Jump to content

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/మావూరు

వికీసోర్స్ నుండి

మావూరు

కృష్ణాపత్రికలో “మా వూరు” అని కొందరు తమ తమ గ్రామాల ఘనతను గురించి వ్రాస్తూ ఉండినది చదివినప్పుడంతా మా వూరును గురించి కూడా ఎందుకు వ్రాయగూడదు అని పలుమారు అనుకొని తుదకీనాడు కృతనిశ్చయుడనై తదేక దీక్షతో వ్రాయనే వ్రాసినాను. ఇందలి విషయాలను అపహాస్యానికై వ్రాసినానని కాని అబద్దాలతో నింపినానని కాని ఎవ్వరున్నూ భావింపరాదు. పదారణాలూ, 12 మాసాలూ సత్యమని నమ్మండి. ఇక మా వూరు చరిత్ర వినండి.

మా వూరు పేరు ఇటిక్యాలపాడు. ఇది రాయచూరు జిల్లాలో ఆలంపూరు తాలూకాలో ఉన్నది. బ్రిటిష్‌ సరిహద్దగు కర్నూలు పట్టణానికి 10 మైళ్ళ దూరములో ఉన్నది. పూర్వము అలంపూరు దేవాలయమునకు కావలసిన ఇటుక మా గ్రామము పొలాలలోనే సిద్ధము చేసి తీసుకొనిపోయి యుండిరట. అందుచేత 250 ఏండ్ల క్రిందట ఈ గ్రామాన్ని నిర్మించుకొన్న పిచ్చి పుల్లయ్యలు వెర్రివెంగళప్పలు దీనికి ఇటికెలపాడు అని పేరు పెట్టిరట. సుమతి శతకములోఒక పద్యమిట్లున్నది.


క॥ అప్పిచ్చువాడు వైద్యుడు
     నెప్పుడు నెడ తెగక పారు నేరును ద్విజుడున్‌
     జొప్పడిన నూర నుండుము
     చొప్పడకున్నట్టి యూరు జొరకుర సుమతీ॥


మా వూరును మొదట కట్టిన బేఖూబ్‌ మదర్సాబులు పై సుమతి పద్యాన్ని అయినా చదువుకొన్నవారు కారు. నేటికిని మా వూరులో అప్పిచ్చేవారు అరుదు. వైద్యుడుపోయిన నెలవరకు లేకుండెను. కాని యిప్పుడు తెలుగు చిన్నయ్య రోగాలను మంత్రించి, జలగం రమణయ్య మందిచ్చి బాగైనవనిపిస్తున్నారు. రమణయ్య చేతి వైద్యము సకలార్తి నివారక మగుటచేత అతని పేరులోని మొదటి రెండక్షరాలను తారుమారుచేసి అంటూ ఉంటారు. మా యూరులో పారే నీరు లేదు. కాని మూడుమైళ్ళ దూరాన ఆ నీరు దొరుకును. మాకు 10 మైళ్ళ దూరములో ఇటికేల అనే గ్రామమున్నది. పొరపాటు పడకుండుటకై యా గ్రామాన్ని ఆకుచోట ఇటికేల అంటారు. మా గ్రామాన్ని నీళ్ళు లేని యిటికేల పాడు అంటారు. కారణమేమనగా మా గ్రామములో ఎంత ప్రయత్నము చేసినా ఊటబావి పడనే లేదు. తుదకు 150 ఏండ్ల క్రిందట గ్రామానికి రెండు ఫర్లాంగుల దూరములో ప్రక్క గ్రామమగు జల్లాపురంలోని ఇట్టేలవారు అనే కోమట్లు తదేక దీక్షతో పాతాళం చూచేవరకు వదలకుండా త్రవ్వించగా అచ్చటవారికి పాతాళగంగాదేవి ఉగ్రరూపములో విసుగుతో ప్రత్యక్షమయ్యెను. అట్టి బావికి లెక్కపెట్టగా 120 మెట్లు కలవు. నీరు చాలా ఉప్పుగా నుండును. నీటిని బాగా కాచి ఆవిరిగా ఎగిరిపోవునటుల జేస్తే చక్కని తెల్లని ఉప్పు దొరకును. ఉప్పు సత్యాగ్రహం చేసేవారు మా బావి నీటిని కాస్తే శిక్షించేవారు లేరు. మా సర్కారు వారితో 40 ఏండ్ల నుండి లబలబ మొత్తుకొనగా రెండేండ్ల క్రిందట కాస్త వినిపించుకొని ఒక బోరింగు మిషను తెచ్చి 80 అడుగుల లోతు కొట్టితే అచ్చట అర్ధగజం లోతుగల ఉప్పునీరు దొరికెను. ఇంకా లోతుగా కొట్టవలెనయ్యా అంటే వచ్చినవారు మాకు ఎక్కువ లోతు కొట్టే హుకుం లేదు అని 4 నెలల వరకు తమకు వెళ్ళి రమ్మను హుకుం వచ్చేవరకు ఈగల జనాభాను వ్రాసుకొని వెళ్ళిపోయిరి. వారు వెళ్ళిన వారం దినాలలో ఊరి పిల్లలు రాళ్లు వేసి ఆ కాస్త బోరింగును మూసివేసిరి. మా గ్రామములో 400 హరిజనులు కలరు. వారికి బావిలేదు. పై జాతుల వారిని బావివద్ద ఎంతో ప్రాధేయపడగా హరిజనులకు తిరిపెముగా కాస్త నీరు పోస్తున్నారు.

మాయూరిలో ఎవరి పప్పు కూడా ఉడకదు. అందుచేత ఊరి బయట ఒక పెద్ద గుంతను గ్రామస్థులే చందాలు వేసుకొని సగటున ఏటేటా 500 రూపాయల వరకు వ్యయం చేసి అందు వాననీ రాపుకొందురు. ఆ మురికి నీరే పప్పునకు, త్రాగుటకు, బట్టలుతుకుటకును, స్నానాదులకు. అంట్లు కడుగుటకు వాడుకొందురు మా ఉప్పు నీటిని త్రాగినవారికి ఒక్కసారికానేకాదు రెంటి నుండి పది వరకు ప్రతివానికి నారి పుండ్లు ఏటేటా అవుతూ వుండును. ఎవరో కొందరు మాత్రమే అగస్త్యులవలె నారి పుండ్లను బయటికి రానీయకుండా లోననే జీర్ణోభవ అని మంత్రించుకొనేవారు. మా యూరిలోనికి యెంతటి మహామహులైనా సరే, ఎంతటి అసూర్యం పశ్యలైన, అంతఃపుర కాంతామణులైనా సరే ఊరివాకిలి వద్ద బండిదిగి ఊరులోనికి పోవలసినదే. కారణమేమన మా గ్రామమంతా బంకరేగడి భూమిలో కలదు. వీథులలో చేలల్లో వాన వస్తే మోకాటివరకు దిగబడును. అందుచేత ఊరి వీథులను నాలుగు అడుగుల వెడల్పుతో కట్టి బండలను పరిచినారు. అట్టి యిరుకు వీథులలో బండ్లు పోజాలవు. వానవస్తే బండల మధ్యన గుంతలలో మురికినీరు కొన్ని దినాల వరకు ఆగియుండును. అందు దోమలు గ్రుడ్లు పెట్టి పిల్లలను లేపును. ఇండ్లకు వెనుక భాగాలు లేవు కాని యిండ్లముందే యింటి వారి పిల్లలంతా మలమూత్ర విసర్జన చేస్తూ ఉందురు. ప్రతి వీధిలో కొన్ని పెంటలుండును. ఊరు చుట్టూ కల్లాలుండుటచేత తూర్పుపట్టితే నుసి ఊరంతా నిండుకొనియుండును.

మా ఊరిని పిండారీల కాలములో కట్టినారు. అందుచేత ఊరికి నాలుగు బురుజులు నాలుగు ప్రాకారాలు కలవు. మాదిగవాడవారు ఆ దిక్కున నున్న బాటలోనే స్త్రీ శిశు పురుషులంతా రాత్రి అనక పగలనక లఘు గురుశంకలను తీర్చుకొను చుండటచే ఊరివారా దిక్కు నడుచుట అరుదు. కాని సర్కారీ అధికారులు వేరే గ్రామాలకు పోవువారు మునులవలె ముక్కుపట్టుకొనియైన ఆమాంతంగా గ్రామాన్ని దాటవలసి వస్తున్నది.

ఇన్ని కారణాలచేత మా వూరిలో 365 దినాలు కూడా ఏకధాటిగా ఈగలు ఒక్కొక్క యింటిలో లక్షల కొలదిగా ఉండును. గట్టిగా విసరినా పోవు. అన్నములోపడి చచ్చును. నీటి స్థాలీలలోపడి చచ్చును. తేనీరు నోటివరకు పొయ్యే లోపలనే రెండైనా అందుపడును. అనగా 'ప్రథమ కబళే మక్షికాపాతః' అన్న గీర్వాణ భాణకము మా ఊరిలోనే ప్రారంభమైనదన్నమాట. మా వూరికి పెద్ద మనుషులు కూడా వస్తారు. మా వూరిలో పెద్ద మనుషులు కూడా పుట్టినారు కాబట్టి గత సంవత్సరము శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు దయచేసి ఒక దినముండి “ఈ ఊరిలో ఈగలు కూడా మంటలెత్తేటట్లు కరుస్తవే” అని అంతటి గొప్పవారు కూడా జడిసిపోయిరి.

మా యూరి ఇండ్లన్నీ పలకరాతి కట్టడములే. గోడలకు గచ్చుకాని, మన్ను కాని మెత్తరు. అందుచేత చలికాలములో నీలగిరిలో ఉన్నట్లు ఎండ కాలములో సహారా ఎడారిలో ఉన్నట్లు ఉండును. ఉప్పునీటి చౌట నేలలో చెట్లు కూడా వృద్ధి కావు కాని అందందు తుమ్మచెట్లు మాత్రం పాంథులకు ఆశ్రయమిచ్చి పుణ్యము కట్టుకొని తమ లోక కంటకత్వనిందను బాపుకొనును. ఎండాకాలము రాత్రులందు రాళ్ళ గోడలలోని తాపమునకు తట్టుకొనలేక వీధులలో తేళ్ళు బ్లాకు మార్కెటులోని బేరగాండ్ల వలె వాహ్యాళి చేయును. లంచాలుతినే అధికారులవలె ఊరకుండెవారిని తమ జోలికి రానివారిని ఆ తేళ్లు బాధించవు. కాని తమను త్రొక్కి అపచారము చేసిన వారిపై కొండెమీటి దెబ్బకొట్టి తీరును. ప్రతి ఇంటిముందు దినం పది తేళ్లయినా ఊరక పారజూస్తే లభించును. వాటి అవసరముండే వారు మా గ్రామం దయచేసిన బాగా సహాయం చేస్తాము.

ఏమైనా కాస్త విశాల స్థలం కలదంటే అది ఊరిముందు కలదు. అచ్చట 600 చ.గజాల స్థలం కలదు. ఊరివారి యిండ్ల మరమ్మత్తు రాళ్ళు కుప్పలు, సేద్యం పనిముట్లు వాడుకొనని బండ్లు, రెండు కొత్తగా ఏర్పడిన పెంటలు, వడ్ల వాని చెట్టు కింది కార్ఖానా, కూలికి వచ్చిన పర గ్రామాల వారి వంట పొయ్యి వరుసలు, బిచ్చగాండ్ర విడిది ఇవన్నీ అందే గారడీ బుట్టవలె యిమిడి యుండును.

గ్రామంలో పుట్టినవారు 200 మంది యుండిరేమో యిప్పుడు 1100 మంది కలరు. కాని పది మాదిగ వారి కొత్త యిండ్లు తప్ప గ్రామమంతా మొదటి చెక్బందీ లోనే ఇరికియున్నది. గ్రామస్థులు అజ్ఞాన సంపన్నులును అభిమాన ధనులును అగుటచే స్థలానికై అధికారుల నడుగరు. అధికారులు లేవీలో మునిగిన వారగుటచేత ఈ అల్పపు ముచ్చట్లను వినిపించుకొనరు. మా గ్రామములో కల్లు సారా త్రాగని యిండ్లు అయిదే అయిదు. మా గ్రామంలో బ్రాహ్మణులు, బాతులు, నీరుకొళ్ళు కొంగలు ఆది నుండి నేటివరకు లేవు. ఘోటక బ్రహ్మచారియగు కోమటి యొకడుండెను. మొన్ననే కొంత అప్పును ఒక పాత బసివిని వదలి చచ్చిపోయెను. ఒకే ఒక తురక కుటుంబ మున్నందున పీర్లపండుగను హిందువులే చేస్తున్నారు. గంటసేపు వర్షము గట్టిగా కురిస్తే రెండు దినాల వరకు బండ్లు కదలవు. మొన్న మొన్ననే సర్కారీ పంతులిద్దరు మా గ్రామానికి వచ్చినారు. కాని వారికి ఉప్పునీరు సరిపడక నెలలో 20 దినాలు ఊరిలో ఉండరు. ఉండిన పది దినాలు ఎవ్వరికీ కనబడరు. మా పొలాలన పండే గోధుమలకు కర్నూలులో ఎక్కువ ధర యిచ్చి కొంటారు. మొత్తం హిందుస్థానంలో ఇంతమంచి గోధుమలు దొరకవన్నమాట. మా గ్రామంలో ఒక వరిగింజ పండకున్నా ఊరంతా వరియన్నమే తింటుంది. అధికారులు బియ్యం సప్లయికి సెలవియ్యకున్నా మా గ్రామానికి బియ్యమెట్లు వచ్చెనో తెలియదు. కానీ, మా యూరి నీటిలో తెల్లబట్టలు వేస్తే మైలపడును. అందుచేత అధికారులు దౌరాకు రారు. విధిలేక వస్తే అప్పుడే మరొక గ్రామానికి వెళ్ళుతారు. ఇదొక్కటే ప్రశంసనీయమగు మా గ్రామ సులక్షణము.

మా గ్రామానికింతలో సర్‌ మీర్జా ఇస్మాయిల్‌ గారి నాహ్వానించి వారికి మా ఉప్పునీటి తీర్థమిచ్చి మా కప్పులేని చావడీలో బస యేర్పాటు చేసి మా ఊరి ముందటి ఫతేమైదానులో వారి వాహ్యాళికేర్పాటు చేసి మా స్థితిగతులను తెలుపుకోవలెనని మా గ్రామ యువకులు ఇస్పేట్‌ ఆట ఆడని కాలములో అనుకొంటూ ఉంటారు.

♦ ♦ ♦ ♦ ♦


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse