సైన్సు ఎలా పుట్టి పెరిగింది?/గూడ్రిక్ వలలో దయ్యపు నక్షత్రం
గూడ్రిక్ వలలో దయ్యపు నక్షత్రం
ఆ నక్షత్రం పేరు 'ఆల్గోల్' అంటే అరబ్బీ భాషలో దయ్యపు నక్షత్రం అని అర్ధం. నక్షత్రాలన్నీ స్థిరకాంతితో ప్రకాశిస్తుంటే దీని కాంతి ఉన్నట్టుండి విపరీతమైన మార్పులు చెందుతుంటుంది. ఈ మార్పుకు కారణం తెలీక అరబ్బులు దీన్ని పిశాచమన్నారు. యూదులు దీన్ని 'సైతాన్ తల అంటే, చీనావారు 'శవాలకుప్ప' అని నామకరణం చేశారు!
'పెర్రిమన్' అనే నక్షత్ర సముదాయంలో ఉండే మన ఆల్గోల్‌కు సుమారు మూడు రోజులకోసారి కాంతి అతివేగంగా మూడవవంతుకు తగ్గిపోయి మళ్లీ అంతే వేగంగా కాంతి పెరిగి యథాతథస్థితికి వస్తుంది.
ఏ నక్షత్రానికీ లేని ఈ వింత లక్షణం దీనికే ఎందుకొచ్చింది? ఇది ఎవ్వరికీ అంతుబట్టని రహస్యంగా చాలాకాలం ఉండిపోయింది. చివరకు 1782లో జాన్ గూడ్రిక్ అనే 18 ఏళ్ళ హాలెండు అబ్బాయి ఈ రహస్యాన్ని ఛేదించాడు! అతనికున్న సాధనాలు ఏవనుకొంటున్నారు? పుట్టు చెవిటితనం, మూగతనం - ఈ రెండే!
ఆశ్చర్యంగా ఉందిగదూ! 1782వ నంబరు 12 రాత్రి మన గూడ్రిక్ దయ్యపు నక్షత్రానికేసి తదేకదీక్షతో చూస్తున్నాడు. కాంతి హఠాత్తుగా తగ్గిపోతోంది. మళ్లీ యథాస్థాయికి వస్తోంది. అప్పటి నుంచి మనవాడు నక్షత్రయజ్ఞం మొదలెట్టాడు. దాని కాంతి ఎలా మారుతున్నదీ 'నోట్' చేసుకోసాగాడు. దాన్ని గ్రాపుగా గీశాడు.
మరి ఈ వ్యవధిని ఎలా నిర్ణయించడం? నక్షత్రం రాత్రి తప్ప పగలు కన్పించదే! పగటిపూట ఈ మార్పు జరిగితే తెలుసుకొనేదెలా? అందువల్ల గడియారం పెట్టుకొని ఏకబిగిని నక్షత్రపు కాంతి మార్పుల్ని కొలవడం అయ్యేపని గాదు. దీనికోసం గూడ్రిక్ నెలల తరబడి రాత్రివేళల కాంతినీ, సమయాన్నీ రాసుకొన్నాడు. పూర్తిగా కాంతిరేఖ (Light Curve) ఏ విధంగా మారుతుందో సరాసరి మీద లెక్కించాడు!
వ్యవధి సరే అంతు చిక్కింది. మరి కారణమో! దీన్ని కనుక్కొనేందుకు గూడ్రిక్ వద్ద ఏ సాధనాలూ లేవు. అలా చూస్తుండడమే అతని పరిశోధన! ఈ నిశిత పరిశీలనలో అతనికున్నట్టుండి ఓ రోజు ఓ ఊహ తళుక్కున మెరిసింది. “ఆల్గోల్ ఒక నక్షత్రం గాదు. రెండు నక్షత్రాలు. ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతుండాలి" అన్నదే ఆ ఊహ! అంటే వాటి ప్రదక్షిణా కాలం 2 రోజుల, 20గంటల, 49 నిమిషాల, 8 సెకండులన్నమాట! అందులో ఒకటి అల్ప కాంతి గలదీ మరొకటి ఎక్కువ కాంతి గలదీ అన్నమాట. పరస్పర ప్రదక్షిణలో అల్పకాంతి గల నక్షత్రం ఎక్కువ కాంతిగల నక్షత్రానికీ, మన భూమికీ అడ్డు రావడంతో మన కంటికి కన్పించే కాంతి మొత్తం హఠాత్తుగా తగ్గిపోతోంది. అడ్డు తొలగగానే మళ్లీ పూర్తి కాంతి కన్పిస్తోంది. ఇదీ గూడ్రిక్ ఊహ సారాంశం! అంటే ఒకరకమైన నక్షత్ర గ్రహమన్నమాట. గూడ్రిక్ దీన్ని రాయల్ సొసైటీకి 1783 మే నెలలో రాసి పంపించాడు!
అంతటితో కథ ఆగలేదు. దీన్ని ఆ కాలపు విలియం హెర్షల్ వంటి హేమాహేమీ ఖగోళ శాస్త్రజ్ఞులు వట్టి ఊహగా కొట్టిపారేశారు. కుర్రచేష్టగా లెక్కగట్టేశారు. ఆనాటికి తమ దగ్గరున్న 7 అడుగుల టెలిస్కోపులో వాళ్ళకి నక్షత్రాల జంట కన్పి,చడం లేదు ! అంతకు ముందు ఆల్ఫా సెంటారీ, సిరియస్ వంటి జంట నక్షత్రాలు ఆ టెలిస్కోపులో కన్పించాయి మరి! ఇవెందుకు కన్పించవు అని వారి ఎదురు ప్రశ్న!
అసలు రహస్యమేమంటే ఆల్ఫా సెంటారీలోని నక్షత్రాల జంట మధ్య దూరం 21.7 కోట్ల మైళ్ళు. సిరియస్‌లోని నక్షత్రాల జంట మధ్య దూరం 18కోట్ల మైళ్ళు. 'అల్గోల్‌లోని నక్షత్రాల జంట మధ్య దూరం 46.5 లక్షల మైళ్ళు మాత్రమే. అంత దగ్గరగా ఉన్న నక్షత్రాల మధ్య దూరాన్ని గుర్తించి వేర్వేరు నక్షత్రాలుగా చూడగల టెలిస్కోపులు ఆనాడే గాదు ఈనాటికీ లేవు గాక లేవు!
దయ్యపు నక్షత్ర బండారాన్ని బయటపెట్టిన గూడ్రిక్ తన 21వ ఏటనే మరణించాడు. ఒక్క నక్షత్రం కోసమే అతని జీవితం ఖర్చయిపోయింది. ప్రత్యక్షంగా కన్పించిన విషయాల్ని, సాధనాలతో కనుగొన్న విషయాల్ని గాదు పరోక్ష నిదర్శనాలతో విషయాన్ని ఊహించడంలోనే శాస్త్రజ్ఞుని ప్రతిభ బయటపడుతుంది. రెండుపదులు నిండీ నిండని పుట్టు మూగ చెవిటి గూడ్రిక్‌ది అలాంటి ప్రతిభ.