Jump to content

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/వేదము వేంకటరాయశాస్తిగారు

వికీసోర్స్ నుండి

వేదము వేంకటరాయ శాస్తిగారు

వేదము వేంకటరాయ శాస్త్రిగారు దివంగతులైరను వార్త విని చాలా ఖేద మొందని యాంధ్రుఁడుండఁడు. శ్రీ శాస్త్రిగారి కీర్తి యక్షరాస్యులగు సకలాంధ్రు లందఱలో వ్యాపించినందునఁ గించిజ్ఞుడను గూడ కాని నేను వారిని గురించి వ్రాయుట హాస్యాస్పదమే ఐనను వారి పరిచయము నాకుఁ గొంత యుండి నందున వారి పాండిత్యమును నే నెల్లప్పుడు స్తుతించు స్వభావము కలవాఁడనైనందున వారి యందు నా కపారమగు భక్తి యుండినందున వారి విషయమై రెండు మాటలు వ్రాయ సాహసించినందులకు పాఠకులు మన్నింతురు గాక!

శాస్త్రులవారికి “పండితరాయ” యను బిరుదము చాల సార్థకమని నా మతము. ఏలన వీరిని బోలు వండితులు వింధ్యకు దక్షిణమున లేరనియే నేను విశ్వసించువాడఁను. వీరి వైదుష్యము వీరు వ్రాసిన సంస్కృతాంధ్ర గ్రంథముల వ్యాఖ్యానములే చాటుచున్నవి. శృంగార నైషధ గ్రంథ వ్యాఖ్యానమందుఁ బలు తావుల తమ గురువులగు సీతారామాచార్యులనే తప్పుబట్టి వారిచే రచితమగు “శబ్ద రత్నాకరము” లోని యర్థము లనేకములు దప్పు అని నిరూపించిరి. మఱియు నాముక్త మాల్యదలోని పద్యము లనేకములు పూర్వ వ్యాఖ్యాతలు సరిగా మనసునకు రాక తప్పని నిర్ణయించియుండ శాస్త్రులవారు తమ వ్యాఖ్యాన మందవి సరియని నిరూపించి, సవరించి చూపించిన పాండితీ మహిమ కడుంగడు శ్లాఘ్యాపాత్రము.

వీరు కేవల వ్యాఖ్యాన కర్తలే గాక విమర్శక శిఖామణులునునై యుండిరి. సుమారు 15 సంవత్సరముల క్రిందట గ్రామ్యవాదము బయలుదేరెను. ఆ వాదమునకు కొక్కొండ వెంకటరత్నము పండితులు వంటివారు సీస పద్యమునకు వెండి బంగారు పద్యములను విశ్వామిత్ర సృష్టి నొకదానిని కల్పించి సహాయపడిరి. ఆ సందర్భమున శాస్త్రులవారు గ్రామ్యాదేశ నిరసనమును నొక లఘు పుస్తకమును వ్రాసి తీవ్రముగా ఖండించిరి. మఱియు వేంకట రత్నము వంతులు సామాన్యులు కారు మహామహోపాధ్యాయ బిరుదాంకితులు. అప్పటికి మన శాస్త్రుల వారికేబిరుదమును లేదు. మహోపాధ్యాయులగు వెంకటరత్నము పంతులుగారు వ్రాసిన ఆంధ్రీకృత “ప్రసన్న రాఘవ నాటకము”పై శాస్త్రులవారొక విమర్శనము వ్రాసిరి. నాటకముకన్న రెండంతలు హెచ్చుగా విమర్శన యున్నది. ఆ గ్రంథమందు పంతులుగారి గ్రంథమును ఖండ ఖండములుగా చించి చెండాడి భీభత్సముగా విమర్శించి పంతుల వారికి తలవంపులగునట్లును, పాండిత్యము సంపాదించుకొనువారికి మార్గదర్శిగా నుండునట్లును నా విమర్శనమును ప్రకటించిరి. కాని యీ గ్రంథము పునర్ముద్రణము గాక బహుకాల మయ్యెను.

శాస్త్రుల వారుపన్యాసములలో మంచి ధోరణి కలవారు. వీరి యుపన్యాసమే యననేల, వీరి సంభాషణ మెల్లకాలములందును హాస్య రసపూరితమై యుండెడిది. వీరుపన్యసించునప్పుడు సభ్యులను దన హాస్య కథనముచే నవ్వింతురు. కాని తాము మాత్రము నవ్వుట లేదు. ఆంగ్ల పండితులు హాస్యమెన్నియో విధముల నుండునని నిరూపించుచు నీ విధమగు హాస్యము చాల ప్రశంసనీయమైనదని వ్రాసియున్నారు. స్విఫ్ట్‌ ఆడిసన్‌ మున్నగు పండితులిట్టి హాస్యమునే చిప్పిలఁ జేయుచుండెడివారట!

శాస్త్రులవారాధునికులగు కవుల ననేకుల మెచ్చకుండెడివాడు. వారు స్వభావముచే మొగమాటము లేనివారు. అనేకులు వారి దగ్గఱకు వచ్చి తమ నూతన కల్పనా విశేషములతోఁ గూడిన గ్రంథములకుఁ దొలి పలుకుల వ్రాయుమని ప్రార్థించెడివారట. కాని శాస్త్రులవారు వారి గ్రంథములను మెచ్చక వారి యెదుటనే తీవ్రముగా విమర్శింప వారు శాస్త్రులవారి పునర్దర్శనమునకుఁ బోవు వారు కారట. నిరంతరము రాత్రిం బవళ్ళును మృతించువఱకు కృషి చేసి విద్యార్థివలెఁ జదువుచు సంస్కృతాంధ్ర గ్రంథముల నించుమించు నన్నింటిని జదువుటయే కాక యనేకులకుఁ దొఱకని గ్రంథములను గూడ శోధించి సంస్కృతాంధ్ర భాషలందు నిరుపమాన పాండిత్యమును గడించిన శాస్త్రులవారి కితర పండితులు మెచ్చఁదగినవారు గాకుండుటలో నాశ్చర్యమేమి? శాస్త్రులవారి యీ యభిప్రాయము కేవల సంభాషణ యందేకాక వీరి గ్రంథములందు బ్రకటితమైయున్నది. శృంగార నైషధ వ్యాఖ్యానమును వ్రాసినప్పుడు దాని నిట్లు సెలవిచ్చి యున్నారు.


ఉ. వ్రాసితి మున్‌ ప్రతాప కథ
             పండిత మానుల గుండె నీరుగా
     వ్రాసితి వెన్క నయ్యుష వివాహము
             సిద్ధ సుధా ప్రవాహమున్‌
     వేసర కిప్డు నైషధము విప్పి నిధుల్‌
             నెఱ చూఱ లిచ్చితివ్‌
     జేసెద నింక తత్పరత సేవను చూడి కుడుత్త దేవికిన్‌.


వీరు వ్రాసిన ప్రతాపరుద్రీయ నాటకమందు మూడు స్థలములందు వీరు తమ గొప్పతనమును జాటుకొని యున్నారు. నాటక ప్రస్తావనలో నిట్లు వ్రాసికొనిరి.


ఉ. అంకెకు దార్చె నే రసికు
             నంగల భారతి ప్రౌఢనీతి నా
     కింకరి నాంధ్ర ద్రావిడియుఁ
             గేరుచు దైవియుఁ గూడి రెవ్వరిన్‌
      జంకు కళంకు లేని కవి చంద్రుడు
             తోషిత కోధరేంద్రుఁడా
      వేంకటరాయశాస్త్రి కృతి వెంగలి
             మూక కెఱుఁగ శక్యమే


శాస్త్రులవారి రచనలన్నింటిలోఁ గవిత్వమందేమి, హాస్యోచిత సంభాషణ ముననేమి, కథాచమత్కారమందేమి, ప్రతాపరుద్రీయ నాటకము శ్రేష్ఠమని నాకు దోచినది. వీరి రచనములందేకాక యాంధ్ర నాటకములందిది యద్వితీయ మన వచ్చును. ఈ కథయందంతటను నాంధ్రదేశముపై శాస్త్రులవారికెట్టి గాఢాభిమాన మున్నదో వెల్లడియగుచున్నది. పేరిగాడు ప్రతాపరుద్రుడై కవిగోష్ఠిలో నుండి కవిత్వమును గుఱించి కొంత ముచ్చటించును. కవి పేరిగాని నాశీర్వదించునప్పుడు త్ప్రేక్షాతిశయోక్తులతో లావులావుమాటలతో సంబోధింపవాని కవి రుచింపక యిట్లనును. యిదేం కయిత్తం యిది సీత్‌ కయిత్తమంటె యీలాగా! ప్రతి మనిషికీ తెలియాలి. సాకలోడికి మంగలోడికి తెలియాలి అని యనగా కవి. “సరి! యిక ధౌర్త్యము చేసెదను” అని యిట్లు పేరిగాని దీవించును.


క. సలవ మడతలకి మలనే
    యెలి బూడిద సౌడుసున్న మెల్లల మలేనీ
    కలునీలమలె, మడేల,
    యెలిగేనీయ సమునేల కెలికోకౌరా.


పేరిగాడు: “తెఱచిన నోరు మూయక తలయూచి యూచి


విని - నవ్వా నవ్వా భలే భలే బాపనయ్యా.
అచ్చరనచ్చలు.. కయీస్సిరుడా యిలాం
టి కయిత్తం యింకెవరైనా శెప్పగల్తురా”


“కయీస్సర్లూ శెప్పవయ్యా యిలాంటి కయిత్తం శెప్పేవోళ్ళు యింక మీదయినా వుంటారా, వుండరా?” అని ప్రశ్నింప భావగర్భితమైన యీ క్రింది ప్రశ్నోత్తరముల గమనింపుడు.


కవి : ఇట్టి కవులింక పుట్టఁగలరు.

పేరి : “యప్పుడు! యక్కడ? నాకిట్టాంటి కవులే గావాల యివరంగా శెప్పు”

కవి : ఇంక ఆఱు సూరేండ్లకు వేరు దొరతనములో కొన్ని తావుల మీబోటి
       రసజ్ఞులే బహుళమగుదురు. వారికై మీబోటి రసికులే కవనములు
       సేయుదురు. మీవలనే వారుభయులు చదువుకున్న వారికన్న తామే
       మేలనిఁ తలచువారే.

పేరి : అయ్యా-కయిస్సరయ్యా-మేము సదువుకున్నోళ్ళ కంటె మెచ్చని మా
       కులం గుట్టు నీకేలాగ తెల్సిందయ్యా?

కవి : వరప్రసాదము మఱి ప్రకృతము. ఆ కవులు మీకుఁదగిన కవనము
       చేయుదురు. అది అతి నీరసముగా నుండును. అందులకా రసజ్ఞులు,
       ఇందులకు మీరెట్లో అట్లే, ఆనంద సాగరములో మునిగి ఊపిరి తిరగక
       ఉక్కిరి బిక్కిరియై డొంక తప్పిడింక కొట్టుదురు.


ఈ సంభాషణములోని విశేషమేమన నీ ప్రతాపుని కథ 610 సంవత్సరముల క్రిందట జరిగినది. కావున ఇంక యాఱు నూరేండ్ల కనుటలో నేటి కాలము సూచింపబడినది. మఱియు వేరు దొరతనములో ననగా నిప్పటి యాంగ్లేయ దొరతనములోనని అర్థము. మీబోటి రసజ్ఞులే యన చాకలి పేరిగాని వంటి వారట! కవిత్వము చేయువారును చాకలి వానివంటి వారేయట. మరి యీ కవిత్వము అతి నీరసమట. యిట్టి దానికే నేటి రసజ్ఞులు యానందమందు మునిగి డొంక తప్పి డింక కొట్టుదురట. నేటి కాలపు గ్రామ్యవాదులను గొంచెము చదివి మరింత వ్రాయు వారిని మనసులో నుంచుకొని పై అభిప్రాయమును శాస్త్రులవారు పేరిగాని నోటను చెకుముకి నోటను బలికించుచున్నారు.

ఈ ప్రతాపరుద్రీయ నాటకమందు యుగంధరుఁడు వెఱ్ఱివానివలె ఢిల్లీ వీధులందు దిరిగి తన పిచ్చిని బ్రదర్శించునపుడా కుహనోన్మత్త మహామహునిచేనిట్లు పలికించుచున్నారు మన శాస్త్రులవారు. - వెఱ్ఱి - నా ప్రతిభముందర ఇతరుల నీతి ప్రయోగ మేపాటిదో వర్ణించెద - లోగుట్టెఱుంగని వారు కవులను దూషించితినని తలంతురుగాక - ప్రకాశముగా - పూర్వ జన్మములో నేను కవీశ్వరుణ్ణి. అప్పుడు నా కవిత్వాన్ని నేనే వర్ణించినాడ - పాడండి-


“మొద్దు మొద్దూల కవుల
బొద్దు బుఱ్ఱల మీద
గుద్దునా ముద్దు పాట”
“జబ్బు జబ్బూ కవుల
గబ్బు పాటల మీద
దెబ్బన లిబ్బి పాట”
“పుచ్చు పుచ్చూ కవుల
చచ్చు పాటల మీద
చిచ్చు నా మెచ్చుపాట”


ఈ ప్రకారముగా నింకను చాలమట్టుకు ఆ వెఱ్ఱివానిచేఁ బాడించినాడు. ఇందుఁగూడ శ్రీ శాస్త్రులవారు తమ ప్రతిభను నితర కవులకన్న మిన్నగా లెక్కించినట్లు ధ్వని వచ్చుచున్నది.


శాస్త్రులవారు రచించిన అమర శతక వ్యాఖ్యయు భర్తృహరి శతకవ్యాఖ్యయుఁ జూచినందున వారుదాహరించిన గ్రంథాలెన్నియో యనేకులెన్నడును విననట్టివి కలవు. శృంగారమును నిరూపించుతావుల ననేక కామశాస్త్రముల నుదాహరించియున్నారు. నీతుల నుదాహరించుచో యనేక నీతి గ్రంథముల సూచించియున్నారు. అటులే “శృంగార నైషధము”ను, ఆముక్తమాల్యదను వివరించునప్పుడనేక ప్రమాణ గ్రంథముల నుదాహరించియున్నారు.

శ్రీ శాస్త్రుల వారికి ప్రతాపరుద్రీయముపై యభిమానము మెండు. వారు కర్నూలులో నొక వారము దినములుండిరి. అప్పుడు నన్ను జూచినపుడెల్లను నిట్లను వారు. “నిన్ను జూచినపుడెల్లను నా ప్రతాపరుద్రుడు జ్ఞాపకము వచ్చును” అని. శాస్త్రుల వారితో నొక తూరి వారు వ్రాసిన ప్రతాపరుద్రీయ విషయమై ముచ్చటించుచు యందలి ముసల్మాన్‌ పాత్రములను మాట్లాడించుచో వారి “తురక”, “తెనుఁగు”ను గుఱించి విచారించితిని. శాస్త్రులవారికేమైన ఉర్దూ కూడఁ తెలియునేమోయని తలంచియుంటిని. దానికి వారు తమ కుర్దూ యేమియుఁ దెలియదనియు, నది కేవలమూహాజనితమే యనియు సెలవిచ్చిరి. బోయవారు పాడిన పాటలు తమ దేశమందేమైన బ్రచారమందున్నవాయని యడిగితిని. తమ దేశమందు బోయలు తెడ్డులేయునపుడు చాల బూతుపాటలు పాడుదురనియుఁ వానిని సంస్కరించి మంచి పాటలు పాడుటకుఁ జాల వీలు కలదని చూపుటకై యిట్లు వ్రాసితినని చెప్పిరి.

శాస్త్రులవారు వ్రాసిన వ్యాఖ్యానములన్నింటిలో వారికి 'ఆముక్తమాల్యద'పై యభిమానము మెండు. ఆముక్తమాల్యద'ను శ్రీకృష్ణదేవరాయలు వ్రాయలేదనియు నది పెద్దన్నయే వ్రాసెనని జెప్పు జనవాక్యముపై వారి యభిప్రాయమేమని శాస్త్రులవారి నడుగ వారిట్లనిరి. “రాజులు తాము వ్రాసిన కృతులను దమ యాస్థాన కవులను సరిఁజూడ నియోగించుట వింత కాదు. కావున శ్రీకృష్ణ దేవరాయలు చేసినారు. పెద్దన్న దానిని చూసినారు” అని రెండే మాటలలో జవాబు చెప్పిరి. “ఆముక్త మాల్యద” వ్యాఖ్యను ముద్రించుటకై సహాయము కావలెనని శాస్త్రులవారు గద్వాల రాజుల నాశ్రయించదలచి కర్నూలొక పర్యాయము వచ్చియుండిరి. కర్నూలులో నొక సభ చేసి యందు, నాముక్తమాల్యదను గుఱించి యుపన్యసించి యుండిరి. అచ్చట చందా కూడఁ గొంతప్రోగయ్యెను. పిమ్మట వారు గద్వాల కేగిరి. అచ్చట కీ.శే. గద్వాల ప్రభువులుంగారు వారిని నలుబది దినములుండనిచ్చి నాలుగు వందల రూప్యములిచ్చి పంపిరి. శాస్త్రులవారు కర్నూలునకుఁ దిరుగా వచ్చి గద్వాల విశేషములును దమ సహజ హాస్యంపు ధోరణిలోఁ జెప్పుచుండిరి. ఆ యంశ మిప్పు డప్రస్తుతమని సూచించితిని గాని వివరింపలేదు. శాస్త్రుల వారు గద్వాల కేగిన తర్వాత వారి హితులలో నొకరు కీ. శే. వనపర్తి ప్రభులగు రాజాకృష్ణదేవరావు గారితో 'నాముక్త మాల్యద' వ్యాఖ్యానమును బ్రశంసించి కృష్ణదేవరాయలు ప్రపంచమందు వెలయించ వలెను” అని చెప్పువారు చమత్కారమునకు సంతసించి దాని ముద్రణమున కగు వ్యయమును 4000 రూపాయల నిచ్చునట్లొప్పుకొనిరి కాని శాస్త్రులవారు కర్నూలుకు 4000 రూపాయలతో వచ్చువఱకు శ్రీకృష్ణదేవరాయలు దివంగతులైరి. ఇది నా యెఱిగిన యంశముగానే వ్రాసితిని. శాస్త్రులవారు పూదూరు ద్రావిడులు. వారి యింటిలో వారి తల్లితో వారు అరవములో మాట్లాడుటను నేను వినినాడను. ఇట్లు ద్రావిడులైనను వీరాంధ్ర భాషకుఁ జేసిన సేవ యద్వితీయము. వీరి వలన నింకను ననేక కార్యములు కావలసియుండెను. ఒక మారు నేను మద్రాసులో కళాశాల విద్యార్థిగా నుండినప్పుడు శ్రీ శాస్త్రుల వారిని దర్శించుకొని యుంటిని. అప్పుడు సంభాషణములో శాస్త్రుల వారు తమకేమియు నవకాశములేదనియు దాము ఆంధ్ర వ్యాకరణము నొకదానిని సమగ్రముగా వ్రాయఁబూనినాననియు సెలవిచ్చియుండిరి. కాని మన దౌర్భాగ్య ఫలితముగా వీరిచే నా పని కాకపోయెను. ఇంకోమారు వారిని గలిసి యుండినప్పుడు వారు సూర్యరాయాంధ్ర నిఘంటువునకై పడిన శ్రమను వర్ణించి తుదకది కొందఱి యసహనమున వ్యర్థమగుటయుఁ దానా పనిని వదలుకొనవలసి వచ్చుటయుఁ జెప్పి చింతించిరి. నిశ్చయముగా వారిచే నా నిఘంటువు కాదగినట్టిది. ఆంగ్ల వాఙ్మయము నకు జాన్‌సన్‌ ఎట్టివాడో మన యాంధ్రమునకు వీరట్టి వారనుటలో నేమియు సందేహము లేదు. డిక్షనరీ జాన్‌సన్‌ అని యతఁడెట్లు పేరొందెనో యటులే వీరిని గూడ నిఘంటు శాస్త్రిగారినిగా భావి పండిత సంతతి ప్రశంసించి యుండును.

మన వాఙ్మయమందుఁ బ్రాచీన మహాకవుల జీవితములన్నియుఁ దెనాలి రామకృష్ణుని కథల వంటివై పోయినవి. ఆధునికుల చరిత్రములు గూడ వ్రాయబడలేదు. మన శాస్త్రులవారి జీవిత చరిత్రములు గూడఁ బ్రకటించుట చాలామంచిది. ఆధునికులలో గణనకెక్కిన సర్వ పండితుల చేతను సంపూజ్యుడై సర్వతంత్ర మహా మహోపాధ్యాయ, పండితరాయ, ఇత్యాది బిరుదములనేకము సంపాదించి కవులకును, సగము పండితులకు, భయంకరుడై నిర్దుష్టమైన కవిత్వమును వ్రాసి పండిత సభలందెల్లెడలను నగ్రపూజ నొందిన శ్రీవేదము వేంకటరాయశాస్తిగారి కీర్తి యాచంద్ర తార్కమై వెలయుగాత. వారియాత్మకు శాంతి కలుగుగాక! ఆంధ్ర లోకము వారి ప్రతిభకు దగినట్టుగా వారిని గౌరవింతురు గాక!

◇ ◇ ◇ ◇ ◇


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse