సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/పండిత మాడపాటి హనుమంతరావు గారు
పండిత మాడపాటి హనుమంతరావుగారు
“గోలకొండ పత్రిక మేనేజరుగారికి - అయ్యా నా యుపన్యాస ప్రతులలో 17 తక్కువగా వచ్చినవి. మహిళా సభాధ్యక్షురాలివి 100 తక్కువగా నున్నవి. దయచేసి పంపగలరు”.
మహిళా సభాధ్యక్షురాలు మాడపాటి హనుమంతరావుగారి భార్య. నిజాం రాష్ట్ర చతుర్థాంధ్ర మహాసభకు అధ్యక్షులు శ్రీ రావుగారే. తమ తమ యుపన్యాస ప్రతులను (200లను) ఓపికతో స్వయముగా నెంచుకొనినారు. ప్రతి చిన్న విషయములోను కట్టుబాటు. అందు ఆవంత పొరపాటును గూడ గుమ్మడికాయంతగా జూతురు. సహింపనే సహింపరు. తమ యింటి లెక్కయెట్లో ప్రజానిధి లెక్కయు నట్లే దమ్మిడీ దమ్మిడీ లెక్కపెట్టవలె. ఆ లెక్క సరిగా కుదరవలె ఏదన్న వ్యర్థముగా పోరాదు. “అనెగొంది లెక్కలు” వారికి సరిపడనే సరిపడవు.
♦ ♦ ♦
ఇంచుమించు 17సంవత్సరాల నాటి మాట. ఆనాడు హైదరాబాదులో తెనుగు వారికి సంస్థలు లేవు. సంఘటన మంతకును తక్కువ. మహారాష్ట్రుల సంఖ్య తక్కువైనను వారిదే ప్రాధాన్యము. ఒక సభలో నొక తెనుగు పెద్ద మనిషి సభావేదికపై నెక్కి యుపన్యసింపబోయినాడు. మహారాష్ట్రులు గోలపెట్టినారు. ఆ పెద్దమనిషితోపాటు శ్రీ హనుమంతరావుగారున్నూ సభను వదిలి వెళ్ళినారు. ఆ చిన్నఘట్టమే ఆంధ్రోద్యమ శంఖుస్థాపనకు కారణమైనది. నేడు మహారాష్ట్రుల కన్న ముందంజ వేయుచున్నారు ఆంధ్రులు: ఇదంతయు రావుగారి నిరంతరకృషి ఫలితము వారి యాంధ్రాభి మానమునకు నిదర్శనము. వక్తృత్వ పరీక్షలో బహుమానం పొందిన వక్త కాడు. గొప్ప పండితుడును కాడు. కవిత్వము చిన్నప్పు డేవో గణబద్ధముగా వ్రాసిన కొన్ని పద్యములు కలవు. పరిశోధకులకు తప్ప నితరులకాసంగతి తెలియదు ఇంగ్లీషులో మెట్రిక్కు హద్దు. ఫార్సీలో సాదీని సాధించెను. ఉర్దూలో మంచి పాండిత్యము. తెనుగులో గ్రాంథికవాది. కాని గ్రాంధిక వ్యావహారిక చర్చలో తమ విలువ వోటు నెవ్వరికి ఇయ్యరు. ఇతిహాసకుడు కాడు, పరిశోధకుడు మున్నేకాడు. అయితే యిన్ని “నఞ్"లతో ఒప్పియు వీరికీ ప్రాముఖ్య మెట్లువచ్చెను? అదియే వీరి జీవిత రహస్యము.
♦ ♦ ♦
శ్రీ పంతుల వారికి చేపట్టిన విషయములందెల్ల పట్టుదల మెండు. కార్యసాధకుడు. (ప్రజోపయోగార్థమై యా సాధన మరుదుగా యేనకేనా ప్యుపాయేన అయిననూ సాధారణముగా నియమోల్లంఘన మభిలషించరు)
ఏ విషయమును గురించి ముచ్చటించినను - సభలో గానీ, ఇంటిలోగాని ఆ విషయమును విపులీకరించి, తిన్నగా, నెమ్మదిగా, కథాక్రమముగా, పూసగుచ్చినట్లు విషయము పెరిగినను సరే, శ్రోతల కానందముండునంతవరకు సాగదీయును.
♦ ♦ ♦
ఎవ్వరి మనస్సును గాని, ఏ కారణమునైనగాని, నొప్పింపగూడదనునది వారి నీతి మార్గములలో రాజమార్గము. “అన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు” అని యీనాడే రాష్ట్ర కవియైన వ్రాసియుండిన అది వీరిని మనసులో నుంచుకొనియే వ్రాసినాడేమోయని మిత్రులందరిలో గుసగుసలు బయలుదేరి యుండును. ఎవ్వరేని రావుగారి అభిప్రాయము గోరిన వారికి మనసిచ్చి చెప్పరు. “పుత్రోనుపుత్రి" వంటి జోస్యముగా నుండును. అభిప్రాయభేదమును విధిలేక ప్రకటింపవలసియే యుండిన అది ద్రావిడ ప్రాణాయామ న్యాయముచే సిద్ధింపజేతురు.
♦ ♦ ♦
నాయకుడైన వానికి ఒకానొక సమయములో శీఘ్ర నిర్ణయము (Quick decissi0n) ఉండవలెను. వీరు తరచుగా వికల్ప న్యాయములో జిక్కియుందురు.
నాయకుడు సమయమునకై పొంచియుండవలెను. సమయము వచ్చినప్పుడు దానిని తటాలున గ్రహించి లాభము పొందవలెను. అట్టి సాధనకు సహనము (Risk) కావలెను. రావుగారిలో (అవకాశము కలుగనందుననేమో) యీ గుణము వ్యక్తము కాలేదు.
వీరిలో నొక గొప్ప లక్షణము కలదు. ప్రజాసేవకులను, వ్రాయసకాండ్రను గుర్తించుటలో వీరికి పక్షి చూపు (Eagle eye) కలదు. అట్టి వారిని జారి పోదమన్నను జారనీయక తమ దృక్పథమందే యుంచుకొని ప్రోత్సాహపరచి రంగములోనికి సిద్ధము చేసుకొనుట నాయకుని లక్షణములలో నొకటి.
ఎత్తైన వారుకారు. స్థూల శరీరులు. ఆ స్థూలత వారి నడక నెటులో నడవడి కను నటులే నెమ్మదిగా సాగించును. స్వీయ ప్రకటనమును ఆత్మోత్కర్షను గోరరు. ఆడంబరము లేదు.
ఉడుపులందు సాధారణత యెట్లో జీవన మందున నట్లే. కళోపాసకులు కారు. భావానుగుణ్యముగా నింటిగోడలు క్యాలెండరు అలంకారములనైన నోచుకొనలేదు.
♦ ♦ ♦
సభా వేదికాలంకారకులు, వాగ్రంగసింహులు, స్వార్థ నిమిత్త కౌటిల్యులు, పత్రికా ప్రకటితులు, మతావేశోన్మాదులు, దాంభికోత్తంసులు - నాయకులు పలు తెరగులవారైయుందురు. మనరావుగారు పై తెరగులలో నొక్కదానికైనను చేరిన వారుకారు. తమ యుద్యమ మూలమున జీవనోపాధియగు ప్రాక్టీసును నష్టపరచుకొనినారు.
ఉత్సాహవంతులను ముందునకు నడిపించుటలో నానందింతురు. ఆంధ్రాభి మానము మెండు. మనవారు - ఏ ప్రాంతీయులైనను సరియే - పేరు ప్రతిష్టలు పొందుచున్నారనిన అది వారికి విందు. ప్రాంతీయ దురభిమాన పిశాచబాధితులై యాత్మోత్కర్షలో తగుల్కొని యైకమత్య దూరులైన యాంధ్రులలో రావుగారి యీ గుణము అనుకరణీయము.
♦ ♦ ♦
ఉత్సాహము, తాత్కాలికావేశము, ఉద్రేకము పొందకమున్నే శాంతించుట - ఇవి యాంధ్రునికి - పూర్వమందుగాని, పశ్చిమ మందుగాని వలసలోగాని - ప్రత్యేక లక్షణములని విశదములైన యంశములే. వీరీ ముఖ్యాంధ్ర లక్షణమునకు దూరులైనారు. మాటలందుగాని, కార్యములందుగాని ఆవేశము చూపరు. శ్రద్ధను పూర్తిగా పూనియుందురు. ఇదియే నిష్కామకర్మ ప్రథమ సోపానము.
♦ ♦ ♦
తమ ప్రథమ కళత్రమువలన నొకే కూతురు. ఆ బాలికకు వివాహమైనప్పుడు యువకులు తమ యసమ్మతిని, రావుగారు తమ హృదయ దౌర్బల్యమును ప్రకటింపవలసి వచ్చెను. ఇప్పుడు సంఘ సంస్కారులు జిల్లాలలో ప్రచారార్థ మరిగినప్పుడు మాత్రము మడి పంచ తమ తోలుపెట్టెలో నుండి తీరును. పంతులుగారికి వేరు సంతానము లేనందున పిల్లల సందడి యెరుగరు. అందుచే తమ బల్లపైని కాగిదములు కలము పుల్ల యథాప్రకార సిద్ధిలోనే యుండును.
♦ ♦ ♦
హిందూ సమిష్టి కుటుంబముల గందరగోళముల నెరుగరు. వీరి కన్నగారు కలరు. వారిటీవలనే చనిపోయిరి. పేరునకు సమిష్టి కుటుంబమే. కాని చిన్నప్పటి నుండియు వీరు బయట బయటనే పెరిగిన వారగుటచేత సమిష్టి కష్టసుఖములనంతగా నెరుగరు.
“అరే” అను మిత్రులు వీరికి లేనే లేరు. “ఓయ్” తెగ వారొకరిద్దరే! “ఆర్యవర్య” పరిచయస్థులే బహుళము.
♦ ♦ ♦
పంతులుగారింటిలో నొక పాత పటము కలదు. బుర్రమీసాలు, 24 అంగుళముల యెత్తుగల తుర్కీటోపీ, మోకాళ్ళపై చిందులాడు షేర్వానీ, పైజామా దిట్టమగు శరీర స్థౌల్యము - ఇవి ఆ పటమందలి విశేషాలు. సుమారు 30 ఏండ్ల వయస్సును సూచించును. ఆ జమీరు షరీపు నుండి హైదరాబాదుపై సవాలు వేయవచ్చిన పైల్వానును సూచించును. ఆ పట మేమూలనో దాగియున్నది. బయటి వారికి గోచరించదు.
ఇప్పుడు రావుగారికి 52 సంవత్సరముల వయస్సు. ఈ 20 ఏండ్లలో నింత గొప్ప మార్పు.
నిజాం రాష్ట్రములోని విద్యావంతులైన యాంధ్రులలో నీ 10-15 ఏండ్ల నుండియు ఇట్టి మార్పులు జరుగుచున్నను “దొర” జాతివారు మాత్రము తమ “చిత్త నిత్య స్థితిని” నిరూపించికొనినారు. రావుగారు మితజీవులు. (నగనాగరికుల యభ్యాసములు ఫ్యాషన్, సిగరెట్, టాకీ వగైరాలు బొత్తిగా లేవు) బెజవాడ సరిహద్దగు మధిర తాలూకా వారై ప్రాత ముల్కీ అయినను పూర్వాంధ్ర సంస్కారమే హెచ్చుగా కనబడుచున్నది. ప్రతి ప్రజాసంస్థలోను సభ్యులై ఆలోచనలు చెప్పి శ్రద్ధతో పనిచేసి లోక సంగ్రహార్థమై తమ శక్తి కొలది సేవజేయు హనుమంతరావు పంతులుగారు ఆంధ్ర మహాపురుషులలో ముఖ్యులనుటలో నేమియు సందేహములేదు.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse