సైన్సు ఎలా పుట్టి పెరిగింది?/తోకచుక్కల వేటలో వంటలక్క
తోకచుక్కల వేటలో వంటలక్క
“ఇక చదివింది చాలు. నాలుగక్షరం ముక్కలొచ్చాయిగా అదే పదివేలు. పెళ్లీ గిళ్లీ అంటూ కలలు కంటావేమో! వాటిని అటకెక్కించు. నీ అనాకారి మొహానికి మెగుణ్ణి నేను తీసుకొని రాలేను. నా దగ్గర డబ్బు లేదు. నీ దగ్గర అందమూ లేదు. ఇక వంటిల్లే నీకు స్వర్గం. అన్నదమ్ములకు వండి పెట్టు. అదే నీ జీవిత పరమార్ధం” అని సాక్షాత్తు కన్నతండ్రే ఆమెను శపించినంత పనిచేశాడు. వయసొచ్చీ రాకముందే కరోలిన్ హెర్షెల్ అలా వంటలక్కగా సొంత ఇంటిలోనే స్థిరపడిపోయింది. జీతం లేని జీవితాతంపు పనిమనిషిగా మారిపోయింది. తల్లయినా కనికరించిందా అంటే ఆవిడా రెండాకులెక్కువే చదివింది. సోదరి మీది ఆప్యాయతతో స్వయాన తోడబుట్టినవాడు తానున్న ఇంగ్లాండు తీసుకెళతానంటే 'మరో వంటలక్కను కుదిర్చి ఆవిడ జీతం చెల్లించే ఏర్పాటు చేస్తేనే కూతుర్ని గడప దాటనిస్తా' అని భీష్మించుకొంది ఆ మహాతల్లి.
1781లో హఠాత్తుగా ఓ అద్భుతం జరిగింది. ఈ సరిగమల చక్రవర్తి సాక్షాత్తూ యురేనస్ గ్రహాన్ని పట్టేశాడు ! ఆనందం పట్టలేక ఆ గ్రహానికి ఇంగ్లాండు చక్రవర్తి జార్జి-3 పేరు పెట్టాలని ప్రతిపాదించాడు. రాజుగార్కి చెప్పలేనంత ముచ్చటేసింది. ఇంకేముంది అతగాణ్ణి ఆస్థాన ఖగోళ శాస్త్రజ్ఞుడిగా నియమించేశాడు. ఇప్పటికి మీకు ఈ సంగీత, ఖగోళ ఉమ్మడి శాస్త్రవేత్త ఎవరో అవసగతమైంది గదూ. ఆయనే విలియం హెర్షెల్.
ఆస్థానంలో చోటు చిక్కడంతో హెర్షెల్‌కి కావల్సినంత సమయం, వసతులూ లభించాయి. రేయింబవళ్ళు ఖగోళ పరిశోధనలో పడిపోయాడు. మన కరోలిన్ అతని టెలిస్కోపు అద్దాల్ని శుభ్రం చేసేది. కావల్సిన ఆకారంలోకి మలిచేది. నోట్సు రాసేది. సోదరుడు తయారు చేసిన పత్రాల్ని కాపీ చేసి ప్రచురణకు సిద్ధం చేసేది. ఇప్పుడు కరోలిన్‌కి కూడా ఓ పాటి శాస్త్రవేత్త లక్షణాలు వచ్చేశాయి. సోదరుడు లేనపుడు అదే పనిగా తానూ టెలిస్కోపుతో ఆకాశాన్ని శోధించసాగింది.
ఆశ్చర్యంగా ఆవిడకు 1783లో మూడు నెబ్యులాలు (నక్షత్రాలు రూపుదిద్దుకొనే ధూళీ వాయువుల మేఘాలు) కన్పించాయి. ఇంకేముంది? ఈ వార్త ప్రపంచమంతా పాకింది. కరోలిన్ 'సోదరుడి నీడ' నుంచి బయటపడి స్వయంప్రకాశంతో వెలిగిపోసాగింది. 1786-97 మధ్య ఆమె 8 కొత్త తోకచుక్కల్ని గుర్తించి చరిత్ర సృష్టించింది.
కరోలిన్ అక్కడితో ఆగలేదు. పట్టుబట్టి తన జన్మస్థలం హాన్‌వర్ (జర్మనీ) వచ్చింది. ఆ ఊళ్లో ఆమె కేవలం వంటలక్క! బండచాకిరీతప్ప, అనుదినం అవమానాలుతప్ప, అనాకారిగా వెక్కిరింతలు తప్ప ఆ ఊళ్లో ఆమె ఏమీ ఎరుగదు.
కానీ కాలు మోపేటప్పటికే ఆమెకిపుడు స్వాగత సత్కారాలు ఎదురయ్యాయి. నగరం నగరమే ఆమె కోసం ఎదురు చూస్తోంది. అప్పటికి ఆమె ప్రపంచంలోనే సుప్రసిద్ధ మహిళా ఖగోళ శాస్త్రవేత్త! మూడు నక్షత్ర మండలాలు (నెబ్యులాలు), ఎనిమిది తోకచుక్కలు ఆమె కిరీటంలో మిలమిలా మెరుస్తున్నాయి.
సాక్షాత్తు జర్మనీ చక్రవర్తి కింగ్ జార్జి మన కరోలిన్‌కు ఏడాదికి 50 పౌండ్లు పారితోషికం ప్రకటించాడు. 1828లో ఆమెకు రాయల్ ఆస్ట్రానామికల్ సొసైటీ స్వర్ణ పతకం లభించింది. ప్రష్యా రాజు 1846లో ఆమెను 'విజ్ఞానశాస్త్రపు స్వర్ణపతకం'తో సత్కరించాడు.
అనాకారి వంటింటి పనిమనిషి ఇలా అంతరిక్షపుటంచులు చూసింది. బండచాకిరీకి బలి కావల్సిన ఓ పుట్టింటి కట్టుబానిస బ్రహ్మాండ భాండోదరాల్ని శోధించి తోకచుక్కల్ని ఒడిసి పట్టుకొంది. విజ్ఞాన శాస్త్రపు వినీలాకాశంలో ఓ ధృవతారగా మిగిలిపోయింది.