సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/పంచేశ్వరము
పంచేశ్వరము
హైదరాబాదు రాష్ట్రములో చూడదగిన హిందూ క్షేత్రాలు చాలా కలవు. మత సాంప్రదాయిక దృష్టితో చూడదగిన వానిని గురించి యిప్పుడు వ్రాయుట లేదు. చారిత్రక దృష్టితోను శిల్పి దృష్టితోను చూడదగినవాని ప్రశంసయే చేయుచున్నాను. అట్టివానిలో “పంచేశ్వరము” అను క్షేత్ర పంచకము చేరినది. దానిలో ఒక విశిష్టత కలదు. అది నిజాము బ్రిటిషు సంధి క్షేత్రమున్నూ అయియున్నది. కృష్ణానది రెండు తీరాలలో ఆ క్షేత్రాలు వెలసియున్నవి. “గంగకిద్దరి మేలద్దరి కీడునుంగలదే” అన్నట్లుగా ఉన్నవి. కృష్ణకిటు కొల్లాపురము సంస్థానమున్నది. అటు దక్షిణమున కర్నూలు జిల్లాలో నందికొట్కూరు తాలూకాయున్నది. కొల్లాపుర సంస్థానమందలి కృష్ణా తీరములో పంచేశ్వరములోని మల్లేశ్వరము అను శైవ క్షేత్రమున్నది. సోమేశ్వరము నాగరుకర్నూలు తాలూకాలోని దైనను మల్లేశ్వరము ప్రక్కననే కలదు. ఆ రెంటికెదుటి దిక్కున చూపుమేరలోనే కృష్ణ కావలి యొడ్డున సిద్ధేశ్వరము, సంగమేశ్వరము, కపిలేశ్వరము అను మరి మూడు శైవ క్షేత్రాలున్నవి. ఆ యైదింటిని పంచేశ్వరమందురు. అవి యుండు స్థానమందు నది కిరు ప్రక్కలలో ఎత్తయిన గట్లు కలవు. కృష్ణను ఎండ కాలములో దాటుట కష్టము. వాన కాలములో దాటుట సుఖము. ఎందుకనగా ఎండకాలములో తొడల లోతు నీళ్ళుండును. అడుగున జానెడు మూరెడు గుండ్లు నిండుగా పరిచి నట్లుగా నుండును. కాలుపెట్టగానే జారుట సంభవించును. ఒడుపు తప్పినచో ప్రవాహములో పడుదురు. ఈదుటకును వీలులేదు, కొన్ని గుండ్లు మోకాళ్లతో డీకొనును. ఇట్టి గ్రవాచారమునకు బద్దులై అవతలి క్షేత్రాలను చూచి రావలసియుండును. వానకాలములో నిండు ప్రవాహముండుటచే అరిగిలి లేక పుట్టి అను వానిపై సుఖముగా దాటవచ్చును. నదీ ప్రవాహ మహాధ్వానము, అయిదు క్షేత్రాలు, వాటి నాశ్రయించిన గ్రామాలు, దేవాలయ శిఖరాలు, చుట్టునుండు గట్లు, వాటిపై నుండు చెట్లు ఇవన్నియు ఒక చక్కని దృశ్యమును కలిగించి మరుపురాని స్మృతిగా మనస్సులో నిలిచిపోవును.
ఇదే స్థలమందు నిజాం ఇంగ్లీషు ప్రభుత్వాలు చేతులు కలిపి నది కడ్డముగా ఆనకట్టవేసి కాలువలను తీయుటకై సంకల్పించినారు. పది పదిహేను ఏండ్లనాడే ప్లానులన్నీ సిద్ధముచేసి యుంచినారు. యుద్ధానంతరము చేయుచున్న కార్యాలలో ఇచ్చటి ఆనకట్ట యొకటియై యున్నది. ఈ పంచేశ్వరములోని ఒక క్షేత్రమగు సోమేశ్వరమును సోమశిల అనియు అందురు. అచ్చట హైద్రాబాదు వారి సుంకము ఠాణా యొకటి కలదు. సోమశిల మల్లేశ్వరానికి ఒక మైలు దూరములో కలదు. మల్లేశ్వరము కొల్లాపురము వారిది. సోమేశ్వరము నాగర కర్నూలు తాలూకా లోనిది ఈ రెండును కొల్లాపురానికి 7 మైళ్ళ దూరములోను కొల్లాపుర సంస్థానములోని దగు పెంట్లవెల్లికి 6 మైళ్ళ దూరములోను కలవు. బాటలు మాత్రము చాలా అధ్వాన్నముగా ఉన్నవి. ఆ ప్రాచీన క్షేత్రాలకు పెంట్లవెల్లి నుండి పోవుదారినైనను బాగు చేయించుట సంస్థానం వారికి తప్పని ధర్మమని తలంతును.
ఇక క్షేత్ర విశేషాలను గూర్చి వ్రాయుదును. వనపర్తి రోడ్డు స్టేషనులో దిగవలెను. అక్కడినుండి కొల్లాపురం పోవు బస్సులో వెళ్ళి పెంట్లవెల్లి స్టేజిలో దిగవలెను. అక్కడ బాడుగ బండ్లు దొరుకును. అక్కడి నుండి 6 మైళ్ళ దూరాన నున్న మల్లేశ్వరములో ప్రధాన దేవాలయమ యేటి గట్టుననే కలదు. దానిలో మూడు శాసనాలున్నవి. ఒక శాసనముపై తైర్థికులు చెట్నీ నూరుకొంటూ వచ్చినందున అది ముప్పాతిక అరిగిపోయినది. తక్కిన రెండున్నూ అరిగినవి. మట్టితో నిండినవి కానవచ్చు లిపి స్వరూపాన్ని బట్టి అవి చాళుక్యుల శాసనాలని స్పష్టమగును. ఇంతవరకీ శాసనాల ప్రతులును తీసి ప్రకటించినట్లు కానరాలేదు. అతివృష్టి కాలములందు కృష్ణవేణమ్మ కూడా ఈ దేవాలయావరణము లోనికి వచ్చి శివుని పలుకరించి పోవును. ఆమె ఆగమన ఫలితముగా దేవాలయము ఒక గజము లోతు వుండుటచే నిండినది. అందందు పగళ్ళు మొదలై ఆలయ భాగాలు పడిపోవుచున్నవి. కొన్ని ఆవరణ విగ్రహాలు సుందరముగా నున్నవి. దేవాలయమునకు కొద్ది దూరమందే రెండు చిన్న గుళ్ళమిట్టపై నున్నవి. అందొక దానిలో శేషశాయి కలదు. శివక్షేత్రములో వీరెట్లు ప్రవేశము కల్పించు కొని తిష్ఠ వేసిరనిన తర్వాతి వారెవ్వరో లింగస్థానములో శ్రీవారిని ప్రతిష్ఠించి నారనుట యొప్పును. విగ్రహము పెద్దది. చాలా సుందరమైనది. సన్నపని చూపరుల నాకర్షించును. ఒకటి రెండు అంగాలను మెప్పులేని వారెవ్వరో చెక్కివేసినారు. ఈ దేవాలయమును సంస్థానమువారు కాపాడవలెను. శాసనాల ప్రతులను ఆర్షశాఖవారు తీయించవలెను. తైర్థికులకు చెట్నీ రోళ్ళను సమకూర్చి శాసనాలను కాపాడవలెను. పూడికను కూడ తీయించవలెను.
మల్లేశ్వరము నుండి సోమేశ్వరము పోవలెను. బండినాట్లకున్నూ ఆంగభంగాలకున్నూ భయపడకుంటే బండ్లలో పోవలెను. లేకున్న నడకయే రమ్యము. సోమేశ్వరములో ఏటిగట్టున 200 ఏండ్ల నాటి మసీదు కలదు. అందొక గోరీ కలదు. దానిపై ఒక ఫార్సీ లిపి శాసనం కలదు. పాముల పిల్లలవలె అక్షరాలను పెనవేసి వ్రాసినారు. వాటిని మల్లాలే చదువగలరు. ఏటి యొడ్డుననే ఊరున్నది. ఇండ్ల వెనుక భాగములో పెద్ద ప్రాచీన దేవాలయమున్నది. దానిలో నుగ్గు లెండించుకొందురు. ఈ కాలానికంత మాత్రమైనా ఉపయోగ పడుచున్నది. మరికొంత కాలానికట్లు పనికిరాదు. దేవాలయములో శిల్పాలేవియు లేవు. లోపలి కప్పులో దశావతారాల సుందర విగ్రహాలు చూడదగినవి. ఒకచోట ఒక స్తంభముపై శాసన భాగమున్నది. అది అచ్చటిదికాదు. శిథిల భాగానికి పోటీ పెట్టి ఒక శాసనాన్ని స్తంభముగా చేసి అచ్చట నిలిపినారు. అది కాకతీయుల నాటి శాసనమని జ్ఞాపకమున్నది.
ఏటిలోనికి దిగుచోట ఠాణా ముందరి మెట్టువద్ద కొన్ని దేవాలయ స్తంభాలు అందందు పూడగా మిగిలినవి కానవచ్చుచున్నవి. అందొక దానిపై నాగర లిపి శాసనమున్నది. ఆ స్థలములోని శాసనాలను కూడా ఎవ్వరునూ సేకరించి ప్రచురించలేదు. సోమేశ్వరమువద్ద ఎండాకాలములో నదిని దాటవలెను. వానకాలములో మల్లేశ్వరమువద్ద దాటవలెను. నదిని దాటిన వెంటనే అచ్చటి గట్టుపై సిద్దేశ్వరము కలదు. అచట ఒక ప్రాచీన దేవాలయ మున్నది. కాని అందేదియు చూడదగిన శిల్పము లేదు.
సిద్ధేశ్వరమునుండి రెండు మైళ్ళు నడచి వెళ్ళిన సంగమేశ్వరము వచ్చును. మధ్యన చిన్నగట్టు తగులును. అందొక గుహకలదు. ఇప్పుడు విశాలమగు రెండు గదులందు కానవచ్చును. లోపల గదిలో చీకటితో నిండిన పెద్ద గుహాబిలము కలదు. అది యెంతో దూరము వరకున్నదని స్థానికులేమేమో చెప్పుదురు. కొన్ని యేండ్ల కిందట ఒక సాధువు అచ్చట బహుకాలము నివసించెను. అతనికి భక్తులు ప్రబలిరి. వారందరున్నూ సిద్దేశ్వరమునకును, సంగమేశ్వరమునకును మధ్య నుండే నదీ మార్గములు చాల ప్రమాదకరముగా నుండుటచే అచ్చట నొక గోడను కట్టించినారు.
సంగమేశ్వరము ఈ పంచేశ్వరములలో తలమానికము. అది సప్తనదీ సంగమము. తుంగభద్రము దాని పంచోపనదులున్నూ ఆలంపూరు వద్ద కృష్ణలో కలియును. అందుచే దానిని చిన్న సంగమందురు. ఆ పంచ నదీ ప్రవాహము కృష్ణలో కలియును. ఈ సంగమేశ్వరమువద్ద భవనాశి అనుపెద్దవాగు (ఆ నది ఉ పనదంతటిది కాకున్నను నది యందురు) కృష్ణలో కలియును. ఇట్లు ఆ స్థానము సప్త నదీ సంగమ మగుటచేత దానిని పెద్ద సంగమని యందురు.
బ్రిటిషిలాకావారు ఆ దేవాలయము మంచి స్థితిలో నుంతురని తలచితిని కాని దాని నేమాత్రమున్నూ విచారించక చాలా అన్యాయము చేసినందునను అచ్చటి శిల్పము ఉత్తమశ్రేణిలో చేరినదై నందున దానిని శైథిల్యమునుండి ఏమాత్రమున్నూ రక్షింపక పోయినందునను చాలా విచారము కలిగినది. అచ్చట అయిదు శాసనాలు కలవు. ఒక శాసనమును దేవాలయపు బయటి భాగములో అరుగుపై కూర్చునుటకై అమర్చినారు. అది చాళుక్యుల కన్నడ శాసనము. ఇంచుమించు 900ఏండ్లనాటిది. ఆ శాసనము కూడ సంపూర్ణముగా లేదు. కట్టడానికి వాడినందున కావలసినంత వరకుంచి మిగతా దానిని పగులగొట్టి పారవేసినట్లున్నది. దేవాలయమందు ఒక చిన్న శాసనమున్నది. అదియు చాళుక్యులదే. దేవాలయము వెనుక దిక్కు ఒక యిసుక రాశిపై శాసనము కలదు. దానిపై సున్నము చుక్కలు నిండుగా గలవు. అవి కడిగినను పోవు. ఆ శాసనమును చదువుటకు వీలు లేదు. దేవాలయములో రెండుస్తంభాలపై రెండు శాసనాలు కలవు. అవి 1050 ప్రాంతము శాలివాహన శక కాలపు శాసనాలు. బ్రాహ్మణులకు భూదానాలు గ్రహణ కాలములో ధనికులెవ్వరో చేసిన ముచ్చట అందు కలదు. అవి 400 ఏండ్ల నాటివి. దైవ భక్తులు దేవాలయము ముందు భాగాన్ని విస్తరించి కట్టించుచున్నారు. పాత కట్టడమునకు కొత్త కట్టడమునకు పోతరాజుకు, భోజరాజుకును ఉండు అంతరాయమున్నది. నదీ తీరములోనున్న దేవాలయమునకు 200 గజాల దూరములో గ్రామమున్నది. గ్రామములో ఒక దేవాలయమున్నది. దాని చుట్టును ఏమిన్నీ సందు లేకుండా గుడిసెలు, ఇండ్లు పెరిగిపోయినవి. ఆ దేవాలయ సౌందర్యమును చూచిన చూపుతోనే, ఆ యిండ్లను చూచిన 'స్వర్గ నరకా” లెట్టివో యూహించుకొనవచ్చును. ఆ దేవాలయాన్ని 'రథము' యని అందురు. దేవతలు రథాల్ని నిర్మించి అందే వదలిపోయిరని స్థానిక జ్ఞానులందురు. అది దివ్య శిల్పమనియైనా వారు గ్రహించినారు కదా! అది శివాలయము తప్ప మరేదియు కాదు. దేవాలయము గోడల చుట్టును అడుగడుగునకు శిల్పములే. ఆ శిల్పాలను గ్రామము వారు మెచ్చుకొనునట్లు లేదు. చేపల బుట్టలు, వలలు, జల్లలు, గంపలు తుదకు కట్టెల మోపులు సుందర విగ్రహాములుండు గోడలోని పెద్ద గూళ్ళలో నింపినారు. దేవాలయానికి చక్కని ఆకర్షణీయమగు శిలా గోపురము కలదు. ఆ గోపురము నిండుగా విగ్రహాలను చెక్కినారు. అవన్నియు అతి రమణీయములు. దేవాలయ ప్రధాన ద్వారమందు కొన్ని విగ్రహాలు విరుగగొట్టబడినవి. సంగమేశ్వరములోని “రథము”ను చూచి ఆనందించవలెను. దాని సౌందర్యాన్ని యెట్లు వర్ణించవలెనో తెలియదు. మద్రాసు ప్రభుత్వం వారీ దేవాలయమునకు ఆవరణము కల్పించి చుట్టు నుండు యిండ్లను, వాములను, పశువుల కొట్టాలను తీసివేయించి రథాన్ని మంచి స్థితిలో నుంచవలసిన బాధ్యత తమపై కలదని యెరుగవలెను.
సంగమేశ్వరము నుండి అరకోసు దూరములో కపిలేశ్వరము నదీ తీరమున కలదు. అందుకూడ ప్రాచీన దేవాలయాలు కలవు. కాని ప్రశంసింపదగిన శిల్పాలందు కానరావు ప్రకృతి రామణీయమునకు సందుర శిల్పముల జోడించి ఆ రెంటిలో మతాన్ని ముడిపెట్టి జనుల విశ్వాసాలను బంధించివేసిన వీర శైవులు గట్టి దిట్టలని ఈ పంచేశ్వరము చాటుచున్నది. ఇప్పుడు శివరాత్రి కాలమందు శైవభక్తులు కైలాస తృష్ణచే ఈ పంచేశ్వరమును సేవించుచున్నారే కాని ప్రాచీనుల కళాసృష్టిని వారు గమనించిన వారు కారు - గమనించినచో వారు శాసనాలపై చెట్నీల నూరి కళాస్వాదము చేసియుండరు. పైగా శివరాత్రి కాలములో ప్రాకార విగ్రహాలపై సున్నము ఎర్రమన్ను కొట్టి తమ కళోపాసనను వ్యక్తపరచుచున్నారు. పంచేశ్వరము ప్రాచీనముది. ఇచ్చటి దృశ్యము మరుపురానట్టిది. ఇప్పుడు శోచనీయ స్థితిలో నున్నట్టిది.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse