సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/సుమతి శతకము
సుమతి శతకము
కర్త యెవరు?
సుమతి శతకమును వ్రాసిన మహాకవి యెవ్వరో ఇంతవరకెవ్వరును నిశ్చయముగా తెలిపినవారు కారు. ఈ శతకమున కుండినంత ప్రచారము మరే తెలుగు గ్రంథమునకు లేదు. క్రీ.శ. 1910 లో వనపర్తిలో శ్రీ మానవల్లి రామకృష్ణ కవి పాదులు భద్ర భూపాలుని నీతిశాస్త్ర ముక్తావళిని ముద్రించి దానికొక యుత్తమ పీఠికను రచించి అందిట్లు వ్రాసిరి.
“ఇతడే భద్ర భూపాలుడు (బద్దెన) సుమతి శతకమును రచించెనని ప్రథమ పద్యము చూచిన దోచును. కాని యీ పద్యము నాకు లభించిన యైదు ప్రతులలో నొక్క దానిలో మాత్రమే యున్నది. రెండు ప్రతులలో ప్రారంభము లేదు. సుమతి శతకమునకును దీనికిని పాఠభేదము గానవచ్చుచున్నది. జాతీయ వాచకములలో భేదమగుపడును. సుమతి శతకమును రచించినవాడు భీమకవి యను లోక ప్రవాదమేకాక సుమతి శతకము తాళపత్రములలో ప్రథమ పద్యము భీమన పేరుతో నుండ నేను జూచియున్నాడను. ఇతడు వేములవాడ భీమ కవియా? లేక చదలవాడ భీమ కవియా? నృసింహపురాణమును రచించినవాడు దాక్షారామ వేశ్యలను వర్ణించినందున వేములవాడ భీమకవియే యని తోచుచున్నది... కావున సుమతి శతకమెవ్వరు రచించిరో గుర్తెరుగవలయును. నీతులు బద్దెన నీతులు వలెనున్నవి కాని శైలి మాత్రము భేదముగా నున్నది. ఇదియును పైయంశము వలెనే యనిశ్చితము.
నీతిశాస్త్ర ముక్తావళిలో శ్రీ మానవల్లివారు ప్రకటించిన దానిలో మొదటి
పద్యమిట్లున్నది.
“శ్రీవిభుడ, గర్వితారి
క్షాపర దళనోపలబ్ధ జయలక్ష్మీ సం
భావితుడ, సుమతి శతకముఁ
గావించిన ప్రౌఢ, గావ్య కమలాసనుడన్”
శ్రీ.మా. రామకృష్ణ కవిగారన్నట్లుగా సుమతిశతకము యొక్కయు నీతి
శాస్త్రముక్తావళి యొక్కయు శైలిలో చాలా భేదము కలదు. అందుచేత సుమతి
శతకమును ముందు రచించి తర్వాత నీతి శాస్త్ర ముక్తావళిని రచించి యుండిన
సుమతి శతకములోని శైలీ సూచక పదజాలము కొంతయైనను రెండవదానిలో
పడవలసి యుండవలెను. అట్టి జాడలేవియు గానరావు.
భీమకవి వ్రాసెననుటకు తాళపత్రపద్యము లేవియు శ్రీకవిగారుదహరింప
లేదు. మరియు వేములవాడ భీమకవియు చాలా ప్రాచీనుడు. నన్నయ తిక్కనల
కాలపు శైలియే వేరు. సుమతిశతకములోని శైలి శ్రీనాథుని యనంతర శైలిగా
కానవస్తున్నది. కాళిదాసుని గురించి మనకెంత తెలియునో తుదకు సుమతి శతక
కర్తను గురించియు మనకంతే తెలిసినదనవలెను.
కవియెవ్వరో తెలియనప్పుడు కవి కాలమెట్లు తెలియును. అయినను
శతకములోని శైలినిబట్టి కొంత యూహింపవచ్చును. భద్ర భూపాలుడు క్రీ.శ. 1150కి
పూర్వమందే ఉండిన వాడనియు అతనిని అతని పద్యాలను నీతి సారములో
రుద్రదేవుడును సకల నీతి సమ్మతములో మడికి సింగనయు మరికొందరును
నుదాహరించిరని ఆ కవిగారు తెలిపినారు. సింగనాదులు సుమతి శతకము నుండి
పద్యాలనేల యుదహరింపలేదు. మడికి సింగన తర్వాతిదే ఈ సుమతి శతకమని
చెప్పవచ్చును. నీతి శాస్త్రముక్తావళిలో తిక్కనయు నతనికి పూర్వులును వాడిన
పదాలెక్కువగా కలవు. కెలసము, పొరచి, ఎత్తికోలు, పురులు, ఒరిమే, కురగట,
మున్నగు బహు ప్రాచీన పదములతడు వాడినాడు. అయితే ఈ పదాలను తిక్కన
తర్వాతి వారును వాడిరని పరిశోధించి చూపించ వచ్చును. కాని అవి పరిశోధన
సుమతికి మూలములు
సుమతి శతకకారుడు విశేషముగా సంస్కృతములోని శ్లోకాల నుండి భావములను స్వీకరించెను. అదే పనిగా పరిశోధించు వారికి విశేషముగా మూల శ్లోకములు లభింపగలవు. స్థూలముగా నాకు తెలిసిన కొన్ని మూలములను తెలుపుకొందును.
క. అధరము కదలీ కదలక
మధురములగు బాసలుడిగి మౌనవ్రతుడౌ
నధికార రోగ పూరిత
బధిరాంధక శవము జూడ బాపము సుమతీ
శ్లో. బధిరయతి కర్ణ వివరం
వాచం మూకయతి గాత్రయష్టిం
సంపద్రో గోయ మద్భుతోరాజన్
“ఉపమింప మొదలు తియ్యన
కపటంబెడ నెడను చెరకు కైవడినేవో”
అనునది. హితోపదేశ మందిట్టి భావముగల శ్లోకమును బోలినది.
“చెఱకు తుద వెన్ను బుట్టిన
జెఱకున దీపెల్ల జెరుచు సిద్ధము సుమతీ.
ఇట్టి భావమే తమిళ నీతి కారులు వాడినారు.
“కరంబు (చెఱకు-క-చ- అగును) పూవోల్"
(చెరకు పూవువోలె) అని తమిళ పద్య పంక్తి ఈ రెంటికిని సంస్కృత
మూలముండి యుండును.
“తలనుండు విషము ఫణికిని
వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్
తలతోక యనక నుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ”
“వృశ్చికస్య విషం పుచ్ఛం మక్షికస్య విషంశిరః
తక్షకస్య విషందంష్ట్రా సర్వాంగం దుర్జనే విషః
“తల దడిపి బాస చేసిన
వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ.
చేమకూర వేంకటపతి సారంగధరలో
“తల తడిపి బాస చేసిన
జలజాక్షులు నమ్మరాదు సారంగధరా
అని వ్రాసెను. ఇందెవ్వరెవ్వరికి ఋణ పడినట్లు? వెంకటపతియే తన చిన్నతనమందు
సుమతి శతకము చదివి యుండెనా?
“పర సతుల గోష్టి నుండిన
పురుషుడు గాంగేయుడైన భువి నిందపడున్
అన్న భావమునే చేమకూర తన సారంగధరలో
“నిజము భీష్ము నంతటి జితేంద్రియునకైన
నాశపుట్టు మదిని రాశపుట్ట దితరులనగ
నెంత ధనము పట్ల యువతి జనము పట్ల
అని వ్రాసెను.
“పర నారీ సోదరుడై
పర ధనముల కాశపడక పరులకు హితుడై.
అన్నది
“మాతృ వత్పర దారేషు, పరద్రవ్యేషు లోష్ఠవత్
ఆత్మ వత్సర్వ భూతేషు యః పశ్యతి స పండితః
అన్న దానిని బోలినది.
సిరిదా వచ్చిన వచ్చును
సరిపోల్పగ నారకేళ సలిలము భంగిన్
సిరిదా బోయిన బోవును
కరి మ్రింగిన వెలగపండు కరణిని సుమతీ.
సమాయాతి యథాలక్ష్మీః
నారికేల ఫలాంబువత్
వినిర్యాతి యథాలక్ష్మీః
గజభుక్త కపిత్థవత్.
అయితే ఏనుగు వెలగపండును నమలక అమాంతముగా (మ్రింగుటను
మరునాడు లద్దితోపాటు ఆ పండులోని గుజ్జును కడుపులో పెట్టుకొని, పండు చిప్ప
పగులకుండా లోపల యేమియు లేనట్లుగా చేసి బయట పడవేయుటను ఎవ్వరైనా
పరీక్షించినారా? గతానుగతికముగా అందరనగా మనమును ఆ ప్రకారమేనా! క్రీ.శ.
1907లో నిర్ణయసాగర ముద్రాలయము వారు ప్రచురించిన “సమయోచిత
పద్యమాలికా” అను సంకలనములో పై శ్లోకమునకు పుట అడుగున “కపిత్థాంతర్గతః
కీటోగజ ఇత్యభిధీయతే” అని యుదాహరించినారు. వెలగకాయలో పుట్టి దానిలోపలి
భాగమును తిను కీటకము గజము అని దీని యభిప్రాయము. గజమున కీయర్థమే
నిఘంటులోను కానరాదు. మరి ఏ నిఘంటు ప్రమాణమో వారును తెలుపలేదు.
“అప్పిచ్చువాడు వైద్యుఁడు
నెప్పుడు నెగ తెగక పారు యేరును ద్విజుఁడుం
జొప్పడిన యూరనుండుము
జొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ”
అనుదానికి మూలము.
“ఋణదాతాచ వైద్యశ్చ శ్రోత్రియః సుజలానది
యత్రహ్యేతే నవిద్యంతే నతత్ర దివసంవసేత్
కోమలి నిజమున్... ... తెల్లని కాకులును లేవు
అన్నదానికి మూలము.
“ఔదుంబరాణి పుష్పాణి, శ్వేత వర్ణంచ వాయసం
మత్స్యపాదం జలేపశ్యేన్న నారీ హృదయస్థితం
“తన వారు లేనిచోటును
చనవించుక లేనిచోట జగడము చోటన్
అనుమానమైన చోటను
మనుజునకును నిలువఁదగదు మహిలో సుమతీ”
“యస్మిన్ దేశోన సన్మానో నప్రీతిర్నచ బాంధవా;
నవిద్యా నాస్తిధనికో, నతత్ర దివసం వ్రజేత్”
ఒల్లని సతి నొల్లని పతి
నొల్లని చెలికాని.....
అనుదానికి మూలము.
“దుష్టా భార్య, శఠోమిత్రః
భృత్యో౽హంకార సంయుతః
“పతి కడకు, దన్ను గూర్చిన
సతికడకున్ వేల్పు కడకు, సద్గురు కడకున్.
సుతుకడకు, రిత్తచేతుల
మతి మంతులు చనరు నీతిమార్గము సుమతీ”
(పతి-రాజు)
అనుదానికి మూలము.
“అగ్ని హోత్రం గృహం క్షేత్రం గర్భిణీ వృద్ధబాలకా
రిక్త హస్తేన నోపేయాత్ రాజానం దైవతంగురుః
“పాలసునకైన యాపద
జాలింబడి తీర్పవలదు సర్వజ్ఞునకున్
తేలగ్ని బడగ బట్టిన
మేలెరుగనె మీటుగాక మేదిని సుమతీ
అనుదానికి మూలచ్ఛాయ.
“ఉపకారేణ నీచానా మపకారోహి జాయతే
పయః పానం భుజంగనాం కేవలం విషవర్ధనం”
“అడవిని తోడ రయక”
అనుదానికి పూర్వపు జాడ
“నైకః ప్రపద్యేతా ధ్వానం”
ఉడుముండదె నూరేండ్లును
కాకోపి జీవతి చిరంచ బలించ భుంక్తే
“పనిసేయు నెడల దాసియు
ననుభవమున రంభ, మంత్రి యాలోచనకున్”
అను పద్యమునకు సరియగు శ్లోకమిది.
“కార్యేషు మంత్రీ కరణేషు దాసీ
భోజ్యేషు మాతా శయనేషు రంభా
ధర్మే౽ను కూలా క్షమయా ధరిత్రీ
భార్యాచ షాడ్గుణ్యవతీహ దుర్లభా”
గడనకల మగని జూచిన
అడుగడుగుకు మడుగులిడుదు రతివలు,
అనునది
“యావద్విత్తోపార్జనశక్తః
తావన్ని జపరి నారోరక్తః"
అన్నదానిని బోలినది.
బలవంతుడ నాకేమని
పలువురితో నిగ్రహించి పలుకుట మేలా?
బలవంతమైన సర్పము
చలి చీమల చేఁత జిక్కి చావదె సుమతీ.
అనుదానికి మూలము
“బహుభిర్న విరోద్ధవ్యం దుర్జనైస్స్వజనైరపి
స్ఫురంత మపి నాగేంద్రం భక్షయంతిపిపీలికాః”
సుమతి నీతి
ప్రాచీన సంస్కృత కవులును నీతి శాస్త్రకారులును తెలిపిన భావములనే సుమతి శతకకారుడును వెల్లడించినాడు. అందుకొన్ని ఈనాటి నీతికోవిదులు మెచ్చనట్టివియు కలవు. “గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజము... లేవు తెలియర సుమతీ” అనుట విచారకరము. ఏమీ! గొల్లవారంతటి మూర్ఖులా? ఇతరుల స్వత్వమేనా సాహిత్యవిద్య! “ఒల్లని సతినొల్లని పతి నొల్లని చెలికాని విడువనొల్లని వాడే గొల్లండు” ప్రాసకై గొల్లడే దొరికినాడే కవికి! కోమలికి నిజము కల్లయట. “లేదు సుమీ సతులవలపు” అని మరొకమారన్నాడు కవి. పురుషులె నిజాన్ని గుత్తగొన్నట్టి వారు కాబోలు! కోమలులే వ్రాసియుండిన వారేమని యుందురు. “మగవారినిలా నమ్మరాదే చెలీ” అని యుందురు కదా! పులియే చిత్తరవు వ్రాసి యుండిన నెట్లుండును? (మానవుడు పులిని జంపి దానిపై కాలుంచినట్లు చిత్రించిన దానిని పులికి జూపగా, పులియే చిత్రించిన మరొక విధముగా నుండునులే అని పులి యన్నదట)” మేకల పాడియే యుత్కృష్టమని వైద్యుల యభిప్రాయము.
“కొక్కోకమెల్ల జదివిన
చిక్కదురా వారకాంత” అన్నాడు.
వాత్స్యాయనుని శాస్త్రమునకు తెనుగు దేశములో ప్రచారము లేదయ్యెను.
ఎవడో మళయాళీయుడగు కొక్కోకుడు వ్రాసిన అనుత్తమ గ్రంథానికే ప్రచారమెక్కు
వయ్యెను. తెనుగులో ఎర్రన కవి యనునతడు క్రీ.శ. 1600 ప్రాంతములో దానిని
రచించెను. సుమతికారుడు ఎర్రనకవి కొక్కోకముగా సంస్కృత రతి రహస్యముగా
పేర్కొనినది. సంస్కృతములో కవి పేరు కొక్కోకుడు. తెలుగులో కృతి పేరే కొక్కోకముగా
ప్రసిద్ధమయ్యెను.
“కరణము కరణము నమ్మిన మరణాంతక మౌను”
“ఒక యూరికి నొక కరణము”
“కరణముల ననుసరింపక, విరసంబున తిన్న తిండి వికటించు సుమీ”
“కరణము సాదై యున్నను లెక్క గొనరు గదరా సుమతీ”
“కరణము వైదికుడైనను మరణాంతక మౌను”
“ధరకాపు కొండెడైనను కరణాలకు బ్రతుకులేదు”
అని ఆరుమారులు కరణాలను స్మరించినాడు సుమతి,
కాని ఆ స్మరణ కరణాలకు ప్రశంసాపాత్రము కాదు. కరణాలొకరి నొకరు
నమ్మరనియు, కరణాలు సాధువులెన్నటికి కారనియు, వారు రైతులను భాదించెడి
వారనియు, కరణాలు సాధారణముగా నియోగులేననియు, కవి యభిప్రాయము.
రాయని భాస్కరుని కాలానికి పూర్వము కమసాలులు కరణాలై యుండిరనియు,
భాస్కరుడు వారిని తొలగించి నియోగుల నేర్పాటుచేసెననియు(?) నొక కథకు
ప్రచారము కలిగింది. అది నిజమగుచో సుమతి కవి క్రీ.శ. 1600 ప్రాంతము
వాడగును.
“వెలయాలు సేయు బాసలు
వెలయగ నగసాలి పొందు వెలమ చెలిమియున్
కలలోన గన్న కలిమియు
విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ”
కవికి గొల్లలన్న అసహ్యము. కరణాలన్న కోపము. వైదికుడు మరణాంతకుడు.
వెలమలు నమ్మరానివారు. “నమ్మకు మగసాలవాని”, నమ్మకు మంగడి వానిని”,
అనుటకూడ అగసాలి వారు కూడా దుర్మార్గులు. అంగడి వాడన వ్యాపారి. బహుశ
కోమటియని కవి దృష్టిలో నుండును. దుష్టరాజులను దొరలను, అధికారులను
పలుమారు దూషించెను. కాపుల వృత్తియు నంత మెచ్చు వచ్చినట్లు కానరాదు.
అడిగిన జీతం బియ్యని
మిడి మేలపు దొరను గొలచి మిడుకుట కంటెన్
వడిగల రెండెద్దుల కట్టుక
మడి దున్నుక బ్రతక వచ్చు మహిలో సుమతీ.
అని నికృష్ట పక్షములో మేలు రకముగా తలచెను.
“మేలెంచని మాలిన్యుని
మాలను నగసాల వాని మంగలి హితుగా
నేలిన నరపతి రాజ్యము
నేల గలసి పోవు గాని నెగడదు సుమతీ,
మాల, మంగలివారిని నిరసించిన పద్యాలు కవి సొంత భావములై యుండును. కవి యే జాతివాడో పై నిరసనములను బట్టి ఊహించుట మరింత కష్టమైనది.
“కలకంఠ కంఠి కన్నీరొలికిన
సిరి యింట నుండ నొల్లదు సుమతీ.”
“అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వర మీని వేల్పు...”
“అపకారికి నుపకారము
నెపమెన్నక సేయు వాడె నేర్పరి సుమతీ”
“ఎప్పుడు సంపద గలిగిన
పసిబాలల పొందు వాడు పశువుర సుమతీ”
“బలవంతుడ నాకేమని
పలువురతో నిగ్రహించి పల్కుటమేలా”
“సరసము విరసము కొరకే....
ఇట్టి పద్యాలు ఉత్తమమై శతక వాఙ్మయములో మకుటాయమానమై
యొప్పుచున్నవి.
అన్ని శతకములలోను సుమతిశతక శైలి విలక్షణమైనది. ఇతనికి అనుప్రాసము
లపై ప్రీతి యెక్కుడు. సులభముగా పద్యములను జ్ఞాపక ముంచుకొను విధమున
వ్రాసినాడు. వేమన పద్యములైనను, సుమతి పద్యాలైనను తెలియని విద్యావంతులు
తెలుగు వారిలో అరుదు. (ఈ కాలము తెనుగుతో డిగ్రీలు పొందిన వారిలో కొందరికివి
రాకపోవచ్చును కాని జన సామాన్యములో సుమతికిని వేమనకును బాగా ఆదరము
కలదు.)
ఇక ఈ కవి వాడిన పదాలను కొన్నింటిని విచారింతము. “ఎద్దుల కట్టుక”,
“మడి దున్నుక” అని కవి ప్రయోగించినాడు. ఇవి భారత కవులలోను, వారి కాలపు
కవులలోను ఉండిన ప్రయోగాలు కావని వైయాకరణుల అభిప్రాయము. అట్లగుటచేత
ఎర్రాపగ్రడ శ్రీనాథుల తర్వాతి వాడని చెప్పవచ్చును. “గుడి మనియము సేయరాదు” అని ముద్రిత ప్రతులలో కలదు. మణియము
శబ్ద రత్నాకరము (శ.ర)లో లేదు. మణివము, మణిగము అను పదాలిచ్చినాడు.
కాని వాటికి ప్రమాణములు తెలుపలేదు. మన్నెము, మన్యము, మాన్యము అను
శబ్దాల కీమణియము సమానముగ నున్నందున ఇదియే సరియగు రూపమేమో?
అధరము కదలీ కదలక అని కొన్ని ప్రతులలో కలదు. కొన్నిటిలో కదలియు కదలక
అని ముద్రించినారు. ఏది సరి? “ప్రాకొన్న నూతి యుదకము, అనుచో ప్రాకొన్న
అనగా ప్రాతబడి వాడుక లేకయున్న అని ఒకరి వ్యాఖ్య. ప్రాకు-కొను= ప్రాకొను
పాచిపట్టు అని శ.ర.లో అర్థమిచ్చి దానికీ పంక్తినే యుదహరించినారు.
“వాదుకు దెచ్చునదె కీడు” అనుటలో వాదునకు అనుటకు మారుగా వాదుకు అని కవి ప్రయోగించినది గమనింపదగినది. “సర్పంబు పడగనీడను” ప్పకు నుర్పకు ప్రాస కలిపి ముద్రించినారు. కాని సర్పము తద్భవములో సప్పమగును. ఆ రూపమియ్యవచ్చును. శ.ర.ములో సప్పము అను పదమిచ్చి ఇదే పంక్తి నుదహ రించినారు.
ఈ కవి రేఫశకట రేఫల ప్రాసలను పాటించినాడు. కవి ప్రాచీనుడు కాదని తెలుపుటకిది ముఖ్యాధారము. శ్రీనాథునికి పూర్వమువారు (ప్రమాదోధీమతా మపి అనునది కాక) రేఫద్వయ సాంకర్యము చేసినవారు కారు. కరణము, మఱినమ్మక అనుచోటను పరునాత్మ మఱుమాట అనుచోటను, పరుల కష్టము ఎఱిగియు అనుచోటను, పరులకు, పిఱికికి అనుచోటను ఇతడు ప్రాసలందు రేఫద్వయ మైత్రి ఘటించినాడు. “పేరణము లేని లేమయ” అనుచో పేరణమునకు శ.ర.లో అంగీ యనియు వ్యాఖ్యాతలు రవికయనియు వ్రాసినారు. పేరణము ఎక్కువగా ఒక నాట్య భంగిమమునకే ప్రాచీనులు వాడినారు. నాట్యమెరుగని స్త్రీ అనియు, చెప్పవచ్చును. “వీరణములు లేని పెండ్లి” అనుచో, వీరణములకు, చర్మవాద్య విశేషమని శ.ర.లో వాద్యములు అని వ్యాఖ్యాతలును వ్రాసిరి. చర్మవాద్య విశేషమననెట్టిది. ఈనాడును కొందరు గొల్లవారు తమ యిండ్లలోని వివాహములందు ఒక పెద్ద డోలు వాయింతురు. ఆ డోలు మంగలివారు వాయించు డోలుకు నాల్గంతలయినను ఉండును. దానిని గొల్లవారు “వీరన్న డోలు” అందురు. ఎందుకాపేరు పెట్టినారనిన, వీరభద్రుని సేవలో వాయించినది కాన వీరన్నడోలైనదందురు. సాధారణముగా గొల్లలు వైష్ణవులే. కావున ఆ యర్థము సరికాదు. వీరణడోలు (వీరణము అను పేరుగల డోలు) అను పదమే వారి నోళ్ళలో నలిగి వీరన్నడోలు అయినది. అంతే!
“జగడము చోట” అనుచో జగడ శబ్దము ఝకటము అను సంస్కృత శబ్ద భవము. భారత కవులీ జగడ శబ్దమును అంత పెద్ద కలహాల గ్రంథములో వాడినట్లు నాకు గోచరింపలేదు. ఇదియు శ్రీనాథాంతర పదమనవలెను. (ఝకట శబ్దము నొక తాయన్న కవియే ఒక చోటనే వాడెను).
“తలమాసిన ఒలుమాసిన” అనుచో, ఒలు అనగా ఒడలు (శరీరము అని అర్థము చెప్పుకొనవలసి యుండును). ఈ శబ్దము నిఘంటులలో లేదు. సుమతి శతకాన్ని ఉదాహరించిన శ. ర. లో ఒలు శబ్దము లేదు. ఇది ప్రాస భీతిచే సన్నగిల్లిన శబ్దమా లేక అట్టి ప్రయోగము వ్యవహారమందున్నదా. ఒడలు శబ్దము ఉత్తర సర్కారులోనే ఎక్కువగా వ్యవహారముననున్నది. రాయలసీమ, తెలంగాణములలో పై, పయి, పెయి అని ఎక్కువగా వాడుదురు. ఈ పదాలు మై, మెయి అను భారత కవుల పదాల గ్రామ్య రూపాలే కాని అన్యము కావు. కాని సర్కారులలో ఒడలు, ఒళ్ళు కాక ఒలు అను రూపము కూడ కలదేమో తెలియదు.
“చీరే శృంగార మండ్రు స్త్రీలకు సుమతీ” అనుటలో చీర అనగా స్త్రీలు కట్టుకొను కోక అని యర్థము కదా. ఈ పదము కూడ కవి యొక్క మధ్య కాలమును క్రీ.శ. 1500-1600 ప్రాంతమును సూచించును. భారత కవులును, ప్రాచీన కవులును, చీరను స్త్రీ వస్త్ర విశిష్టార్థమున కాక, వస్త్ర సామాన్యార్థమునకే వాడిరి. “తలఁజీర సుట్టియును" అని తిక్కన వ్రాసెను. (ఆను 3-177)
“సంగరమున పారిపోకు సరసుడవైనన్” అనునది కొన్ని ముద్రణములలో సరసుడవైతే అని యున్నది.
“చీటికి ప్రాణంబు వ్రాలు” అనుచో చీటి యనగా పత్ర ఖండమని శ.ర. లోను, జాబు, రసీదు అని వ్యాఖ్యానములలోను కలదు. చీటి పదము తెనుగు పదమేనా? అని సందేహము! హిందూస్థానీలో చిట్టీ అను పదము నుండి వచ్చెనేమో అని యూహింతును.
“పిరికికి దళవాయితనము పెట్టకు” అనుదానిలో దళవాయితనము అనగా సేనా నాయకత్వమని అర్థము. ఈ పదము కూడ భారత కవులది కానట్లు తలతును. “మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!!” అను పంక్తి ఒక ముద్రణలో “మనుజాధి పుడతడు గొల్వ మహిలో సుమతీ” అని కలదు. “కాపు కొండెడయిన” అనుచో కొండీడు అనుటకు కవికొండెడు అని ప్రయోగించెను.
“శుభముల నొందని చదువును” అను పద్యములో మూడవ పంక్తి “అభిలాష లేని కూటమి” అని కలదు. నేను చూచిన ఒక ప్రతిలో “గుభగుభలు” లేని కూటమి అని కలదు. (గుబగుబలని) కలదు కాని ప్రాసకై గుభగుభలు అని వ్రాస్తున్నాను).
“కడు బలవంతుడైనను” అను పద్యములో తుది గీటులో “పడుపుగ సంగడికి దానె పంపుట సుమతీ” అని కలదు. కాని ఒక ప్రతిలో “బడువగ సంగడికీ...” అని కలదు. బడువ అనగా నీచుడు అను నర్ధములో వ్యావహారమందు కలదు.
“తలదడివి బాస చేసిన” అని సుమతి, “తల దడిపి బాస జేసిన” అని సారంగధర ఏదిసరి?
“తాననుభవింప నర్థము” తాను అనుభవింపని యర్థము అనుటకు తప్పు ప్రయోగము. ఇదియు కవియొక్క అర్వాచీనత్వమునకు నిదర్శనము కాదగును.
“నీరే ప్రాణాధారము” అను పద్యములో “నీరే” అను దానికి సరిపోవునట్లు- నోరే, నారే, చీరే, అని యొక ప్రతిలో ముద్రించినారు. కాని తక్కువ వాటిలో నారియె, చీరయె అని ముద్రించినారు ఏవి కవి ప్రయోగాలో?
“పరసతుల గోష్ఠి నుండిన” అను పద్యములో మూడవ పంక్తి “గరిత సుశీలయె యైనను” అని యొక ప్రతిలోను “పరసతి సుశీలయైనను” అని ఒక ప్రతిలోను కలదు. “పరునాత్మ దలచు సతివిడు” మఱుమాటలు పలుకు సుతుల మన్నింపకుమీ” అని ముద్రణ. ఒక ప్రతిలో “బరునాత్మ దలచు” అని కలదు. మరియు పద్యమిట్లుండెనా? పరునాత్మ తలచుసతి: విడుమర మాటలు పలుకు సుతుల మన్నింపకుమీ”
“మది నొకనివలసి పద్యములో “మానక తిరుగన్ అది చిలుక పిల్లి పట్టిన” అని కలదు. ఇది కవి హృదయము కానట్లున్నది. పద్యపునడక, అల్లిక, ఎట్లెట్లో ఉన్నది.
“సిరి దా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్”
“సిరి దా వచ్చిన వచ్చును
సరిపోల్పగ నారికేళ సలిలము భంగిన్”
అని కలదు. ఇది మంచి పాఠము కాదా?
ఈ విధముగా ఈ చిన్న శతకములో ఇన్ని పాఠభేదాలుండుట దీని
ప్రచారాధిక్యమునే సూచించును. కావున పూర్వ తాళపత్ర ప్రతులను సేకరించి సరియగు
పాఠములను నిర్ణయించుట అవసరమని అంటున్నాను. ఇంకను కొన్ని ప్రధానములగు
పాఠభేదములను విషయగురుత్వశంకతో వదలినాను.
70 ఏండ్ల వృద్ధుడొకడు తన బాల్మయులోని ఈ నీతిపద్యములు అచ్చులో
లేదని విచారించి నాకిట్లు చదివి వినిపించెను.
“ఘన మెరుగనట్టి కోడలు,
వినయము లేనట్టి సుతుడు, వెరవని యనుజుం
డనుకూలగాని భార్యయు
మనుజున కిది మందులేని మరణము సుమతీ”
ఒక ప్రతిలోని క్రింది యధిక పాఠము కలదు.
“వలరసము సతికి బుట్టక
బలిమిని దమకించి విటుడు పైకొనుటెల్లన్
మలయజము సానమీదను
జలముంచక తీసినట్టి చందము సుమతీ”
అయితే యీ పద్యము ఎర్రన కొక్కోక కళాశాస్త్ర మందిట్లున్నదని చెప్పిరి.
“వలరసము సతికి బుట్టక
బలిమిని దమకించి విటుడు పై కొనుటెల్లన్
జలముంచక సానపయిన్
మలయజమును తీయబూను మాదిరికాదె”
ఒక పూర్వ లక్షణ గ్రంథములో ఈ క్రింది పద్యమునుదాహరించినారు.
కాదన్న వాడె కరణము।
వాదడచినవాడె। మేటి వసుధేశుకడన్!
లేదన్నవాడె చనవరి।
గాథలు పెక్కాడు వాడే కావ్యుడు సుమతీ॥
సుమతిలోను స్వమతిని అతికించిన వారు కూడ యుండిరేమో?
ఇంత దూరము చేసిన చర్చనుబట్టి సుమతి శతకకారుడు క్రీ.శ. 1500- 1600ప్రాంతము వాడని అభిప్రాయపడుదును.
ఈ శతకమునకు పీఠికను వ్రాసి చక్కని పాఠములను నిర్ణయించి పాఠాంతరము లనిచ్చి అవసరమగు పదముల విశేషార్థములను వ్రాసి, మూల సంస్కృత శ్లోకాలను వెదకిచూపి ఆకర్షణీయముగా ముద్రించుట అత్యంతావశ్యకమని నిరూపించుట కీవ్యాసలేశము పనికివచ్చుగాక.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse