సైన్సు ఎలా పుట్టి పెరిగింది?/అంధకారంలోంచి అక్షర ప్రపంచంలోకి...
అంధకారంలోంచి అక్షర ప్రపంచంలోకి...
వెన్నముద్దల్లాంటి తెల్లటి మబ్బుల్ని తదేకంగా చూస్తున్న ఆ పిల్లవాడు ఉన్నట్టుండి తూనీగల వెంబడి తుర్రుమంటున్నాడు. రంగు రంగుల సీతాకోక చిలుకల్ని వెంటబడి తరుముతున్న ఆ అల్లరి పిల్లడు పూలరంగుల్ని వాటి పుప్పొడిని శోధించి చూస్తున్నాడు...
ఇదంతా ఇప్పుడు ఒకనాటి మధురస్మృతి. అయిదేళ్ళ వయస్సుకే అతడికివన్నీ స్మృతుల' జాబితాలో చేరిపొయ్యాయి.
ఒక విషాదం అతని రెండు కళ్ళనూ బలిగొంది. వాళ్ళ నాన్న చర్మకారుడు. ఎవ్వరూ లేనపుడు కుతూహలం కొద్దీ చర్మాన్ని శుభ్రం చేసి, కత్తిరించే పరికరాల్ని పరిశీలిస్తూ, నున్నటి చర్మం మీద మొనదేలిన దబ్బనంతో ఏదో పిచ్చిగీతలు గీయబోతూ ఆ నిర్భాగ్యుడా దబ్బనాన్ని ఎడమకంటిలో గుచ్చుకొన్నాడు. ఆ గాయం సెలవేసి, రెండో కంటికీ ప్రాకి అతని జీవితాన్ని చిమ్మచీకటిమయం చేసింది. రెండు వందల యేళ్ళనాడు ఫ్రాన్సులో రెండు కళ్లూ పోగొట్టుకోవడమంటే భిక్షగాళ్ళ జాబితాలో చేరినట్టే లెక్క.
అయినా వాళ్ళ నాన్న తన కొడుకు దిక్కులేనివాడు కాగూడదని పట్టుపట్టాడు. ఒక సన్నటి చేతిబెత్తం తయారు చేసిచ్చాడు. దాని సాయంతో నడుస్తూ ఆ పిల్లవాడు తండ్రివద్దే చర్మం బాగుచేసి కత్తిరించి గుర్రపు జీనులు చెయ్యడం నేర్చుకోవడం మొదలు పెట్టాడు. కథ ఇక్కడితో ఆగిపోయి ఉంటే లోకంలోని లక్షలాది అంధుల చరిత్ర కూడా చీకట్లో చిక్కి నేటికీ విలవిలలాడుతుండేది.
ఇంతలో ఊళ్లోకి ఒక క్రైస్తవ ఫాదర్ వచ్చాడు. ఆ పసివాణ్ణి చేరదీసి స్కూలు మాస్టారికి నచ్చజెప్పి బళ్లో చేర్చాడు. ఏం విన్నా ఏకసంతాగ్రాహిగా ఇట్టే పట్టేసుకొంటున్న ఆ పిల్లవాణ్ణి ఆ బడితో ఆపెయ్యక పట్టుబట్టి, వాళ్ళమ్మా నాన్నలకు నచ్చజెప్పి పారిస్‌లోని అలనాటి మొట్టమొదటి అంధుల పాఠశాలలో చేర్పించాడు. ఈ ఘటన ఆ పిల్లవాడి జీవితంలోనే కాదు చూపుకు నోచుకోని లక్షలాది అంధుల జీవితాల్ని ఒక మలుపు తిప్పుతుందని ఆనాడు ఆ ఫాదర్ కూడా ఊహించి ఉండడు.
ఆ పిల్లవాడెవ్వరో ఇప్పటికి మీరు కొంత ఊహించుకొని ఉంటారు. బ్రేలీ లిపిగా నేడు చలామణిలో ఉన్న అంధుల లిపికి ఆవిష్కర్త అతడేనని ఇతడి పేరు 'లూయీ బ్రైల్' అనీ మీరు గుర్తించి ఉంటారు. ఇంతకూ మన లూయీ వయస్సు ఆనాటికి పట్టుమని పది సంవత్సరాలే.
అంధులు చదవడానికి అక్షరాలు కాగితం మీద ఉబ్బుగా, తాకితే చేతికి తగిలేలా ఆ రోజుల్లో ఉండేవి. చదవాలంటే అన్నీ ఒకటిగానే చేతికి తగిలేవి. తేడా కనుక్కోవడం మహా కష్టంగా ఉండేది. పేజీకి పది అక్షరాలు కూడా పట్టేవి కాదు. అందువల్ల అంధుల కోసం పుస్తకాలు దొరికే అవకాశమే లేదు. ఇంతలో కెప్టెన్ బార్బియర్ ఆ స్కూలుకు వచ్చాడు. సైనికులు రాత్రులు చదివేందుకు ఆయన కనుగొన్న పద్ధతిని అక్కడ ప్రవేశపెట్టాడు. కాగితం మీద సూదితో రంధ్రాలు గుచ్చి, కాగితాన్ని వెనక్కు తిప్పి తడుముకొంటూ చదవడం ఈ పద్ధతిలోని ప్రత్యేకత.
ఈ బార్బియర్ పద్ధతిని చూచినప్పటి నుంచి మన లూయీ ఎలాగైనా అంధులు ధారాళంగా చదవగల్గేలా ఒక లిపిని తయారు చెయ్యాలని దీక్షబూనాడు. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా అతని వెంట ఒక దబ్బనం ఉండేది. ఒక కొయ్యపలక, దళసరి కాగితం ఉండేవి. రాత్రింబవళ్ళు ఆయనకదే చింత, అదే తపన.
ఎట్టకేలకు ఒక రాత్రి లూయీ మెదడులో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. బార్బియర్ ఫ్రెంచి భాషలోని ధ్వను లన్నిటికీ సంకేతాలను సూదితో గుచ్చిన రంధ్రాల రూపంలో రూపొందింంచాడు. ఫ్రెంచి భాషను రాయడానికీ సంకేతాలు ఏ మాత్రం చాలేవి కావు. అంతా గజిబిజిగా ఉండేది. దీనికి పరిష్కారంగా ఫ్రెంచి లిపిలోని ప్రతి అక్షరానికీ లూయీ కొన్ని బిందువులు నిర్దిష్ట రూపంలో ఉండేలా చేశాడు. మొత్తం 26 అక్షరాలే గాబట్టి కొద్ది సంకేతాలతో భాషనంతా ఇష్టం వచ్చినట్టు రాయడానికి, దేన్నైనా చదవడానికి దీంతో ఎంతో సులభమై పోయింది. అప్పటికి లూయీకి కేవలం పదిహేనేళ్లే!
లూయీ లిపిని బార్బియర్ ససేమిరా ఒప్పుకోలేదు. పాఠశాల డైరెక్టరు దీనికి ప్రచారం తేవాలని ఎన్ని సంస్థలకు చెప్పినా విన్నవారు లేరు. కొత్త డైరెక్టరు వచ్చి లూయీ తయారు చేసిన పుస్తకాలన్నీ తగలబెట్టేశాడు. తోటి పిల్లలే లూయీని ఆదరించారు. అతని లిపిని స్వీకరించి అద్భుతంగా చదవడం, రాయడం సాగించారు. అంధులు చదవడం ఇంత సులభమైతే మనకు ఉద్యోగాలెక్కడ ఉంటాయని పాఠశాల టీచర్లందరూ దీన్ని తొక్కి పెట్టాలని సర్వ ప్రయత్నాలు చేశారు! చివరికి లూయీ అదే స్కూల్లో టీచరుగా చేరాడు. ఒక్క క్షణం వృధా పోనీకుండా లైబ్రరీలోని పుస్తకాల్ని తన లిపిలోకి 'తర్జుమా' చెయ్యడానికి కంకణం కట్టుకొన్నాడు. దీంతో అతని ఆరోగ్యం క్షీణించింది.
ఒకానొక వసంతకాలపు ప్రభాతాన వందలాది మంది విద్యాభిమానులు చేరిన సభలో లూయీ తన లిపిని పరిచయం చేశాడు. అంధులు ఏం చెప్పినా రాయడం, ఏం రాసినా అనర్గళంగా చదవడం, కళ్లారా చూసిన సభికులు హర్షధ్వానాలతో లూయీని ఆకాశానికెత్తారు.
ముప్ఫై అయిదేళ్ళు నిండీ నిండక ముందే తృప్తిగా లూయీ తుదిశ్వాస విడిచాడు. ఆయన మరణించిన ఏడేళ్ళకు అమెరికా అధికారికంగా ఆయన లిపిని స్వీకరించింది. అప్పటి నుంచి అది బ్రేలీ లిపిగా ప్రసిద్ధికెక్కింది.
ఏ దబ్బనం అయిదేళ్ళప్రాయంలో తనకు వెలుగును శాశ్వతంగా దూరం చేసిందో, ఆ దబ్బనతంతోనే లూయీ లక్షలాది అంధుల జీవితాల్లో అక్షరాల వెలుగును నింపే లిపిని ఆవిష్కరించాడు.
ఆధారం: అరవిందగుప్తా