సైన్సు ఎలా పుట్టి పెరిగింది?/యురేనస్ గుట్టు ఎలా రట్టయింది?
యురేనస్ గుట్టు ఎలా రట్టయింది?
నవగ్రహాలు పుట్టి ఎన్నికోట్ల సంవత్సరాలో గానీ ఏవి నవగ్రహాలో తేల్చుకోవడం మాత్రం కేవలం 150 సంవత్సరాల క్రితం మాత్రమే జరిగింది. ఈ అన్వేషణకు శాస్త్రజ్ఞులు వాడింది కేవలం కాగితాలూ, తమ తర్కమూ మాత్రమే. ఇలా నిర్ధారించుకొన్నాక తాము అనుకొన్నచోట అవి వున్నాయో లేదో అని వారు సరి చూచుకొన్నారు.
మన ప్రాచీనులు గ్రహాలు తొమ్మిదన్నారు. వారు చెప్పిన గ్రహాల్లో సూర్యుడు నక్షత్రమనీ, చంద్రుడు ఉపగ్రహమనీ, రాహుకేతువులు అస్తిత్వం లేని ఛాయాగ్రహాలనీ తర్వాత రుజువైంది. ఇక మిగిలినవి బుధుడు, శుక్రుడు, కుజుడు, గురుడు, శని అయిదు మాత్రమే. భూమి కూడా గ్రహమే అని తేలాక ఈ అంకె ఆరుకు చేరింది. భూమి మీది నుంచి పైన చెప్పిన గ్రహాలన్నీ కంటికి కనపడేవే. కాబట్టి గొడవలేదు.
1781 మార్చి 13న విలియం హెర్షెల్ అనే ఔత్సాహిక ఖగోళ పరిశోధకుడు తన టెలిస్కోపుతో మరో గ్రహాన్ని కనుగొన్నాడు. అదే యురేనస్. అక్కడితో కథ మలుపు తిరిగింది.
1784లో యోవాన్‌బోడ్ యురేనస్ కక్ష్యను నిర్ధారించాడు. కానీ 1788లో చూస్తే యురేనస్ ఆ కక్ష్యలో లేదు. మళ్లీ 1790లో దీని కక్ష్యను నిర్ధారించారు. కానీ కొన్నేళ్ళకు అదీ తప్పని తేలిపోయింది. 1820లో ఇంకోసారి అలెక్సిస్ బోర్డ్ పాత లెక్కల్ని కాదని కొత్త కక్ష్యను నిర్ధారించాడు. కానీ అదేమి చిత్రమో యురేనస్ ఈసారి కూడా తప్పుడు నడకలు సాగించింది. ఇలా కక్ష్యలు మార్చే దాని నడక శాస్త్రజ్ఞులకు కొరకరాని కొయ్యగా మిగిలి పోయింది.
మరి యురేనస్ నిర్ధారిత కక్ష్యలో ఉండకపోవడానికి కారణం ఏమిటి? ఒక్కొక్కరు దీనికి ఒక్కో కారణం చెప్పారు. అప్పటి ఫ్రెంచి శాస్త్రజ్ఞుడు రెనెడెకార్డ్ అంతరిక్షమంతా కనిపించని ద్రవ్యంతో నిండి ఉందని అదే యురేనస్ గమనాన్ని ప్రభావితం చేస్తోందన్నాడు. మరి మిగిలిన గ్రహాల్ని కూడా ప్రభావితం చెయ్యాలి కదా. అందువల్ల ఇది కారణం కాదు. భూమికి మల్లే యురేనస్‌కూ పెద్ద ఉపగ్రహం ఉండొచ్చు. దానివల్ల యురేనస్ కక్ష్య మారుతుండవచ్చునని మరో కారణం వెతికారు. అంత పెద్ద ఉపగ్రహమే ఉంటే అది టెలిస్కోపులో కన్పించాలి గదా. అందువల్ల అదీ కారణం కాదు. విలియం హెర్షెల్ అప్పటికే యురేనస్‌కు రెండు ఉపగ్రహాలు కనిపెట్టి ఉన్నాడు. అవి సైతం యురేనస్ గమనాన్ని మార్చలేకపోతున్నాయి. అందువల్ల ఇదీ కారణం కాదు. 1781లో యురేనస్‌ను కనిపెట్టక ముందు దీన్ని ఏదేనా పెద్ద తోకచుక్క ఢీకొని ఉండొచ్చునని ఇంకో కారణం వెతికారు. కానీ 50 ఏళ్ళ తరువాత కూడా దీన్ని తప్పుడు నడక మారలేదే. గ్రహకక్ష్యలన్నీ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతంపైనే ఆధారపడ్డాయి. యురేనస్ లాంటి సుదూర గ్రహాలకీ సిద్ధాంతం వర్తించదేమో అనుకొందామా? యురేనస్ కంటె ఎంతో దూరంలో ఉన్న హేలీ తోకచుక్క న్యూటన్‌కి నమ్మిన బంటులా నడుచుకొంటోందే !
ఏమో ఏదైనా ఎనిమిదో గ్రహం ఉందేమో. అది యురేనస్ కక్ష్యను ప్రభావితం చేస్తోందేమో! ఈ అనుమానం దగ్గర శాస్త్రజ్ఞులు ఆగిపొయ్యారు. అన్వేషణ మొదలెట్టారు.
ఆడమ్స్ అనే ఇంగ్లీషు శాస్త్రజ్ఞుడూ, లీనేలియర్ అనే ఫ్రెంచి శాస్త్రవేత్త ఎవరికివారు పరిశోధనలు ప్రారంభించారు. ఒకరి పరిశోధనాంశాల్ని మరొకరు ఎప్పటికప్పుడు తెలుసుకొనేంత సమాచార వ్యవస్థ ఆరోజుల్లో లేదు. యురేనస్ అంతటి పెద్ద గ్రహాన్ని ఇన్ని సంవత్సరాలు ప్రక్కకు లాగేసిందంటే అది ఎంత పెద్ద గ్రహమై ఉండాలి? దాని కక్ష్య ఎలా ఉండాలి? అనేవైపు వీరి పరిశోధనలు జరిగాయి.
విచిత్రమేమంటే వీళ్లిద్దరూ ఆ అష్టమ గ్రహాన్ని ఎవరికివారు పట్టేశారు. అది ఏ కక్ష్యలో సంచరిస్తోంది? దాని లక్షణాలేమిటి? ఇవన్నీ నిరూపించి, "ఫలానా రోజు ఆకాశంలో ఫలానా చోటున ఉంటుంది. వెతికి పట్టుకోండి,” అని ప్రకటించారు. వీళ్ళలో ఎవరికి దీని ఖ్యాతి దక్కాలి అని సిగపట్లు కూడా జరక్కపోలేదు గానీ రాయల్ సొసైటీ ఆఫ్ లండన్‌వారు ఇద్దర్నీ 1847లో సన్మానించడంతో దీనికి తెరపడింది. ఆ గ్రహం నెప్ట్యూన్.
చివరకు వీరిద్దరిచ్చిన లెక్కల ప్రకారం 1846లో బెర్లిన్ పరిశోధకులు నెప్ట్యూన్ గ్రహాన్ని అంతరిక్షంలో దర్శించారు.
యురేనస్ కక్ష్యను గురించిన పరిశోధనలో నెప్ట్యూన్ బయటపడింది. విచిత్రంగా ఉందికదూ ! పైగా ప్రత్యక్షంగా చూడకుండా శాస్త్రజ్ఞులు దాని బరువునూ, కక్ష్యనూ నిర్ధారించడం మరీ విచిత్రంగా ఉందికూడా.
విజ్ఞానశాస్త్ర చరిత్రలో ఇలాంటి చిత్ర విచిత్రాలు కోకొల్లలు.
మరి తొమ్మిదవ గ్రహం ప్లూటో ఎలా ఎప్పుడు దర్శనమిచ్చింది? నవగ్రహాల కొలువులోకి ఎప్పుడు వచ్చి చేరినట్టు? అదో కథ.