Jump to content

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/హైదరాబాదు రాష్ట్రములోని చారిత్రక స్థలములు

వికీసోర్స్ నుండి

హైదరాబాదు రాష్ట్రములోని చారిత్రక స్థలములు

హైదరాబాదు రాష్ట్రములో అనేక రాజ్యాలు సామ్రాజ్యాలు ఏర్పడి అంతరించెను. అనేక మతాలిందే విజృంభించెను. అందుచేత చారిత్రకులకు ఇది ముఖ్యస్థానమని చెప్పవచ్చును. ప్రాచీన రాజులు కట్టిన కోటలు వారి రాజ్య చిహ్నములు గాను, రాజులు ధనిక భక్తులు కట్టించిన పూజాలయములు మత చిహ్నములుగాను, నేటికిని ఈ రాష్ట్రమందు ప్రతి తాలూకాలో కూడ చూచి ఆనందింపవచ్చును. చారిత్రకులకు నెత్తినొప్పిని, ఆయాసమును, పరిశోధన పటిమను, కల్పించునట్టి తామ్రశిలా శాసనములు వందలు కాదు కదా వేలకొలది లభించుచున్నవి. అముద్రిత తాళపత్ర గ్రంథములు కూడా వందల కొలదిగా, వేలకొలదిగా లభించినవి. ఇంకను లభించు చున్నవి. ప్రాచీన నాణెములు పలుతావుల జనులకు దొరకుచుండును.

ఈ రాష్ట్రములోనే ఆంధ్ర శాతవాహనులు, యాదవులు, చాళుక్యులు, రాష్ట్ర కూటులు, కాకతీయులు, పంచ సుల్తానులలో ముగ్గురు సుల్తానులు తమ రాజధానులను స్థాపించుకొని రాజ్యము చేసిరి. ఈ రాష్ట్రమందలి భాగములను బయటి ప్రాంతముల నుండి ఆంధ్రులు, మహారాష్ట్రులు, ఓడ్రులు, రెడ్లు రాజ్యము చేసిరి. ఈ రాష్ట్రములోనే జైన, బైద్ధ, వీరశైవ, శ్రీవైష్ణవ మతములకు సంబంధించిన ప్రసిద్ధాలయములు కలవు. సిక్కులకు కూడా నాందేడు పవిత్రమైనది. గుల్బర్గా, గోలకొండ, సుల్తానులీ రాష్ట్రములోనే పరిపాలనము చేసియుండిన వారగుట చేత చాలా మసీదులు దర్గాలు నిర్మాణమయ్యెను. ఆసఫ్‌ జాహి వంశ ప్రభువుల కాలములో పై నిర్మాణములను కాపాడుటయేగాక కొత్త నిర్మాణములను కూడా కావించిరి. హైదరాబాదు రాష్ట్రములోని పాత దిబ్బలను త్రవ్వించినచో మరికొన్ని చారిత్రక విశేషములు లభ్యమగును. ఇటీవలనే హైదరాబాదునకు 40 మైళ్ళ దూరములో నున్న కొండాపురము అను స్థలము వద్ద కొన్ని ప్రాచీన ఆంధ్ర నాణెములు లభించెను. వాటి ఆధారముచే అచ్చట త్రవ్వించగా 1800 సంవత్సరాల క్రిందటి ఆంధ్ర నగర మొకటి బయటపడెను. ఈ రాష్ట్రములోని రాయచూరు జిల్లాలోని మస్కీ వద్ద అశోక చక్రవర్తి శాసనములు లభించినవి. అవి 2200 ఏండ్లకు పూర్వము నాటివి. రాష్ట్రములోని అతి ప్రాచీన చారిత్రక చిహ్నములలో ఇది ముఖ్యమైనదని చెప్పవచ్చును. అటు ఉత్తర దిశయందుండు ఔరంగాబాదు జిల్లా చాలా ముఖ్యమైన చారిత్రక మండలమై యున్నది. ప్రాచీనకాలమందు దేవగిరి రాజ్యమిందే యుండెను. అంతకన్న ప్రాచీనములో శాలివాహన రాజులు ప్రతిష్ఠానపురమును (నేటి పైఠాన్‌) రాజధానిగా చేసుకొని ఇప్పుడు ఆంధ్ర మహారాష్ట్ర కర్ణాటకలనబడు భాగాలను ఏకచ్ఛత్రాధిపత్యముగా పరిపాలించిరి. ఔరంగాబాదుకు 12 మైళ్ళ దూరములో హిందూస్థానమందలి అగ్రశ్రేణిలోచేరిన కోటలలలో నొకటగు దేవగిరి (దౌలతాబాదు) జిల్లా యున్నది. అచ్చటనే ఔరంగజేబు యొక్కయు, అసఫ్‌ జాహి యొక్కయు గోరీలున్నవి. అచ్చటకి 2 మైళ్ళ దూరములో జగద్విఖ్యాతమైన ఎల్లోరా గుహలున్నవి. మూడు మైళ్ళ పొడవున గట్టులలోనే గుహలను తొలచి ఆలయములను విహారములను నిర్మించినారు. అందు జైన, బౌద్ధ హిందూ శిల్పములున్నవి. క్రీస్తు శక పూర్వము 200 ఏండ్ల నాటినుండి క్రీస్తు తర్వాత 900 ఏండ్ల వరకు ఈ గుహలు నిర్మాణమై యుండెను. అందలి శిల్పాలు అద్వితీయమైనవి. ఆ శిల్పాలలో కైలాసం అను పేరుతో నున్న శిల్పరాజము నిజముగా భూలోక శిల్పములలో కైలాసము వంటిది. ఔరంగాబాదులో బీబీకా మక్భరా అనునది తాజమహల్‌ యొక్క నఖల్‌. అదే నగరములో పూర్వులు చుట్టునుండు గట్లనుండి భూమిలో కాలువలు నిర్మించి నగరమంతటను నిరంతరము ఊట గొట్టముల ద్వారా నీరు సప్లయి యగునట్లు చేసినది నేటికిని అనుభవములోనున్నది. ఔరంగాబాదునకు 60 మైళ్ళ దూరములో అజంతా గుహలున్నవి. అవి రాతిలో కవితను ప్రదర్శించు తావులు. గట్లును వాటిపై నుండు చెట్లును ఆ గట్ల నుండి నిరంతరము ప్రవహించు దివ్య ప్రవాహమున్నూ అరసికుని రసికునిగా క్షణమాత్రమున జేసివేయును. ఇంచుమించు 2000 ఏండ్ల కిందట అచ్చటి గుహలలోని గోడలపైన గచ్చువేసి వాటిపై రంగులతో చిత్రించిన చిత్రాలను నేల నాలుగు చెరగుల వారును అదేపనిగా వచ్చి చూచి ముగ్ధులైపోవుచున్నారు. కామధేను వంటి మహాత్ములను గన్న ఔరంగబాదు జిల్లా పవిత్రమైనది.

ఔరంగాబాదు తర్వాత ప్రసిద్ధమైనట్టిది ఒరంగల్‌ జిల్లా. అది ఆంధ్రులకు ప్రాముఖ్యమైనట్టిది. అందు కాకతీయ రాజుల కోటలు గలవు. వారిచేతను వారి సామంత దండ నాయకులచేతను నిర్మింపబడిన జైన దేవాలయములచ్చట సర్వ వైభవమును ప్రకటించుచున్నవి. ఓరుగంటికి 40 మైళ్ళ దూరములో రామప్ప గుళ్ళును పాఖాల చెరువును ఆవశ్య దర్శనీయములై యున్నవి. రామప్పగుళ్ళ గోపురములకు వినియోగించిన ఇటికలు చాలా పెద్దవైనను అవి నీటిపై తేలియాడుటను నేటి ఇంజనీరులు చూచి ఆశ్చర్యపడుచున్నారు. రామప్ప గుళ్ళలోని నల్లరాతి విగ్రహాలను పూర్వమెవ్వడో ఒక తాలూక్దారు మొహించి యుండెనను కథను విన్నచో వాటి శిల్ప సౌందర్యమెట్టిదో ఊహించుకొనవచ్చును. రామదాసు భక్తిని చాటిన భద్రాచల క్షేత్ర మీ జిల్లాలోనిదే.

ఒరంగల్‌ తర్వాత చరిత్ర పరికరాలకు ప్రసిద్ధమైనది నల్లగొండ జిల్లా. నల్లగొండ పట్టణానికి 4 మైళ్ళ దూరములోనే పానగల్లు కలదు. అందలి 1000 ఏండ్ల నాటి దేవాలయము శిథిలమైపోయినను మిగిలిన శకలములు కూడ తమ శోచనీయ స్థితిని కరుణరసయుక్తముగా మనకు తెలుపుచున్నవి. సూర్యాపేటకు 12 మైళ్ళ దూరములోని పిల్లలమర్రి వెలమదొరల చరిత్రకును, సుందర దేవాలయ శిల్పమునకు ప్రసిద్ధి. నల్లగొండ జిల్లాలో దేవరకొండ రాచకొండ అను పెద్ద దుర్గాలు కలవు. అవి వెలమరాజుల రాజధానులు. వాటిలోనిప్పుడు నీటు ఏమిన్నీ లేకున్నను వైరుల పోటును మాత్రము అవి బాగుగా ప్రదర్శించుచున్నవి. ఇదే జిల్లాలోని భువనగిరి దుర్గము కాకతీయుల నాటిదైనను చూచుట కందమైన దైనను ఎక్కువ చరిత్రను కాంచనట్టిది. దానికి కొన్ని మైళ్ళ దూరములో కొలనుపాక కలదు. అది సుప్రసిద్ధ జైన క్షేత్రము.

ప్రాముఖ్యతలో నాల్గవ స్థానము వహించునది రాయచూరు జిల్లా. అందలి గోనబుద్ధారెడ్డి కోట దక్కను సుల్తానులకును విజయనగర చక్రవర్తులకును నిరంతరము యుద్ధాలు చేయించినట్టిది. ఇదే జిల్లాలోని కొప్పలుకు 15 మైళ్ళ దూరములోని ఇటుగీలో చక్కని శిల్పములతో కూడిన ప్రాచీన దేవాలయములున్నవి. ఆలంపూరులోని నవబ్రహ్మ దేవాలయాలు ఇంచుమించు 2000 ఏండ్ల నాటివి. రాష్ట్ర శిల్చములలోని దేవాలయాల శిల్పము విశిష్టతతో కూడినట్టిది. ఈ రాయచూరులోనిదే గద్వాల సంస్థానం. ఇది 800 ఏండ్ల చరిత్ర కలిగిన సంస్థానం. దీనికి గొప్ప మట్టి కోట గలదు. కాని అది రాతి కోటలను మించినట్టిది. అందలి ఫిరంగీల వంటివి రాష్ట్రములోను రెండును ఉన్నవో లేవో అనిపించును.

అయిదవ స్థానము మహబూబు నగరం జిల్లాకు చెందును. అందు వనపర్తి కొల్లావుర నంస్థానములు వాటిలోని కోటలకు పేర్కొనదగినవి. కొల్లాపుర సంస్థానములోని జటప్రోలు దేవాలయము ప్రాచీనమైనది. దాని శిల్పము ఇతరోత్కృష్ట శిల్పముల కేమాత్రమున్నూ తీసిపోదు. ఇదే సంస్థానములో కృష్ణా తీరమందు మల్లేశ్వరము సోమేశ్వరము అను 1200 ఏండ్ల నాటి వీరశైవ క్షేత్రాలు కలవు. నది కవతలి యొడ్డుననేశైవ క్షేత్ర రాజ్యమైన సంగమేశ్వరము కలదు. నాగరుకర్నూలు తాలూకాలోని పానగల్లు కోట ఇంచుమించు 800 ఏండ్ల నాటిది. అచ్చంపేటలోని ఉమామహేశ్వరం అమరాబాదులోని మన్ననూరు మంచి శైవక్షేత్రములు. ఆత్మకూరు సంస్థానములోని కురుమూర్తి శైలము రెండవ వెంకటాచలమని ప్రతీతి.

హైదరాబాదు నగరము దాని పరిసరములు అడుగడుగునకు చరిత్రతో కూడినట్టినవి. సమీపమందలి గోలకొండ దుర్గము, నగరము చుట్టునుండు చెరువులు, చారుమినారు, మక్కామసీదు వంటి విఖ్యాత స్థలములు ఇట్టివెన్నియో స్మరింపదగినవి కలవు.

బీదరుకోట ఈ రాష్ట్రములోని ఖిల్లాలో గణతకెక్కినది. అచటి గావాన్‌ విద్యాలయము సుప్రసిద్ధమైనది. బీదరు పాదుషాల గోరీ భవనములు చూడదగినవి. బీదరు సమీపములోనే నరసింహాలయము ఒక విచిత్రమగు స్థలము. ఒక ఫర్లాంగు వరకు గుట్టలో గుహమార్గ మేర్చడినది. అందు నడుము లోతువరకెల్లప్పుడును నీరు ప్రవహించుచుండెను. అట్టి గుహలో ఆ దేవాలయమున్నది. గుల్బార్గాలోని మసీదులు చాలా గొప్పవై అందమైనవై ప్రసిద్ధి నొందినవి. అందలి కోట, గోరీలు చూడదగినవి. ఆ జిల్లాలోని కళ్యాణి పూర్వమందు వీరశైవ కేంద్రమై యుండెను. అదే జిల్లాలోని మాన్యఖేటము (ఇప్పటి మలిఖేడు) రాష్ట్ర కూటుల రాజధాని. వాతాపి గణపతి అని ప్రసిద్ధి నొందిన దేవుడు ఇప్పటి బాదామిలో వెలసినాడు. కరీంనగరములోని ఎల్లందు కోట, మహబూబ్‌ నగర జిల్లాలోని కోయిలకొండ కోట వంటివి రాష్ట్రములో అనేక స్థలములందు కానవచ్చుచున్నవి. అజ్ఞాత వాసములో నున్న శిల్పము లెన్నియో కలవు. రాజ్యాలతోపాటు ఆలయాలెన్ని భూగర్భమందు అణగిపోయెనో యేమో. వీలైనంతవరకు ప్రభుత్వ దృష్టికి వచ్చిన ప్రాచీన స్థలముల నన్నింటిని కాపాడుటకై ఏటేట కొన్ని లక్షలను మ.ఘ.వ. నిజాం ప్రభుత్వం వారు ఉదారతతో వ్యయము చేసి ధన్యవాదములకు పాత్రులైనారు. గద్వాలలోని పూడూరులో జైన శాసనాలున్నవి. ఇట్టి వెన్నియో వందల కొలది స్థలములున్నవి. సుప్రసిధ్ధములైన వానినే ఇప్పుడు పేర్కొనియున్నాను.

ఈ రాష్ట్రములో పశ్చిమ చాళుక్యుల యొక్కయు, కాకతీయుల యొక్కయు శాసనములే యెందు చూచినను కానవచ్చుచున్నవి. అనేక స్థలములందు నాణెములు నేటికిని దొరుకుచున్నవి. అముద్రిత గ్రంథాలు దొరుకుచున్నవి. ఈ రాష్ట్ర మింకను చారిత్రిక పరిశోధకులకు గనియై యున్నది. ఉపయోగించుకొనువారే పరిశోధింపదగిన వారై యున్నారు.


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse