Jump to content

సైన్సు ఎలా పుట్టి పెరిగింది?/నిత్యజీవితంలో నిప్పుతో చెలగాటం

వికీసోర్స్ నుండి

నిత్య జీవితంలో 'నిప్పుతో చెలగాటం'

అదో పెద్ద గడ్డి మైదానం. ఓ పక్కనుంచి ప్రళయ భీకరంగా గడ్డి తగలబడుతోంది. కరాళ మృత్యువు కబళించబోతున్నట్టు అగ్నికీలలు నాలుకలు చాచుకొంటూ తరుముకొస్తున్నాయి. ప్రయాణీకులు విలవిల లాడిపోతున్నారు. గాలి కూడా మంటకు తోడై పరిగెత్తిస్తోంది.

“వచ్చేసింది! దగ్గరకు వచ్చేసింది. ఇంకో అరమైలు అంతే. అరగంటలో సర్వం పరశురామ ప్రియం అయిపోతుంది.”

“ఎక్కడి నుంచి వచ్చాడో యముడో దేవుడో ఓ ముసలాయన పరిగెత్తుకొచ్చాడు. కర్ర తుపాకీ, గడ్డి పరకల టోపీతో చూడగానే తెలిసిపోతోంది వేటగాడని. అయితే ముసిముసి నవ్వులు నవ్వుతాడేమిటి? అందరికీ గుండెలవిసి పోతుంటే పిచ్చోడి ఫోజుపెట్టి నిలబడతాడేమిటి”

“అయ్యా ముసలాయనా! మంటలు అరమైలు దూరంలోకి వచ్చేశాయ్. గాలీ ఇటే వీస్తోంది. ఏమిటయ్యా నీ నవ్వులాట!" మిడితటన్ ఆవేశంగా అన్నాడు.

“ఆఁ మంటలా? అవి నాకో లెక్కా? రమ్మను చూద్దాం. మీసాలైనా కాలకుండా మింగి జీర్ణం చేసుకొంటా ఏమనుకొన్నారో" అంటూ కళ్ళు మిలమిలా తిప్పుతూ నవ్వుతున్నాడు ముసలాయన.

మిడితటన్‌కి ఏదో గుర్తుకొచ్చింది. వేటగాళ్ళు కార్చిచ్చును ఆపేందుకేదో చిట్కా ప్రయోగిస్తారటగా. అది కాబోలు ధైర్యం అనుకొని “మా ప్రాణాలు కూడా కాపాడవయ్యా మహానుభావా! పిల్లలూ ఆడవాళ్ళు అల్లాడిపోతున్నారు" అంటూ ప్రాధేపడ్డాడు.

“సరే కానీండి. ఇదిగో నేను నిలబడ్డ చోట గడ్డినంతా పీకేసి నేల బాగా కన్పించేలా చెయ్యండి.”

ముసలాయన ఇలా అన్నాడో లేదో అందరూ కలిసి గడ్డంతా పెరికేశారు. ఆడవాళ్ళనూ, పిల్లల్నీ ఓ ప్రక్కకు చేరవేశారు. వాళ్ళకడ్డంగా దుప్పట్లు పట్టుకొన్నారు.

ఈ తతంగమంతా గడిచేప్పటికి మంట ఇంకా దగ్గరికొచ్చేసింది. మంటల చిటపటలు గుండెల్ని దడదడలాడిస్తున్నాయి. ముసలాయనేమో చిద్విలాసంగా తాపీగా ఏదో చేసుకొని పోతున్నాడు. ఎండుగడ్డిని

మంటలొస్తున్న దిశకు ఎదురుగ్గా పేర్చాడు. అందులో తుపాకి పెట్టి పేల్చాడు. ఆ నిప్పు రవ్వలతో గడ్డి అంటుకొంది.

మిడితటన్‌కి మతిపోయినంత పనైంది. గడ్డిలో మంట చిటచిటా అంటుకొంటోంది. చూస్తుండగానే నాలుకలు పైకి చాస్తోంది. ముసలాయన గడ్డం నిమురుకుంటూ "ఇక చూడండి మంటకూ మంటకూ తగవు పెట్టేశా. తన్నుక చస్తాయంతే” అంటూ తుపాకీ గాల్లోకి ఊపుతూ గడ్డి పెరికేసిన ఖాళీ జాగాలోకి వచ్చేశాడు.

“ఎంత విచిత్రం! గాలివాటానికి భిన్నంగా ముసలాయన రగిల్చిన మంట పాతమంటవైపుకు ప్రాకుతోంది. మూడు వైపులకీ అంటుకొని నాలుగో దిశలో తానకు తానే ఆరిపోతోంది. కొద్దిసేపట్లోకి మంటలు మంటలు కలియ బడినట్టు కలియబడి ఆరిపోవడం మొదలైట్టాయి. ఇప్పుడందరికీ మంటలంటే మర్యాదకోసమైనా భయముంటే ఒట్టు. అంతా తమాషా చూస్తున్నారు. పిల్లలు గడ్డం తాతయ్యకు జేజేలు కొడుతున్నారు.”

★ ★ ★

ఇది ఫెనిమోర్ కూపర్ రాసిన 'ప్రయరీ' అనే నవల్లోని ఓ మహోత్కంఠభరిత ఘట్టం.

ఇంతకూ ఇలా నవలల్లో, కథల్లోనేనా జరిగేది? నిజజీవితంలో కూడానా?

అక్షరాలా నిజం. ఇదో నిత్యజీవిత వాస్తవం. ఫెర్డినాండ్ కొలువులో కొలంబస్ కోడిగుడ్డును నిలువుగా నిలబెట్టినంత వాస్తవం!

ఈ ముసలి వేటగాడికి ఓ భౌతిక శాస్త్ర రహస్యం తెలుసు. రెండవ మంట మొదటిమంట వైపుగా వ్యాపించి దానికి ఇంధనం లేకుండా చేసింది. దీంతో రెండు మంటలూ కలవగానే ఒకదాన్ని ఒకటి మింగినట్లుఆరిపోయాయి!

మరి గాలివాటం వైపుకే రెండు మంటలూ ఒకదాన్ని ఒకటి తరుముతున్నట్టు వ్యాపించాలి గదా. ఎదురెదురుగా ఎలా వ్యాపించాయి. అందులోనూ ఓ భౌతికశాస్త్ర రహస్యం ఉంది.

గడ్డి మైదానంలో మంట ప్రయాణీకుల వైపుకే వ్యాపిస్తోంది. అందుకు అటుగా వీస్తున్న గాలే కారణం. కానీ మంటకు ముందువైపు మరో గాలి కూడా వీస్తోంది. అది మంటకు వ్యతిరేక దిశలో వస్తోంది. అదెక్కడిది? మంటవల్ల వేడెక్కి, అక్కడి గాలి పల్చనై పోవడంతో తాజాగాలి మంట కెదురువైపు నుంచి దూసుకొస్తోంది. అందువల్ల రెండో మంట ఆ గాలి కనుకూలంగా మొదటి మంట కెదురుగా వ్యాపించిందన్న మాట!

అందుకనే వేటగాడు మంట బాగా దగ్గరి కొచ్చేదాకా ఆగి తర్వాతే రెండో మంట రాజేశాడు. రెండు మంటలకూ చాలా వ్యవధి ఉంటే మొదటి మంటకు వ్యతిరేక దిశలో వచ్చే గాలి మంటను తనవైపు లాగేంత బలంగా ఉండదు! పైగా అప్పుడీ కొత్త మంట కూడా ప్రయాణీకుల వైపే పరుగెత్తికొచ్చి ప్రాణాలు తీసేది. అనుభవం ఉంటేనే ఈ సాహసం చెయ్యగలరు.

ముసలి వేటగాడు సైన్సు చదవకపోవచ్చు. నిత్త జీవితంలో మాత్రం దాన్ని జీర్ణం చేసుకొన్నాడు గదూ! సైన్సు పాఠాలు చెప్పే మనం ఇందులోంచి ఏమైనా నేర్చుకోగలమా?

ఆధారం: మాకోవ్ పెరెల్మాన్‌