సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/శబ్దాల ముచ్చట
శబ్దాల ముచ్చట
మా శ్రీపాద శాస్త్రిగారితో మాటల సందర్భమున నా పుస్తకములో వ్రాసికొనిన కొన్ని శబ్దముల చరిత్రను ముచ్చటించి యుంటిని. కాని వాని నింత త్వరగా ప్రకటించదలచి యుండలేదు. మా శాస్త్రిగారు మాత్రము ఇప్పుడే కావలనెనని పట్టుపట్టినారు. సంస్కృత ఫార్సీ భాషలకు పరస్పర సన్నిహిత సంబంధమెట్లు కలదో, ఈ రెంటికినీ కించిద్భేదమెట్లేర్పడెనో, ఎన్నడేర్పడెనో ఇత్యాది విషయముల నొక చిన్న గ్రంథముగా వ్రాయ తలపెట్టి యుంటిని.
అప్పుడు నేను సంగ్రహించి యుంచిన ఫార్సీ శబ్దములను గురించియు వ్రాయదలచి యుంటిని - అదెన్నడో యేమోకాని యిప్పుడు మాత్రము నాకు తోచిన కొన్ని శబ్దముల నిందు ప్రకటించుచున్నాను. నేను వ్రాసిన అభిప్రాయములు సరిగాకపోవచ్చును. విమర్శకులకు మార్గదర్శకముగ నైన నుండవచ్చునను ఊహతో ప్రకటించుచున్నాను.
1. ద్వార - ద్వి+ అర రెండు రెక్కలు కలది. ప్రాచీనమందు ఒంటిరెక్క తలపులకన్న రెండు రెక్కల తలుపులే విశేషమేమో.
2. డప్పు - ఇది ఉత్తర సర్కారులలో విశేషము వాడుకలో కలదు. ఫార్సీలో దఫ్ అని కలదు. తప్పెట అను నర్థములో నుపయోగింతురు.
3. హంవీరుడు - శూరుడను నర్థములో ప్రయుక్తము. తారా శశాంక విజయమందు ప్రయోగించబడినది.
“దండ హంవీర తలగుండు గండ” అని శుకసప్తతిలో (పు. 128) కలదు. “రాజమాన్య హంవీరులు దక్కణీలు” అనియు నొక చాటువు. హంవీరుడు రాజపుత్ర స్థాన చిత్తూరు రాజగు అర్సికుమారుడు. మహావీరుడగుటచే శూరపద పర్యాయ మయ్యెను. 4. దేవానాం ప్రియ - ఇది షష్ఠీ తత్పురుష అలుక్సమాసముగానే మూర్ఖుడను నర్ధములో వాడినారు. అమరసింహుడు త్రికాండ శేషములో దీని యర్థము “ఛాగము” అని వ్రాసెను. ఛాగసమానుడు మూర్ఖుడు. మరియు ఛాగము యజ్ఞములందు దేవానాం ప్రియమైనది. నిఘంటుకారులు మూర్ఖునికే యీ పదము అలుక్సమాస స్పరూపమందే వర్తించుననిరి. దీనికి చారిత్రక కారణము కలదు. బౌద్ధులు తమ మతమందు శ్రేష్ఠులైన వారిని “దేవానాం ప్రియులు” అని పిలుచుచుండిరి. ఆశోక చక్రవర్తి బిరుదులలో నిదొక్కటి. హిందువులు బౌద్ధులను హేళనము అవమానము చేయు నుద్దేశముతో నీ యలుక్సమాస మూర్ఖనిర్వచనము చేసి యుందురు.
5. హజారము - దర్బారు అను నర్ధములో వాడుదురు. ఫార్సీ హుజూరీ నుండి వచ్చియుండును.
6. హసాదు - “చిత్తము అట్లే” అను నర్థము హాస్రాబ్ అను దానినుండి యేమో?
7. చొక్కా - అంగీ, ఫార్ఫీలోని “చొగా” నుండియే వచ్చినది. నిస్సందేహము.
8. కాగితము - ఫార్సీ - కాగజ్ నుండి
9. బులాకి - ముక్కుకొనను అలంకారముగా (?) వాడుకొను ఆభరణ విశేషము. ఫార్సీలో “బులాఖ్” ఈ ఆభరణమును ముసల్మానులే తెచ్చి ఈ దేశ స్త్రీల ముక్కుల కెక్కించినారేమో, ఆలోచించుడు.
10. కందిల్ - హైద్రాబాదులో ప్రయుక్తము దీపమని యర్థము. ఇంగ్లీషు క్యాండిల్ (Candle) నుండి వచ్చినదీ వెలుగు.
11. గడ్డినూనె - ఉత్తర సర్కారులలో నున్నదో లేదో కర్నూలులో నిజాం రాష్ట్రంలో కొన్ని భాగములలో కిరోసిన్ నూనెకు పర్యాయపదముగా నున్నది. కిరోసిన్ నుండి గ్యాస్ కూడా వచ్చును. కావున గ్యాసును ముసల్మానులు 'ఘాస్‌నూనె'నుగా జేసిరి. ఉర్దూలో ఘాస్ (ఘాసశబ్దమే) అనగా గడ్డి కావున కిరోసిన్ గడ్డినూనె అయినది.
12. చీనా గొలుసు - ఇది నంబి సోమయాజి వంటి పదము. ఇంగ్లీషు చైన్ (Chain) అనగా గొలుసు. ఆక్స్ (OX) ఎద్దు అన్న చదువు పరిణామమే చైన్ గొలుసు తుదకు చైనా గొలుసు , చీనా గొలుసు అయినది. చీనా దేశమున కిప్పుడిప్పుడే గొలుసు సంబంధము కలుగుచున్నది. 13. తంబలి - ఒక శైవజాతి - తాంబల శబ్ద భవమని తలతును. పూర్వము ఒక్కొక్క జాతి ఒక్కొక్క వృత్తి. నంబులకు పూజయే కాక పూలను వర్తనగా తెచ్చియిచ్చుట ("నంబి వాడిచ్చిన గన్నేరు పూవులు” అని శుకసప్తతి కారుడు) అటులే తంబలవారికి గ్రామములో తమలపాకుల నిచ్చుట.
14. యోజన - ఈ శబ్దము ఒక యూర పొడవగును, ఒకచోట చిన్నదగును. కొందరు పది మైళ్ళందురు. కొందరు ఎనిమిది, మరికొందరు ఆరు మైళ్లు యుజ్యంతేతి యోజన. ఎద్దులను బండికి కట్టుట యని యర్థము. అనగా ఎద్దులబండి ఒక దినములో ఎంత దూరము పోవునో అంతదూరము. అది ఐదు మైళ్ళ నుండి పది మైళ్ళు కావచ్చును. బాటలను బట్టి యది నిర్ణయింపదగినది.
15. సెమ్మె - దీపము పెట్టు స్తంభము అని యర్థము. ఫార్సీలో “షమ” అనగా దీపము (దీప స్తంభముకాదు) దాని నుండియె మన సెమ్మె ఏర్పడినది.
16. కాక పక్షము - గిర్జాలు, జుంపాలు. కాకి రెక్కలవలె ఉభయ పార్శ్వములందుండునవి. శ్రీరాములకు కాకపక్ష ముండెనని వాల్మీకి అభిప్రాయము.
17. కవాట - పాణిని కాలములో మన దేశమందు తలుపులు చిన్నవిగా నుండెనేమో. క=తలను, పాటయతీతి=పగుల గొట్టునది కనుక - కవాటమయ్యెను.
18. కీసర - కీస అనికూడ యందురు. జేబు అని యర్థము. ఈ జేబు కూడా అన్యదేశ్యమే. (మన పూర్వలకు జేబులు లేకుండె నన్నమాట. మన మెప్పుడను పరులకై జీవించువారము కాన మనకు జేబులెందుకు?) కీసర్ అని ఫార్సీరూపము నుండి వచ్చినది.
19. దుహిత - బిడ్డ అని యందరకు తెలిసినదే. ఈ శబ్దార్థము రెండు విధములు. ఈ అర్థములో ప్రాచీనుల ఇంటి బిడ్డయొక్క స్థానము విశదమగును. దుహ్ ధాతువు. పితుకుట అను దానినుండి వచ్చినదీ పదము. పూర్వము ఇంటి యాడుపడుచు దినము ఆవులను, బర్రెలను చూచుకొనుచుండెనని యూహ్యము. ద్వేహితా - రెండు కుటుంబములకు - పుట్టినయింటికి మెట్టినయింటికి హితురాలు అగుట కావచ్చును.
20. పునాస - వర్షకాలారంభమున విత్తునట్టి పంటకు అర్ధము. పునర్వసు కార్తిలో సజ్జలు, కొర్రలు మున్నగునవి వేయుదురు. ఈ పునర్వసు నుండియె పునాస పదముద్భవించినదని నా యూహ.
21. అక్ష (మాల) -
శ్లో. ఆదిక్షాంతార్ణయోగిత్వా దక్షమాలేతి కీర్తితా
తద్వర్ణ సంఖ్యైర్మణిభి ర్జపమాలాం ప్రకల్పయేత్
- శారదా తిలకము -
22. ఏడుగడ -
క. గురుడును 1. తల్లియు 2. దండ్రియు 3.
బురుషుడు 4. విద్యయును 5. దైవమును 6. దాతయు 7. నా
బొరి నేడు గడయు దానై
హరి నను రక్షించుగాత ననవరతంబున్
- వాసిష్టము -
23. హెగ్గడి - ద్వారపాలకుడు, బహు భార్యాయుక్తులగు రాజులు నాటికి
నేటికి తమ దేవిడీలవద్ద పురుషుల పహిరాను అంతగా పసందు చేయరు.
నపుంసకులను అంతఃపురమువద్ద కావలి పెట్టుచుందురు. ఉర్దూలో హిజ్‌డా అను
పదము యొక్క అపభ్రంశమీ హెగ్గడియై యుండును.
24. చిలువ - చీలినన - వ - నోరు కలది - పాము
25. నలువ - నాల్గు - వ- మోములవాడు. ఇట్లే గట్టివ మున్నగునవి.
26. కింపచ - దరిద్రుడు - ఈ దినమేమి వండుకుందునా అని చేతులు
పిసికికొనువాడు.
27. ముత్తైదువ - అయిదు వన్నెలు కలది - మంగళసూత్రము, పసుపు,
కుంకుమ, గాజులు, చెవ్వాకు - కడపటిది అరవల సొమ్ము. తెలుగు స్త్రీలకు మట్టియలు
- (మెట్టెలు)
28. హురుమంజి - హురుమంజి ముత్యములు. పర్ష్యాదేశపు సంధిని
హురుముజ్ సంధి యందురు (Gulf of Hurmuz). పూర్వము మనదేశానికీ
సముద్రభాగము నుండి తీసిన ముత్తెములు విశేషముగా నెగుమతి యగుచుండెను.
29. నంగనాచి - ఈ పేరు గలది ఏలేశ్వరోపాధ్యాయుల కూతురనియు
నామెనొక కంసాలి తన కులము దాచి వివాహమాడెననియు తదనంతర మామోసమెరిగి
యామె యాత్మహత్య చేసుకొనెననియు అప్పటినుండియు “ఎంతటి నంగనాచివే” అనిన “ఎంతటి సాహసురాలవు” అను సామెత యయ్యెననియు కొందరందురు.
హిందీలో నగ్నము (నంగా)గా ఆడునట్టి (నాచ్) స్త్రీల నృత్యమునకు నంగా నాచ్
అందురు. ఈ నృత్యముచేయు స్త్రీ సాహసికురాలు కాదా! అంతటి సిగ్గు విడిచిన
దను నర్థము ప్రయుక్తమే కాని ఏలేశ్వరోపాధ్యాయుని కూతురునకు మంచి పేరు
దొరకక యంతటి సుందర నామము పెట్టి యుండరు.
30. మోజాలు - బగ్దాదు పాదరక్షలకే యీ పేరుండెను. ఆ దేశము నుండి దిగుమతి యగుచుండెను.
31. దేవర - ద్వితీయో వరః మరది-వితంతువైన వదినెకు నియోగ న్యాయముచే ద్వితీయ వరుడై యుండెను. ఉర్దూ, హిందీ భాషలలో నీ పదమే (దేవర్) అని నేటికిని మరదికి వాడుచున్నారు.
32. దరుబేసి - యోగి. ఫార్సీలో దర్వేష్, ఒక తెనుగు కవి (శృంగార అహల్యా సంక్రందన మేమో?) యీ పదమును ప్రయోగించినాడు.
33. వర్గ - అధ్యాయము, భాగము, ప్రకరణమను నర్థము. ప్రాచీన కాలములో గ్రంథములు ఆకులపై వ్రాయుచుండిరి. ఫార్సీలో బర్గ్ అన ఆకు. (బవయోరభేదః - వర్గ్)
34. సూక్త - (హోమము చేయునప్పుడుచ్చరించు) మంత్రము. ఫార్సీలో సోక్త్ అన కాల్చుట, వ్రేల్చుట అని యర్థము.
35. పుస్తకము - ఫార్సీలో పొస్తక్ అన చర్మము. బహుశః ప్రాచీనమందు గ్రంథములకు జింక చర్మములు మున్నగునవి అట్టలుగా నుంచుచుండిరో లేక చర్మపు సంచులలో గ్రంథముల భద్రపరచుచుండిరో యని దీనివలన గ్రహింపవచ్చును.
36. ద్విబిస్తా - బిస్తా 80 రతుల తూకపు బంగారు నాణెము. (సూ. ఆపరిమాణ బిస్తా చితకం బల్వేభ్యోనతద్దితలుకి) రెండు బిస్తలకు కొన్న బానిస స్త్రీ.
37. పంచాశ్వా - అయిదు గుర్రములిచ్చి కొన్నట్టి బానిస స్త్రీ. ఈ రెండు పదములను బట్టి ప్రాచీనార్యులలో బానిసలను కొనుటయు, వ్యాపారమందు బానిసల విలువయు వెల్లడియగుచున్నది.
38. చండాల - సుప్రసిద్ధుడే! ఫార్సీలో నీచుని జందాల్ అనిరి. 39. దేవ అసుర - ఈ పదములకర్థము ఫార్సీలో అపసవ్యముగా నున్నది. దేవ్ అన భూతము లేక రాక్షసి అని, అహుర్ (ఫార్సీలో సకారమునకు హకారముంచుదురు. ఉ॥ సప్త=హప్త. సింధు=హిందు) అనగా ఫార్సీ మతమున మంచి దేవత. ఫార్సీలు, ఆర్యులును మొదట ఏకస్థులుగా నుండి సురాసుర పూజాదులందు భేదాభిప్రాయులై వేరైన నాట నుండి యా పరస్పర విరుద్ధార్థములు ప్రారంభమై యుండును.
♣ ♣ ♣
1935లో ప్రబుద్ధాంధ్రలో నేను “కొన్ని శబ్దముల కథలు” అను విషయముపై చర్చించి యుంటిని. ఇప్పుడు మరికొన్నింటిని గూర్చి నా ఊహలను తెలుపుకొందును. అందు సగము తప్పయినను మిగిలినవి సరియగుచో ఈ చర్చవల్ల నష్టము లేదని అనుకొందును.
1. టక్కు
టక్కులాడు, టక్కరి అను పదాలు టక్కు నుండి వచ్చినవి. నాకు తెలిసినంత వరకు ఈ పదాన్ని ఒకరిద్దరు కవులే పూర్వములో వాడినారు. నాచన సోమన “తిరిపెపు కూడు దెచ్చి” అను పద్యములో “టక్కరి బలుమోపు మోచు నయగాకితనంబడి యుట్టిగట్టినన్” అని ప్రయోగించెను. క్రీ.శ. 17వ వతాబ్ది తర్వాతి కవులీపదాన్ని ఎక్కువగా వాడిరి. ఠగ్ అను హిందీ పదము కలదు. ఠగ్గులు ప్రసిద్ధులే. మన డక్కు నుండి ఠగు అనునది వచ్చెనా? లేక ఈ రెంటికినీ మూల సంస్కృత పదము కలదా?
2. మ్లేచ్చ
ఈ పదము బలూచ్ పదము నుండి ఏర్పడినదని మాక్సుమూలర్ అభిప్రాయము. బెలుచిస్తాన్‌లోని వారు ఆర్యావర్తము సరిహద్దులోని వారనార్యులుగా ఉండి అపభ్రంశమును మాట్లాడిన వారని మహర్షి పతంజలి అభిప్రాయము.
3. బర్రెంకపూలు
బర్రెంక అను విష వృక్షమొకటి మహబూబ్‌నగరులో కలదు. కాని ఆదిలాబాదు
జిల్లాలో పారిజాత పుష్పాలను బర్రెంక పూలని అందురు. 4. శరభము
మన సంస్కృత కవులు “సింహ శరభ శార్దూలములు” అని చాలా వర్ణించేవారు. శరభం ఎట్టి మృగమో ఎవ్వరున్నూ చూడలేదు. ఈ పదము అసీరియా నుండి వచ్చినట్లు కానవచ్చును. అసీరియాలో cherub అను ఊహ మృగాన్ని భయంకరముగా చిత్రించేవారు. దేవతలు దానిపై స్వారీ చేసినట్లు చిత్రించుచుండిరి చెరుబిం (Cherubmim) అను పదము లాటిన్ లోనికినీ ఎక్కెను. ఆ చెరుబిం పదమే మన శరభం అయినదేమో?
5. ఖుదా
దేవుడు అను ఫార్సీలో అర్ధము. ఇది సంస్కృతంలోని స్వధా అను పదము నుండి యేర్పడి యుండును. సకారము ఫార్సీలో ఖకారముగా మారును. స్వసుర ఖుసర్ అయినది.
6. జగడము
హిందీలో ఝగడా ఏది మొదటిది? భారతములో యుద్ధవర్ణనలు నిండుగా ఉండినను జగడము అను పదము కానరాలేదు. హిందీ నుండియే తెనుగులోనికి వచ్చెనేమో?!
7. కుల్లాయి
పొడువైన బట్టటోపీ కర్థము. విజయనగర చక్రవర్తుల కాలములో పలువురు హిందూ ముసల్మానులు మూరెడు పొడవు గలిగి తలక్రిందులుగా ఉంచిన కాగితము పొట్లము వంటి టోపీని ధరించేవారు.
“కుల్లా పెట్టితి కోక జుట్టితి మహాకూర్పాసమున్ దొడిగితిన్” అని శ్రీనాథుడనెను. ఫార్సీలో కులా: అనగా టోపి. ఇది ఫార్శీ వారి నుండి మనవారు తీసుకొన్న ఆచారము.
8. పంతులు
ఈ పదమును ఇప్పుడు నియోగులు తమ బిరుదు పదముగా వాడుకొను చున్నారు. తెనుగు దేశములో చదువు చెప్పే ఉపాధ్యాయుని పంతులు అని అంటారు. ఈ పదము తెనుగు వాఙ్మయములో కానరాదు. ఇది మరాటీ పదమని తోస్తున్నది. పంథ్ అనునది మరాఠీ పదము. మరాఠీ బ్రాహ్మణోద్యోగులు ఈ పదాన్ని తమ పేరుల తుదిలో నుంచుచునుండిరి. మోరో పంథ్ వంటి విట్టివే, పంథ్ బహువచనము మన పంతులు అయి యుండును. ఇది గోలకొండ నవాబుల కాలములోను పీష్వాల కాలములోను తెనుగు దేశములోనికి వచ్చినట్లున్నది.
9. ఫిరంగి
ఇంగ్లీషులో క్యానన్ అందురు. ఈ పదము ఫ్రెంచివారి నుండి యేర్పడినది. ఫ్రెంచి వారే ఫిరంగీలు, వారు తెచ్చిన మారణయంత్రమే ఫిరంగి. ఈ పదాన్ని క్రీ.శ. 1600 తర్వాత కవులెక్కువగా వాడినారు. అంతకు పూర్వమీ పదము మన వాఙ్మయములో లేదు.
10. గేరి
వాడ, వీధి అని యర్థము. రాయలసీమలో, మహబూబ్‌నగర్ జిల్లాలో వాడుదురు. మాదిగగేరి, బాపనిగేరి, కాపుగేరి అని కన్నడములోని కేరి అనుపదమే గేరి అయినది.
11. కురువ
గొల్లజాతిలోని ఒక జాతి. కన్నడములో కురి అనగా గొర్రె. కురికి సంబంధించిన జాతి కురువగా ఏర్పడియుండును.
12. అడకొత్తు
కన్నడములో అడకె అనగా వక్క, దానిని ఒత్తునది అడకొత్తు.
13. క్రమేలక
ఒంటె ఇంగ్లీషులోని క్యామెల్ అనునది దీనికి దగ్గరి పదము. ఇది సెమిటిక్ భాష నుండి సంస్కృతములోని కెక్కిన పదమని భాషాతత్వ శాస్త్రవేత్తల అభిప్రాయము.
14. మేలా
సంస్కృతములో మసి-సిరా-అనుదానికి వాడుదురట. మేలాంధుక అనగా మసిబుడ్డి (Ink pot) అట. ఇది గ్రీకు భాష నుండి సంస్కృతములోనికి వచ్చినదట.
15. లిపి
ఇది పురాతన ఫార్సీ నుండి సంస్కృతములోని కెక్కెనని భాషాశాస్త్రవాదుల
వాదము. పాణిని నాటికిది మన సంస్కృతములో నుండినట్టిది. 16. శేరక
వ్యాఘ్రము - అనునర్థములో సంస్కృతములోని కెక్కెనట. ఫార్సీ షేర్ పదాన్ని సంస్కృతములో శేరక అన్నారట.
17. శిరోబంధనము
రుమాల. ఫార్సీలో సర్‌బంద్ అందురు. అదే ఇంగ్లీషు టరుబన్ అయ్యెను.
18. సమరె హింద్
చింత చెట్టు ఈరాన్‌లో లేనిది - ఫార్సీలు దీనికి హిందూదేశపు (సమర్) పండ్ల చెట్టు అనిరి - అదే ఇంగ్రీషులో టామరండ్ అయ్యెను.
19. సిస్తు
శిష్టము (పరిశిష్టము) నుండి వచ్చియుండును. సేద్యము ఖర్చు కూలి ఇంటి బత్తెముపోగా మిగిలినది. (శిష్టము) రాజుకు చెల్లించుట అను నర్థములో వాడియుందురు.
20. వరహా
మూడున్నర రూపాయి - విలువగల బంగారు నాణెము. విజయనగర రాజుల కాలములో ఆ నాణెములపై వరాహ చిహ్నముండెను. వరాహమే వరహా అయ్యెను. ఆ నాణెమునకు రెండవ ప్రక్కన దేవాలయ చిహ్నముండినందున ఇంగ్లీషువారు దానిని పగోడా అనిరి.
21. తత్తెరేని
మట్టితో చేసిన గుండ్రని కూజా. దీనిని ఉత్తర సర్కారు వారు తాబేటిబుర్ర అని అందురు. తత్తెరేని పదము కర్నూలు మండలము రాయచూరు పాలమూరు జిల్లాలో వాడుటను ఎరుగుదును. శబ్దరత్నాకరములో తత్తెర అను పదమిచ్చి దానికి సారాబుడ్డి అని యర్థము వ్రాసినారు. వ్యవసాయకులు పొలాలకు వెళ్ళునప్పుడు తాబేటిచిప్ప వంటి యాకారముకల మట్టికూజాలో నీరు తీసుకొనిపోదురు. దానిని
తత్తెరేని యందురు. 22. మేజువాణి
ఉత్తర సర్కారులలో భోగము సానుల ఆటకు మేజువాణి యందురు. ఇది ఉర్దూలోని మేజ్‌బానీ అను పదము యొక్క అపభ్రంశరూపము. మేజ్‌బాన్ అనగా విందునిచ్చువాడు. మేజుబానీ అనగా విందు. సాహెబులలో విందులలో పూర్వము నాచ్ ప్రధానముగా నుండెను. అందుచేత మనవారు సానుల ఆటకు వారి పాటకచ్చేరీకి మేజువాణి అని పేరు పెట్టినారు.
28. పోఱి
బాలిక అని అర్థము. ఇది అల్పార్థమందు తక్కువ వారి పిల్లలను పిలుచుటకై వాడుదురు. కాని పూర్వము గొప్పవారి కూతుండ్ర కీ పదమును వాడిరి. వేంగీ చాళు క్యులలో మంగిరాజు క్రీ.శ. 701-725 వరకు వేంగీ రాజ్యమును పాలించెను. అతని కూతురు పేరు “పృథివీ పోఱి” అని అతని శాసనములో వ్రాసినారు. పోఱి శబ్దము ఇప్పుడు తెలంగాణాలో చాలా ప్రాంతాలలో విరివిగా వాడుకలో కలదు. పిల్లవానిని పోఱడు, పోఱగాడు అని యందురు.
24. వంద
నూఱు యని యర్థము. ఈ పదము భారతములో కానరాదని నా నమ్మకం. ఇతర పూర్వ కవులలో, మధ్యకాలపు కవులలోను ఇది కానవచ్చినటుల నాకు తోచదు. మరి యిదెట్లేర్పడెను? ఈ పదము తెలంగాణాలో, రాయలసీమలో జనసామాన్యమందు వాడుకలో లేదు. ఉత్తర సర్కారు వారిని జూచి తక్కిన వారు వందయనుటయే బాగని ప్రయోగించుటకు నేర్చుకొనుచున్నారు. బహుశ బృంద (సమూహము) అను పదము యొక్క తద్భవముగా ఈ వంద అను పదమేర్పడెనేమో?
25. కరడా
ఇప్పుడు బళ్ళలో కాపీలు వ్రాయింతురు. అందుచేత కాపీ వ్రాయుట అని మనము వ్యవహరించుతున్నాము. కాని మనకు కాపీ శబ్దమునకు సరియగు పదము కలదు. అదే కరడా అను పదము. ఈ శబ్దము నిఘంటులలో లేదు. తెలంగాణాలో ఇది విరివిగా ప్రయోగింపబడుతున్నది. అక్షరాలు బాగా కుదురుటకై మంచి అక్షరాలను
ఒరవడిగా నుంచుకొని వ్రాయుటకు కరడాలు వ్రాయుట అని యందురు. 26. అరి కంఠము
తల చెవులు మూసుకొనునటుల వస్త్రమును చలినాపుటకు చుట్టుకొనుట కందురు. ఇది నిఘంటులలోలేదు.
27. మాంగో
మామిడి పండు అను నర్థము కల ఇంగ్లీషు పదము. ఇంగ్లండులో మామిడి చెట్లు పండ్లు లేవు. ఈ పదాన్ని మన దేశమునుండి తీసుకొనిపోయి యుందురు. మచిలీ బందరులో మొదట ఇంగ్లీషువారు మొఖాము వేసిననాడు తెనుగువారి నుండి మావికాయ మాగాయ అని దాని పేరు తెలుసుకొని దానినే ఆంగో అని మార్చుకొని యుందురు.
28. దుముదారు
rear guard అని యింగ్లీషులో దానికి సరియగు పదము. సేనకు వెనక భాగమందుండి శత్రువుల నుండి రక్షించుటకై నియుక్తులగు సేనానుల కీ పదమును విజయనగర చక్రవర్తుల కాలములో వాడినారు.
“సకుటుంబముగ వీగి చరమ శైలము చేరు
తుహినంవు దుముదారు దొరయనంగ”
మనుచరిత్ర. ఆ ౩ ప. 54
ఇచ్చట దుముదారు అన సేనానాయకుడని అర్థము వ్రాసినారు. సేనకు
వెనక దిక్కుననుండు రక్షక సేనాని యనుటయే స్వారస్యము. దుముదారు అనునది
దుందార్ అను ఉర్దూ పదము. దుం అనగా తోక దుందార్ అనగా తోక దిక్కుండువాడు
అని యర్థము.
29. తాయెతు
దీన్ని గూర్చి అప్పకవి ఒక వ్యుత్పిత్తిని చెప్పసాహసించెను. “ఎత్తులనగా దక్షిణ
దేశీయమున దండలకు పేరు. దాని జడ్డన తేలబలికిన ఎతులాయెను. తాయి అనగా
తల్లి. ఆ తాయి శిశువులకు శరీర రక్షగా కట్టునవి యెత్తులు కనుక తాయెతులు”
అని వ్రాసెను. అప్పకవి తనకు పూర్వము ముద్దరాజు రామన తాయెత్తును తాయతు అని వ్రాసి యుండెనని యాక్షేపించెను. మరియు తనకు పూర్వుడైన కవి తన చంద్రభాను
చరిత్రయందిట్లు వ్రాసెనని యుదాహరించెను.
“ఒక యింతి యొరగిన సికమీద ముడి పువ్వు
టెత్తులు దొరయు తాయెతులు చుట్టి”
చంద్రభాను చరిత్రమును వ్రాసిన తరిగొప్పుల మల్లన కవి క్రీ.శ. 1600
ప్రాంతము వాడని ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారు పీఠికలో వ్రాసినారు. తరిగొప్పుల
మల్లన ముద్దరాజు రామన కంటే పూర్వకవులెవ్వరును తాయెతు శబ్దమును ప్రయోగించి
నటుల కానరాదు. అనగా క్రీ.శ. 1500 తర్వాతనే యీ శబ్దము తెనుగులోనికి
ప్రవేశించిన దనవలెను. ప్రవేశించిన దగుటచేత ఇది విదేశీ శబ్దమై యుండవలెను.
అప్పకవి భ్రమించినట్లుగా ఇది దక్షిణ దేశీ పదము కాదు. ఎత్తు లేక ఎతు అను
పదాలకు దండ (హస్తముపై భాగము) అను నర్థమెందును కానరాదు. నిఘంటువులలో
గాని ప్రయోగాలలోగాని ఈ యర్థము కానరాదు.
ఇక ఈ పదమెక్కడిదనగా ఇది అరబీ పదమనవలెను. అరబీలో తావీజ్ అను పదము కలదు. అరబీ నిఘంటువులలో దానికర్థము చేతులకు కట్టుకొనే ఖురాను మంత్ర విషయిక రక్ష అని వ్రాసినారు. తెనుగుదేశముపై గోలకొండ సుల్తానుల పరిపాలనము క్రీ.శ. 1512 నుండి స్థిరపడెను. వారి పరిపాలనములో ఫకీరుల ద్వారా హిందువులు తావీజులను పొంది అవి తమకు సకల పీడానివారక రక్షలుగా నుండునని భ్రమించిరి. తావీజు శబ్దమే తెనుగు నోళ్ళలో నలిగి తుదకు తాయెతు రూపము దాల్చెను. దీని పుట్టుకను సరిగా గుర్తించక తానేమో సరిగా నుచ్చరించినట్లు తలచి మల్లనను ఆధారము చేసుకొని ముద్దరాజు రామన్నను తప్పుపట్టిన అప్పకవి శాసనమును ఎవ్వరును అవుగాదనిన వారు కారు.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse