సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/హైదరాబాదు నగర ప్రాచీన స్థలాలు
హైదరాబాదు నగర ప్రాచీన స్థలాలు
హుసేన్‌సాగరు
హైదరాబాదుకును సికింద్రాబాదుకును మధ్య ఉన్న హుసేను సాగరు చెరువును గురించి లోకులు ఒక వినోదమగు కథ చెప్పుకుంటారు. అదేమన మీర్ ఆలం మంత్రిగా ఉండే కాలములో ఈ చెరువును కట్టించెనట. కాని తన పేరుతో ప్రచార మందుండుటకు మారుగా దానిని జనులు హుసేనుసాగరు అనిరట. ఎందుకంటే హుసేను సాబ్ అను “మేస్త్రీ” చెరువు కట్టిన కూలీలలకు దినమూ సాయంత్రము కూలీలు బట్వాడా చేయుచూ ఉండెనట. అప్పుడు మీరు ఆలం వేరే ఒక చెరువు నిర్మాణాన్ని ఏర్పాటుచేసి తానే కూలీ యిచ్చుచు వచ్చెనట. అందుచేత వేరే మీరాలం చెరువు ఏర్పడెనట. ఇదంతా పుక్కింటి పురాణం. నిజమేమంటే ఇబ్రహీం ఖుతుబుషా 957 హిజరీలో గోల్కొండ నవాబయ్యెను. అతడు రైతు లోకాన్ని ఉద్ధరించి రాజ్యాదాయం ఎక్కువ చేసే నిమిత్తం చాలా చెరువులు కట్టించెను. ఇప్పటి ఇబ్రహిం పటం చెరువు మరియు కంకూరు బుద్వేలిలోను అతడే చెరువులు కట్టించెను. హుసేను సాగరు చెరువు కూడా అతడే కట్టించెను. దానికి రెండు లక్షల హూన్నులు ఖర్చయ్యెను. ఆ చెరువు నిర్మాణాన్ని హుసేనుషా అను నొక వలీ విచారించు కొనుచుండెను. అందుచేత అతని పేర ఈ చెరువు ప్రసిద్ధికి వచ్చెను.
పాతవారధి
నగరములోని మూసీనదిపై కట్టబడిన పాత వారధి యొక్క నిర్మాణము రసికత్వముతో కూడినదై యున్నది. ఇబ్రహీం ఖుతుబ్‌షా కుమారుడైన మహమ్మదుఖులీ అనువాడు “భాగమతి” అను భోగముదాని నుంచుకొని యుండెను. ఇప్పుడు చార్‌మినారుండు ప్రాంతాన “చచ్లం” అనుగ్రామం ఉండెను. అచ్చట ఆ బోగముది ఉండెను. దాని యింటికి యువరాజు వచ్చి పోవుచుండెడి వాడు. ఒకనాడు తన అలవాటు ప్రకారము గోలకొండ ఖిల్లానుండి బయలుదేరి దాని యింటికి పోవువాడై మూసీనది వరకు వచ్చెను. వర్షాకాలమగుటచేత నది అప్పుడే నిండి పారుచుండెను. ప్రేమ శక్తి బలవత్తరమైనది. ప్రవాహాన్ని జయించునట్టిది. యువరాజు గుర్రాన్ని ప్రవాహములోనికి దింపి ఇవతలి నుండి అవతలికీ దించి భాగమతి యిల్లు చేరుకున్నాడు. ఈ వార్త చారులు పాదుషాకు తెలిపినారు. తక్షణమే మూసీపై వారధి కట్టవలెనని ఆజ్ఞాపించినాడు. మరొక వర్షర్తువు వచ్చే లోపల అది సిద్ధమయిపోయెను. దానికి రెండు లక్షల (బంగారు హున్నులు నాణెములు వ్యయమయ్యెను). ఈ వారధి 881 హీజ్రిలో కట్టబడెను. దీనినే ఇప్పటికిని పురానాపుల్ అని వ్యవహరింతురు.
మౌలాలీ ఉరుసు
హైదరాబాదులో ఏటేట మౌలాలీ గుట్టపై ఒక గొప్ప ఉరుసు జరుగును. దానికి గాను స్థానికముగా రెండు దినాలు కచ్చేరీలకు సెలవు కూడా ఇయ్యబడును. ముసల్మానులే కాక హిందువులును వేలకొలది ఆ గుట్టకు పోయి ఫాలుహారు చదివించి మ్రొక్కులు చెల్లించికొని వత్తురు. బీదలేకాక మ.ఘ.వ. నిజాం ప్రభువుగారును మౌలాలీ సేవచేసుకొని వత్తురు. ఈ మౌలాలీ గురించి జనులు నానా కథలు అల్లుకొని చెప్పుకొందురు. నిజమైన సంగతి ఇట్లున్నది.
ఇదే ఇబ్రహీం కుతుబుషా కాలములో గోలకొండకు సమీపములో నుండు నొక గుట్టపై ఒక దేవాలయముండెను. ఒకనాడు వెన్నెలరాత్రిలో పాదుషా గోలకొండ పై భాగమందలి “బాలా హిసార్” అను సౌధముపై ఆనందముతో అటునిటు ప్రచారు చేయుచు ఉండెను. అట్టి సమయములో అతనికి ఉత్తరపు దిక్కున ఒక పెద్ద వెలుతురు కానవచ్చెను. ఆ సమయములో రాయారావు అను పేరుగల బ్రాహ్మణుడు పాదుషా వెనుక నిలిచి యుండెను. ఆ వెలుతురేమిటి? అని రాయరావును పాదుషా విచారించెను.
“సర్కార్ ఆ గుట్టపై మౌలాలీ అనే ఫకీరు యొక్క జండా యున్నది. అందుచేత షియ్యాలు అచ్చట అఖండదీపములు పెట్టినారు” అని చెప్పినాడు. “అట్లయితే మనము కూడా రేపు గురువారము నాడు పోయి దర్శనము చేసుకొని వత్తుము” అని పాదుషా సెలవిచ్చినాడు. బ్రాహ్మణుడు, యజమాని సంతోష పడుటకై ఏదో ఒక తప్పుడు కూత కూసి యుండెను. పరివాసవిజల్పితము తుదకు పరమార్థముగా గ్రహించబడెను. తనమాట దక్కించుకొనవలెను. లేకున్న తన తలకూడ పోవచ్చును. మరునాడే ఆ గుట్టకు పోయి గుడిలోని హిందూ దేవత విగ్రహాన్ని ఎత్తి పారవేయించి మసీదువలె మార్పించి ఒక జెండా పాతించి దానిచుట్టును ఒక ఆకుపచ్చని బట్ట కట్టించి అంతయు సర్వసిద్ధము చేయించినాడు - గురువారము రానే వచ్చెసు. ఆనాడు హజరత్ ఆలీగారి 13వ రజల్ దినము. కావున గుట్ట వద్ద పాదుషా బీదలకు అన్నదానము బాగుగా చేయించినాడు. ఈ విధంగా అది ఏర్పడెను. ఆనాటి నుండియు మౌలాలీఉరుసు అనుపేర సుప్రసిద్ధముగా అదే స్థలములో జరుగుచున్నది, కారణం తెలియకున్నా హిందువులును అచ్చట సేవ చేసుకొని పోవుచుండుటయు ఒక విశేషము.
భాగ్యనగరము
మన ఆంధ్రులు చాలామంది హైదరాబాదును “భాగ్యనగర” మని కూడా ఇప్పటికి వ్యవహరించుచున్నారు. బహుశ చాలామందికి దాని కారణము తెలియక పోవచ్చును. 988 హిజ్రీలో ఇబ్రహీం ఖుతుబుషా చనిపోయెను. అతని కుమారుడు - భాగమతి అను బోగము దాన్ని ఉంచుకున్న మహామ్మదుఖులీ ఖుతుబుషా అనువాడు రాజయ్యెను. భాగమతికి తానున్న చోటనే నగరము నిర్మించవలెనని కోరిక పుట్టెను. మహా సౌందర్యవతి, పాదుషాగారు చేపట్టిన యువతి, బోగముది. కోరికలు వృథా పోవు. పాదుషాగా రిట్లాజ్ఞాపించినారు. “గోలకొండ ఇరుకటంగా ఉంది. మా దర్జాకు తగినట్టుగా లేదు. అమీర్లకు ఇబ్బందిగా వుంది. నదికి అవతలి భాగంలో నగర నిర్మాణం చేయవలసింది. నాలుగు బాటలు నాలుగు వీధులుండవలెను. నాలుగు కమానులు నాలుగు దిక్కులు కట్టవలెను. 14000 దుకాణాలుండవలెను. 12000 మొహల్లాలు (వాడలు) ఉండవలెను” అని ఆజ్ఞాపించెను. నగరము సిద్ధమయ్యెను. రెండు కోట్లకన్న యెక్కువగా రూపాయీల వ్యయమయ్యెను.
చార్‌కమాను
పై విధముగా సిద్ధమైన నాలుగు బజారులలోని నాలుగు కమానులనే ఇప్పటికిని చార్‌కమాన్ అని వ్యవహరించుచున్నారు. ఇందలి ఉత్తర దిక్కున కమాను వద్ద ఒక వైద్యాలయమును నిర్మించిరి. పశ్చిమ దిశలో హుజూరు వారి భవనాలు నిర్మించిరి. ఈ నాలుగు కమానుల మధ్య విశాల స్థలమును నందలి ఒక “హౌజును” కట్టిరి. అందు నీరు విడచి రమ్య దృశ్యముగా నేర్పాటుచేసిరి. తర్వాతి కాలములో అందు నీరు విడుచుట లేనందున దానికి “సూఖా హౌస్” అనుపేరు వచ్చి ఇప్పటికిని అదే పేరుతో వ్యవహరింపబడుచున్నది.
ఆషుర్ ఖానా
వీటి సమీపంలోని జామె మస్జిద్ కట్టిరి. దీని నిర్మాణానికి 2 లక్షల రూపాయలు ఖర్చయ్యెను. నదీ తీరమున నదీ మహలునున్ను నబీ బాగునున్ను కట్టిరి. 1003 హిజ్రీలో 60 వేలు పెట్టి “ఇమాంబాడా” ను కట్టిరి. దానినే యిప్పుడు బాదుషాహి ఆషుర్ఖానా అని యందురు. దాని సమీపంలోనే మోతీ మసీదును కట్టించిరి.
చార్‌మినార్
మొత్తానికి ఈ భాగ్య నగరాన్ని మక్కా క్షేత్రమువలె నిర్మించవలెనని పాదుషాకు కోరిక జనించి యుండెను. అందుచేతనే యీ విధముగా నూతన నగరములో కమానులు, హౌజు, వీధులు, మసీదు, బంగ్లాలు నిర్మించెను. అచ్చట మక్కా క్షేత్రములో హజరత్ ఇమాంగారి రోజా ఉన్నది. దానికి ప్రత్యామ్నాయముగా ఇచ్చట చార్‌మీనార్ కట్టించెను. దాని నిర్మాణానికి ఇంచుమించు రెండు లక్షల బంగారు హొన్నులు ఖర్చయ్యెను. ఈ చార్‌మినార్ 1000 హిజ్రీలో నిర్మింపబడెను.
నగర వ్యాప్తి
యథా పాషా తధా ప్రజా. పాషాను జూచి అమీర్లు కూడా పెద్ద పెద్ద బంగ్లాలు, తోటలు, బాటలు కట్టించి వేయించిరి. నూతన నగరమునకు ఇవి వ్యాప్తి నొందుచుపోయెను. అందుచేత రఖోడా, ఇబ్రహీంపట్నం, బోనగిరి, పటాన్‌చెరువునకు అమీర్లు బంగ్లాలు తోటలు నిర్మించిరి. ఇట్లు నూతనముగా నిర్మాణమై చార్‌కమానుల మధ్యనున్న నగరానికి భాగమతి జ్ఞాపకార్థము “భాగ్యనరగము” అను నామకరణము కావింపబడెను. ఈ నగరములో పట్టీలు ఏటేట నాలుగు లక్షల హొన్నులవరకు వసూలు కావచ్చెను. ఈ పన్నుల నుండియే బీదలకు అన్నదానమునకై 12 వేల హొన్నులకు 60 హొన్నులు లంగరు ఖర్చుకును, తక్కిన మొత్తము మౌల్వీలకును పంచిపెట్టబడుచుండెను. గోలకొండ పాదుషాలు షియ్యా మతస్థులు. అట్లున్నను ఈ పాదుషా ఎవరైతే హజరత్ పైగంబర్ మహమ్మద్ రసూలుగారి ముగ్గురు అనుయాయులను (తబర్రాపాడి) నిందింతురో వారి నాలుకలను కోయింతునని ఆజ్ఞ యిచ్చెను.
అయితే యీ ఆజ్ఞను తనకే మనసుకు వచ్చి చేయలేదు. అప్పుడు ఢిల్లీలో చక్రవర్తియైన జహంగీరు ఇచ్చటి షియ్యాల ఆచారాలను విని వెంటనే తబర్రాను మాన్పింతువా లేదా అని బెదిరించెను. అందుచేత తబర్రా నిలిచిపోయెను. జహంగీరు కోపశాంతికై మంచిమంచి నజరానాలు కూడా పంపబడెను.
మక్కామసీదు
భాగమతీ ప్రియుడు చనిపోయెను. అతని కుమారుడు సుల్తాన్ మహమ్మదు కుతుబుషా రాజయ్యెను. అతడు తన కాలములో చారుమీనారు సమీపంలో మక్కా మసీదును కట్టించెను. దీని శంఖుస్థాపన కథ చాలా రమ్యముగా నున్నది. 1027 హిజిరిలో రాష్ట్రములోని మౌల్వీలను, ఫకీర్లను, అరబి పండితులను పిలిపించి వారి సమక్షములో నిట్లు సెలవిచ్చెను. “మీలో ఎవరైతే ఎన్నడుగాని తప్పకుండా దినమూ అయిదు మారులు నమాజు చేసినారో అట్టివారు దీని శంఖుస్థాపన చేయవలసినది” అందరూ ఒకరి మొగము ఒకరు చూచుకొనుచున్నారు. అప్పుడు పాదుషా తానే శంఖుస్థాపనకై మొదటి రాతిని పాదుకొలిపినాడు. అంటే ఆయన నమాజు తప్పని మతాభిమాని అని తేలిపోయింది. ఆయన కాలములో ఈ మసీదుకు గాను 30వేల హొన్నులు వ్యయము జేసినాడు. పని చాలా తిన్నగా సాగుతూ వచ్చింది. ఆయన కాలములో అది పూర్తికాలేదు. తర్వాత అబుల్‌హసన్ తానాషా కాలములో కూడ నిర్మాణము జరుగుతూ వచ్చెను. అప్పటికిని పై కప్పు పూర్తి అయ్యేనే కాని దానిపై మీనారులు ప్రారంభమే కాలేదు. తర్వాత అతనికి పతనము కలిగెను. ఆలంగీరు పాదుషా గోలకొండ రాజ్యాన్ని వశపరచుకొనెను. అతడును ఇంత గొప్ప మసీదుకు మీనారులు మున్నగునవి కట్టించుట సాధ్యము కాదని అక్కడికక్కడే పూర్తి చేయించి ముగించెను. ఇట్లు 1027 హిజరీలో మొదలైన యీ మక్కామసీదు 1104 హిజరీలో పూర్తయయ్యెను. అనగా ఇంచుమించు ఒక శతాబ్దము పట్టెను. ఇప్పటికిని
హైదరాబాదు రాష్ట్రములో మక్కా మసీదును మించిన మసీదు లేనేలేదు. లింగంపల్లి బాగ్
సుల్తాన్ మహమ్మదు ఖుతుబ్షా వచ్చెను. అతని కుమారుడు అబ్దుల్లా ఖుతుబుషా అనువాడు రాజ్యానికి వచ్చెను. అతడు రంగీలా రాజు. విలాసపురుషుడు, స్త్రీలోలుడు, విషయాసక్తుడు. అందుచేతనే అతడు తన వాహ్యళి విహారాలకుగాను లింగంపల్లిలో పెద్ద ఉద్యాన వనము పెంచెను. దానినే యిప్పటికిని 'బాగ్‌లింగంపల్లి' అని అందురు.
గోషామహల్
అతడే తన వినోదాలకు తాను నిర్మించిన నట్టితో తృప్తి పడక “గోషా మహల్” కట్టించెను. అచ్చట ఒక పెద్ద హౌజు కట్టించెను. దాని చిహ్నాలిప్పటికిని గోషామహల్‌లో కలవు. దాని చుట్టునూ ఒక వేయి పెద్ద గదులు కట్టించెను. ఈ పాదుషా చీనా దేశము నుండి చిత్రకారులను పిలిపించి షాహీ ఆఘుర్ఖానాలో రంగుల చిత్రాలు వ్రాయించెను. ఇతడు తన కాలములో ఒక ఆజ్ఞను తన రాజ్యములో కావించెను. 'పీర్ల పండుగ' కాలములో ఒక రాజ్యమందెచ్చటను దేవిడీలలో నగారాలు మ్రోయించ కూడదనిన్నీ తమలపాకులు, మాంసము ఎవ్వరునూ తినకూడదనిన్నీ అమీరుకానీ, ఫకీరుకానీ ఆనందాల నన్నింటిని కట్టి పెట్టవలెననిన్నీ హిందువులకును, ముసల్మానులకును ఈ యాజ్ఞ వర్తించుననిన్నీ ఫర్మానాను ఇచ్చెను.
లంగర్
మొహర్రం (పీర్ల) పండుగలో 20 ఏండ్ల క్రిందటివరకు అయిదవ దినమునాడు హైదరాబాదు నగరములో “లంగర్” అను ఉత్సవము ప్రచండ వైభవముతో జరుగుచుండెను. దీని ఉత్పత్తి క్రమము రమ్యముగా నున్నది. సుల్తాన్ అబ్దుల్లా ఖుతుబ్‌షా ఒకనాడు ఏనుగుపై ఎక్కి వాహ్యాళి వెళ్ళుచుండెను. అంతలో ఏనుగుకు మదమెక్కెను. అది చుట్టుపట్టు వారిని చెదరగొట్టి ఒకే పరుగున అడవిమార్గము పట్టెను. ఈ వార్త సుల్తాను తల్లియైన హయాతు బక్షీ భేగంకు తెలియగానే ఆమె ఏడ్చుచూ కూర్చుని తుదకు 'హజరత్ ఇమాం హుసేను'ని తలచుకొని నాకొడుకు క్షేమముగా తిరిగి వచ్చినట్టయితే బంగారు గొలుసును సిద్ధము చేయించి నాకొడుకు నడుముకు చుట్టి 'లంగర్'కు వెళ్ళి తను తర్వాత దానిని ఫకీర్లకు పంచిపెట్టుదును అని మ్రొక్కుకొనెను. దైవము ఆమె ప్రార్థనను వినెనో ఏమో అన్నట్లుగానే ఏనుగు పట్టుబడెను. పాదుషా క్షేమముగా దేవిడీకి వచ్చి చేరెను. అదే క్షణమందు రాత్రియనక, పగలనక కంసాలులను పిలిపించి, బేగంగారు 12 మణుగుల బంగారు గొలుసును సిద్ధము చేయించి, పాదుషా నడుముకు చుట్టి జూలూసు జెళ్ళించి హుసేనీ ఆలం వద్దకు పంపెను. అప్పటినుండియు ఈ లంగరు ఏటేట చేయుట పరిపాటి అయ్యెను.
మీరాలం చెరువు
హైద్రాబాదు నగరంలో హుసేన్ సాగరు తర్వాత (ఉస్మాన్‌సాగరుకట్టక పూర్వము వరకు) మీరాలం చెరువు చాలా ప్రసిద్ధి నొందినట్టిది.
నవాబ్ సికందర్ జా (ఆసఫ్‌జాహీ వంశపు నవాబు) 1187 హిజరీలో హైద్రాబాదు రాజ్యానికి వచ్చెను. 1219 హిజరీలో మీరాలం అతని మంత్రి యయ్యెను. అతడు నాలుగేండ్లు మంత్రిత్వము నిర్వహించి మరణించెను. అతని కాలములోనే అతని పేరిట మీరాలం చెరువు కట్టబడెను. దానికిగాను మూడులక్షల రూపాయలు ఖర్చుపెట్టెను. మూసీనదీ తీరములో బారాదరీ తోటకూడా అతడే వేయించెను. మీరాలం మండి (దీనినే పామరులు 'మిరియాల మండి' అని అందురు) అనునదియు వీరే ఏర్పాటు చేయించిరి. ఇప్పటికిని అచ్చట కూరగాయలు అమ్మబడుచుండును.
చాదర్‌ఘాట్ వారధి
1246 హిజరీలో నవాబు నాసిరుద్దౌల కాలములో చాదర్‌ఘాట్ వారధి కట్టబడెను. దానికై సుమారు 50వేల రూపాయల వ్యయమయ్యెను.
మూసీనది క్రీ.శ. 1912 లో గట్లు తెగి పారి నగరములో గొప్ప నష్టము కలిగించినది. యిప్పటికాలము వారి కందరికిని తెలియును. పూర్వము 1246 హిజిరీలో అనగా 113 ఏండ్లక్రిందట ఒక మారిట్లే మూసీనది ప్రవహించి యుండెను. అప్పుడు పురాన్‌పుల్ కొంత భాగము ఎగిరిపోయెను. ఘాసిమియా బజారున్ను, సిద్ది అంబరు బజారున్ను, దీని పరిసర ప్రదేశాలును నదిలోని నీటిచే మునిగిపోయి చాలా నష్టమయ్యెను.
ఈ విధముగా హైద్రాబాదు నగరములో ప్రసిద్ధమైన స్థలము లేర్పడుచూ వచ్చెను.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse