ విజ్ఞానచంద్రికా గ్రంథమాలలో ప్రచురముచేసికొనుట కనుజ్ఞ యియ్యవలసినదని నన్నడిగిరి. ఆలాగుననే చేసికొనవచ్చు నని నేను నాసమ్మతిని దెలిపితిని. అంతట వారు వెంటనే తాము ప్రచురింపఁబోయెడు పుస్తకముల పట్టికలో నీపుస్తకమునుగూడ చేర్చి ప్రకటించిరి. అదిచూచి యిట్లేల త్వరపడి ప్రకటించితిరని నేను వారినడుగఁగా నిట్లుచేసి తొందర పెట్టినంగాని మీరు పుస్తకమును వ్రాయఁబూనరని యట్లు ప్రకటించితిమని వారు సమాధానముచెప్పిరి. అందుచేత నిప్పుడు ప్రకటింపఁ బడినదానిలో విశేషభాగమును కడచినవేసవికాలములో నేను బెంగుళూరిలో వ్రాయవలసినవాఁడనైతిని. కొంతవఱకువ్రాసి విడిచిన పుస్తకమును నాచేత మరల వ్రాయించుటకు కారకులయినందున వారియెడల నేనెంతయు కృతజ్ఞత గలవాఁడనయి యున్నాను. ఈగ్రంథమును నేను ప్రత్యేకముగా నాగ్రంథ సంపుటములలో నొకదానినిగా ప్రకటింపఁదలఁచియున్న వాఁడ నగుటచేత దీనిని పునర్ముద్రణము గావించుకొను స్వాతంత్ర్యమును విజ్ఞానచంద్రికా మండలివారి కియ్యక నా కే యుంచుకొన్నాఁడను. అందుచేత నీసారి తమ చందాదారుల కియ్యవలసిన పుస్తకముల నచ్చొత్తించుకొనెడి యీకూర్పునకుఁ దక్కవారికి వేఱుస్వాతంత్ర్య మేదియు లేదు. అయినను పూర్వ నాగరికుల కంతగా రుచింపని నా స్వీయచరిత్రమును రెండవసారి ముద్రింపవలసిన యావశ్యకముండునోలేదో చదువరుల యాదరణమునుబట్టి ముందు చూడవలసియున్నది.

తెలుఁగుభాషలో స్వీయచరిత్రమును వ్రాయఁబూనుకొనుటకిదియే ప్రథమ ప్రయత్నము. ఇట్టి స్వచరిత్రమును వ్రాయుటలో నితరగ్రంథరచనములోనున్న వానికంటె నెక్కువకష్టములు కానవచ్చు చున్నవి. తన్నుఁగూర్చి తాను వ్రాసికొను నప్పుడీశ్వర ముఖమునుజూచి సత్యమునే చెప్పఁబూనినను సమకాలపువారది యాత్మస్తుతి గానో పరనింద గానో చేకొని యన్యధా భావింపవచ్చును. ఒకానొకప్పుడు పరులనుగూర్చి యప్రియములగు సత్యములను బయలుపఱుపవలసివచ్చినప్పుడు వారికిని వారిమిత్రులకును బంధువులకును మనస్తాపము కలుగవచ్చును. అయినను సాధ్యమైనంత వఱకన్యుల మనస్సులకు నొప్పి కలిగించెడు విషయముల ననావశ్యకముగా నిందుఁ జొప్పింపమానితిని గాని కొందఱినిగూర్చి మనస్సున కింపుగాని విషయములనని వార్యముగా వ్రాయవలసివచ్చి నందున కెంతయు చింతిల్లుచున్నాఁడను. సహృదయులు నా యెడల సదయ హృదయులయి యిందుపొడకట్టు భ్రమప్రమాదజనిత దోషములను సుహృద్భావముతో నుపేక్షించి నన్ను మన్నింతురుగాక!

కందుకూరి - వీరేశలింగము.

రాజమహేంద్రవరము.

15 - వ డిసెంబరు 1910.