Jump to content

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/హిందూ ధర్మ శాస్తమందు స్త్రీల స్థానము

వికీసోర్స్ నుండి

హిందూ ధర్మశాస్త్రమందు స్త్రీల స్థానము

ప్రాచీనము నుండియు హిందూ స్త్రీ చరిత్రయే హిందూ సంఘ చరిత్రయై యున్నది. స్త్రీ హక్కులు, బాధ్యతలెట్లెట్లు మారుచు వచ్చెనో అట్లట్లు సంఘముకూడా మారుచు వచ్చెను. హిందువుల “ధర్మ శాస్త్రము”లో స్త్రీకి సంబంధించని విషయములు లేనే లేవనవచ్చును. వివాహము, విభాగము, వారసత్వము, స్త్రీ ధనము, దత్తత, మున్నగు విషయములలో స్త్రీ స్థానమెట్టిదో గుర్తించవలెను.

పూర్వము వేదకాలమందు, స్మృతికాలమందు, తర్వాత నిబంధనకారుల కాలమందు అటు తర్వాత ముసల్మాను ప్రభువుల కాలమందు, మరియు నేడు బ్రిటిషు వారి సామ్రాజ్యములో స్త్రీ స్థానమెట్లుండుచు వచ్చెనో ఆ చరిత్ర యంతయు మనకిప్పుడవసరము లేదు. వేదకాలములో స్త్రీకి సంపూర్ణ స్వాతంత్ర్య ముండెననియు స్మృతి కాలములో స్త్రీ స్వాతంత్ర్యము సన్నగిల్లెననియు ముసల్మానుల కాలములో నిబంధనకారులు తమ కిష్టమువచ్చినట్లు శాసించిరనియు మనము గ్రహింపవచ్చును. బ్రిటిషు కోర్టులు మనదేశములో నెలకొనిన తర్వాత స్త్రీ హక్కులలో గల్గిన మార్పులే యిచ్చట చర్చనీయాంశములు.

ధర్మ శాస్త్రములు

హిందువులకు వర్తించు ధర్మశాస్త్రములలో బ్రిటిషు కోర్టులొప్పుకొనిన వానిలో ముఖ్యమైనవి, మనుస్మృతి, యాజ్ఞ వల్క్యస్మృతి. మనుస్మృతి శ్లోక మొక్కటి అన్నిటికి మూలాధారము.


శ్లో॥ “శృతి స్మృతి స్పదాచారః స్వస్వ
      చ ప్రియ మాత్మనః

ఈ శ్లోక ప్రకారము “సదాచారము” ప్రధాన సూత్రమైనది. ఏ జిల్లాలో విశేష

జనులచే నెట్టి పద్ధతి (రివాజు) యాదరింపబడునో అదియే సదాచారము దానిని కోర్టు వారొప్పుకొందురు. ఒకమారు సిద్ధించిన ఆచారము ఎన్ని శాస్త్రములకు విరుద్ధమైనను త్రిప్పబడజాలదు. “వచన శతేనాపివస్తు నాన్యథా కరణే శక్తి” అనుప్రాచీన సిద్ధాంతమును బ్రిటిషు కోర్టు లొప్పుకొనినవి. అనగా ఒకమారు ఒక విషయము ఆచార సిద్దమయ్యెనా దానికి విరుద్ధముగా నూరు శాస్త్రాధారములున్నను అంగీకరింపబడవు. ఈ సిద్ధాంతరీత్యా బిడ్డ కొడుకుల దత్తును, ఇల్లటమును అంగీకృతమయ్యెను. కావున బ్రిటిషు కోర్టులలో ఈ 40-50 ఏండ్ల నుండి కావింపబడిన హిందూశాస్త్ర సంబంధమగు తీర్మానములు సక్రమమైనవా యను సంశయము బాధింపక మానదు. ఇక స్త్రీ సమస్యను గురించి విచారింతుము.

మనువు స్త్రీ విషయములో చాలా అన్యాయము చేసినాడు. అయినను యాజ్ఞ వల్క్యస్మృతిలో కొంత న్యాయము చూపింపబడెను. అదియు కాలము మారుకొలది జనుల కుపకరింపక పోయెను. అప్పుడు విజ్ఞానేశ్వరుడు అను మహాత్ముడు యాజ్ఞవల్క్య స్మృతిపై “మితాక్షర” వ్యాఖ్యానము వ్రాసి పుణ్యము కట్టుకొనెను. మన అదృష్టమువలన ఈ మితాక్షర న్యాయమే బ్రిటిషు కోర్టులలో వర్తించుచున్నది. విజ్ఞానేశ్వరుడు స్కృతిలోని మూల సూత్రమును ఆధారముగా నిమిత్త మాత్రముగా చేసికొని, దానిపై తన కాలములో నుండిన ఆచారములను, లేదా న్యాయముగా నుండవలసిన పద్ధతులను, విశదపరచి పెంచి వ్యాఖ్యానము చేసెను. మొత్తము హిందూ స్థానములో నిప్పుడు రెండు శాఖలేర్పడినవి. బెంగాలులో దాయ భాగమనియు తక్కిన దేశములో మితాక్షర అనియు, ధర్మ శాస్త్రము వర్తించుచున్నది. దాయ భాగముతో మనకిప్పుడవసరము లేదు. ఒక ముఖ్య సూత్రము మాత్రము గమనింపవచ్చును. దాయ భాగము ప్రకారము యజమాని చచ్చిన తర్వాత వారసుల కాతని యాస్తిపై హక్కు ఉత్పత్తి యగును; మితాక్షరములో యజమానికి కొడుకు పుట్టిన వెంటనే ఆ పుట్టిన వానికి ఆస్తిలో హక్కేర్పడును. ఇక మితాక్షర ప్రకారము బ్రిటిషు కోర్టులెట్లు స్త్రీల హక్కులను గురించి నిర్ణయించెనో విచారింతుము.

విభాగము

విభాగములో నించుమించు స్త్రీకి హక్కే లేదనవచ్చును. అవిభక్త కుటుంబము లోని స్త్రీకి ఎట్టి హక్కులును లేవనవచ్చును. ఒక సమిష్టి కుటుంబము విభజించు కొనినప్పుడు, తల్లిదండ్రులు జీవించి యుండినచో వారిద్దరికిని పుత్రులతో సమానమగు భాగము దొరుకును. తల్లిదండ్రులనుటచే భర్తయున్నందున భార్యకు ప్రత్యేక భాగము లేదు. తండ్రి చనిపోయి తల్లి మాత్రమే జీవించియుండినచో నామెకు ఒక యంశ మీయవలెనని యాజ్ఞవల్క్యు డు సెలవిచ్చినాడు.


“పితూరూర్థ్యం విభజితాం
మాతాప్యంశం సమం హరేత్‌”


కాని యీ భాగముపై ఆమెకు సంపూర్ణాధికారము లేదు. ఆమె దాని నిష్టము వచ్చినట్లు వ్యయము చేయజాలదు.


మరియు పెండ్లికాని బిడ్డకును, చెల్లెలికిని విభాగ సమయములో పురుషుని భాగములో నాల్గవ భాగము విధింపబడినది. కాని వివాహితలైన భగినీదుహితల కేమియు భాగములేదని మితాక్షరమందే శాసింపబడినది. అదే విధముగా నిరుడు బ్రిటిషిండియాలో తీర్పులు చేయబడినవి. కాని ఆచారములో నిట్లు వర్తించుట కనబడదు. పెండ్లికాని చెల్లెండ్రకు, బిడ్డలకు వివాహము చేయు బాధ్యత మాత్రమే యితర భాగస్థులపై యున్నది.


ఒక యజమాని పురుష సంతతి లేక చనిపోయినటైన, యతని భాగము మొదలు భార్యకును, తర్వాత బిడ్డకును, చెందునని యాజ్ఞ వల్క్యస్కృతి చెప్పుచున్నది. కాని బిడ్డల విషయమై మితాక్షరములో కొన్ని సూక్ష్మ భేదములు కల్పించినారు. పెండ్లియైన బిడ్డలకు మారుగా పెండ్లికాని బిడ్డలకే భాగమియ్యవలెననియు బిడ్డలందరికిని పెండ్లియైనట్లైన ధనికుల యింటికీయబడిన బిడ్డలకు మారుగా బీదల యింటికీయబడిన బిడ్డలకే యియ్యవలెననియు నిర్ణయించినారు.


స్త్రీ ధనము


స్త్రీ ధనమును 7-8 విధములుగా విభజించినారు.

1. పితృ మాతృ పతి భ్రాతృదత్తము

2. ఆధ్యగ్ని - పెండ్లివేళ మామ మున్నగు వారిచ్చినది.

3. ఆధివేధనికము - భర్త రెండవ భార్యను చేసికొనినప్పుడు మొదటి భార్య కోదార్పుగా నిచ్చుకొనిన ధనము. యాజ్ఞవల్క్యుడు పైవి శాసించుచు “ఆద్యం” ఇత్యాదులు అన్నాడు. ఇంతమాత్రమాధారము విజ్ఞానేశ్వరునికి దొరికిన చాలును; “ఆద్యం” లో యివన్నియు చేరినవన్నాడు -

1. ఆధ్యావాహనికం - అత్తగారింటికి వధువును తీసికొని పోవునప్పుడిచ్చు ధనము.

2. ప్రీతిదత్తం - బంధువులచేత, భర్తచేత ప్రీతితో నప్పుడిచ్చునది.

3. పాదవందనికం - పెండ్లిలో పెద్దలకు నమస్మారము చేసినప్పుడిచ్చినది.

4. సౌదాయికం - కన్యకనైనను, వివాహతకైనను, ప్రతి యింటిలోగాని, తండ్రి యింటిలో గాని యియ్యబడినది.

ఇవన్నియు ఎన్ని కలిగినను చిల్లర బాబతువే ఇట్టి స్త్రీ ధనము పైనను కొన్ని సమయములలో భర్తకధికారమిచ్చినారు.

దత్త స్వీకారము

ప్రాచీనములో 72 విధముల పుత్రులను శాస్త్రకారులంగీకరించిరి. ఇప్పుడు ప్రధానులు ఔరసుడు, దత్తుడు, పుత్రీపుత్రకుడు దౌహిత్ర బాధ్యతలో వచ్చును. కృత్రిముడనువాడు మాళవదేశములో మాత్రమే. ధ్వ్యముష్యాయనుని ప్రశంస అరుదుగా వచ్చును తక్కిన కానీన, గూఢోత్పన్న పౌనర్భవః కుండగోళకాదు లిప్పుడు లేరు.

సంతానంలేని వితంతువునకు దత్తస్వీకార విషయముతో నొక్కొక్క రాష్ట్రములో నొక్కొక్క విధముగు తీర్పును బ్రిటిషు హైకోర్టులు చెప్పియున్నవి. వషిష్ఠ స్మృతిలో పత్యాజ్ఞలేనిది భార్యకు దత్తస్వీకారాధికారము లేదనియున్నది. కాని మిథిలలో వితంతువున కేవిధముగా గూడ దత్త స్వీకారాధికారము లేదు, చనిపోయినపుడు భర్త ఆజ్ఞ యిచ్చినను వితంతువున కధికారములేదట - కాశియందును, వంగదేశమందును భర్త ఆజ్ఞ యుండినచో అధికారము కలుగును. మద్రాసులో భర్తగాని, అతడు లేనిచో సపిండులుగాని యంగీకరింపవలెను. బొంబాయిలో భర్త తన జీవితకాలమందు ప్రత్యేకముగా నిషేధించిననే తప్ప వితంతువునకు అధికార మిచ్చినారు.

పూర్వము స్త్రీలను దత్తు తీసుకొనుచుండిరని పురాణ ప్రమాణములు కలవు. నంద పండితుడు తన “దత్తక మీమాంసము”లో రోమపాదుడు 'శాంత' అను బాలికను దత్తుగా తీసికొనెననియు, వధ్రీమతి యనువాడు 'హిరణ హస్త' యను బాలికను దత్తుగా స్వీకరించె ననియు రామాయణాది పురాణ ప్రమాణములనిచ్చి విపులముగా నీ విషయమును సమర్థించినాడు. దత్తు విషయములో నీ గ్రంథము ముఖ్య ప్రమాణము. కాని, బ్రిటిషు కోర్టులలో నిప్పుడు స్త్రీలను దత్తుగా నంగీకరించుటలేదు.

వ్యవహారములు

స్త్రీలు చేయు వ్యవహారములు (కంట్రాక్టులు -మొఅహిదాలు) సాధారణముగా చెల్లవు. కారణమేమన “నస్త్రీ స్వాతంత్ర్య మర్హతి” అని మనువు శాసించి యుండలేదా? యాజ్ఞవల్క్యుడు భార్యకు, బిడ్డలకు వారసత్వపు హక్కులిచ్చినను, అట్టి వారసత్వము వలన వచ్చిన ధనముపై స్త్రీలకు సంపూర్ణాధికారము లేనట్లుగా వారు స్థిరాస్థులను ట్రాన్స్‌ఫర్‌ చేయజాలనట్లుగను, అట్టి వ్యవహారములు చెల్లనేరనట్లుగను హైకోర్టులు తీర్మానించెను. ఒక బొంబాయి రాష్ట్రములో మాత్రమే స్త్రీ వ్యవహారముల సాధుత్వము నంగీకరించెను.

కొన్ని చిల్లర సందర్భములలో స్త్రీ తనకు సంక్రమించిన ఆస్తిలో చాలా కొద్ది అంశమును మాత్రమే అమ్మవచ్చునని తుదకంగీకరింపబడినది. ఆ యంగీకరణము కూడ తల తోక లేని పద్ధతిగా నున్నది. గయకు తీర్ధ యాత్రకైపోయిన దాని నంగీకరింతురట! కాని కాశీ యేమి పాపము చేసినదో; కాశీకి పోయిన ఖర్చుల నంగీకరింపరట! చెరువులు, సత్రములు కట్టించుట అంగీకరింపరట!

ప్రత్యేక శాసనములు

బ్రిటిషిండియాలో స్త్రీల సంబంధమగు కొన్ని ప్రత్యేక శాసనములు కావింప బడినవి. అవి మాత్రము విశేషముగా స్త్రీలకు సహాయపడిన వనవచ్చును.

క్రీ.శ. 1856లో వితంతూద్వాహ శాసనము కావించిరి. దాని ద్వారా యువతులైన వితంతువులు తమ యిష్టముతో వివాహము చేసుకొని అట్టి వైవాహిక ధర్మముచే సంతానము కనినచో, ఆ సంతానమునకు తల్లిదండ్రుల యాస్తిపై అధికారముండునని శాసింపబడెను. యిది చాలా న్యాయబద్ధమైన శాసనము. యిట్టి శాసనము పుట్టిన సుమారు 80 ఏండ్ల తర్వాత కూడ నిజాము రాష్ట్రములో నిట్టి శాసనము కావించుటకు ఆటంకములు కలుగుచున్నవి!

ఈ శాసనాత్పుర్వమే క్రీ.శ. 1829లో సహగమన నిషేధ శాసనము గావింపబడెను. దానివలన బలవంతముగా భార్యలను భర్తలు చితులపై కట్టి కాల్చునట్టి ఘోరమును, నమానుషమును నగు ఆచారము ఆపి వేయబడెను. క్రీ.శ. 1850లో మత స్వాతంత్ర్య శాసనము (Caste Disabilities Re- moval Act) కావింపబడెను. ఇది మాత్రము హిందువులకు చాల నష్టదాయకమే! ఇది క్రైస్తవులకు చాలా లాభదాయక మయ్యెను. హిందూ భర్త క్రైస్తవుడైన, వాడు భార్యను వదలి యింకొకతెను వివాహము చేసికొనవచ్చును, లేకున్నచో భార్యకూడ క్రైస్తవ మత స్వీకార మొందవలెను. ధర్మశాస్త్ర ప్రకారము మత భ్రష్టుడు పతితుడు. పతితునికి ఆస్తిలో భాగము లేదు. కాని యీ మత స్వాతంత్ర్య శాసనము ప్రాత శాసనమును ఖండించివైచి వానికి ఆస్తిలో భాగమిప్పించెను. అట్టి పతితుడు హిందువులకు చచ్చిన వానితో సమానుడు. ఒక వితంతువున కొకే కొడుకుండి వాడు క్రైస్తవుడైనచో వాడామెకుత్తరోత్తర కర్మాదులకు చచ్చినవాడే! అట్టిచో ఆమె యింకొకని దత్తు తీసుకొన వచ్చునా! కూడదని తీర్పులయ్యెను.

ఇటీవలనే, బాల్య వివాహ నిరోధక శాసనము గావింపబడినది. ఇది లాభకారియే; కాని మన రాష్ట్రములో కూడ నిట్టి శాసనము లేనందున బ్రిటిషిండియాలో పై శాసన ధిక్కారుల కిది శరణ్యమైన పుణ్యభూమియై పోయినది.

వైవాహిక శాసనములు

బ్రిటిషిండియాలో కూడ సివిల్‌ మ్యారేజ్‌ శాసనము లేదుకాని బరోడా రాజ్యములో 1908లోను, ఇందూరు రాజ్యములో 1916లోను, కొల్లాపూరులోను, మరికొన్ని యితర దేశీయ సంస్థానములలోను సివిల్‌ మ్యారేజ్‌ శాసనములు గావించిరి; అనగా వివిధ మతములకు చేరిన స్త్రీ పురుషులు వివాహము చేసికొనుట కంగీకరింప బడినది. బ్రిటిషిండియాలో నిట్టి శాసనము లేకున్నను 1832లో స్పెషల్‌ మ్యారేజ్‌ శాసనము (హిందూ, బౌద్ధ సిక్కు జైనుల కొరకు) గావింపబడెను. తద్వారా వివిధ మతముల స్త్రీ పురుషుల వివాహము కొన్ని నియమములతో నంగీకరింపబడెను.

మన రాష్ట్రములో నీరెంటిలో నొక శాసనమైనను లేదు. పూర్వము అష్టవిధ వివాహములను శాస్త్రకారులంగీకరించిరి. ఇప్పుడు బ్రిటిషిండియాలోనేమి రెండు విధముల వివాహములే యంగీకరింపబడినవి.

వివాహితయైన హిందూ స్త్రీ సాధారణముగా యజమానుని చరాస్థివలె చూడబడినను బాధకము లేనిస్థితి యేర్పడినది. ఎట్టి కారణము లేకయే, భర్త భార్యను వదలి వేయవచ్చును. లేక భర్త యెందరినైనా వివాహమాడవచ్చును. అట్టి సందర్భములలో భార్యకు విడాకులు పొందు (Divorce) అధికారము లేదు. రెండవ వివాహము చేసుకొనకుండ భర్తను నిరోధించు (injunction) అధికారమును లేదు. ఏమైనను భరణార్థము దావాచేసి, కోర్టువారనుగ్రహించి డిక్రీ యిచ్చిన తృణమునకో పణమునకో మాత్రము ఆమె యధికారి. ఆమెకు రెండవ వివాహమున కధికారము లేదు, మరి భర్త ఆస్తిలో భాగమడుగుట కధికారము లేదు.

కాని భార్య నకారణముగానైనను, నిష్కారణముగానైనను భర్తతో నుండుట కంగీకరింపని యెడల భర్తకు (Restitution of conjugal rights) ఆమెను పూర్తిగా స్వాధీన పెట్టుకొనుట కధికారము కలదు. మొదలు మొదలు బ్రిటిషు కోర్టులో భార్యను స్వాధీనము చేయు డిక్రీనిచ్చి, దాని తామీలులో భార్యను పట్టి (arrest) భర్తకిప్పుంచుచుండిరి. ఒక బొంబాయి కేసులో (44 బొంబాయి 932) నీ విషయమున న్యాయాధిపతి తీవ్రముగా ఖండించెను. క్రమేణా కోర్టు వారది మొరటుపని యని కాఠిన్యము తగ్గించుచు వచ్చిరి. తుదకు 1923 సం॥ 26వ శాసనము ప్రకారము అరెస్టు పద్ధతి తీసివేయబడెను.

సూచనలు

ఇంతవరకే విషయ బాహుళ్యమైనది. పై యంశములను గమనించి చూచిన ఈ కాలములో పూర్వపు ఋషుల స్థానమును హైకోర్టు జడ్జీలు, ప్రీవీ కౌన్సిలు మెంబర్లు వహించినారు.


“శృత యశ్చభిన్నాః ఋషయశ్చభిన్నాః
నైకోమ నిర్యస్యమతం విభిన్నం”


అన్న రీతిగా కోర్టు ఋషులలో గూడ భిన్నాభిప్రాయము లేర్పడినవి. మొత్తముపై హిందువులకు ప్రాచీనకాలములో (అనగా రెండు మూడువేల యేండ్ల నాడు) మనువు మున్నగు ఋషులు వ్రాసిన శాస్త్రములనే హిందువులకు అంటగట్టి తీరుదుమన్న పట్టుదల వీరికి మెండుగా కనబడుచున్నది. ఇంగ్లీషు వారికి “ఈక్విటీ” అను “లా” కలదు. అట్టి దానినైనను క్లిష్టమగు కేసులలో వర్తింప జేయవలసి యుండెను.


మన రాష్ట్రములో కావలసిన హిందూశాస్త మందలి మార్పులనిక సూచింతును.


1. బ్రిటిషిండియాలో 1930 సంవత్సరములో వారసత్వపు సిల్సిలాలో తండ్రి తండ్రికి పూర్వము కొడుకు బిడ్డ, బిడ్డ బిడ్డ, సోదరి, ఆమె కుమారులు క్రమక్రమముగా వారసులగునట్లు శాసించిరి. అది మనకు లేకపోయినది. 2. వితంతువునకు వారసత్వ రీత్యా సంక్రమించిన ఆస్తిపై ఆమెకు సంపూర్ణాధికారము లేదు (Limited estate). ఈ యన్యాయమును తొలగించుటకై శాసనము కావలెను.

3. అనులోమ వివాహములు శాస్త్ర సమ్మతములు, ప్రతిలోమ వివాహములు అట్లు కావని నిర్ణయించిరి. ఈ శాసనములు చేసినవారు పూర్వములో చాల సంఘ దౌర్జన్యము చేసినవారు.

ఉత్తమ జాతులవారు తమకన్న తక్కువ జాతి స్త్రీలను పొందవచ్చునట కాని తమ స్త్రీలను తక్కువ జాతి పురుషులు పొందకూడదట. కామములో కూడా (ఇతర విషయములందువలె) వారు శాశ్వతపు గుత్తా తీసికొనిరి; ఇప్పుడు ప్రతిలోమ వివాహములు అందందు జరుగుచున్నవి. అవి సక్రమమైనవే (Valid) అని నిర్ణయము కావలెను.

4. పిచ్చివాడును, మెదడులేని వాడు (Idiot Lunatic) చేసుకొనిన వివాహములు చెల్లునట! ఇట్లు బ్రిటిషిండియాలో తీర్పులయ్యెను. శాస్త్రప్రకారము వివాహములో కన్యను “దానము” చేయుదురు. ఈ దానమును వరుడు “ప్రతి గృహీత”గా గ్రహించవలెను. పిచ్చివాడు, మెదడు లేనివా డీపని చేయగలరా! మనువుకూడ,


“ఉన్మత్తం పతితం క్లీబమ
బీజం పాప రోగిణం
సత్యాగోస్తి దిషంత్యాశ్చ
నచదయాస వర్తనం”


ఉన్మత్త నపుంసకాది భర్తల ద్వేషించిన స్త్రీలను ఇంటినుండి వెళ్ళకూడదనినాడు. అట్టి స్త్రీల వివాహము దాన గ్రహణ లోపముచేతను, నపుంసకునికి సంభోగమున కవసరమగుట చేతను రద్దు కావింపదగినవిగా నిర్ణయింపబడవలెను.


5. హిందూ స్త్రీకి కొన్ని సందర్భములలో విడాకులు (Divorce) అవసరమగుచున్నది. భర్తయొక్క అమానుష కృత్యముల చేతగాని, మరియెట్టి యితర హింసాదుల చేతగాని ఆమెకు అవసరమగుచున్నది. కాని చిల్లర జాతులనుబడు వారిలో నొప్పుకొనిన విడాకుల పద్ధతిని పై వర్ణ స్త్రీల కంగీకరించుట లేదు. ఎట్లన

(అ) నపుంసకుని భార్య యేమి చేయవలెను. రెండవ వివాహము, లేదా వ్యభిచారము, లేదా ఆమరణ బ్రహ్మచర్యము. ఇవియే ఆమెకు శరణ్యము

(ఆ) భర్త మతాంతరుడైనప్పుడు మాత్రము ఆమెకు రెండవ వివాహమును కోర్టులు అంగీకరించినవి.

(ఇ) పూర్వము వియోగముండెడిది. ఇప్పటికి అది ఒరిస్సాలో మాత్రము ఆచారముగా నున్నది. కాని దానిని కోర్టు వారంగీకరించారు. కాని దానిని కుష్ఠు రోగాదులచే బాధపడునట్టి భర్తలయొక్క భార్యలకు విడాకుల అధికారముండవలెను.

(ఈ) ఒక స్త్రీని బలవంతముగాగాని, మోసముచే గాని (force or fraud) వివాహమాడిన ఆ వివాహము చెల్లదని కోర్టులు నిర్ణయించినవి. కాని సంఘ మొప్పుకొనకపోయెను. ఇది సంఘము యొక్క దౌర్జన్య నిదర్శనము.

(ఉ) సగోత్ర స్త్రీనిగాని, వరుసగాని స్త్రీనిగాని (Prohibited degree) వివాహమాడిన ఆ వివాహము చెల్లదట. చెల్లనప్పుడు పురుషుడు రెండవ వివాహ మాడవచ్చునట, కాని భార్య అట్లే యుండవలెనట. భార్య భరణార్థమునకే యధికారియట. ఇది చాలా అన్యాయము. ఇట్టి ఒక బెంగాలు కేసులో న్యాయాధికారిట్లు సెలవిచ్చిరి. ఆ స్త్రీ ప్రతివాదితో వ్యభిచారిణిగా నుండవచ్చును. డైవర్సు (విడాకులు) లేనందున విడాకులు పొందగోరు స్త్రీలకు ఒక మార్గము మాత్రము దొరకుచున్నది. ఆ స్త్రీ హిందూమతమును వదలి ముసల్మాను లేక క్రైస్తవ స్త్రీయైన ఆమెకు రెండవ మతము ప్రకరాము వేరు భర్తను వివాహమాడుట కవకాశమున్నది. ఒక కేసులో నొక హిందూ స్త్రీ ముసల్మానై రెండవ వివాహమాడినా ఆమెకు హిందూమతమింక వర్తింపనందున ఆమె చేసిన దానిలో తప్పులేదని నిర్ణయించిరి. మరియు మన రాష్ట్రములో సివిల్‌ మ్యారేజి శాసనముగాని, స్పెషల్‌ మ్యారేజి శాసనముగాని లేనందున హిందువులు సికిందరాబాదులో 21 దినములు నివాసము చేసి పెండ్లి చేసికొని వచ్చిన మన రాష్ట్రములో కూడ అవి చెల్లును. (వివాహము అంతర్జాతీయ శాసనము (international law) లో చేరినది, కాని ఏ దేశమందే పద్ధతులున్నవో ఆ పద్ధతులు లేకున్నను చెల్లవలసి యుండును.) కావున మన రాష్ట్రములో సివిల్‌ మ్యారేజి శాసనము చేసిన తప్పు కాజాలదు. ఇట్టి యవకతవక లెన్నియేని మన నేటి "హిందూలా”లో ఏర్పడుచున్నవి. హిందూ సంఘమువారు ఇట్టి సమస్యలపై శాంతబుద్ధితో, సమబుద్ధితో దూరదృష్టితో, ఆధునిక పరిస్థితులను దృష్టి పథమున నుంచుకొని ఆలోచించి ఆందోళనము చేసి, మార్పులు గావించి, తమ సంఘమునను, తమ స్త్రీలను వారి గౌరవమును తమ గౌరవమును సంరక్షించుకొందురని యుద్భోధించుచున్నాను.


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse