Jump to content

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/వర్ణాంతర వివాహాలు

వికీసోర్స్ నుండి

వర్ణాంతర వివాహాలు

వర్ణాంతర వివాహాలు పూర్వం చాలా లేకుండెను. ఇప్పుడు గూడా అవసరం లేదని శ్రీ నందిగామ దత్తాత్రేయ రావుగారు గోలకొండ పత్రికలో వ్రాసినారు. చాలా లేకుండెను అనుటచేత కొద్దిగా పూర్వంలోనూ ఉండెననిన్నీ ఇప్పుడున్న “చాలా” వరకు పోక కొద్దిగా చేయవచ్చుననిన్నీ వారి వాదాన్ని అర్థము చేసుకొనవలెనో యేమో? అయినా వారు చూపించిన కారణాలు తృప్తికరముగా లేవు.

“వజ్ర సూచికోపనిషత్తు" అను చిన్న ఉపనిషత్తు వావిళ్ళవారు తెనుగర్థముతో ముద్రించినారు - దాని వెల 2 అణాలు మాత్రమే. దాని నింతవరకు చదువనివారు తప్పకుండా చదువవలెనని కోరుతున్నాను. అందీ చర్చకు బ్రాహ్మణత్వానికేది ప్రధానం?


“కోవా బ్రాహ్మణోనామ
కిం జీవః కిందేహః? కింజాతిః?
కిం జ్ఞానం? కింకర్మ? కిం ధార్మిక?”


అని ప్రశ్న వేసుకొని ఇవన్నియు ప్రధానం కావు అని చెప్పుచు ఇట్లు సెలవిచ్చినారు.


“తర్హి జాతిర్ర్భాహ్మణ ఇతిచేత్‌, తన్న;
తత్ర జాత్యంతరేష్వనేక జాతి సంభవాత్‌
మహర్షయో బహవస్సంతి, ఋష్య
శృంగోమృగ్యాః, కౌశికః కుశాత్‌,
జాబూకో జంబుకాత్‌, వాల్మీకో వల్మీకాత్‌
వ్యాసః కైవర్తక న్యాయాం, శశ


పృష్ఠాత్‌ గౌతమః వసిష్ఠ ఊర్వశ్యా, ఆగ
స్త్యః కలశేజాత ఇతిశ్రుతత్వాత్‌, ఏతే
షాం జాత్యా వినాస్యశ్రీ జ్ఞాన ప్రతిపాదితా
ఋషయో బహువస్సంతి తస్మాన్న
జాతిర్ర్భాహ్మణ ఇతి.


వర్ణము బ్రాహ్మణుడనిన యెడల అదికాదు. ఒక వర్ణములోనే అనేక వర్ణాలు కలిగెను. ఋష్యుశృంగుడు లేడికి, కౌశికుడు దర్భకు, జాంబూకుడు నక్కకు, వాల్మీకుడు పుట్టకు, వ్యాసుడు బెస్తకన్యకకు, గౌతముడు కుందేటికి, వసిష్ఠుడు ఊర్వశియను బోగము దానికి, అగస్త్యుడు కుండకు పుట్టిరి.


పై ప్రమాణాన్ని బట్టి మహర్షులు జంతువులకు, కుండలకు, గడ్డికి, పుట్టలకు కన్యలకు, వేశ్యలకు, బెస్తలకు పుట్టినట్లు స్పష్టమగుచున్నది. ఈ వజ్ర సూచికోపనిషత్తును మొదట ముద్రించిన పళ్ళె చెంచల రావుగారు ఈ యుపనిష దంతమందు తమ పక్షాన ఈ విధముగా వ్రాసినారు.


పై జెప్పబడిన వచనముల కనుగుణముగా బ్రాహ్మణేతరులు సైతము బ్రాహ్మణులైనట్లు భాగవతములో నీ క్రింది ప్రమాణములు కలవు.

10-12 శ్లోకాలు 5 స స్కంధం 4 అధ్యాయం
17,21,22 శ్లోకాలు 9 స, స్కంధం 2 అధ్యాయం
11 శ్లోకాలు 9 స స్కంధం 17 అధ్యాయం
1 శ్లోకాలు 9 స స్కంధం 20 అధ్యాయం
21,32,33 శ్లోకాలు 9 స స్కంధం 21 అధ్యాయం

ఈ ప్రమాణాలను బట్టి శూద్రులు బ్రాహ్మణులైనట్లు తెలియవచ్చును.


అట్లయితే శూద్రులెప్పుడు బ్రాహ్మణులైనారో, అట్లు బ్రాహ్మణులైనవారు బ్రాహ్మణ స్త్రీలను వివాహమాడి బ్రాహ్మణ వంశములకు కర్తలెప్పుడైనారో ఆ యాచారాన్నే వర్ణాంతర వివాహమంటారా లేదా? పాండు ధృతరాష్ట్రులు నియోగముచే పుట్టినారని నియోగము వివాహము కాదనియు రావుగారు సెలవిచ్చినారు. వివాహము కాదు నిజమే కావున అది వ్యభిచారమే యగును. వ్యభిచారము వలన పుట్టిన వారికి గౌరవ మర్యాదలు కలుగునా? అట్టివారి సంతానము పొందినది పెండ్లి కాకముందే ఒకణ్ని కన్నది. దీనికి సమాధానమేమంటే వ్యభిచారము చేసినవారు దేవతలట! ఈ కాలములో కూడా వ్యభిచారం చేసే వారంతా దేవతలని మనము సమాధాన పడవచ్చునా? హిడింబి రాక్షసియే కాని వాస్తవముగా క్షత్రియ జాతి స్త్రీయే! అని రావుగారనుచున్నారు. రావణుడు రాక్షసుడే కాని నిజంగా ఆయన బ్రాహ్మణుడే. అందుచేత లంకలోని రాక్షసులంతా బ్రాహ్మలే. రాముడు బ్రాహ్మల జంపెను అని తర్కించితే యెట్లుంటుంది - వేద కాలములో నూటికి 99 పాళ్ళు సవర్ణ వివాహము లేనట - మిగతా ఒకపాలు ఏమైంది.

చారిత్రక నిదర్శనములోనికి రావుగారు పోనియ్యరు. ఎందుకంటే చరిత్రలు విదేశీయులచే వ్రాయబడినవట. “కావున నమ్మదగినవి కావు” అట. “ఒకవేళ నమ్మినను పౌరాణిక వర్గము వారికి సనాతనులకంతగా ప్రమాణములు కావు” అని రావుగారు కొట్టి పారవేసినారు. పురాణాలు నమ్మదగినవి కావు. అవి ప్రమాణాలు కావు అని ప్రాచీన భారతీయ తార్కికులన్నారు. ఆచార్యత్రయము వారు తమ తమ భాష్యాలలో పురాణాలకు కనిష్ఠ స్థానమిచ్చినారు. పురాణాలు పరస్పర విరుద్ధమైనవి. ఒకే పురాణములో వివిధ స్థలములలో ఒక విషయమును గురించి పరస్పర విరుద్ధాంశము లను వర్ణించినారు. పురాణాలు ఎల్లప్పటికినీ పెరుగుతూ వచ్చినవి. 8000 శ్లోకాల భారతము 1 లక్ష శ్లోకాల గ్రంథముగా పెరిగెను. రావుగారు ఉదాహరించిన స్కాంద పురాణము ఇప్పటికిని పెరుగుచూ ఉండే గ్రంథము. అట్టి పురాణాలను వారు నమ్ముతారట. చరిత్రను వారు నమ్మరట. విదేశీయులు వ్రాసిన చరిత్రలు అబద్ధమైతే స్వదేశీయులు వ్రాసిన చరిత్రలనైనా రావుగారొప్పుకొందురా? స్వదేశీయులు విదేశీయు లను అనుకరించినారు కావున వారిని కూడా ఒప్పుకోము అంటారా? రావుగారు శాసనాలనైనా ఒప్పుకుంటారా? అవికూడా అబద్ధం అంటారా? సర్వం కల్లా సాగరం కల్లా అంటే ఇక దత్తాత్రేయరావుగారికే దిగ్విజయ పత్రమిచ్చి ఆడియేన్‌ దాసు అని సెలవు పుచ్చుకుంటాము.

వేద కాలంలో కులాలు లేకుండెను. అట్లంటే వాదవివాద మేర్పడుతుందని నాకు తెలిసిన యంశమే. పురుష సూక్తం కులాల సూక్తం కాదా అని ప్రతి పక్షులన గలరు. ఆ సూక్తం ఋగ్వేదాంత్య భాగమందేయున్నది. అదియు ఋగ్వేదమును విభాగించి సంహితగా దిద్ది తీర్చిన వెనుక చాలాకాలం తర్వాత చేర్చబడినదని పాశ్చాత్య పరిశోధకులంతా ఏక వాక్యంగా నిర్ణయించినారు. పాశ్చాత్యులు మాకు ప్రమాణభూతులు కారను వాదమును శ్రీ దత్తాత్రేయరావుగారు ఇదివరకే లేవదీసినారు - అగుగాక - వేద కాలములో పుట్టుకచేత కుల నిర్ణయమైనట్లు కానరాదు - ఆ మాటనే భగవద్గీతలోను “గుణ కర్మ విభాగశః" అని చెప్పినారు. దానికి కూడా అపార్థం చేసిన సనాతనులున్నారు. పోనిండు, ఇక మూల చర్చ నందుకొనుచున్నాను.


కౌరు రహం, తతో భిషగు, పల ప్రక్షిణీననా,
నానాధియో వసూ యవో నుగా,
ఇవతస్థి మేంద్రాయోం దోపరిస్రవ
                                           - ఋగ్వేదం - 9-112 -3


అంటే - నేను సూక్తాలు రచించేవాణ్ణి, నా తండ్రి వైద్యంచేసి బ్రదుకుతాడు, నా తల్లి విసురుతూ జీవించుతుంది. వివిధ వృత్తులలో మేము బ్రతుకుతాము - ఆవులు గడ్డికై నానా క్షేత్రాలలో సంచరించునట్లుగా జీవించుతాము. కావున ఓ సోమా! మాకు సంపద ఇచ్చుటకై నిన్ను ప్రార్థించుతాము. ఇంద్రా నీవున్నూ సహాయపడుము.


ఇందు వివిధ వృత్తులవారు ఒకే యింట భేదము లేకుండా జీవించినట్లు కనబడుతుంది. ఈ వృత్తులనే తర్వాతి సూత్రకాలంలో కులాలని నిర్ణయించినారు. క్షత్రియుడు బ్రాహ్మణుని యజ్ఞములో పాల్గొని భుజించిన అతని రెండవ లేక మూడవ సంతతి బ్రాహ్మణులలో చేరుతుంది (ఐతరేయ బ్రాహ్మణం 7, 29)


ఇదే ఐ. బ్రాహ్మణంలో 2,19లో ఒక చిన్న ముచ్చట యిట్లున్నది. ఐలూషునికి కవషుడు అనే కొడుకుండెను. అతడు బ్రాహ్మణుల యజ్ఞానికిపోతే “ఒరేయ్‌ నీవు దాసీ పుత్రుడవు, జూదగాడవు, మాతో కూర్చునే దానికి నీకు అధికారం లేదు” అని వెళ్ళగొట్టినారు. కాని కవషుడికి దేవతలంతా పరిచయమై ఉండటంచేత వారు అతన్ని ఋషిగాచేసి వేసిరి.


ఛాందోగ్యోపనిషత్తు 6,4 లో ఒక రమ్యమైన కథ యిట్లున్నది -


జబాల అను స్త్రీ యొక్క కుమారుడు గురుకులములో చదువుకొనుటకై బయలుదేరుచు “అమ్మా! గురువులవారు నీ తండ్రి యెవరు, నీ గోత్రమేమి” అని అడిగితే యేమి చెప్పుదును అని తల్లిని అడుగగా తల్లి యిట్లన్నది; “నాయనా, నేను చిన్నతనంలో చాలామంది యిండ్లలో దాసీపని చేసినాను. అట్టి సమయంలో ఎందరో నన్ను పొందినారు. వారిలో నీవెవరికి పుట్టినావో యేమో. కావున నీ పేరు సత్యకామ జబాల అనిమాత్రం చెప్పి, ఉన్నంత సంగతి గురువులతో తెలుపుకొనుము.” సత్యకాముడు గురువుతో అట్లే చెప్పుకొన్నాడు - గురువిట్లన్నాడు. “నీవు సత్యమే చెప్పినావు. నీవు బ్రాహ్మణ బీజానికే పుట్టినావు. కావున నీవు బ్రాహ్మణుడవే” అని నిర్ణయించి చదువు చెప్పినాడు. ఈ కథ యింకా చాలావరకున్నది. అదంతా యిప్పుడవసరం లేదు. దీనివల్ల తెలిపేదేమనగా వ్యభిచార సంజాతుడుగూడా ఏ దాసీపుత్రుడో ఏ సేవకులవాడో కాకుండా బ్రాహ్మణుడే అయినాడు.


ఉత యత్పతియో దశ
స్త్రీయాః పూర్వే అబ్రాహ్మణాః
బ్రహ్మచేద్దస్తమగ్రహిత్‌
బ్రహ్మ చేద్ధస్తమగ్రహిత్‌
స ఏవపతి రేకధా
                                   - అథర్వవేదం, 4, 17,8


అనగా;


ఒక స్త్రీకి పదిమంది అబ్రాహ్మణులైన భర్తలు ఏర్పడిపోయినప్పటికిన్ని తుదిలో ఆమెను ఒక బ్రాహ్మణుడు పెండ్లి చేసుకొన్నట్లయితే అతడే ఆమె భర్త.

దీనివలన స్త్రీకి 11 మంది భర్తలను చేసుకొను అధికారం ఉన్నదన్నమాట. 11వ భర్త బ్రాహ్మణుడైతే ఆమె బ్రాహ్మణి అయిపోతుంది కదా!


ఇక మనువుగా రేమంటారో చూడండి

యాదృగ్గుణేన భర్తా స్త్రీ
సంయుజ్యేత యథావిధి
తాదృగ్గుణా సాభవతి
సముద్రేణేవ నిమ్నగా


నదిలోని నీరు ఎట్టిదైనను సముద్రములో పడిన తర్వాత దానిలో కలిసి పోయినట్లు స్త్రీలు తాము వివాహమాడిన వారిలో కలిసిపోతున్నారు (ఎట్లనగా)


అక్షమాలా వసిష్ఠేన సంయుక్తాధమ యోనిజా
సారంగీ మందపాలేన జగమాభ్యర్హణీయతామ్‌

వసిష్ఠునిచే వివాహము చేసికొనబడిన అధమయోనిలో పుట్టిన అక్షమూలము,

మందపాలుడను వానికి వివాహితయైన సారంగి యను (అధమ యోనిజయగు) స్త్రీయు భర్తల మూలాన పూజ్యూలైరి.

అక్షమాల (లేక అరుంధతి) శూద్ర స్త్రీ కాదు. అధమజాతి వనిత (చండాల స్త్రీ.) ఆమె బ్రాహ్మణింటిపిల్లయే. కాని ఎవ్వరో చండాలుడు పెంచినాడు అని వాదించకుండా అచ్చట ఆమె అధమయోనిజగా స్పష్టీకరింపబడినది. మందపాల ఋషి సారంగి అను దాన్ని పెండ్లాడిన కథ యేపురాణమందున్నదో యేమో నాకు తెలియదు. వీరిద్దరే కాదు. ఇంకా ఇట్టి వర్ణాంతర వివాహాలను చేసుకొన్నవారు చాలామంది యుండిరి.


ఏతాశ్చానాశ్చలోకేస్మిన్‌
అపకృష్ట ప్రసూతయః
ఉత్కర్షం యోషితః ప్రాప్తాః
స్వైస్వైర్భర్తృగుణై శ్శుభైః


ఇంకా చాలామంది నికృష్ట జాతి స్త్రీలు గొప్పవారిని పెండ్లాడి తమ భర్తల శుభగుణాల మూలాన తామును ఉత్కర్షను పొందినారు (మనుస్మృతి అధ్యాయం 22,23, 24 శ్లోకాలు)


పూర్వకాలంలో భారతదేశమందు కొందరు రాజులు చాలా దుర్మార్గులుగా నుండిరి. వారి కాలములో వర్ణాంతర వివాహములు, స్త్రీలకు స్వేచ్చా భోగము వివాహ నియమ రహితత్వము (రష్యాలో Nationalisation of women ఉన్నదని కొందరు వ్రాసినట్లుగా) ఉండెను. వేనుడు చాలా చెడ్డరాజు. అతని కాలములో ఒకని భార్యను మరియొక్కడు స్వేచ్చగా పొందుచుండెను. అది తప్పు కాదని ఆ రాజు శాసించి యుండెను.


అయం ద్విజైర్హి విద్యద్భిః
పశుధర్మో విగర్హితః

అది పశుధర్మమని పెద్దలు గర్హించిరి. కాని

మనుష్యాణామపి ప్రోక్తో
వేనే రాజ్యం ప్రశాసతి (మను. 966)

ఈ పశుధర్మాన్ని మనుష్యులు కూడా పాలించండి అని వేనమహారాజులుంగారు

బారాఖూన్‌ మాఫీగా సెలవు పెట్టిరి.

గౌతమ ధర్మసూత్రాలు (అవి సూత్రాలు అగుటచేత) చాలా ప్రాచీనములని పరిశోధకులు నిర్ణయించినారు. అందు ఎత్తుకుంటూనే మూడవ సూత్రము ఇట్లన్నది.


దృష్టోధర్మ వ్యతిక్రమః
సాహసంచ మహతాం.


పెద్దలు ధర్మ విరుద్ధంగా ఆచరించినారు. అది సాహసమే అన్నారు. దానికి వ్యాఖ్య వ్రాసిన హరదత్తాచార్యులిట్లు వ్రాసినారు.


కతక భరద్వాజౌ వ్యత్యస్య
భార్యే జగ్మతుః వసిష్ఠ
శ్చండాలీం అక్షమాలాం


కతకుడు, భరద్వాజుడు ఒకనాడు ఇట్లు ముచ్చటించుకొన్నారట. “ఏమోయ్‌, నీ భార్యపై నాకు మోజు, నా భార్య నిన్ను చూస్తే నీమీద విరుచుకొని పడుతుంది. ఎదుకీ దొంగబ్రదుకు సుఖంగా పెండ్లాలను మార్చుకొందామా? సరే అంటే సరే అనుకొన్నారు. భార్యలను వెంటనే అదిలీ బదిలీ చేసుకొన్నారు. ఇది యీ చర్చకు అప్రస్తుతము లెండి - మరి ప్రస్తుతమేమంటే శ్రీరావుగారు వసిష్ఠుని భార్య చండాల స్త్రీ కాదన్నారు. ఇచ్చట 'చండాలీం అక్షమాలాం' అని మనుస్మృతి ప్రమాణాన్ని విప్పి స్పష్టం చేసినారు. స్మృతి ప్రమాణాలు రావుగారికి గ్రాహ్యములా? స్మృతులను గూడా పాశ్చాత్యులే వ్రాసినారా? లేక స్మృతులలో ఇట్టివన్నీ ప్రక్షిప్తమంటారా? వారికంటే ముందుగా నేనే ఈ తీర్మానాన్ని లేవదీస్తాను. ఆమాట అంటారేమో మొదలు వినుకొన్న తర్వాత దానికి సమాధానమిచ్చుకోవలసి యుంటుంది.


వర్ణాంతర వివాహాలు ప్రకృతి ధర్మంలో గాఢంగా చేరినట్టివి. ప్రేమకు వేదాలు, శాస్త్రాలు, పురాణాలు గిరాణాలు అడ్డము రానేరవు. అందుచేత అనంతకాలములో ఈ విపులమైన పృథివిలో ఎందరేమి శాసించినను వాటిని లెక్కపెట్టకుండా నూర్లుకాదు వేలుకాదు లక్షలుకాదు కోట్లకొలది జనులు వర్ణాంతర వివాహాలు చేసుకొనుచు వచ్చిరి. చేసుకొనుచుందురు. ఎవరేమన్నా చేసికొని తీరుదురు. ఈ అవస్థను చూచియే శాస్త్రకారులు ఒక సిద్ధాంతాన్ని లేవదీసిరి. అది అనులోమ ప్రతిలోమ వివాహపద్ధతి. నెత్తి నున్నగా గొరిగిన తర్వాత జుట్టునుండి నొసటి వరకు ఎదురుగా చేయి నిమిరిన కరుకుగా తగులును. అది ప్రతిలోమ పద్ధతి. అంటే పై జాతి పురుషులు క్రిందిజాతి స్త్రీలను పెండ్లాడితే అంతగా తప్పులేదట.

కాని క్రిందిజాతి పురుషులు పైజాతి స్త్రీలను వివాహమాడితే అది తప్పట. అందులోను శూద్రపురుషుడు బ్రాహ్మణ స్త్రీని వివాహమాడితే ఇంకేముంది కొంపమునిగింది. వారికి పుట్టినవాడే చండాల సోదరుడు. మన అస్పృశ్యుల తల్లులంతా బ్రాహ్మణస్త్రీలు!! శాస్త్రకారుల పక్షపాతం చూడండి. పై జాతులు ఇతర జాతుల స్త్రీలపై చేయి వేయవచ్చునట, తమ జాతి స్త్రీలను మాత్రం ముట్టితే ఘోరమగు పాపమట! దీనికి, అమెరికాలోని తెల్లవారు నీగ్రోలను “లించింగ్‌” చేసిన దానికి ఏమి భేదము?


గౌతముడు అనులోమాన్ని గురించి యిట్లన్నాడు

వర్ణాంతరగమన ముత్కర్షా
పకర్షాభ్యాం, సప్తమే
పంచమే వేత్యాచారః
                    ..................... 1, 4, 19


అనులోమ వివాహిత స్త్రీ సంతానం అట్లే ఏడు లేక అయిదు తరాలు జరిగిన తర్వాత పతి కులంలో ఆ సంతానం చేరిపోతుంది.


సృష్ట్యంతర జాతానాంచ 1, 4, 19


మను గౌతమాది ధర్మ శాస్త్రాలలో క్షేత్రము ప్రధానమా బీజం ప్రధానమా అని చర్చచేసి ఒకని భార్యయందు పరుడు వీర్యముంచిన ఆ సంతానం క్షేత్రపతికే చెందునని నిర్ణయించినారు.


భారతములోని ఉద్దాలక శ్వేతకేతూపాఖ్యానం చాలామందికి తెలుసును కదా! అతని కాలములోని సాంఘిక స్థితి యెట్టిదో అందు స్పష్టంగానే నిరూపించినారు. ఇంకను ఇట్టి అంశాలు వెదికేకొలది బావి త్రవ్వితే బేతాళాలు బయటికి వచ్చినట్లు కావలసినన్నీ బయటపడగలవు.


చారిత్రకముగా వర్ణాంతర వివాహాలు ఎట్లు జరుగుచు వచ్చెనో తెలిపి యీ చర్చను ముగించుదును. బుద్ధుని కాలమునుండి నేటివరకు తక్కువ వర్ణాలవారు పెద్ద వర్ణాలుగా మారిపోవడం, పెద్ద వర్ణాలవారు తక్కువ వర్ణాలుగా మారిపోవడం జరుగుచు వచ్చుచున్నది. నేటివరకును జరుగుచున్నదని అర్ధవంతముగానే వ్రాసినాను.

ఏ జాతి వారినైతే 50 ఏండ్లనాడు రెడ్లు మున్నగువారు తాకజాలకుండిరో అట్టి జాతి ఈనాడు బ్రాహ్మణులతో బాంధవ్యము చేయుచున్నది. అది ఈ నిజాం రాష్ట్రములోనే తెలంగాణాలోనే ఉన్నది. బౌద్ధులు, జైనులు హిందువులైరి. ముసల్మానులు వచ్చిన తరువాత ముసల్మానులైన హిందువులు మరల హిందువులైరి. ఇదంతయు వర్ణాంతరముల సంబంధ చర్చయేయగును. మతాంతరులను తమ మతములోనికి చేర్చుకొని వారిని తనలో లీనము చేసుకొన్న హిందూమతములో వర్ణాంతరములు కూడవని ఈనాడు చర్చించు శుద్ధ పూర్వాచార ఛాందసత్వము నేమనవలెను.

ముసల్మానులు హిందువులైరని అంటిని కదా. అంతేకాదు ముసల్మానుల స్త్రీలను హిందువులు పెండ్లాడిరి. ఎట్లనగా :

1. అల్లావుద్దీను బిడ్డలు ద్వార సముద్ర రాజైన బల్లాళ రాజును మోహించి పెండ్లాడిరి. (Hist. and Discri. of N.S. Domin. Vol. 1-P.50)

2. సబ్వ అను రాజపుత్రరాజు సలీం బిడ్డను పెండ్లాడెను (టాడ్‌ రాజస్థాన్‌)

3. బాజీరావు పేష్వా మస్తాన్ని అను ముస్లిం సుందరిని పెండ్లాడెను.

4. నింబాల్కరు అను మరాఠీ సేనాని బీజాపూరు సుల్తాను బిడ్డను పెండ్లాడెను. తర్వాత ఇతడు శివాజీ బిడ్డనే పెండ్లాడెను. (3-4 విషయాలకు చూ. కింకేడు వార్స్నిక్ష - మరాట చరిత్ర)

5. జస్వంతసింహుడు షాజహాన్‌ చక్రవర్తి బిడ్డను పెండ్లాడెను (టాల్బాయి, వీలర్‌)

ఇట్టి యంశాలను యింకను కావలసినన్ని చూపించవచ్చును.

కాశ్మీర రాజైన చక్రవర్మ అనువాడు చండాల స్త్రీని పొందెను (కల్హణ రాజ తరంగిణి 5-354)

“ఫూర్వము వైశ్యులకును, శూద్రులకును భేదము లేకుండెను. ఉభయ జాతులును నియమరహితముగా వివాహమాడుచుండిరి. వైశ్యులు కాని శూద్రులు కాని వేదాలు చర్చించితే వారి నాలుకలు కోయుచుండిరని ఆల్బెరూని వ్రాసెను” (అల్చెకర్‌ - రాష్ట్ర కూటులు)

“బాణుడను సంస్కృత మహాకవి యొక్క తండ్రి ఒక శూద్రస్త్రీని పెండ్లాడెను.

అనేకమంది గ్రీకులు హిందువులై హిందువులలో కలిసిపోయిరి.

అదే విధముగా అనార్యులై కషాణహూ, సికమెచ్చ సహళర బర్చరాది జాతులవారు హిందువులైరి. హూణజాతి రాజులైన కనిష్క హువిష్కరాజులు సూర్యవంశ క్షత్రియులైరి. (వివరాలకు ఇండియన్‌ ఆంటిక్వారీ 1911లో డా॥ భండార్కరు గారు వ్రాసిన హిందువులలో విజాతీయులు అను వ్యాసము చూడుడు)

టిబెటు రాజైన గంపరాజు నేపాళ రాజకుమారిని పెండ్లాడెను. క్రీస్తు శకాదిలో కౌండిన్యుడు బ్రాహ్మణుడు కాంభోజ (కాంబోడియా) దేశమునకు రాజయ్యెను. కాంబోడియా రాణిని కౌండిన్యుడు పెండ్లాడెను. (వివరాలకు (Greater India) గ్రంథాలను చూడుడు)

ఒక క్షత్రియుడు కుమ్మరి దానిని, మేదర దానిని, పుష్పలావికను, వంటల దానిని పెండ్లాడెను.

ఒక బ్రాహ్మణుడు క్షత్రియుడు వదలిపెట్టిన భార్యను వివాహమాడెను. (చూ. రిస్‌డేవిడ్‌ బు. డిస్టిల్‌ ఇండియా)

“వివాహములోని నిషేధాలన్నింటిని బ్రాహ్మణులు స్వార్థపరత చేతనే నిర్మించి పెట్టిరి” (నెస్‌ఫీల్డ్‌)

ఆర్యులు ఆటవికుల పిల్ల వివాహమాడిరి. (రిస్లీ)

“ఆటవికులలో చాలామంది బ్రాహ్మణులును, క్షత్రియులును అయిపోయిరి.” (రిస్లీ) యు.పి.లోని సనాలాఖీ బ్రాహ్మణులు ఉదంబరులు, తలాజియాలు, పుస్కరణ బ్రామ్మలు, నిజమైన బ్రాహ్మణులు కారు. తక్కువ జాతులనుండి బ్రాహ్మణులలో చేరిపోయినారు. (షిర్రిగ్‌ మిందూ కాస్ట్సు పు.32 మరియు బరోడా సిన్సన్‌ రిపోర్టు 1931) అదే విధముగా చిత్పాసన బ్రాహ్మణులు, నాగార్‌ బ్రాహ్మలు విదేశమునుండి వచ్చిన జనులు. (భండార్కరు ఇండియన్‌ ఆంటిక్యారి 1911)

ప్రతాపగడీతో కుంద బ్రాహ్మణులలో నొక తెగగలదు. రాజామానిక చందు సవాలక్ష బ్రాహ్మణులకు విందు చేస్తానని మ్రొక్కుకొని యుండెను. అందరు బ్రాహ్మణులతనికి లభింపక పోయిరి. అప్పుడు అహీరు (గొల్ల) కూర్మి, భట్టు మున్నగు శూద్ర జాతివారిని బ్రాహ్మణులుగా జేసివేసెను. నేటికినీ వారికిని ఇతర బ్రాహ్మణులకు భేదం లేకుండా సంబంధ బాంధవ్యాలు జరుగుచున్నవి. (ఔదుగజెటియర్‌ 1-305) తిరుగు రాయకులు, పాఠకులు, ప్రాండే పర్వారాలు, సవాలాఖీలు, వీరంతా శూద్రులనుండి ఏర్పడ్డ బ్రాహ్మణులు కాని తమ లోపం దాగిపోవుటకు గాను వారు తమ పేరుల తుదిలో డూబే, ఉపాధ్యాయ, తివారీ, మిశ్ర, దీక్షిత, పాండే, అశ్వత్థి, పాఠక్‌ అను లావు లావు పదాలు వ్రాసుకొంటారు ("N.W.P. VI-351-2)

నిన్న మొన్నటిమాట చూడండి. 100 ఏండ్ల క్రిందట రాజా భగవంతరాయి అను అశోక్తరు రాజా, ఉప్పుచేయు టానిమా జాతివారిని బ్రాహ్మణులనుగా జేసివేసెను. (N.W.P.-VIII)

దక్షిణములో కూర్గులోని తౌ అను బ్రాహ్మణులు చేపలు పట్టువారి నుండి వచ్చినవారు. (వివరాలకు శరశ్చంద్ర రాయిగారు వ్రాసిన వ్యాసం 1943 లోని (Hindu Superiority) అను దానిలో చూడుడు)

క్రీ.శ. 12వ శతాబ్దములో బెంగాలు రాజైన బళ్ళాల సేనుడు కైవర్తులు అను బెస్తవారికి ఉత్తమ కులమునిచ్చెను. క్రీ.శ. 17వ శతాబ్దములో జైసల్మెరు రాజగు అమరసింగు మహారాజుగారు తురకలైన భట్టే రాజపుత్రులందరినీ శుద్ధిచేసి హిందువులను చేసివేసెను. (Hindu Superiority)

మలబారు ప్రాంతములో పరశురాముడు శైవర్తాదులను బ్రాహ్మణులనుగా జేసెను (సహ్యాద్రి ఖండము)

తెనుగు దేశములో బెస్తవారు మున్నగు క్షుద్రజాతుల వారినుండి నియోగి బ్రాహ్మణులు కొందరు ఏర్పడిరి. (రాజరాజ నరేంద్ర సంచిక - చిలుకూరి వీరభద్రరావుగారి వ్యాసం)

ఈ విధముగా హిందువులలో ప్రతి శాఖలోను కులాల మార్పులు జరుగుచు వచ్చెను. తత్ఫలితంగా వర్ణాంతర వివాహాలు ప్రబలుతూ వచ్చెను. చరిత్ర పరిశోధనలు చేయువారికి అడుగడుగు కిట్టి విషయాలు గోచరించుచునే యున్నవి.


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse