సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/హజరత్ ఉమర్
హజరత్ ఉమర్
ఉమర్ భగవత్పాదుడు పైగంబర్ మహమ్మద్ ప్రవక్తగారి తర్వాత ఇస్లాం లోకములో అగ్రగణ్యుడు. ఇస్లాం మతములో అంతటివాడు పుట్టలేదు. పుట్టబోడు. (నభూతో నభవిష్యతి) అనవచ్చును. ఇస్లాం మత వ్యాప్తికి అతడే కారకుడు. అతడు ముసల్మానులకు ఆదర్శప్రాయుడు. అంతేకాదు అతని జీవిత విశిష్టతను, అతని న్యాయపద్ధతులను, అతని మత వ్యాప్తి రహస్యమును కనుగొనవలెనంటే ఇతర మతస్థులు కూడా అతని గురించి తెలుసుకొనవలెను. అతని జీవిత చరిత్రలు కొన్ని ఉర్దూలోను, ఇంగ్రీషులోను రచింపబడినవి. ప్రపంచ మహాపురుషులలో అతడు గణనీయుడు. కాని మన హైదరాబాదు సారస్వత పరిషత్తు వారీ కార్యమును చేయుట సమంజసము.
హజరత్ ఉమర్, పైగంబర్ హజరత్ మహమ్మదు గారి సమకాలికుడు. అతడు మొదట ఇస్లాం మతము ప్రతిఘటించినవాడు. విగ్రహారాధనతో కూడిన తన పాత మతమునే ప్రేమించినవాడు. కొత్త మతమును తెచ్చినందుకు కంటగించుకొని ఒకనాడు కత్తిదూసి మహమ్మదుగారినే చంపుటకై ఆవేశపూరితుడై బయలుదేరెను. దారిలో ఒక పెద్దమనిషి యెదురై “నీ యింటిలో నీ సోదరిని ఆమె భర్తను ఇస్లాం నుండి తప్పించలేవు కాని ప్రవక్తపై దాడిచేయబూనితి వెందుకయ్యా” అని మందలించగా ఆగ్రహోదగ్రుడై అదే కత్తిని అమె పై వినియోగించుటకు మరలిపోయెను. తన సోదరి నెత్తురు చూచువరకు కసిదీర్చుకొనదలిచెను. నీవు నన్ను చంపినను నా కొత్త మతమును వదలుకొనను, అని ఆమె పలుకగా చకితుడై నీవు మెచ్చిన ఖురానును చదువు విందునుగాని అని ఆమెచే చదివించి విని దాని భాషకు దానిలోని భావాలకు ముగ్ధుడై దీర్ఘాలోచనా నిమగ్నుడై మూకీ భావముతో నిలువెడల పైగంబరుగారి వద్దకు వెళ్లి తమ దీక్ష నిచ్చుటకై ప్రార్ధించెను. ఉమర్ ఇస్లాం పుచ్చుకొన్న సమయము ఆ మత విజృంభణకు నాందీభూతమగు విజయఘటిక. అతనికి ఆల్‌ఫారుఖ్ అను బిరుదు వచ్చెను. సత్యాసత్య విచక్షణ నెరిగిన వాడని దాని అర్థము.
అరబిస్థానములో చాలా గోత్రముల వారుండిరి. హిందువులలో బుషి గోత్రాల వారెటుల నేటికిని యున్నారో అటులే అరబులో పూర్వము ప్రతివంశము వారును తమ మూలపురుషుల (గోత్రవతుల) పేరుతో వర్గాలుగా ఏర్పడి యుండిరి. అట్టి వర్గమును ఖబీలా యనిరి. ఉమర్ ఖురేషీ అను ప్రసిద్ధ గోత్రమువాడు. మనదేశములో నవ ముస్లిములు కూడా ఖురేషి అను అర్థములేని పేరును పెట్టుకొందరు. అట్టి వారందరును ఈ ప్రసిద్ధ ఉమర్ వంశమువారనిన హాస్యాస్పదము. ఖురేషీ గోత్రము వారు అరబులోని ఖబీలాలలో ముఖ్యమైనవారు.
ఉమర్ పైగంబరు గారి కన్న 17 ఏండ్లు చిన్నవాడు. చిన్న తనములో ఇతడు ఒంటెల కాపరిగా ఉండెను. ఇతని తండ్రి యీ పశుల కాపరితో పగలంతా మసలనీయక కఠినంగా పని తీసుకొనుచుండెను. ఇతనికొక ముతక బట్టను కట్టుకొనుట కిచ్చుచుండెను. ఈ కారణములచేత తర్వాత కాలములో హ॥ ఉమర్ తన విధులను నెరవేర్చుటలోను, ఇతరులతో పని తీసికొనుటలోను కఠినాతి కఠినుడై యుండెను. తాను సకల ఇస్లాం రాజ్యమునకు సర్వతంత్ర స్వతంత్రుడగు ఖలీఫాయయినను మోటు వస్త్రములనే కట్టుచుండెను. సొంతముగా కష్టించి, సంపాదించి జీవించుచుండెకాని మత పీఠకోశమునుండి ఏమియు తీసికొనకుండెను. చిన్నప్పుడు పొలాలలో తిరిగి పసుల మేపి, కర్కశ కాయుడైనందున అతి బలాఢ్యుడని పేరొందెను. అరబ్బు దేశము గుర్రాలకు ప్రసిద్ధి. ఇతడు గుర్రపు సవారీలో మహానిపుణుడు. ఆ కాలములో అరబ్బీ చదివిన కొలదిమందిలో ఉమర్ ఒకడు. అతడు మంచి ఉపన్యాసకుడు. బాగా వ్రాయగలడు. ఇంతో అంతో కవిత కూడా అల్లినవాడు. వ్యాపారములో దక్షుడు.
పైగంబర్ గారు ఈ లోకమును వదిలిరి. ఆ దుర్వార్తను విన్నవారుందరును హాహాకారములతో రోదనము చేసిరి. “పైగంబర్ గారు గతించినారు అని అన్న వారి తల లెగరింతును” అని ఉమర్ అనెను. పైగంబర్ గారిపై అతని భక్తి యెంతో గాఢమైనది. పైగంబర్ గారు ఇస్లాం వ్యాప్తికై ఈరాఖ్, మెసోపటేమియా దేశాలపై దండెత్త బూనినప్పుడు ముసల్మానులందరును త్యాగము చేయవలెనని కోరెను. “నీవేమి తెచ్చినావు ఉమర్” అని యడుగగా నా ఆస్తిలో సగము తెచ్చితిననెను. “మరి నీవేమి తెచ్చినావు అబూబకర్” అని విచారించగా, నా ఆస్తి యంతయు తెచ్చితినని అబూబకర్ అనెను.
పైగంబర్ అనంతరము అబూబ్‌కర్‌గారు మొదటి ఖలీఫా అయిరి. వారు చనిపోవునప్పుడు అబ్దుర్రహిమాన్ అనునతనితో “ఉమర్‌ను గూర్చి నీ అభిప్రాయమేమి” అని యడిగెను. అతడు చాలా గొప్పవాడు. కాని చాలా కఠినుడు” అని యతడనెను. అబూబకర్ చనిపోవునప్పుడు తన తర్వాత పీఠాధికారి (ఖలీఫా) హజరత్ ఉమర్ అని శాసించెను. అబూబకర్ కాలములో ముసల్మానులు సిరియా, ఈరాఖ్, పాలస్తీనులను జయించి యుండిరి. ఉమర్ జరుసలేమును జయించుటకు సేననంపెను. ఆ నగర జనులు ముట్టడికి తాళ జాలక తమ కోటను ఉమర్ గారికే యప్పగింతుమని చెప్పనంపిరి. ఉమర్ ఒక ఒంటెతో ఒక బానిసవానితో చద్దిమూటతో బయలుదేరెను. నీవొక అంచె నేనొక అంచెవంతు ప్రకార మొంటెనెక్కి పోవలెనని అతడు బానిసతో చెప్పి అటులే జేసెను. దారిలో చద్దిమూటను విప్పి ఇరువురును పొత్తుగుడిచి మరల బాట పట్టిరి. జరుసలేమును సమీపించినప్పుడు ఒంటెపై నెక్కు వంతు బానిసకే వచ్చెను. “ప్రభూ, ఇప్పుడు తాము దర్జాగా ఒంటెపై నెక్కుటయే నీతి” అని వాడు మనవి చేసుకొనెను. “మరి మన ఒప్పుదల?” అని ఉమర్ తర్జించి వాని నెక్కించెను. కోట వద్ద జరుసలెం ప్రజలు వేలు వేలుగా గుమికూడి ఒంటెపై నున్న గులామునే చూచి జోహారు లర్పించుకొనిరి. ఈ జోహారుల నందవలసిన భక్త జనాధిపతులగు ఖలీఫా గారిదిగో అని ఒంటె త్రాటిని బట్టి పాదచారియగు ఉమరును వాడు చూపగా ఆశ్చర్యచకితులై అతని నెగదిగ చూచిరి. అతని అంగీకి కోరినన్ని అతుకులతుకు లుండెను. అతని మోజాలకునూ అతుకులే యుండెను. జరూసలెం వారు అతనికి దివ్య వస్త్రాలను సమర్పించుకొనిరి. ఇస్లాం అలంకరణముతో నిండిన నాకు ఈ అలంకరణ లేమియు రుచించవు” అని మతాభినిష్ఠుడనెను.
ఈరాన్, (పర్ష్యా) సామ్రాజ్యముతో అరబ్బులు తలపడిరి. ప్రతిదినము యుద్ధ వార్తకై ఉమర్ ఊరు బయటకు పోయి వార్తా హరునికై యెదురు చూచుచుండెను. ఈరానును అరబ్బులు జయించిరను సువార్తను ఖలీఫాకు తెలుపుటకై ఒక నవాబు దుమ్ము లేపుతూ దౌడు తీయుచు వచ్చెను. దారిలో ఖలీఫాగారు ఏమి వార్త అని వాని నడిగెను. “ఉండవయ్యా, నేను ఖలీఫాతోనే మొదలీ వార్త చెప్పవలెను” అని వాడు వేగాన్ని తగ్గించకుండా సవారి చేసెను. ఉమర్ గుర్రము తోకను పట్టుకొనియే వెంట నురికెను.
ఈరాన్ చక్రవర్తి ఉమర్‌కు కానుకలంపి యుండెను. అరబ్బుల దేశాలలో కానుకలు తెచ్చినవారు ఖలీఫా గారెక్కడ అని విచారించుచూ వెదుకుచుండిరి. తుదకొక సాధారణమగు డేరా ముందొక ఖర్జూర వృక్షము క్రింద ఖలీఫా గారొక చినిగిన ఉ డుపును కుట్టుకొనుచు కూర్చుని యుండిరి. ఖలీఫా గారెక్కడ అని యతనితో వచ్చిన రాయబారులు ప్రశ్నించిరి. “నేనే” అను మాటను విని అతడౌనో కాదో యను విచికత్సలో మునిగితేలిరి. తెచ్చిన కానుకలన్నియు ప్రజాకోశము (బైతుల్ మాల్)లో చేరిపోయెను.
ఒక యుద్ధము నుండి వార్త తెచ్చిన సేనానులు మంచి వెలగల యుడుపుల ధరించి యుండిరి. “ఇది సిపాయీల వేషము కాదు” అని ఖలీఫా మందలించెను. జంబియాలు కత్తులు నడుమున, చంకన కలవని వారు చూపించగా కొంత శాంతించెను.
ఖలీఫా బహు రాజ్యాలను గెలిచి వాటిపై సుబేదారులనుగా పలువురిని నియమించెను. వారికిచ్చిన యాదేశము లెట్టివనగా “తుర్కీ పెద్ద గుర్రాలపై సవారీ చేయరాదు. విలువ గల యుడుపుల తొడగరాదు. రుచిరాన్నముల తినరాదు. నౌకర్లను పెట్టుకొనరాదు. ప్రజలందరికి దర్శనమిచ్చుటకై దర్బారు తలుపులెప్పుడును తెరచి యుంచవలెను”. ఈజిప్టు సుబేదారగు ఆయాజ్ అనునతడు తద్విరుద్ధముగా మహా వైభవముగా సుఖించుచుండుటను విని అతని పిలిపించెను. అతని మెరుగు బట్టలను స్వయముగా చించి పారవేసి మోటు బట్టలను కట్టించి మేకల గాయుటకై పంపెను. కొన్నాళ్ళీ పనిచేసిన తర్వాత అతనికి బుద్ధి వచ్చెను.
పూర్వము విక్రమాదిత్య చక్రవర్తి తన సామ్రాజ్యములో ప్రజల స్థితిగతులెట్టివో కనుగొనుటకై రాత్రులందు మారు వేషాలతో తిరుగుచుండెనట. అటులే హ॥ ఉమర్ గారున్నూ తిరిగెడివారు. ఒక రాత్రి ఒక యింటిలో పిల్లలేడ్చుటచే తలుపు తట్టి కారణమేమని విచారింపగా ఆకలిచే వారేడ్చుచుండిరని తెలుసుకొనెను. అయితే ఆ మూలలో ఉడుకేదేమిటి? అని యతడు విచారించెను. ఉత్తనీరు మాత్రమే కుతకుతమని యుడుకుచున్నది. పిల్లల యోదార్చుటకై అటుల చేయుచున్నాను అని తల్లి పలికెను. ఉమర్ ఏమియు పలుకక మదీనాకు వెళ్ళి ఒక సంచి పిండిని తన వీపుపై మోసుకొని పోవుచుండెను. “ప్రభూ నేనీ మూటను తెత్తును లెండి తమ కెందుకీ శ్రమ” అని బానిస యనెను. “ఒరే ప్రళయ కాలము నాడు నీవు నా బరువు మోయుదువా? అని యతడనెను. మరొక రాత్రి ఒక అరబు గుడారములో ఆక్రందనమును విని కారణమడుగగా అయ్యా నా భార్య ప్రసవ వేదనలో నున్నది. దాయిని తెచ్చుకొను శక్తి లేదు. మరెవ్వరును నాకు దిక్కులేరు” అని భర్త యనెను. ఉమర్ తన భార్యను కాన్పు చేయుటకై పంపెను. మరొక రాత్రి ఒక స్త్రీ ఉమర్ పరిపాలనలో నాకు తిండి లేక పస్తుండవలసి వచ్చెనని తిట్టుకొనుచుండుటను ఖలీఫా విని ఆమెకు కడుపు నిండునటుల అన్నము తెచ్చి పెట్టెను. ఆమెయన్నమును తిని యిట్లనెను. “నీ వెంత మంచివాడవయ్యా నీవు ఖలీఫా కంటే మేలైనవాడవు నీవే ఖలీఫాగా నుండిన ఎంతో బాగుండును కదా”.
ఇస్లాం వ్యాప్తికి బైతుల్ మాల్ ఒక ముఖ్య కారణము. అది ప్రజల ధన కోశము. గెలిచిన రాజ్యాల లూటి ధనములో అయిదవ పాలు బైతుల్ మాల్‌లో చేరుచుండెను. ప్రతి ముసల్మాను తన ఆదాయములో నూటికి రెండుపాళ్ళు బైతుల్ మాల్‌కు చెల్లించుచుండెను. దాని నుండి బీదలు వృద్ధులు వితంతువులు అనాథులను పోషించుచుండిరి.
అంతేకాదు విద్యాలయములు వైద్యశాలలు పైకమునుండియే పోషింపబడు చుండెను. ఒక అపశత్రు దేశపు లూటీలోని ధనము రాగా ఖలీఫా బిడ్డ కూడ అందు కొంత పైకము తన కిమ్మనెను. అది జనుల పైకము, నాకు దానిపై యధికారము లేదు అని ఉమరనెను.
ఒకనాడు ఖలీఫా కుమారుడు మద్యమును సేవించి అపరాధి యయ్యెను. ఖురాన్ ప్రోక్త ప్రకారము వానికి 100 కొరడాదెబ్బల శిక్ష విధించెను. ఖలీఫా కొడుకని సేవకులు మెల్లగా కొట్టుటచేత తానే కోరడా తీసుకొని శక్తి కొద్ది 100 వరకు ఎంచి యెంచి చావ మోదెను. “నేను తప్పు చేస్తే దానిని చూపించి సవరింపుడు. మీకు సౌఖ్యమును చేకూర్చు విధానములను నాకాదేశింపుడు” అని ఉమర్ పలుమారు అనుచుండగా ఒకనాడొక శ్రోత కత్తి నొరనుండి లాగి “నీవు పెడత్రోవ పట్టితే నీకు దీంతో బుద్ధి చెప్పగలము” అని పలికెను. “భేష్ నాకు నీవంటి ధీరులు అనుచరులైనారని నా యానందము పారమందినది” అని ఉమర్ ప్రత్యుత్తరమిచ్చెను.
ఇస్లాం కొరకై చేసిన యుద్దాలలో స్త్రీలు చాలా సహాయము చేయుచుండిరి. వారు పురుషులకు జియోహమ్మెత్తర్వా-యుద్ధము చేయవలెనని పురికొల్పుచుండిరి. కొన్ని సమయములలో తమ పురుషులు చచ్చినప్పుడు వారి ఆయుధములను గొని తామును యుద్ధము చేసిరి.
హజరత్ ఉమర్ గారి అంత్యదశ విషాదకరమైనది. ఒక నాడొక ఈరానీ బానిస ఖలీఫాతో తన యజమాని తనపై భరింపరాని పన్ను వేసెనని మొరపెట్టుకొనెను. ఎంత పన్నని విచారింపగా రెండు దిరములనెను. నీ వృత్తి యేమని యడిగెను. నేను వడ్ల పని కమ్మరి పని చేయుదుననెను. అట్లయితే పన్నధికము కాదు పొమ్మనెను. మరునాడు వాడు మసీదులో దాగి ఖలీఫా నమాజు చేయునప్పుడు బాకుతో పొడిచెను.
నన్ను పొడిచినదెవరు అని ఖలీఫా అడిగెను. ఈరానీ గులామని చెప్పిరి. ఇస్లాం భక్తుడు పొడువనందున ఆ దేవునికి ధన్యవాదాలు అని ఉమర్ పలికెను.
అతడు అతి మితజీవి. మసీదులో దినము బీద ముస్లింవలె కూర్చుండువాడు. న్యాయము చేయుటలో తనవారని పరులని విచక్షణ చేయలేదు. పెద్ద చిన్నలని కాని, ధనిక దరిద్రులని కాని, బాలవృద్ధులని ఆత్మీయ పరకీయులని కాని యెన్నడును భేదము చేయలేదు. ఇస్లాముకై జీవించెను. దాని సేవలో చనిపోయెను. దానికై తన సర్వస్వమును త్యాగము చేసెను. ఇతరులకు మేలు చేయించెను. ఈ గుణములు కలవాడగుటచే అతని నాయకత్వమున ఇస్లాం సామ్రాజ్యము అతి వేగముగా నలుదిక్కుల వ్యాపించెను.
“హజరత్ ఉమర్ ఇస్లాము లోకములో ఉత్తమోత్తముడు”.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse