సైన్సు ఎలా పుట్టి పెరిగింది?/తెలివి కొలతల కథా కమామీషు
తెలివి కొలతల కథా కమామీషు
తెలివి మీరిన మనిషి తన తెలివిని ఎత్తులాగే, బరువులాగే కొలుచుకోవడానికి పడిన తంటాలు అన్నీ ఇన్నీ కావు. తెలివి వారసత్వంగా సంక్రమిస్తుందని, అందువల్ల కొంతమంది పుట్టకతోనే మేధావులుగా పుడతారని ఒక గాఢ (మూఢ) నమ్మకం మనిషిని చాలాకాలం నుంచి వెన్నాడుతోంది.
ఇప్పుడీ తెలివి కొలతల కథలు కొన్ని విందాం. మొదటిది ఫ్రాన్స్ కథ.
తెలివి కొలతల కాద్యుడు ఫ్రాన్సు దేశపు ఆల్‌ఫ్రెడ్ బినే. 1905లో ఈయన కొన్ని అభ్యాసాల్ని తయారుచేశాడు. వీటి ఆధారంగా ఐ.క్యు. లెక్కించేందుకు రంగంలోకి దిగాడు. ఒకానొక అభ్యాసాన్ని 7ఏళ్ళ పిల్లలు కొద్దిమంది, 8 ఏళ్ళవారు చాలామంది, 9ఏళ్ళవారు అందరూ చెయ్యగల్గుతున్నారనుకోండి. దాన్ని బినే 8 ఏళ్ళ స్థాయి అభ్యాసంగా ప్రమాణీకరించాడు. దీన్ని 7 ఏళ్ళ పిల్ల చెయ్యగల్గుతోందనుకోండి. ఆ పిల్ల ఐ.క్యు. 8/7x100=114. ఆరేళ్ళ స్థాయి అభ్యాసాన్ని మాత్రమే 7 ఏళ్ళ పిల్లవాడు చెయ్యగల్గుతున్నా డనుకోండి. వాడి ఐ.క్యు 6/7ఞ100=86.
అయితే బినే ఉద్దేశం తెలివిగల పిల్లల్ని పసిగట్టడం గాదు. వెనకబడ్డ పిల్లలకి సాయమందించి ముందుకు తీసుకొని రావడం. అంటే బినే దృష్టిలో ఐ.క్యు. స్థిరంగా ఉండదు. పరిసరాలు, అవకాశాలు ఆధారంగా దాన్ని మార్చవచ్చు. దీనర్ధం ఐ.క్యు. అనువంశికం కాదనేగా. ఒకే అభ్యాసంలోని గణితంలాంటి కొన్ని అంశాల్ని అద్భుతంగా, భాషలాంటి అభ్యాసాల్ని చాలా పేలవంగా పూర్తిచేసిన వారినీ బినే గుర్తించాడు. దీనర్ధం ఏమిటి? ఒకేబిడ్డ ఐ.క్యు. ఒక అంశంలో ఒకరకంగా, మరో అంశంలో మరోరకంగా ఉందన్నమాట. అప్పుడు ఐ.క్యు.కు అర్ధమేముంది?
ఇదే అభ్యాసాల్ని బెల్జియంలోని పాఠశాలల్లోనూ ప్రయోగించారు. బెల్జియం పిల్లలు ఫ్రెంచి పిల్లల కంటే అద్భుత ప్రతిభ ప్రదర్శించడంతో ఫ్రాన్సు దేశం ఖంగు తింది. తీరా లోతుకెళ్లి చూస్తే బినే పరిశోధన చేసిందేమో ఫ్రెంచి దేశపు ప్రభుత్వ పాఠశాలల పిల్లల మీద. బెల్జియంలో జరిగిందేమో ప్రైవేటు పాఠశాలల పిల్లలమీద! అదన్నమాట కిటుకు.
రెండోది అమెరికా కథ.
1907లో అమెరికా తమ దేశంలో తెలివితక్కువ చచ్చుసరుకు పెరిగిపొయ్యే 'ప్రమాదం' ఉందని పసిగట్టి నేరస్తులు, తాగుబోతులు, వేశ్యలు లాంటి ‘బుద్ధిహీనులు' పిల్లల్ని కనరాదని ఓ శాసనం తెచ్చింది! ఆ తర్వాత తమ దేశంలోకి వచ్చే వివిధ జాతీయులకు కోటా పెట్టి తూర్పు దక్షిణ యూరపు దేశాల 'బుద్ధిహీనులు' తక్కువగానూ, ఉత్తర యూరపు దేశాల 'తెలివిమంతులు' ఎక్కువగానూ తమ దేశంలో స్థిరపడేలా 'జాగ్రత్త' తీసుకొంది. 'తెలివిగలవాళ్ళంతా అమెరికా వాళ్లేనోయ్' అన్పించుకోవాలని పాపం ఆ దేశానికంత తహతహగా ఉండేది.
ఈ నేపథ్యంలో 1915-20 ప్రాంతంలో అమెరికా సైన్యంలోకి వచ్చే వారికో పరీక్ష పెట్టారు. ఈ పరీక్ష రెండు రకాలుగా ఉండేది. ఇంగ్లీషు తక్కువగా తెలిసి, అమెరికా బయటి నుంచి వచ్చిన వారికొక పరీక్ష, తరాల తరబడి అమెరికాలో స్థిరపడి ఉన్న వారికింకో పరీక్ష! మొదటిది 'బీటా', రెండోది 'ఆల్ఫా'.
బయటివారిని వీలున్నంత మందిని సైన్యంలోకి రానీకుండా అడ్డుకోవడం ఈ తెలివి కొలత పరీక్షల పరమార్ధం. అందుకని 'బీటా' పరీక్షలో విచిత్రమైన ప్రశ్నలుండేవి. ఒక టెన్నిస్‌కోర్టు బొమ్మ ఇచ్చి టెన్నిస్ ఆట ఎప్పుడూ చూడనివాళ్ళు దీన్నెలా రాయగలరు? రాయలేరు. అందువల్ల వీళ్ళు తెలివితక్కువ వాళ్ళని ‘గుర్తించి' తరిమేశారు. ఈ పరీక్షల నిర్వాహకుడు 'రాబర్ట్ మర్కేస్'. ఇందుకోసం ఈ తంతు నడిపాడు. తర్వాత ఈ పరీక్షలు అమెరికా పరువు తీశాయనుకోండి.
ముచ్చటగా మూడోది లండన్ కథ.
1955-65 మధ్య తాను 106 మంది (53) కవలల మీద ఓ పెద్ద పరిశోధన జరిపినట్టు 'సెసిల్‌బర్ట్' అనే శాస్త్రజ్ఞుడు ప్రకటించాడు. ఈ కవలల్లోని ప్రతి జంటలోని బిడ్డా ఒకరు ఒకచోట, మరొకరు మరోచోట పెరిగినవారట. అంటే వీరు పెరిగిన పరిసరాలు భిన్నమైనవి. అయినా ప్రతి జంటలోను సమాన లక్షణాలు (సమాన తెలివితేటలు) 77 శాతం ఉన్నాయని ఆయన తేల్చాడు.
ఈ పరిశోధనకు ఎన్నడూ లేని పేరు ప్రతిష్టలు దాపురించాయి. పరిసరాల, అవకాశాల ప్రభావం ఐ.క్యు. మీద ఏమీ ఉండదని నిర్ధారణలు వెలిశాయి. తెలివి సహజసిద్ధమని సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. దీంతో కావల్సినంత కలకలం కూడా రేగింది. ఇంతలో బర్ట్‌గారు ఆయన అదృష్టవశాత్తు కాలధర్మం చెందారు.
తర్వాత బండారం బయటపడింది. బర్ట్‌రెండో కంటికి తెలీకుండా పత్రాల్లోని లెక్కల్నీ తారుమారు చేశాడని తెలిసింది. కొంత మంది బర్ట్‌గార్ని రక్షించాలని తెగ ఉబలాటపడ్డారు. చివరకు బర్ట్‌గారి వీరాభిమాని 'లెసలీ హర్న్‌శా' అన్ని పత్రాల్నీ పునఃపరిశీలించాడు. 1979లో ఈ పరిశీలన బయటికొచ్చింది. బర్ట్ పచ్చి మోసగాడని తేలిపోయింది. అయితే అప్పటికే కావల్సినంత ఆలస్యం జరిగిపోయిందనుకోండి.
ఇలాంటి తెలివి కొలతల కథలు కోకొల్లలు. స్వంత పిల్లల మీదా దత్తు పిల్లల మీదా, నల్లవారి మీదా తెల్లవారి మీదా ఇలా ఒక్క్కొకరి మీద ఒక్కో పరీక్షల కథలు కావల్సినన్ని!
అసలు తెలివిని కొలవగలమా? ప్రేమించడం, కోపించడంలా ఇది కూడా ఒక స్పందన రూపంలోనే గదా వ్యక్తమవుతుంది. ప్రేమ లాంటి స్పందనలు ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా ఉంటాయి. మరి తెలివి కూడా ఒక్కో విషయంలో ఒక్కో రకంగా ఉంటుందాయె. దీన్నిబట్టి సాధారణ తెలివిని (ఐ.క్యు.ను) ఎలా నిర్ధారిస్తారు? ఇవన్నీ మనలాంటి సామాన్యుడి కెదురయ్యే సవాలక్ష ప్రశ్నలు. తెలివిని కొలిచినవారి తెలివిలోకి ఇంత చిన్న ప్రశ్నలు దూరలేక పొయ్యాయి కాబోలు!