Jump to content

సైన్సు ఎలా పుట్టి పెరిగింది?/భూమి పరిధి మొదట ఎలా తెలిసింది?

వికీసోర్స్ నుండి

భూమి పరిధి మొదట ఎలా తెలిసింది?

మనిషి నిరంతరాన్వేషణ శీలి. తన చుట్టూ ఉన్న ప్రకృతిని తన అనుభవంతో, తార్కికశక్తితో పరిశీలించి అతడు ఎన్నో రహస్యాలు ఛేదించాడు. ఇప్పటిలా వాళ్ళకి ప్రయోగశాలలు లేకపోవచ్చు. ప్రపంచంలోని ఏ మూలకైనా సమాచార వ్యవస్థ లేకపోవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం లేకపోవచ్చు. కానీ ఉన్న అవకాశాలతోనే మనిషి చేసిన అన్వేషణ మనం ఊహించనైనా వీలుగాని ఆవిష్కరణలు చేసింది.

మనం నివసిస్తున్న భూమి మనిషి కెప్పటి నుంచో పరిశోధనాంశంగా ఉండేది. గ్రహాలతో దాని సంబంధం, రాత్రింబవళ్ళు ఏర్పడ్డం లాంటివి తెలుసుకోవడం కోసం ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేశారో లెక్కలేదు. కొన్ని సత్యాలు వాళ్ళు చాలా విచిత్రంగా కనుక్కొన్నారంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది.

క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దంలోనే మన పూర్వీకులు భూమి పరిధిని లెక్కించి కనుక్కొన్నారంటే మనకు నమ్మశక్యంగాదు. మరి ఇది ఎలా సాధ్యమైందో తెలుసా?

ధృవాలు తిరగబడతాయా?

భూమి ఉత్తర దక్షిణ ధృవాలు ఇప్పుడున్న స్థానంలోనే ఎప్పుడూ ఉండేవా? అవీ స్థానభ్రంశం పొందుతాయా? ఇవి తారుమారు అవుతుంటాయంటున్నారు శాస్త్రజ్ఞులు. అంటే ఇప్పుడు ఉత్తరధృవం ఉన్నచోట దక్షిణ ధృవం. దక్షిణ ధృవం ఉన్నచోట ఉత్తరధృవం ఒకరోజు ఉండే వన్నమాట. అయితే ఇలా తలకిందు లయ్యే సమయంలో ధృవాలు ఒక స్థిరస్థానంలో నిలబడేందుకు కొంత సమయం పడుతుంది. ఎందుకంటే మొదటి దశలో చాలా వేగంగా అవి అటూ ఇటూ ఊగుతుంటాయి. ఒకటిన్నర కోట్ల సంవత్సరాల ముందు ఇలా ధృవాలు తలక్రిందులయ్యాయి. అప్పుడు ఉత్తర ధృవం స్థిరంగా నిలబడేందుకు వెయ్యి సంవత్సరాలు పట్టింది. అప్పటిదాకా అది ఊగుతూనే ఉండింది!

అలెగ్జాండరు మనకు మహాయోధుడుగానే తెలుసు. కానీ ఆయన మహాద్భుత నగర నిర్మాతా, శాస్త్రవిజ్ఞాన పిపాసీ కూడా. ఆయన నిర్మించిన అద్భుత నగర్ అలెగ్జాండ్రియాలో 'మ్యూసిమోన్' గ్రంథాలయం 'విజ్ఞాన దేవతల కాణాచి'. ఈ గ్రంథాలయంలో ఎరాతస్పెనస్ అనే శాస్త్రవేత్త ఉండేవాడు. ఈయన ఖగోళ భూగోళ విభాగాల్లో సుప్రసిద్ధుడు.

ఒకసారి 'అనుకోకుండా ఓ విచిత్ర జరిగింది. అదేమంటే అలెగ్జాండ్రియాకు అయిదువేల స్టేడియోల (1 స్టేడియో = 185.25మీ.) దూరాన ఉన్న సియోనా నగరం నుంచి వర్తకులు వచ్చేవారు. వారొక విషయం మన ఎరాతస్పెనస్‌కు చెప్పారు.

సియోనాలో సోల్‌స్పెయిస్ రోజున అంటే సంవత్సరంలో పగటి పొద్దు ఎక్కువగా ఉండే రోజున మిట్ట మధ్యాహ్నం సూర్యకిరణాలు నగరంలో ఉన్న అతిలోతైన బావి నీళ్ళమట్టాన్ని ప్రకాశింపజేస్తాయనేదే వాళ్ళు చెప్పిన విశేషం. అంతే ఎరాతస్పెనస్‌కు మెరుపులా ఆలోచన మెరిసింది.

లోతైన బావి నీళ్ళమట్టాన్ని ప్రకాశింపజేయడమంటే సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడడమేగదా. మరి అలెగ్జాండ్రియాలో అదే రోజున సూర్యకిరణాలు ఎలా పడతాయి? ఈ ప్రశ్న వేసుకొని అలెగ్జాండ్రియాలో అదేరోజు సూర్యకిరణాలు పూర్తి వృత్తంలో 50వ వంతు కోణంలో పడతాయని లెక్కించాడు.

దీన్నిబట్టి అలెగ్జాండ్రియా సియోనా నగరాల మధ్య దూరం (5వేల స్టేడియోలు) భూమి పరిధిలో 50వ వంతు ఉండాలని ఎరాతస్పెనస్‌కి అర్ధమైపోయింది. ఇంకేముంది? ఈ దూరాన్ని 50తో గుణిస్తే సరి. అలా గుణిస్తే రెండు వందల ఏభైవేల స్టేడియోలు అవుతుంది. అంటే సుమారుగా 42-43వేల కిలోమీటర్లన్నమాట.

ఈ రోజు మన లెక్కల ప్రకారం ఒక ధృవం నుంచి బయలుదేరి మళ్లీ అదే ధృవానికి చేరేందుకు దూరం 39,940 కిలోమీటర్లు. అంటే ఎరాతస్పెనస్ దాదాపు సరైన లెక్కకే వచ్చాడన్నమాట!

విచిత్రంగా ఉందిగదూ! చిన్న గణితగణననతో ఎంత గొప్ప అంశం బయటపడింది. ఐన్‌స్టీన్‌లాంటి శాస్త్రజ్ఞులకు ఎరాస్పెనస్ లాంటి పూర్వీకుల నుంచి అన్వేషణలే గాదు అన్వేషణా పద్ధతులూ వారసత్వంగా ఎన్ని లభించాయో!