సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/ప్రాచీనార్యులు - వర్ణవ్యవస్థ
ప్రాచీనార్యులు - వర్ణ వ్యవస్థ
హిందూమతము వ్యాపకమతము (Proseletysing religion) కాదని నేటి హిందువుల యాచార వ్యవహారముల గమనించువారు చెప్పుచున్నారు. ఇది హిందూమత క్షైణ్యచిహ్నముగాని వేరుకాదు. ప్రాచీనార్యులలో నిట్టి సంకుచిత భావము లంతగా లేకుండెననియే భావింపవలయును. ప్రపంచముయొక్క సర్వభాగములందు సముద్ర వ్యాపారము చేసిన కాలమందుగాని, దూరదేశములందు విశాల భారతిని (Greater India) నెలకొల్పిననాడు గాని ప్రాచ్య ప్రతీచ్య దేశములందు మతబోధలు చేసి హిందూ బౌద్ధమతములలోనికిఁ దద్దేశీయుల బరివర్తనము (conversion) చేసిననాడుగాని ప్రాచీనార్యులలో నేటిరీతి జాతి వైషమ్యము, హ్రస్వదృష్టి, హృదయ దౌర్బల్యము, సాంఘిక పతనము లేకుండెను.
హిందూమతమందు జేరిన స్త్రీ శూద్రులు వేదమునే వినగూడదు, చదువగూడదు అను కుత్సిత తర్కము లీ మధ్యకాలముననే బయలుదేరెనుగాని, ప్రాచీన కాలమందు లేకుండెను. క్రీ. శ. 1907 వ సంవత్సరమున జర్మన్ పండితుడగు హ్యూగోవింక్లర్ కనిపెట్టిన బేగాజ్ కే (Beghaz keui) అను శాసనమందు కపడోషియా దేశమందు అనార్యజాతులగు హిట్ టైవారును, మిటన్నీ జాతివారును సంధి కుదుర్చుకొనినప్పుడు మిత్ర, వరుణ, ఇంద్రాది దేవతలను సాక్షులుగా గోరికొనిరనియు, నీ రెండు జాతుల రాజులు బాంధవ్యమును గుదిర్చికొని వివాహముల జేసికొను కాలమును 'నాసత్యుల' (అశ్వినుల) ను మంత్రపూర్వకముగా నాహ్వానించిరనియు నున్నది. ఎక్కడ కపడోసియా? మఱియెక్కడ నార్యావర్తము? ఈ శాసనములోని విషయములు క్రీస్తుకు బూర్వము 1400 సంవత్సరము నాడు జరిగెను. అంతటి ప్రాచీనకాలమందే వేదమత మెట్లు ప్రచారము చేయబడెనో యూహించవచ్చును. బౌద్ధమత ప్రచారము నానా దిగంతము లందెట్లు ప్రచారము గావింపబడెనో చరిత్రజ్ఞులకు విదితమే. బౌద్ధులయొక్క ప్రాచీన గ్రంథములగు “జాతకముల”లో హిందూ వర్ణవ్యవస్థను గుఱించిన విషయములనేకములు కలవు. రిస్‌డేవిడ్సు పండితుడు తన (Budhist India) గ్రంథమున నిట్లు వ్రాసియున్నాడు. ఈ క్రింది యుదాహరణముల వలన నా కాలమున జాతులలో సమ్మేళనము ధారాళముగా జరిగెనని విశదమగు చున్నది.
1. ఒక క్షత్రియుడు క్రమముగా కుమ్మరివాని దగ్గఱ, మేదరవాని దగ్గఱ పుష్పలావిక దగ్గఱ, బానిసీని దగ్గఱ పనులను నేర్చుకొనెను. కాని వానికి కులము తప్పుపెట్టిన వారెవ్వరును లేరు (జాతకము 2,5,290)
2. ఒకరాజు రాజ్యము వదలి బేరియయ్యెను (జాత. 2,87)
3. ఒక బాపడు వ్యాపారము చేయుచుండెను (జాత. 4, 15)
4. బ్రాహ్మణులు వేటకాండ్రు (బోయలు)గా, పసుల కాపరులు (గొల్లలు)గా నుండిరి (జాత. 2,200)
5. ఒక క్షత్రియుడు వదలిపెట్టిన భార్యను బ్రాహ్మణుడొక్కడు పెండ్లి యాడెను. (జాత. 5,280)
పై యంశముల వంటి వనేకములు వందలకొలదిగా జాతకములందు పరిశోధించువారికి గోచరించును. ఆ కాలమున మొదటి తరగతిలో క్షత్రియులను, రెండవ తరగతిలో బ్రాహ్మణులను, జైన, బౌద్దులుంచినట్లు తెలియుచున్నది. జాతకములలో బ్రాహ్మణులు హీనజాతి (హీనజక్కోపాళి) వారుగా ననేక స్థలములందు సంబోధింపబడియున్నారు. జైన గ్రంథములలో క్షత్రియులే యగ్రజాతి వారనియు వాసినట్లు రిన్‌డేవిడ్ పండితుడు సెలవిచ్చి యున్నాడు. ఈ సందర్భమున ప్రాచీనార్యులతో కలసిమెలసియుండి కొంతకాలమునకు భిన్నాభిప్రాయులై వేరుపడి ప్రకృతము పర్షియా దేశమును జేరిన జరత్వష్ట మతమువారగు పార్సీల భాషలోని కొన్ని పదముల విమర్శనము గమనింపదగియున్నది.
ఆధునిక ఉర్దూ పండితులగు ఆజాద్‌గారు తమ సఖున్ దానె ఫారిస్ అను గ్రంథమున 66 వ పుటలో నిట్లు వ్రాసియున్నారు : ఆర్య : విచిత్రమేమనగా పర్షియా దేశపు ప్రాచీన గ్రంథములలో ఆర్యన్ లేక ఈరాన్ పదమునకు జ్ఞాని, పెద్దమనుష్యుడు మఱియు తెలివిగలవాడు అను నర్థములు చేసియున్నారు.
జందాల్ : ఫార్సీలో పనికిమాలిన వారి గుంపునకు, నీచునకు, మరియు త్రాగుబోతునకు అర్థము చేసియున్నారు. సంస్కృతములో నీచుని “చండాల” యని పిలుతురు. ఈ జనులు మొదట కల్లు గీయుచుండిరి. పందుల మేపుచుండిరి మఱియు సర్వ విధములగు నీచకార్యములు చేయుచుండిరి.
హిందువు లితర మతస్థులను తమ మతములోనికి దీసికొనవచ్చునా యను ప్రశ్న నేడు చాల చర్చింపబడుచున్నది. ఆనాడీ ప్రశ్నయే లేకుండెను. ఇతర మతస్థులనేకులు హిందువులై యుండిరి. కపడోషియాలోని జాతులు వేదకాలపు దేవతల బూజించుచుండిరని నివేదించియుంటిని. ఆ జాతులను నార్యులు మ్లేచ్చులని వ్యవహరింతురు. అది తప్పు. సుమారు 2300 సంవత్సరముల క్రిందట నుండిన పతంజలి మహర్షి తమ పాణినీయ మహాభాష్యములో పశ్పశాహ్నికములో వ్యాకరణమును జదువుట వలని ప్రయోజనములలో నొకటిగా “మ్లేచ్ఛో నాపభాషితవై” యని యుదహరించి యున్నారు. అనగా మ్లేచ్ఛులవలె మాట్లాడకుండుటకై వ్యాకరణము చదువవలెను అని భావము. అనగా మ్లేచ్ఛులు సంస్కృతము కన్న వేరగు భాషను వ్యవహరించుచుండిరనియు, నయ్యది యపభ్రంశముగా నుండెననియు, నట్టి భాషను మాట్లాడు జాతులు మ్లేచ్ఛులుగా బరిగణింపబడుచుండిరనియు నీ జాతులు కూడా హిందూమతమును స్వీకరించి యుండిరనియు విశదమగును.
అలెగ్జాండరు కాలములో గ్రీకు దేశమునకు ఆర్యావర్తమునకు నుండిన సంబంధము అలెగ్జాండర్ చక్రవర్తి మన దేశముపై దండెత్తి వచ్చిపోయిన తర్వాత నింకను విశేషమయ్యెను. చంద్రగుప్తుడు (క్రీ.పూ. 330-298) దనపై దాడి వచ్చిన గ్రీకు సేనానియగు సెల్యూకస్ నికేటర్ అనువానిని యుద్ధమందోడించి వానినుండి జెడ్రోషియా, ఏరియా, అరకోసియా మున్నగు రాష్ట్రములను లాగికొనెను. క్రీ.పూ. 300వ సంవత్సరమున నీ గ్రీకు దేశీయుడగు సెల్యూకస్ బిడ్డను బెండ్లియాడెను. ఒక హిందూ చక్రవర్తి యొక యవన స్త్రీని పెండ్లియాడిన నాక్షేపించినవారే లేరు. కాళిదాసు తన శకుంతలా నాటకములో నొక రంగమందు దుష్యంతుడు యవనస్త్రీలచే పరివృతుడై కణ్వాశ్రమమున వేటాడినట్లు నిరూపించినాడు.
విదూషకుడు : “ఏషఖలు బాణాసన హస్తాభి ర్వసపుష్పమాలాధారణీబి ర్యవనీభిః పరివృత ఇతేవాగచ్చతి వయస్యః!” దీనివలన కాళిదాసు కాలములో రాజులు యవనస్త్రీలను దమ నగరులందుంచి యుండిరని యూహింప వచ్చును. యవన పదమును అయోనియన్ దేశీయులకు (Greek) సంస్కృతములో వాడియున్నారు.
క్రీ॥శే॥ ఆచార్య భండార్కర్‌గారు 1911లో నిట్లు వ్రాసియుండిరి. “చిత్రమేమన విదేశీయులు హిందూమతమును స్వీకరించినదే కాక కొందరు హిందూనామములను గూడబెట్టికొనిరి. ఇండో పార్ధియన్ శాఖకు మూలపురుషుడగు గొండఫేరిన్ తన నాణెములపై యొకప్రక్క త్రిశూలధారియైన శివుని విగ్రహమును జెక్కించి యుండెను. ఇదే ప్రకారము వేమ కాడ్ఫిసీన్ అనువాని నాణెములపై శైవ విగ్రహములున్నవి. కానిష్క హువిష్క వాసుదేశ, అనువారు పైవాని వంశీయులు. వీరు సిథియన్ జాతివారైనను హిందూనామములు ధరించిరి. మఱియు సోఫిటీస్ అను గ్రీసు దేశీయుడు తన పేరును సౌభూతియని మార్చుకొనెను.
కాంబోడియా దేశమును నాదేశీయులు పునావ్ అని యందురు. దీనినే సంస్కృతమున కాంభోజియని వ్యవహరించిరి. క్రీ.శ. ప్రథమ శతాబ్దములో హూన్‌టైన్ అను బ్రాహ్మణుడీ దేశస్థులను హిందూమతములోనికి పరివర్తనము చేసెను. ఈ హూన్‌టైన్ అనువాడే 'కౌండిన్యుడు' అని పండితులు నిశ్చయించినారు. కాంబోడియా దేశములో నీ ప్రకారమొక గాథ కలదు : అచ్చట నొకరాణి 'యేలియో' అనుచున్నది రాజ్యము చేయుచుండెననియు, దానిని జయించి కౌండిన్యుడు పెండ్లియాడెననియు తర్వాతి రాజులు వీరి సంతతియే యనియు నీ గాథ చెప్పుచున్నది.
కుషనులు, హూణులు అను తెగలు మ్లేచ్ఛ తెగలై యుండెను. క్రీ.శ. 399-414 కాలములో పలు తెగలు పొందూమతములో చేరిపోయెను. కుషన్‌జాతికి జేరిన కనిష్కరాజు సంస్కృత వాఙ్మయ ప్రియులకు బాగుగాఁ దెలియ దగినవాడు. జగద్విఖ్యాతుడగు చరక పండితుండు (వైద్య గ్రంథకర్త) ను, కాత్యాయని పుత్రుడును, నితని శిష్యుడగు అశ్వఘోషుడును నీ రాజును ఆశ్రయించి యుండిరి. కచయను దేశమును పాలించిన రాణి కుమారయానుడను హిందూ యువకుని బ్రేమించి పెండ్లియాడెను. వీరికి కుమారజీవుడు అను కొడుకు జనించెను. ఈ బాలుని వాని దల్లిదండ్రులు కాశ్మీర దేశమందు జదివించిరి. వీడు క్రీ.శ. 413 సంవత్సరములో మరణించెను.
తిబ్బెట్టు దేశము (త్రివిష్టపము) ను క్రీ.శ. 630 నుండి 698 వరకు పాలించిన గంపోయను రాజు నేపాల దేశపు రాజు బిడ్డను, చీనా దేశపు కన్యను, నిద్దఱను బెండ్లియాడెను; కాని, హిందూరాజగు నేపాళరాజు నిక్కడ వెలిబెట్టిన వారు లేరు.
సముద్ర ప్రయాణము హిందువులు చేయకూడదను కొన్ని తప్పుడు శాస్త్రములు కలవు. కాని, ప్రాచీన కాలము నుండి మొగలురాజుల ప్రభుత్వము వరకు - తుదకు గత శతాబ్దాది వరకు హిందువులు సముద్ర వ్యాపారము చేసినట్లు వేనవేలు నిదర్శనములు కలవు. ఆ దివ్య కాలమంతరించినతోడనే స్వాతంత్ర్యము, దేశ సంపద, ఆత్మగౌరవము అన్నియు నశించెను. కథాసరిత్సాగర మందలి కథలనేకములు సముద్ర సాహసములను సూచించుచున్నవి. మరియు ఈజిప్టు దేశపు శవముల (Mum- mies) ను బట్టలతో కప్పినది భారతదేశము. గ్రీకు దేశముతో 3 వేల యేండ్ల క్రిందట వ్యాపారము చేసినదియు, ఇటలీ దేశ సంపదను జూరగొనినదియు, జావా, బలి, బోర్నియో, చీనా దేశములతో సంబంధములు చేసినదియు నీ భారతదేశమే. చీనా దేశములో బౌద్ధమత వ్యాప్తిచేయుట కనేక పండితు లాదేశమున బోధించి వచ్చిరి. క్రీ.శ. 67లో మతంగ, ధర్మరక్ష అనువారు చీనాలో ప్రచారము చేసిరి. జావా మున్నగు ద్వీపములలో హిందూ దేవాలయములు, భారతము వంటి హిందూ పురాణములు నేటికిని హిందువుల ప్రాచీనౌన్నత్య నిదర్శకములుగా వెలయుచున్నవి. క్రీస్తునకు పూర్వము 150 సంవత్సరముల నాడు అనగా (2100 ఏండ్ల క్రిందట) ఒక యవన (గ్రీసు) రాజు వైష్టవమత మవలంబించెనని ప్రసిద్ధమైన బాస్నగల్ శాసనము ప్రపంచమునకు నేటికిని చాటుచున్నది. మఱియు మిళింద పంథ (Questions of Minondar) యను గ్రంథములో బౌద్ధ బోధాలున్నవని పండితుల యభిప్రాయము.
సూత్ర కాలము హిందూమతముయొక్క క్షీణదశను సూచించు కాలము. ఈ కాలమందే యెవరికి దోచినట్లు వారు శాసింప మొదలిడిరి. ఈ కాలమందే అనులోమ ప్రతిలోమ వివాహములు నిరూపింపబడి సవర్ణ వివాహములు, సవర్ణ భోజనములు విశదీకరింపబడెను. ఈ కాలమందే శూద్రులను, స్త్రీలను, అస్పృశ్యులను కఠినముగా నన్యాయముగా జూడ మొదలిడిరి. అయినను నచ్చటనచ్చట కొన్ని సూత్రములలో వర్ణభేదము లంతగా బాటింపకుండిన విషయములు గొన్ని గోచరించుచున్నవి. ఒక యుదాహరణమును జూపెద : ఆపస్తంబ సూత్ర గ్రంథములో ప్రశ్న 2., పటలము 2, ఖండము 3, సూత్రము 4,5,6,7,8,9 జదివినచో నందు శూద్రులచే వండబడిన యన్నమును పై మూడు జాతులవారు భుజించుచుండిరని తెలియగలదు.
శంఖ లిఖిత సృతియందు హిందువులను మ్లేచ్ఛాది జాతులు బలవంతముగా తమ తమ మతములో చేర్చుకొని నట్లైన వారిని మరల ప్రాయశ్చిత్తముతో హిందువులనుగా జేయవచ్చునని ప్రమాణములున్నవి. మతాంతరములో జేరిన వారిని మొన్న మొన్నటివఱకు గూడా హిందువులు పునఃస్వీకారము చేయుచుండిరి. “క్రీ.శ. 1756లో బసాలత్ జంగ్ అను నతడు ఆదోని నవాబుగా నుండెను. ఇతనికి పత్తికొండ పటేలు పట్వారీలగు సోమిరెడ్డి, పంగనామాల చిన్న తిమ్మన్న యనువారు పన్నులు చెల్లించజాలకపోయినందున వారిని బసాలతు జంగ్ బాధింపగా నందు చిన్న తిమ్మన్న తన భార్యను, పిల్లలను జమానతుగా నవాబు దగ్గర నుంచి పోయెను. వీరికి బసాలతు జంగ్ బలవంతముగా భోజనము తినిపించెను. పూనా పేష్వా యగు శ్రీనాథయను నతడీవార్త విని తక్షణమే ఈ కరణము యొక్క భార్యను పిల్లలను నవాబు వశము నుండి వదలించెను. అందు వానప్పయను బాలుని మాత్రము బసాలతుజంగ్ భార్య తన దగ్గరనే యుంచికొనెను. మిగతావారిని ప్రాయశ్చిత్తముతో బ్రాహ్మణులు స్వీకరించిరి” (కర్నూలు జిల్లా మాన్యువల్)
పై కొన్ని యంశముల వలన ప్రాచీనార్యులలో వర్ణ వ్యవస్థ నేడుండినంతటి కఠినముగా లేకుండెనని చెప్పవచ్చును. హిందువులు మరల తమ పూర్వౌన్నత్యమును నభిలషించిరేని జాతి మత వైషమ్యముల వదలి విశాలహృదయులై మతాంతర వ్యాప్తిని గావింపబడవలసియుండును. కాలమెంత తీవ్రముగా మారునో హిందువులు కూడ నంత తీవ్రముగా మారవలెను. తుర్కీ ఆప్ఘనిస్థాన్, చీనా, ఈజిప్టుల చరిత్ర నించుక విమర్శించి చూచుకొనవలయును.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse