Jump to content

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/పల్లెపదాలు

వికీసోర్స్ నుండి

పల్లెపదాలు

1

నన్నయభట్టు కాలమునుండియు ఆంధ్రులు సంస్కృత ప్రాబంధిక కవితా పద్ధతికే ప్రాధాన్యతనిచ్చిరి. నన్నెచోడుడు తన కుమార సంభవములో నిట్లు వ్రాసెను.


“మును మార్గ కవిత లోకం
బున వెలయగ దేశికవితబుట్టించి తెనుం
గున నిలిపి రంధ్ర విషయం
బున జనజాళుక్య రాజు మొదలుగ పలువుర్‌”.


అనగా చాళుక్య రాజుల కాలములో (మార్గ కవిత) సంస్కృత కవితా పద్ధతి దేశాన్ని ముంచివేసిందట, అప్పటికే (దేశి కవిత) సంస్కృత మర్యాదకు భిన్నమైన తెనుగు కవిత్వము ప్రచారములో నుండినది. మరల అట్టి దానినే చాళుక్యుల తర్వాత శివకవులు తెలుగుదనాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసి పుణ్యం కట్టుకున్నారు. బసవ పురాణంలో పాల్కురికి సోమనాధ కవి నాథుడిట్లు వ్రాసినాడు:


“ఉరుతర గద్యపద్యోక్తుల కంటె
సరసమై పరగిన జాను దెనుంగు
చర్చింపగా సర్వ సామాన్య మగుట
గూర్చెద ద్విపదలు కోర్కెదైవార
తెలుగు మాటలనంగ వలదు వేదముల
కొలదియు కాజూడుడిలనెట్టులనిన.


ఇదే సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో తన కాలమందుండిన నానావిధ పదములను (పాటల భేదములను) గురించి యిట్లు పేర్కొన్నాడు.


“మదినుబ్బి సంసార మాయాస్తవంబు
పదములు “తుమ్మెద పదముల్‌” “ప్రభాత
పదములు” “పర్వత పదము” “లానంద
పదములు” “శంకర పదముల్‌” “నివాళి
పదములు” “వాలేశు పదములు” “గొబ్బి
పదములు” “వెన్నెల పదములు” సెజ్జ
వర్ణన, మరి “గణ వర్ణన పదము”
ఆర్ణవ ఘోషణ ఘూర్ణిల్లుచుండ
బాడుచు నాడుచు పరమహర్షమున....”


జానుతెనుగులోనేమి విశేషము? అనిన సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో మరలనిట్లు పల్కినాడు.


“ఆరూఢ గద్య పద్యాది ప్రబంధ
పూరిత సంస్కృత భూయిష్ట రచన,
మానుగా సర్వసామాన్యంబుగామి,
జానుతెనుగు విశేషము ప్రసన్నతకు”


సోమనాథుడు పేర్కొన్న తుమ్మెదపదాలు, ప్రొద్దు పొడుపు పాటలు, నివాళి పాటలు, వాలేశు పాటలు, గొబ్బిళ్ళు, వెన్నెల పాటలు ఇవన్ని యెందరికి తెలియును? ఇందులో చాల భాగము నశించినట్లే కదా?


తెనుగువారు సంస్కృత కవులననుసరింపబోయి అటు పూర్తిగా సంస్కృతాన్ని సాధించలేకపోయిరి. ఇటు తమ జాతీయతను పోగొట్టుకొనిరి. పైగా తమ స్వచ్ఛతను నిలబెట్టే దానికి ప్రయత్నం చేసిన మహానుభావులను బాగా వెక్కిరించినారు.


“ఇవేం పాటలోయ్‌, పిచ్చికుంట్ల పాటలు, ముసలితనాన మిండరికమువలె మొగడుపోయిన పిదప జేసే లంజరికము వలెనే ఉందే” అని కొక్కిరించినాడట శ్రీనాథకవి సార్వభౌముడు. అతని ఆసరాచూచుకొని వేణుగోపాల శతకం వ్రాసినాతడు “ఇదేటి ద్విపదనోయ్‌. ముసలితనాన లంజరికం చేసేదాని సరసంగా ఉందే” అని వెక్కిరించినాడు. విజయనగర రాజులు, రెడ్డిరాజులు మరీ విజృంభించి పూర్తిగా దేశికవితను అణగద్రొక్కిరి. ధనికులు కృతక లోకంలో సంచారం చేసినారు. బీదవారు దిక్కులేక వెర్రిచూపులతో చూచినారు. పండితులు రాణివాసాల ముచ్చట్లు వ్రాసినారు. గిరికాదేవి, వరూధిని, యామినీ పూర్ణ తిలక వంటివారు విరహతాపాలు పొంది చిగురుటాకులు కలువలు తెప్పించుకొని వాటిపై పండుకున్నారు. ఉస్సురంచూ బుసకొట్టినారు. చంద్రుణ్ణి ఏడుతరాలటూ ఏడుతరాలిటూ ఎగదీసి దిగతీసి చెడతిట్టినారు. మన్మథుణ్ణి మరీ తూర్పారబట్టినారు. కోయిలలను ఒక చెట్టు మీదనైనా ఒక క్షణమైనా కూర్చోనిచ్చిన వారు కారు. ఇట్లు నానా భీభత్సపడినారు. చదువురాని వారికి కీలకాలన్ని తెలియకపోయెను. చంద్రమ్మ యెంకయ్యలు తమకు వచ్చినట్లు వినోదం చేసుకున్నారు. బుద్ధులు చెప్పేవారు లేనందున ఇచ్ఛావిహారంగా ప్రవర్తించుకున్నారు. లేకపోతేనా చంద్రమ్మ ముందుర గిరికాదేవి నాల్గు గిరాట్లు కొట్టియుండేది. పామర జనులు తమకు తోచిన భావాలను దేశీయగానములలో ద్విపదలలో రగడలలో పాడుకున్నారు. అవియే వారికానందము కలిగించి వారి జీవితాలను తరింపజేసినవి. పల్లెటూరి వేదాంతులు తమకు తోచిన తత్వాలు పాడినారు. జనులు గుంపులు గుంపులుగా మూగినారు. వారికి దాసానుదాసులైనారు. పీఠాధిపతులు అప్పుడప్పుడు తమ ప్రాంతాలకు ఏనుగునెక్కి భేరీభాంకారములతో పంచమహాధ్వనులతో సకలాట్ట హాసములతో వచ్చేవారు. పెద్ద పెద్ద సిద్ధాంత చర్చలు చేస్తే పల్లెటూరివారు మనకేమి తెలుస్తుంది పదరా అని వెళ్ళిపొయ్యేవారు. ఉగాది దాటిందంటే జంగం కథ వారు వచ్చి తాంబూరా ఢక్కా తీసుకొని తాండ్ర పాపారాయుని కథనో, బాలనాగమ్మ కథనో, కాంభోజరాజు కథనో, స్థానిక వీరుల సుద్దులనో తందాన తాన లయ యుక్తముగా రాత్రుల్లంతా పాడినప్పుడు పిల్లలూ తల్లులూ ముసలివారు, కాపులూ, గొల్లలూ, మాలలూ, మాదిగలూ మున్నగు జాతుల వారంతా ముచ్చటగా వినిపొయ్యేవారు. బయలు నాటకాలో తోలుబొమ్మలోవస్తే మునిమాపే జనులు ఊరి ముందటి బయలంతా నిండిపోయి గొంగళ్ళను వేసుకొని ముచ్చటగా కూర్చునేవారు. ఈ విధంగా రాజాదరణ లేకున్నా పండితులు నిరసించినా, కవులు వెక్కిరించినా, బీద జనులు మాత్రం తమ నిజమైన “దేశికవిత"ను పోషించుతూ వచ్చినారు.

“ఈ దేశికవితలో ఏమైనా పొగడదగిన విషయముందా? ఎందుకింత ఆర్భాటం చేస్తారు. ఏదీ? ఏమీ విశేషమో చూపించండీ” అని భాషా సనాతనులెవరైనా హుంకరించవచ్చును. మనవి చేసుకుంటాను వినండి. సవాలుకు సవాలు చేస్తే అదే మంచి జవాబు. “మీ ప్రాబంధిక కవిత్వంలో మీరేమి గొప్ప తనం చూపించుతారయ్యా” అని ప్రశ్న వేయుచున్నాను. ఎంతసేపు చెప్పినా పంచకావ్యాల మాటే. అందు అస్వాభావికము, కృతకము ఎంత కలదో చెప్పండి. పదాడంబరము కవిత్వమేనా? నోరుబట్టని సంస్కృత దీర్ఘసమాసాలు తెనుగేనా? వర్ణనలన్నీ సహజమేనా? కథలలో నవ్యతయున్నదా? లేక “ఉండంగా ఉండంగా ఒక రాజుండె, ఆయన వేటకు పోయెను, ఒక సుందరాంగిని చూచెను. మన్మథుడు నాయికా నాయకులపై బాణాలు వేసెను. ఇద్దరున్నూ పొర్లి పొర్లి చచ్చే అంత విరహతాపం అనుభవించి, ఎట్లో భేటీ అయినారు. తర్వాత పెండ్లి, శోభనం, పుత్ర జననం, కథ కంచికి మనమింటికి” ఇంతకు మించిందిం కేమైనా ఉన్నదా? కొన్ని ఉత్తమ గ్రంథాలున్నవిలెండి, అవి వ్రేళ్ళమీద లెక్కకు వచ్చేవిగా నున్నవి.

మరి తందాన కథలలో, పాటలలో, జానపదుల గేయాలలో, స్త్రీల పాటలలో నిజమైన కవిత ఉంది. ఉత్ప్రేక్షాతిశయోక్తులను, శాస్త్రోక్తముగా సరిచూచి వీరు వ్రాయించుకోలేదు. ద్వ్యర్థిత్యర్థి చతుర్థి అను వ్యర్థములను గాని, చక్ర, నాగ, ఖడ్గాది బంధాలను గాని చెక్కించుకోలేదు. వీరి భాషను మనమింకా నేర్చుకోవలసియున్నది. వీరి పాటలలో నిజమైన తెనుగు నుడికారమున్నది. సూటిగా మనకు తగిలే భావాలున్నాయి. వీరి కథలకు భాష్యకారులతో, పౌరాణికులతో, వ్యాఖ్యాన కర్తలతో అవసరము లేదు.

“అయితే వీటివలన నేమి లాభమయ్యా” అని ఒక గడ్డు పండితుడు నిలదీసి అడుగవచ్చును. మాటకు మాట. “మీ ప్రబంధాల వల్ల ఏమి లాభమయ్యా” అంతకంటే ఎక్కువ లాభకారి కాకున్నా అంతమాత్రమైనా లాభకారిలెండి. ఏ జాతి తన పూర్వ సంస్కృతిని, తన జనుల విశ్వాసములను, భారత గాథలను, కథలను, పాటలను విస్మరించునో ఆ జాతికి నిష్కృతియే లేదు. పాశ్చాత్య దేశాలలోను గత శతాబ్దములో (Folk Tales) జనుల కథలను, (FOlk songs) జనుల పాటలను, (Ballads) వీర గాథలను ఉదహరించినారు. ప్రాచీనమందు పాళిలో బౌద్ధ జైనులు వ్రాసిన “జాతక కథలు” సంస్కృతమందు వ్రాసిన హితోపదేశ కథలు, భేతాళ పంచవింశతి, పంచతంత్ర కథలు, కథాసరిత్సాగరము ఇట్టి వాటిలోనెల్ల పిట్ట కథలు, నక్క బావ కథలు, పిల్లిమామ కథలు ఎందుకు వ్రాసినారు వారంతా పిచ్చి పుల్లయ్యలేనా మరి. క్రీ. శ. 1703లో స్కాట్లండు దేశీయుడగు ఆండ్రూ ప్లెచ్చర్‌ అను దేశభక్తుడు “ప్రతి జాతి యొక్క జానపదములు ఆ జాతి యొక్క శాసనాల కన్నను ముఖ్యమైనవి” అని సెలవిచ్చెను. మన తెనుగు వారిలోని జానపదులు చారిత్రక గాథలు, శృంగారము, వేడుకలు, వినోదాలు, కష్ట సుఖాలు అన్నింటిని గేయ రూపములో పాడుకొంటూ వచ్చినారు. శోభనాలు, సువ్వాలలు, ధవళాలు, సుద్దులు ఇవన్నియూ గాన యుక్తములే. మోటకొట్టినా, కలుపు తీసినా, దంచినా, విసిరినా, బంతి తిప్పినా, చేల కోతలు కోసినా, పండుగలు పబ్బాలు చేసుకొన్నా, తుదకు శవాన్ని కాటికి తీసుకొనిపోయినా తదనుగుణ్యమైన గానములను చేసినారు. ఇవన్నియు నుద్ధరించినచో భాషకు గొప్ప అభివృద్ధి. కవితకు విజృంభణము, జన సామాన్య సముద్ధరణానికి సులభ మార్గము అలవడుతుంది.

2

పూర్వమందు తెనుగుదేఫశములో మార్గకవిత, దేశికవిత యను రెండు విధాల కవిత్వముండినట్లు మనకు మొదటిసారి నన్నెచోడుని కుమార సంభవము ద్వారా తెలిసినట్లు చూపించియుంటిని. అయితే ఈ విభాగము తెనుగు కవులు చేసినదేనా లేక మరెందైనా ఇట్టి మర్యాద యుండెనా అని చూచిన ఇది అతి ప్రాచీనము నుండియు వర్తించినదని తెలియగలదు. ఆది కావ్యమగు వాల్మీకి రామాయణములోని బాలకాండలోని చతుర్థ సర్గలో కుశలవులు వాల్మీకిచే రచితమగు రామయాణమును శ్రీరాముని కాలములోనే వారి సన్నిధిలోనే గాన లయయుక్తముగా పాడిరని తెలుపబడినది. ఎట్లన -


శ్లో॥ తతస్తు తౌ రామవచః ప్రచోదితా
      వగాయతాం మార్గవిధాన సంపదా
      సచాపిరామః పరిషద్గతశ్శనై
      ర్బుభూషయాసక్త మనాబభూవ బాల -4 సర్గ శ్లో.31


అనగా శ్రీరాముల ప్రేరణచే ఆ లవకుశులు “మార్గము” అనునట్టి పద్ధతితో గానము చేసిరి. రాముడును చాలా ఆనందించిన వాడయ్యెను అని యర్థము. ఈ

శ్లోకముపై వ్యాఖ్యానకర్త లిట్లభిప్రాయమిచ్చినారు.


“మార్గ విధాన సంపదా దేశీ మార్గశ్చేతి ద్వౌగాన ప్రకారౌ
తత్రమార్గస్సార్వత్రికః దేశిక్వాచిత్కః
దేశిశేషణైరపేక్ష్యేణ శాస్త్ర ప్రతిపాది
తో మార్గస్సార్వత్రికరాగ ప్రకారః
తయోర్మధ్యే మార్గ నిర్వాహ సామగ్ర్యా గాయతాం”


మార్గము, దేశి అను రెండు విధాలైన గానములుండెననియు, మార్గవిధాన గానము దేశమంతటను వ్యాపించినట్టి సార్వత్రికమైనట్టిదనియు, దేశి విధాన గానము కేవలము క్వాచిత్కమైనదనియు అనగా కొన్ని ప్రాంతాలలో నుండినట్టిదనియు వ్యాఖ్యాన కర్తలు తెలిపినారు. అనగా మార్గ గానము సంస్కృత భాషాయుక్తమనియు దేశిగానము, ప్రాంతీయ ప్రాకృతాది భాషలతో కూడినట్టిదనియు మన మర్థము చేసుకొనవచ్చును.

మొదటి వ్యాసము వ్రాసిన తర్వాత ఏప్రిల్‌ నెల మాడరన్‌ రెవ్యూ చూచితిని. అందు “ఊర్మిళాదేవి నిద్ర” అను తెనుగునాటి పాటను ఇంగ్లీషు ఛందస్సులో అనువదించి 5-6 పుటల పెద్ద వ్యాసాన్ని దేవేంద్ర సత్యార్థి అనువారు వ్రాసినది చూచితిని. నేనున్నూ ఎన్నెన్నో గ్రంథాలు చదివినానని గర్వించిన వాణ్ణి కదా- మరి మాడరన్‌ రెవ్యూలో ఒక పంజాబీ పండితునిచేత శ్రమించి సంపాదించినట్టి తెనుగు దేశములోని ఆడువారు పాడుకొను పాట నింతవరకు చూడకపోతినే అని వెంటనే గ్రంథమెంతటిదో వెలయెంతనో తెలియక 6 అణాలు మనిషి చేతిలో బెట్టి గుజరీ పాతచ్చులో దొరకవచ్చును “ఊర్మిళాదేవి నిద్ర' అనే పుస్తకాన్ని కొనుక్కురా అని పంపితిని. 8 పుటల గ్రంథము వెల ఒక అణా. అందు ప్రారంభమిట్లున్నది.


శ్రీరామ భూపాలుడూ
         పట్టాభి
షేకుడై కొలువుండగా
భరత శత్రుఘ్నులపుడా
         సౌమిత్రి
వరునకు సేవలు చేయగా


ఈ ధాటిపై కథంతా నడిచింది. ఇట్టివింకా చాలా కథలున్నవని విన్నాను. ఒకనాడు పని కల్పించుకొని పాతచ్చు పెద్దచ్చు పుస్తకాల వారి వద్దకు పోయి అవన్ని సేకరించుతానులెండి. అయితే చెప్పవచ్చినదేమంటే మన తెనుగు ఊర్మిళను గౌరవింపకపోతిమి. ఇంగ్లీషులో కెక్కవరకు గౌరవము కలిగినది. చూచినారా? ఇతర రాష్ట్రాల వారు దేశికవిత నుద్ధరించుటకై యెంత కృషి చేయుచున్నారో?

పూర్వము మనదేశములో “కోలన్న” లేక “కోలాటము” అను వేడుక ఆటపాటలతో కూడినది సాధారణముగా నుండెడిది. ఆడువారు కోలాటమును జడవలె త్రాళ్ళనల్లుట ఇప్పటి నాగరికులకు పరిచితమైంది. కాని పురుషులు 10-12 మంది కలిసి యెత్తులు అందెలు వేయుచు పాటలు పాడుచు కోలలు కొట్టుచు పండుగల వేళలలో వెన్నెల రాత్రులలో వినోదాలు చేసేవారు. సుమారు 200 ఏండ్ల క్రిందటి వాడగు గండ్లూరు నరసింహరాయ కవియను కర్నూలు మండల కవి తన భాషీయదండకములో ఒక స్త్రీచే నిట్లు పలికించినాడు. “నీవాడ కోలన్న వేస్తుండగా చూసినాల్నుండి నాకిట్లరా తాపమంటింది. (విరహతాపము కలిగింది)” ఇప్పుడు మన దేశీకోలన్న మాయమగుచున్నాడు. పండరి భజనలు ఆస్థాన మాక్రమించుకున్నవి. ఈ కొత్తదానిలో మన పూర్వపు దానిలోని ధాటి, దర్జా, వీరత్త్వము కానరావు.

మనదేశములో జంగము కథలు (తందాన కథలు) ఎన్నియున్నవి, విద్యావంతులమనుకొన్నవారు వాటిలో ఒకటి రెండైన ఎప్పుడైనా విన్నారా? మరి భావకవులమని చెప్పుకొనుచు ప్రబంధాల పేరు చెప్పితే తలనొప్పి కలిగిందని తలపట్టుకొనువారు, ఈ జంగము కథలలో పాట, భావము, చరిత్ర, వర్ణన, సులభశైలి, అచ్చతెనుగు నుడికారము, అన్నియు నున్నవి కదా. ఉద్ధరించే ప్రయత్నమేమైన చేసినారా? ఈ నిజాము రాష్ట్రములోనే వనపర్తి సంస్థాన పూర్వికులగు సవై వెంకటరెడ్డి, రాజారామేశ్వరరావు అను వీరుల కథలను, చించోడివారి పూర్వీకుల కథలను, గద్వాల వారిలో సోమనాద్రి కథను, పాపన్న వారి పూర్వీకులలో రాణీ శంకరమ్మ, నరసింహారెడ్డి సదాశివరెడ్డి కథలను తందానవారు తరతరాలనుండి చెప్పుచున్నారు కదా! పై సంస్థానాల వారు తమ పూర్వీకుల యశోగానాలను సమకూర్చి సంస్కరించి, చారిత్రక సమన్వయముతోను, ఇతరాధారాములతోను కూడిన పీఠికతో ముద్రించరాదా? అదొక కష్టమా? నష్టమగు కార్యమా? నిజాం రాష్ట్రములో ఇంకను ఎన్నియో కథలు ఆదరము లేక కాలగర్భములో పడి మాయమగుచున్నవి. భాషా సేవ జేయదలచిన వానికి చేతి నిండుగా పనియే దొరకును. స్త్రీలకు విద్య యెందుకు? స్త్రీలను నమ్మరాదు; (పురుషులను మాత్రము నమ్మవచ్చునేమో, పాపము వారెంతటి మేదకులో యేమో) స్త్రీలకు చదువు వచ్చిన తంటాలు చేయుదురు అను భావాలు హిందువులలో విశేషముగా వ్యాపించిపోయెను. ఆ కారణముచేతనోయేమో స్త్రీలు ఊర్మిళాదేవి నిద్రవంటి పాటలపై అభిమానము కలవారైరి. పెండ్లి పేరంటములలోను, పండుగలలోను, స్త్రీలు నానా విధములగు పాటలను పాడుకొని కాలము వెళ్ళబుచ్చుకొందురు. ఇప్పుడు ఆ సంతతివారు కూడ అరుదగుచున్నారు. ఆధునిక స్త్రీలకు పాతదంతయు మోటైపోవుచున్నది. తమ జాతీయ సంస్కృతిని విస్మరించుచున్నారు. కాని పాశ్చాత్య పద్ధతిలో అమిత దుష్టములగు నాచారములే మనవారి కెక్కువగా పట్టుబడుచున్నవి. వృద్ధులైన స్త్రీల నుండి పాటలనన్నిటిని సేకరించి వ్రాసుకొని కాపాడుట చాలా యవసరము. నానా ప్రాంతములలో ఇప్పటికిని పాటలు నేర్చినట్టి ముదుసళ్ళగు ఆడువారు చాలామంది కలరు. ఆ ముసలమ్మలు మోటువారనియు, విద్యాశూన్యులనియు, మూర్ఖులనియు, నవనాగరికులు భావించినందున వారిలో దాగినట్టి గేయ వాఙ్మయము ప్రకాశమగుట లేదు.

ఈ సందర్భములో ఒక సూచన చేయదలచినాను. మన ఆంధ్రులను ఆశ్రయించుకొని ఆంధ్రులుగానే పరిగణింపబడునట్టి అడవిజాతులవారు కలరు. చెంచులు అను తెగవారు కర్నూలు జిల్లాలోను మహబూబు నగరము జిల్లాలోను ఆమ్రాబాదులోను కలరు. అనగా శ్రీశైల ప్రాంతములో వీరున్నారు. మరియు “కోయదొరలు” అనుపేరుతో కోయజాతివారు వరంగల్‌ జిల్లాలోనున్నారు. సవరలు గంజాం జిల్లాలో కలరు. ఈ సవరలు (శబరులు) ఆంధ్రులు కారు. కాని పై చెంచుకోయవారాంధ్రులు. వారికి సమీపములోగల నాగరికులు వారి నుద్ధరించు విషయములో ఏమియు శ్రద్ధ తీసికొనుటలేదు. ఏ ఇంగ్లాండునుండియో, ఏ అమెరికా నుండియో వచ్చిన పాద్రీలు ఇట్టి జాతులకై శ్రమించుచున్నారు. వీరి భాషకు వ్యాకరణాలు, గ్రంథాలు వ్రాసినారు. వీరికి బళ్ళు స్థాపించినారు. వీరితో జీవితాలు గడిపి సంస్కరించినారు. మరి మనము వారి ప్రక్కననే యుండియు వారి భావాలు, వారి ఆచారాలు గమనింపకపోతిమి. ఈ చెంచుల నాటకము చాల అందముగా నుండును. వీరి పాట, వీరి ఆట మన ఆంధ్రులెల్లరు చూచినారు. గావున వీరికి సమీపములోనుండు మహబూబునగరు, వరంగల్‌ జిల్లా ఆంధ్రులు చెంచు కోయ సోదరుల విషయమై మంచి శ్రద్ధ తీసుకొని వారి పాటలను సేకరించగలరు. అవి కూడా భాషకుపకరించుకునేమో!

భారతదేశములోని మహారాష్టులు, కర్ణాటకులు, బంగాళీలు, హిందీవారు, తమ తమ భాషలలోని పల్లె పాటలను అప్పుడే సమకూర్చి అనేక గ్రంథాలను ముద్రించినారు. మన తెలుగులో ఒక గ్రంథమైనా ఈ విషయానికి సంబంధించినది కలదా? లేదు మరి తక్కిన భారతీయులకన్న మనమే తెలివిపరులమా యేమి? ఈ గేయ వాఙ్మయాన్ని ఉద్ధరించుటలో గ్రాంథిక వాదులకన్న భావకవుల మీదనే యెక్కువ భారమున్నది.

3

ఇదివరలో పల్లెపాటల యొక్క ప్రాముఖ్యమును వీలైనంతవరకు తెలుపుకున్నాను. అయితే ఇది ఎవరో నావంటి చాదస్థులకు పట్టిన పిచ్చియేనా కాక మరెవ్వరైనా యిట్టి పిచ్చివారున్నారా అని కొందరికైనా సంశయము కలుగవచ్చును. భారతదేశములో మనము తప్ప తక్కిన అన్ని భాషల వారును జానపదుల వాఙ్మయమును సేకరించి ఉద్ధరించి సమకూర్చి ముద్రించి తమ తమ భాషా సముద్ధరణమునకు తోడ్పడినారు. రెండవ వ్యాసములో దేవేంద్ర సత్యార్థి గారు మాడరన్‌ రెవ్యూలో వ్రాసిన మన ఊర్మిళాదేవి నిద్రను గురించిన దీర్ఘ వ్యాసమును గురించి సూచించితిని. సత్యార్థిగారు పంజాబు వాస్తవ్యులు. వారు మన తెలుగుదేశానికి వచ్చి తెనుగు వారి పరిచయాన్ని కలిగించుకొని మీలోనున్న పాటలేమి? అని విచారించి వాటిని సమకూర్చుకొని తర్జుమా చేసుకొని కష్టపడుచున్నారు కదా? వారి శ్రద్ధలో శతాంశమైన మనకు కలదా? ఈ సత్యార్థి గారు బెంగాలు, కాశ్మీరు, అయోధ్య, నాగపూరు, ఆంధ్ర, కర్ణాటక మున్నగు ప్రాంతాలన్ని తిరిగినారు.

ఈ సత్యార్థిగారు “రూరల్‌ ఇండియా” అను మాసపత్రికలో జనవరి సంచికలో “భారతదేశపు పల్లెపాటలే జాతీయ వాఙ్మయము” అనునొక అమూల్య వ్యాసమును వ్రాసినది చూడ తటస్థించినది. దానిని చదివిన తర్వాత మనమెంత వెనుకబడినామో మన వాఙ్మయానికి మనమెట్లపచారము చేయుచున్నామో మనకెంత అశ్రద్ధయు అనాదరణమును మన సోదరుల పాటలపై కలదో విశదమగును. సత్యార్థిగారు వ్రాసిన వ్యాసము నుండి కొన్ని భాగాల నిందుదుహరింతును.

“పంజాబులో నూర్లకొది గొల్లలు మంచి మంచి భావయుక్తమైన పాటలు పాడుచున్నారు.

గోండులు అను అడవిజాతి వారిలో మంచి సుందరమైన గానాలు కలవు.

“ఆంధ్ర దేశమందు పల్లెపడుచులు ప్రత్తి విరుచునపుడు ముద్దయిన పాటలు పాడుదురు”.

“పఠాన్‌ స్త్రీలు శతాబ్దముల తరబడి అందమైన పాటలు పాడుకొనుచున్నారు.

క్రీ. శ. 1872లో గోవర్‌ అను యూరోపియన్‌ దక్షిణ దేశపు పల్లెపాటలు (Folk songs of Southern India) అను గ్రంథాన్ని ముద్రించినారు. ఈ వాఙ్మయాన్ని తెలుపు మొదటి గ్రంథమిదే. 1885లో సర్‌.ఆర్‌.సి. టెంపిల్‌ పంజాబు లిజెండులు అను గ్రంథాన్ని ప్రకటించెను. చంద్రకుమారదేవు తూర్పు బంగళా గేయములు ప్రకటించెను. దీనినే ఇటీవల రోమన్‌ రోలెండుగారి సోదరి ఫ్రెంచి భాషలో తర్జుమా చేసి ప్రకటించెను. కే. యం. మున్షీ గుజరాతు వాఙ్మయము అను గ్రంథాన్ని ప్రకటించి అందు చాలా పాటలు ముద్రించెను. దానికి మహాత్మాగాంధీగారు పీఠిక రాశారు. రామనరేశత్రిపాఠీగారు “గ్రామగీతములు” అను గ్రంథాన్ని హిందీలో ప్రకటించెను. ఒక రైలు స్టేషనులో కొందరు స్త్రీలు తమ భర్తలు కలకత్తాకు పోవుచుండగా వారిని సాగనంపుటకై ఒక పాట పాడిరి. దాని అందము చందము విని త్రిపాఠీగారికి ఆనందమైనది. ఆనాటి నుండి వారు గ్రామ గీతాలను సమకూర్చుటలో నిమగ్నులైరి. స్త్రీలు వరి పొలాలలో కలుపు తీస్తూ పాడినప్పుడు అదేపనిగా పొంచి యుండి ఈ త్రిపాఠీగారు పొలములోని వరాలపై కూర్చుని విన్నది విన్నట్లుగా వ్రాసుకున్నారు. కొన్ని గ్రామాలలోని మంది అతన్ని చూచి ఎవరో ప్రభుత్వచారుడని భయపడి దూరము పోయినారు. ఇతడేదో తప్పుజేసి జైలు నుండి తప్పించుకొని పారివచ్చినాడురా అని గుసగుసలు పోయినారు. ఎట్లయితేనేమి పట్టినపట్టు వదలని ధీరుడు. అతడు హిందీలో “కవితాకౌముది” అను పేరుతో అయిదు పెద్ద సంపుటాలు ప్రకటించినాడు. అందులో పూర్వకవిత, ప్రాచీన కవిత, మధ్యకవిత, ఆధునిక కవిత ప్రకటించి తుది అయిదవ సంపుటములో “గ్రామగీతములు” ప్రకటించినాడు.

పండిత రామశరణదాసుగారు ఉర్దూలిపిలో “పంజాబుకే గీత్‌” అను గ్రంథాన్ని ప్రకటించినారు. సంత్‌రాం పంజాబీగీత్‌ అను గ్రంథాన్ని ప్రకటించెను. ఈ రెంటిలోను జానపదుల ప్రేమగానాలు పూర్వకాలము నుండి అనుశ్రుతముగా వచ్చుచున్న వాటిని సేకరించి ముద్రించినారు.

“రాజస్థాన్‌కీ లోకగీత్‌” అను హిందీ పాటల గ్రంథములో 230 పాత పాటలను క్రోడీకరించి ముద్రించినారు. ఇవన్నియు రాజపుత్ర స్థానములోని స్త్రీల పాటలు. ఇంకను ఈ పద్ధతిపై అచ్చైన గ్రంథాల సంఖ్య పెరుగుతూ వచ్చినది.

మదన్‌లాలూగారు మార్వాడీ గీతములను, నిహల్‌ చందువర్మగారు మార్వాడీ గీతములను, భేటారాం మాలీగారు మార్వాడీ గీతా సంగ్రహమును, తారాచందు ఓఝాగారు మార్వాడీ స్త్రీ గీత సంగ్రహమునున్ను జగదీశ సింగు గహిలోటు గారు మార్వాడకీ గ్రామగీత్‌నున్ను ప్రకటించినారు.

వెరియర్‌ ఎల్విన్‌ అను ఇంగ్లీషు పాద్రీగారు 290 గోండుపాటలను సేకరించి అరణ్యగానము (songs of the forest) అను పేర ప్రకటించినారు. మహారాష్ట్ర భాషలోని పాటలను కొన్నిటిని సేకరించి వామన్‌ కృష్ణ చోర్‌ఘారే అనువారు సాహిత్యాచే మూలధన్‌ అను గ్రంథాన్ని ప్రకటించినారు.

పై సత్యార్థిగారి వ్యాసములోని విషయమును చూడగా భారతీయ భాషా కుటుంబంలో చేరిన కాశ్మీరీ, పంజాబీ, రాజస్థానీ, హిందీ, మరాఠీ, బెంగాలీ, గోండు, గుజరాతీ మున్నగు భాషలన్నిటిలోను గ్రామ గీతములు సేకరించి ముద్రింపబడినవి కర్ణాటకులును ఇట్టి గేయాలను ప్రకటించినారని తెలిపినాను. ఇక మిగిలిన వారము మనమే! ఇతరులను చూచియైన మనము గుణపాఠము నేర్చుకొందుము గాక. మన యువకులలో ఈ విషయమైన శ్రద్ధ హెచ్చగుగాక. నశించిపోవుచున్న వీర కథలు, సుద్దులు, తందాన పాటలు, ఏల పాటలు మున్నగునవన్నియు నుద్ధరింపబడు గాక!

4

మన తెనుగు దేశములోని జనులు తాము పనులు జేయునప్పుడు పాటలు పాడుచుందురు. మోటకొట్టిన, కలుపు తీసిన, దంచిన, విసరిన, రాట్నము త్రిప్పిన, కళ్లాలలో బంతులు త్రిప్పిన, బండితోలిన, బరువులాగిన, ఏ కాయ కష్టము చేసినను సరే ఆ సమయములలో పాటలు పాడుచుందురు. అవన్నియు సేకరించవలసిన అవసరము చాలా కలదు.

తుదకు చిన్న పిల్లలు గూడ ఏవో పాటలు పాడుచుందురు. శ్రీ చింతాదీక్షితులు గారు పిల్లలకై వాచకములు ప్రకటించినారు. అందు పిల్లల పాటలను కొన్ని చేర్చినారు. అయినను వారుగూడ వానిలోని అంతరార్థమును గుర్తించిన వారు కారు. దానిని మొట్టమొదటిసారి గుర్తించినవారు మిత్రులగు ఆయుర్వేదాచార్య శ్రీ వేదాల తిరుమల వేంకట రామానుజస్వామిగారు. బాలబాలికల పాటలందు పెక్కింటిలో వైద్యపు చిట్కాలున్నవని వారు గుర్తించినారు. ఆ చికిత్స పాటలలో నెట్లిమిడియున్నదో ఆచార్యులవారు ఒక చిన్న గ్రంథముగానే ప్రకటించవలసినదని పలుమార్లు కోరినాను. కాని వారట్లు చేయుటలేదు.

స్త్రీలలో ముసలివారిప్పటికిన్ని పలుతావులలో కొన్ని కథలను పాటలుగా పాడుకొనుచుందురు. ఊర్మిళాదేవి నిద్ర, రామాయణ కీర్తనలు, కామేశ్వరీ పాటలు మున్నగునవి వారిలో ప్రచారమందున్నవి. వల్లభరాయుడు తన క్రీడాభిరామములో ఒక బ్రాహ్మణ వితంతువు రామాయణమును తెల్లవార్లు పాడుచుండెనని ఇట్లు వర్ణించినాడు.


ఉ. కోయిల పంచమ స్వరము
             క్రొల్చిన భంగిని విద్ధి చూచి రా
మాయణ మారుకాండములు
             నచ్యుత జాగర వేళబాడెనా
రాయ వితంతురత్న మను
             రాగముతోడ నమశ్శివాయ శాం
తాయ సమస్త దోష హరణాయ
             సమానమె దాని కెవ్వరున్‌


కామేశ్వరీ లేక మహాలక్ష్మి పాటలను పాడుచుండిరని అదే క్రీడాభిరామమందిట్లు వర్ణింపబడినది.


గీ. రాగమున నుండి లంఘించు రాగమునకు
    నురు మయూరు ద్వయంబుపై నొత్తగిల్ల
    కావ తల్లీ మహాలక్ష్మి కైట భారి
    వలపు పాడుచు వచ్చె జక్కుల పురంధ్రి


జమదగ్ని భార్యయు, పరశురాముని తల్లియునగు రేణుకను కాకతీయుల కాలములో ఏకవీరాదేవి అను పేర పూజించుచుండిరి. ఇప్పటికిని తెనుగుదేశమందు కొన్ని ప్రాంతాలలో ఈరమ్మ (ఏకవీరమ్మ) అను దేవతను పామరులు పూజింతురు. తెనుగు స్త్రీలకు చాలామందికి ఈరమ్మ అను పేరు కూడా పెట్టుదురు. ఈ వీరమ్మయే ఎల్లమ్మ. నేటికిని పల్లెలలో ఎల్లమ్మ దేవరను చేయుదురు. ఆమె కథను బవని వారు (మాదిగజాతిలో ఒక శాఖ) రెండు రాత్రుల వరకు చెప్పుదురు. అదంతయు రేణుకా పరశురాముల కథయే. ఈ కథలను పాడినట్లు క్రీడాభిరామములోనే యిట్లు వర్ణించినారు.


గీ॥ వాద్యవైఖరి కడు నెరవాది యనగ
     నేకవీరామహాదేవి యెదుట నిల్చి
     పరశురాముని కథలెల్ల ప్రౌఢి బాడె
     చారుతర కీర్తి బవనీల చక్రవర్తి


ఆంధ్రదేశమందు బహు ప్రాంతాలలో కోలాటమును పురుషులు వేయుచు పాటలు పాడేవారు. దీనినే రాయలసీమలో కోలన్న పాటలు అనిన్నీ కోలంట్ల ఆట యనిన్ని యందురు. 200 ఏండ్ల క్రిందట కర్నూలు జిల్లా కవియైన గండ్లూరి నరసింహరాయ కవియను నతడు భాషీయ దండకములో దీనిని వర్ణించినాడు. ఒక స్త్రీ తన ప్రియుడు 'కోలన్న' వేయుచుండగా చూచి మరునాడతనితో ఇట్లన్నదట. “నీవాడ కోలన్న వేస్తుండగా చూచినాట్నుండి నాకి ట్లిరాతాపమంటింది - నీ మీద మోహాన నే తాళలేనోయి” (ఇరాతాపమనగా విరహతాపము)


విజయనగర చక్రవర్తులు తాము దండయాత్రలు చేయుటకుముందు ప్రొద్దుననే కొన్ని శకునాలను చూచేవారు. శ్రీకృష్ణదేవరాయలు కటకంపై దండెత్తుటకాలో చించినప్పుడు ఒకనాడు తెల్లవార చీకటిలో ఒక చాకలి యిట్లు పాడుకొనుచుండుట విననయ్యెను.


కొండవీడు మనదేరా
కొండపల్లి మనదేరా
కాదని యెవ్వరు వాదుకు వచ్చిన
కటకందాకా మనదేరా!


పల్లెపాటలలో జన సామాన్యమందుండు భాష, భావములు పూర్తిగా నిండి యున్నవి. గ్రంథస్థ భాషలోనికి పల్లె పదాలలోని పదాలెక్కలేదు. అట్టి పదాలు వేలకొలదిగా ఉన్నవి. ఆ పదాలన్నియు ఏ నిఘంటువులందును లేవు. ఆ సుందరమగు పదాలు విద్యావంతుల అనాదరణముచేత మూలబడియున్నవి. మరియు జనసామాన్యమునుండి విద్యావంతులు దూరమగుచు వచ్చినారు. ఈ కారణముచేత భాషకు కూడా చాలా నష్టము కలిగినది. శుకసప్తతి కవితలోని కొన్ని పదాలు ఏ నిఘంటువులోనులేవు. “బందారాకు” “నభరువాడు” “కూనలమ్మ చీర" ఇట్టి పదాలు 100 వరకైనా కదిరీపతి యొక్క శుకసప్తతిలో కలవు. ఈ దేశ ప్రాంతమందలి ఈలకత్తి కూడ నిఘంటువులలో లేదు. దానిని శుకసప్తతిలోన పాడిరి. ఇట్టి పదాలలో అనేక పదాలకర్థమును మంగలివారిని పల్లెటూరివారిని విచారించి తెలుసుకొన గలిగితిని. 300 ఏండ్ల క్రిందట ఒక ప్రామాణిక కవి వాడిన పదాలకే యీ గతి పట్టినప్పుడు పల్లెపదాలలో ఎన్ని పదాలు ఇప్పుడు విద్యావంతులకర్థమగునో యేమో?


భారతదేశమం దితర భాషలలోని పల్లెపదాలను గొప్ప గొప్ప పండితులు సమకూర్చి గ్రంథస్థము చేసి పెద్ద పెద్ద సంపుటాలుగా ప్రకటించినారు. తుదకు ముండా, కోయ, గోండు, భిల్లు, సంధాలులవంటి ఆటవికుల పాటలు గూడా ముద్రితములైనవి. మనము మన పల్లెపదాలను ఇంతవరకు ఒకచోట చేర్చి ముద్రించకపోయితిమి. ఈ కార్యమును ముఖ్యముగా భావకవులు చేయవలసి యుండెను. వారు గూడా చేయకపోయిరి. ఈ నిజాం రాష్ట్రములోనే చాలా తందాన కథలున్నవి. అవి విశేషముగా మన తెనుగు సంస్థానాలకు సంబంధించినవి. మన సంస్థానాధిపతులును తమకు సంబంధించిన జంగముల కథలనైనా ముద్రింపించక పోయిరి. అవి అనాదరణచేత దినదినము నశించిపోవుచున్నవి. విద్యావంతులు పల్లెపదాలను శ్రద్ధతో ఉద్ధరించి మరల వాటికి మంచి ప్రచారమును కలిగించవలెను. కొన్ని పల్లె పదాలలో అసభ్యత కలదు. అట్టి వాటిలో మంచి భావాలను గ్రహించి అసభ్యతను పరిహరించవలెను. మంచి పాటలు వేలకు వేలు కలవు. వాటిని సేకరించితే అదొక మహోపకారమగును.


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse