Jump to content

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/రాజబహద్దరు వెంకటరామారెడ్డి గారు

వికీసోర్స్ నుండి

శ్రీ రాజాబహద్దురు వేంకటరామారెడ్డిగారు

నిజాము రాష్ట్రములోని రాయచూరు పట్టణమున ఒకప్పుడు 18 ఏండ్ల రెడ్డి బాలుడొకడు తన మేనమామ చనిపోవుట వలన చాల చింతించుచుండెను. అతడు మిగుల బీద కుటుంబము లోనివాడు. మేనమామ జిల్లా పోలీసు సూపరింటెండెంటుగా నుండి అతనిని తన యింటనే యుంచుకొని చదివించుచుండెను. ఆ పోలీసు అధికారి చనిపోగా అతని బంధువులు వచ్చి యిల్లు ఖాళీ చేసి యీ బాలుని గూడ తమతో గొనిపోవ నుద్యుక్తులైరి.

బాలునకు విద్యాసక్తి యధికముగా నుండెను. గ్రామమునకు పోయిన వ్యవసాయమున ప్రవేశింపవలసి వచ్చును. అది బాలునకెంత మాత్రము నిష్టము లేకుండెను.

అతడుండిన యింటికి సమీపమున నొక మౌల్వీ యుండెను. బాలుడాతని చెంతకు బోయి కూర్చుండి దుఃఖింపసాగెను. అది చూచి మౌల్వీ “ఏల దుఃఖించెద”వని యడుగ బాలుడు సంగతి యంతయు చెప్పెను. దాని మీద మౌల్వీ “దేవుడున్నాడులే. దుఃఖించకు' అని ఓదార్చెను.

కాని బాలుని దుఃఖము ఓదార్పులతో పోలేదు. మరునాడు గూడ అతడు యథా ప్రకారముగ దుఃఖింపసాగెను. మౌల్వీ మరల అది చూచి బాలుని సమీపమునకు బిలిచి “ఏమి ఫర్వాలేదు పో, నీకు మేలే కలుగును” అని దృఢముగా పలికి పంపివేసేను.

మరునాడు బండ్లు కదలుటకు సిద్ధముగా నుండెను. బాలుడేమియు తోచక బిక్క మొగముతోనిలిచి యుండెను. ఒక క్షణమాలస్యమయిన బండ్లు సాగియే పోవును. కాని ఉన్నట్లుండగా యీ బాలుని మేనమామ అనుగ్రహమున ఉన్నతికి వచ్చిన ఒక పఠాను వచ్చి “ఈ బాలుని గూడ తీసుకొని పోయెదరా” అని అడిగెను. “అవును?”

“తీసుకొనిపోయి”

“వ్యవసాయము చేయింతుము”

“చదివించరా?”

“ఎవరు చదివింతురు? ఖర్చెవ్వరు భరింతురు? అది మావల్ల కానిపని.”

“సరే, మీరీ బాలుని నాకప్పచెప్పుడు”

“వీలులేదు”

“అప్పజెప్పవలసినదే. ఆ బాలుని ముట్టితిరా, ఖబడ్దార్‌!”

బంధువులు అందుకు మారు చెప్పలేక, “వాని తిప్పలు దైవమెరుగు"నని పఠానున కప్పగించి వెడలిపోయిరి.

బాలుడు బ్రహ్మానంద భరితుడయ్యెను.

మరునాడే పఠాను బాలుని వెంటనిడుకొని హైదరాబాదు నగరమున కరిగి పెద్ద పెద్ద అధికారుల వద్దకు పిలుచుకొనిపోయి “ఇతడు విలియం వహబు (పోలీసు మొహతెమీం) సూపరింటెండెంటు గారి మేనల్లుడు”అని చెప్పి పోలీసు శాఖలో అమీన్‌ (సబినస్పెక్టరు) పదవినిప్పించెను.

విలియం వహబ్‌ అను పదమును విన్నంతనే యీ పురుషుడు ఇంగ్లీషు వాడా, ముసల్మానా, లేక ఉభయ సంబంధము కలవాడా అనే పాఠకు లూహలకు పోవుదురు; కాని అతడు రెడ్డియే.

క్రీ. శ. 1865లో దివంగతులైన వనపర్తి సంస్థానాధీశ్వరులు ప్రథమరామేశ్వర రాయల వారు గొప్ప సంఘ సంస్కారపరులలో అత్యుత్తములు (ఈ మహారాజే ఆంధ్రులందరిలోను మొదటి సంస్కారి అని నేనిదివరలో గోల్కొండ పత్రికలో విపులముగా వ్రాసియున్నాను). తత్ఫలితముగా వారు తమ బంధువులలో ఏడుగురు బాలురను తమవద్దనే చేర్చికొని వారి పుట్టు పేరులను తుడిచివేసి ఇంగ్లీషువారి పేరు కొంత, ముసల్మానుల పేరు కొంత చొప్పున చేర్చి వారికి పేరులు పెట్టిరి. ఆ బాలురే విలియం వహబ్‌, చార్లెస్‌ వహబ్‌, హెన్రీ వహబ్‌ ఇత్యాదులు. ఈ వహబులందరును గొప్ప గొప్ప యుద్యోగములు చేసిరి. ఆ వహబులలో నొకడైన విలియం వహబ్‌ రామేశ్వర రాయల వారికి మేనల్లుడు. ఆ విలియం వహబు మేనల్లుడే యీ బాలుడు - అనగా వేంకట రామారెడ్డి. రెడ్డిగారి బాల్య దశలోని యింకొక చిన్న ఘట్టము నిక్కడ చూపవలసి యున్నది. రెడ్డిగారు సుమారు 12-13 ఏండ్ల వయస్సులో కొన్ని దినములు హైదరాబాదులో చదువుకొనిరి. ఆ రోజులలో నొకరాత్రి ఇంధ్ర సభ అనేది కాబోలు ఒక నాటకము ప్రదర్శింపబడినది. దానిని చూడవలెనని రెడ్డిగారికి సరదా పుట్టినది. కాని పెద్దలు పోనీయరు. మానలేడు. ఏమి చేయుట? తుదకు రెడ్డిగారొక యుక్తి పన్నిరి. మంచము మీద వారు దిండుపెట్టి దానిపై దుప్పటి కప్పిరి. చూచువారికి బాలుడే పడుకొని యున్నట్టు తోచెటట్టు సరిగా సర్దిరి. తరువాత మిత్రులతో కలిసి నాటకమునకు వెడలిపోయిరి. కొంతసేపయిన తరువాత యజమాని వచ్చి చూసి బాలుడే పడుకొని యున్నాడని వెడలిపోయెను. కాని అక్కడ నాటకమయిపోయిన తరువాత కళ్లు నులుముకొనుచు బాలుడు తన మిత్రులతో బయలుదేరి వచ్చుచు ఉస్మాన్‌గంజ్‌ నాకా (పోలీస్‌స్టేషన్‌) వద్ద ఎవరో తగవులాడుకొనుచుండ తమాషా చూచుచు నిలువబడెను. కొంతసేపటికిపోలీసులు వచ్చి “మాకీ తగవుతో సంబంధములే”దని బాలుడును, మిత్రుడునుఎంత మొరపెట్టుకొనినను వినుపించుకొనక తగవులాడుచుండిన వారితో పాటు వీరిని నాకాలో బంధించిరి. తెల్లవారిన పిదప యజమాని బాలుని లేపవచ్చి, దిండుచూచి అదిరిపడి బాలుడు రాత్రి మిత్రులతో గూడి ఎక్కడికోపోయి యుండునని తహతహపడును. కొంతసేపటికి బాలుడు పోలీసులు విడిచిపెట్టగా యింటికి వచ్చి యజమానిచే ప్రాయశ్చిత్తము పొందెను. రెడ్డిగారు ఇప్పటికి కూడా యీ సంగతి మరువకపోవుటయే కాక అప్పుడప్పుడు అది యంతయు చెప్పుచు “ఇప్పటికి గూడ నేను ఆ నాకాను చూసినప్పుడు చిన్నప్పటి ఆ ఘట్టము జ్ఞాపకము వచ్చు”ననుచుందురు.

పఠాను అనుగ్రహమువలన అమీన్‌ పదవి దొరికినది; కాని తన్నిర్వహణ విధానము మాటయేమి? అప్పటికి వారి పాండిత్యము ఉర్దూలో 5వ వాచకము వరకు మాత్రమే. తెనుగులో చదువుట, వ్రాయుట, కొంచెము వడ్డీ లెక్కలు కట్టుట వరకు మాత్రమే. పార్శీలో ఇంతకు చాలా తక్కువ ప్రవేశము మాత్రమే. పైగా ఉర్దూలోని నిశిందా వ్రాత చదువుటకే శక్తి చాలదయ్యెను. ఇక పోలీసు వ్యవహారముల జ్ఞానమా? పూర్తిగా సున్న

ఈ స్థితిలో ఒక తాలూకాలో పోలీసు ఉద్యోగిగా వెళ్ళి ప్రవేశించినారు రెడ్డిగారు; కాని అదృష్టము బాగుగానుండెను. ఏమంటే? అక్కడి తహస్సీలుదారు రెడ్డిగారి మేనమామ సిఫారసువలన ఉద్యోగము పొందినవాడు. ఇంక లోటేమి? దినదినమును పైనుండి వచ్చెడి ఆజ్ఞలతో రెడ్డిగారు ఏకాంతముగా తహస్సీలుదారు వద్ద కరిగి జవాబులు రాయించుకొని (ఈ నంగతి అక్కడి నౌకర్లకును తెలియదు) వచ్చుచుండెడివారు.

ఇట్లు కొలది దినములే జరిగెను. తరువాత రెడ్డిగారు స్వయముగా వ్యవహ రించుటకు పూర్తిగా సమర్థులయిరి.

సుమారు 15 సంవత్సరముల క్రిందటి మాట. వనపర్తిలో మహారాజా శ్రీ రామేశ్వరరావు బహద్దరువారి రెండవ కుమార్తె వివాహము జరుగుచుండెను. ఆ సందర్భమున మనరెడ్డిగారు “రెడ్డి విద్యార్థుల విషయమున శ్రద్ధ చూపువారులే” రనియు, “వారికి సాయము చేయవలయుననే భావమే యెవరికినిలే” దనియు, “కాని ఇతరత్రా అనవసర వ్యయాలు చేయుటకు మాత్రము ఎవరూ జంక” రని ప్రసంగవశమున పలికిరి. అదివిని రాజులు మున్నగు పెద్దలు “మేము ద్రవ్యము ఇచ్చెదము; కాని దానిని సక్రముగ వినియోగించు వారెవ్వరు?” అనిరి. వెంటనే రెడ్డిగారు “నేనున్నా” నని ధైర్యముగా బదులుచెప్పిరి.

ఇంకేమి? వెంటనే పింగళి వెంకటరామరెడ్డి దేశముఖుగారు 10000-0-0, వనపర్తి మహారాజు 25000-0-0, గద్వాల మహారాజు 30000-0-0 ఇతరులు మరికొందరు తమ తమ శక్తికొలది చందాలు వాగ్దానము చేసిరి. జాపితా మొత్తము 80000-0-0 అయ్యెను. అందుకు చాలా సంతోషించి మన రెడ్డిగారు వెంటనే వసూళ్ళు ప్రారంభించి హైదరాబాదు నగరమున “రెడ్డి హాస్టలు” అనే పేరుతో నొక ప్రచండ రెడ్డిసంస్థను నెలకొలిపిరి. అది నేటికిని మన రెడ్డిగారి పర్యవేక్షణము క్రిందనే చక్కగా నడుచుచున్నది. దినదినాభివృద్ధియు గాంచుచున్నది.

ఈ రెడ్డి హాస్టలు విశ్వరూపము తాల్చునప్పటికి మన వేంకటరామారెడ్డిగారు అమీన్‌ పదవినుండి సర్కిల్‌ ఇనస్పెక్టర్‌, దానినుండి సూపరింటెండెంటు, దానినుండి నగరపు కొత్వాల్‌గారి మదదార్‌ (first assistant) తర్వాత నగరపుకొత్వాలు (Com- missioner of City Police) గను అభివృద్ధి బడసిరి. ఈ నగరపు కొత్వాలు పదవి పొందుటలో హైదరాబాదు చరిత్రలో మొదటి హిందువు రెడ్డిగారే. (ముందు సంగతియేమో!) రెడ్డిగారు కొత్వాలుగా నుండిన కాలములో నొకనాడు వీరి తల్లిగారి పుట్టింటి యూరగు (వనపర్తి సంస్థానము నందలి) రాయణిపేట గ్రామవాసి, వృద్ధుడైన యొకకాపు (రెడ్డి) నగరమున కేదోపని మీద వచ్చి రెడ్డిగారు తన గ్రామమున పుట్టి పెరిగినవారు గనుక చూచివత్తమని వీరి యింటికి వెళ్ళిరి. ఆ సమయమున రెడ్డిగారు కొందరు నవాబులు, రాజులు, ఉన్నతోద్యోగులు దర్శనము కోరి వచ్చియుండ వారితో మాట్లాడుచుండిరి. కాని బైటనుండి చూచువారికిప్రక్కల నున్న గొప్పవారు కనబడక ఎదుటనున్న రెడ్డిగారొక్కరును మాత్రమే కనబడుచుండిరి. అందుచేత మన వృద్ధకాపు రెడ్డిగారొక్కొరే ఉన్నారని భావించి “ఏమిరా వేంకటరాముడూ బాగున్నావురా?” అని పలకరించుచు లోపల అడుగుబెట్టెను; కాని ఇంకేమున్నది? లోపల ఎందరో పెద్దలు, వారిమధ్య చుక్కలలో చంద్రునివలె రెడ్డిగారు! వృద్ధునకు వడకు ప్రారంభమైనది. మాట నిలిచిపోయినది. చూపులు చెదరిపోయినవి. అయితే రెడ్డిగారు సంతోషముతో బదులుచెప్పిరి. కుశల ప్రశ్న చేసిరి. ఒకటి రెండు నిమిషములు గడచినను వృద్దుని భీతి ఇంకను అట్లేయుండుట చూచి “పనియున్నది, లోనికి పోవలయును” అని పెద్ద మనుష్యులను పంపివేసి, చేయిపట్టుకొని వృద్ధుని గృహాంతర్భాగమునకు తోడుకొని వెళ్ళి కులాసాగా మాట్లాడసాగిరి. దానితో వృద్ధుడు కొంతవరకును దేరికొనెను, గాని రెడ్డిగారు తమ ప్రక్క గూర్చుండబెట్టుకొని సరాగములాడుచు భోజనము చేయించునంత వరకును అతడు పూర్తిగా కుదుటబడలేదు. తరువాత రెడ్డిగారు అతని స్థిమితము గాంచి ఆనందించి సత్కరించి పంపివేసినారు.

హైదరాబాదులో కొత్వాలీ పదవీ అన్న అసిధారావ్రత వన్నమాట. ఒక ప్రక్క మహాఘనత వహించిన నిజాము ప్రభువు, ఒక ప్రక్క హిందువులు. మరొక ప్రక్క ముసల్మానులు, వేరొక ప్రక్క నవాబులు, రాజులును, అందరికిని పైని ఇంగ్లీషు ప్రభువులు. ఇందరికి తృప్తి కలిగించవలెనన్న సామాన్యముకాదు, కాని యీయసామాన్య కార్యమును మనరెడ్డిగారు మాత్రము చాలా కులాసాగా నెరవేర్చి అందరవలనను మెప్పుబడసిరి.

రెడ్డిగారు కొత్వాలుగానున్న కాలమునందే మన హిందూదేశమునకు వేల్సు యువరాజుగారు వచ్చిరి. అసహాయవాదులు దేశమందంతటను వారి రాకను నిరాకరించుచుండిరి. హైదరాబాదున నేమి చిక్కులు వచ్చునోయని ప్రభుత్వము వారు తహతహలాడుచుండిరి. అది చూచి రెడ్డిగారు “ఏమియు భయము వలదు. వారిని ఆహ్వానింపుడు, వారి క్షేమమునకు, వారి సంతృప్తికి నేను పూచీ” అని బాసయిచ్చినారు.

ఆ సమయమున ఏలాటీ కల్లోలములును జరుగకుండునట్లు రెడ్డిగారు కావించిన ఏర్పాటులు, రాత్రింబగళ్ళు వీరుపడిన శ్రమ చాలామందికి తెలియవు, కాని వేల్సు యువరాజాగమనము సక్రమముగను, దేవేంద్ర వైభవముగను జరిగి పోయినది.

ఆ సమయమున రెడ్డిగారి శక్తి సామర్థ్యములను బాగుగా - పూర్తిగా గ్రహించిన వారిలో వేల్సు యువరాజుగారు ప్రముఖులు. వారు నగరమునుండి వెళ్ళునపుడు గొప్ప గొప్ప అధికారుల కందరకును దర్శనమిచ్చి ప్రతివారికి నేదో బహుమానమిచ్చిరి.

ఆ సందర్భమున వంతు ప్రకారమున రెడ్డిగారికిని దర్శనము దొరకెను. వేల్సు యువరాజుగారు రెడ్డిగారితో చాలసేపు మాట్లాడి వారికొక వెండి సిగరెట్‌ డబ్బీ బహుమానమిచ్చి పంపివేసినారు. (రెడ్డిగారికి సిగరెట్‌ అభ్యాసము ఏ మాత్రమును ఇప్పటికిని లేదు)

రెడ్డిగారు బయటికి వచ్చిన తరువాత ప్రముఖులు చాలామంది వీరికి జరిగిన సత్కారమును వినగోరిరి. “నన్ను తమ ప్రక్కన కూర్చుండబెట్టుకొని వేల్సు యువరాజుగారు “నీవు చేసిన యేర్పాటులన్నియు నాకు మెప్పు కలిగించినవి” అని చెప్పినారు. అని రెడ్డిగారు పలుకగా తక్కిన అధికారులందరును ఆశ్చర్యపడి ఏమీ వారి ప్రక్కన కూర్చుంటివా? మేమందరము దూరమున నిలిచియే మాట్లాడితిమే? తెలియక నీవు వారి పక్క కూర్చుంటివేమో?” అని హేళనము చేసిరి. దానికి రెడ్డిగారు “నేనట్లు తెలివి తక్కువ పనిచేసిన నాతల తీయించి యుండరా? వారు స్వయంగా పిలిచి నన్ను కూర్చుండబెట్టుకొనిరి” అని బదులు చెప్పి వారిని నివ్వెరపడునట్లు చేసిరి.

వేల్సు యువరాజుగారు వచ్చునప్పటికి రెడ్డిగారి వయస్సు సుమారు 55 సంవత్సరములు. అప్పటివరకును వారింగ్లీషు ఒక్క ముక్క అయిన నెరుగరు. అట్టి రెడ్డిగారు వేల్సు యువరాజుగారు ఒక సంవత్సరమునకు హిందూస్థానమునకు వత్తురనగా “వారు హైదరాబాదుకు తప్పక వచ్చెదరు. అప్పుడు నేను వారితో ఇంగ్లీషున మాట్లాడవలెను” అని దీక్ష పట్టిరి. ఉపాధ్యాయుడు వచ్చి, ఏ,బీ,సీ,డీలు ప్రారంభించెను. అప్పుడు రెడ్డిగారు ప్రయిమరీ విద్యార్థి కంటెను ఎక్కువ భయము శ్రద్ధ చూపసాగిరి. దినపాఠము తెల్లవారుజామున వల్లెవేయుట, రాత్రి పడుకొనబోవుటకు ముందు పాఠము గట్టిచేసుకొనుట, పాఠము నేర్చుకొనుటలో బిగ్గరగా చదువుట, ఇది నిత్యకృత్యము. రెడ్డిగారి గదిముందే జవానులు పహరా యిచ్చుచుండిరి. “ఎన్నడును లేనిది యీ మధ్య నేమోమో యొవ్వరికిని దెలియని మాటలతో తమకు తామే ప్రతి రాత్రియు గొణుగు కొనుచున్నారు వీరు. ఏదో దయ్యమో భూతమో ఆవేశించినట్లున్నది. ఇంకెట్లు?” అని జవాను లొకనాడు కూడబలుకుకొని వేగముగ పోయి యొక పోలీసు అధికారితో చెప్పివేసిరి. అంతట ఆ యధికారి వచ్చి రెడ్డిగారితో మాట్లాడి యథార్థము నెరిగి జవానుల భీతిని రెడ్డిగారి కెరింగించెను. దానిమీద ఇద్దరును చాలాసేపు నవ్వుకొని జవానుల భీతి తొలగించిరి.

వేల్సు యువరాజుగారు రెడ్డిగారి వచ్చీరాని ఇంగ్లీషు విని ముసిముసి నవ్వులు నవ్విరట.

రెడ్డిగారికి బీదలనిన చాలా ప్రీతి. సాధారణముగా పోలీసులు కఠినులనియు, భయంకరులనియు జనుల అభిప్రాయము; కాని రెడ్డిగారు 40 ఏండ్లకు పైగా పోలీసు ఉన్నతోద్యోగము నిర్వహించినను మార్దవము, క్షమ, దయ, కరుణ తప్ప కాఠిన్యము, ఆగ్రహము, క్రోధము, ద్వేషము ఎంతమాత్రమును దగ్గరకు రానిచ్చి యెరుగరు. గొంగటి వారిని (పేద రైతులను) జూచిన రెడ్డిగారికి ఎంతో ఆనందము. ఆదరమున్ను. బీద విద్యార్థులకు సాయము చేయుటయన్న వీరికి పండుగ. సంఘ సంస్కారమన్న వీరికి చాలా యిష్టము, ముందడుగున్నూ పూర్వకాలపు మొగలాయి మనిషివలె కనబడుదురు. కాని నేటి సంస్కారి ప్రముఖులకంటె నెక్కువ సంస్కారులు.

రెడ్డిగారికి మహాఘనత వహించిన శ్రీనిజాము ప్రభువువారు శ్రీరాజా బిరుదమును, బ్రిటిషు ప్రభుత్వమువారు ఓ.బి.ఇ. బిరుదమును ప్రసాదించి గౌరవించిరి.

రెడ్డిగారు కొత్వాలీ ఉద్యోగమునుండి గత సంవత్సరము నందే విరమించుకొనిరి పెన్షను సగము జీతము అనగా 750-0-0 మాత్రమే ఏర్పడ వలసియుండ శ్రీనిజాము ప్రభువువారు సమర్థమైన వీరి సేవను గుర్తించి 1000-0-0 ఇచ్చునట్లు ఫర్మానురూపముగా అనుజ్ఞ యిచ్చిరి. ఇంతేగాక ఒక ప్రక్క కొత్వాలీ ఉద్యోగము నుండి సెలవు పొందుచుండ శ్రీనిజాము ప్రభువు వారు తమ సొంత జిల్లాయగు ఆత్రాపు బల్దాజిల్లాలో రెడ్డిగారికి ఒక ప్రత్యేక పదవిని కల్పించి “స్పెషల్‌ ఆఫీసరుగా 500-0-0 వేతనముమీద (పెన్షను 1000-0-0 లును గాక) నియమించినారు.

ఇప్పటికి రెడ్డిగారి వయసు సుమారు 62 సంవత్సరములు. ఇంకా వ్రాయవలసిన వీరి చారిత్రక విషయాలు ఎన్నో యున్నవి. ఇప్పటికి సెలవు.


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse