Jump to content

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/నన్నెచోడుడు

వికీసోర్స్ నుండి

నన్నెచోడుఁడు

నన్నెచోడుని కాలము వివాదఁగ్రస్తము. ఆదిమ కాలమునందీకవి ఏలనో వెలుగుజూడని వాడైనాఁడు. ఇరువదియవ శతాబ్దిదనుక నీతని రచనలకు నవియున్నవను సంగతి తెలియరాలేదు.

తత్కవి కాలవిషయమై స్థూలముగా నాలుగు వాదములున్నవి. పలువురు తదనుగుణ భావవ్యక్తీకరణ గావించిరి. అందు, నన్నయకు బ్రాచీనుఁడుగను, నన్నపార్యునకు సమకాలికుఁడుగను, ఆది కవికిని కవి బ్రహ్మకును నడిమి కాలము వాడుగను, ఉభయకవి మిత్రునికి తరువాతి వాడుగను, గన్పట్టి సందేహపుటూయల యందూగుచున్నాడు.

నన్నపార్యునకు సోమయాజికి నడుమ కాలము వాడని పెక్కురభిప్రాయ మగుటం జేసి తద్రచయితనట్లే స్వీకరించుట ఉచితము.

రచనలు - బిరుదులు- కవితారీతులు

సూర్యవంశ క్షత్రియ, కాశ్యపగోత్ర, చోడబల్లి, హైహయాన్వయాంబర శశిరేఖల యనుంగు పుత్ర, నన్నెచోడ నామాంకిత మహాకవి “టెంకణాదిత్య” - కవిరాజ శిఖామణి” బిరుధేయుడై యొప్పెను.

శివభక్తాగ్రగణ్యుండైన యీతని గురువరేణ్యుడు “జంగమ మల్లిఖార్జును”డుగ గుర్తింపబడినాడు.

అదియునుంగాక నాతడే ఇక్కృతికన్య స్వీకర్త. అచ్చటచ్చట ఈశ్వరునకు సద్గురువునకు నాతడభేదము చూపుట వలనఁబరమేశ్వరుడే ఈతని గురువు కానోపునను సందియమించుక బొడసూపక తప్పదు.

'కుమార సంభవము' కళావిలాసమను కవితా కన్నియం సృష్టించిన నన్నెచోడుడు ప్రప్రథమముగా షష్ట్యంతముల బ్రవేశపెట్టెను. ఉద్భటుని సంస్కృత కృతి దీనికి మూలమని తెలియనగును.

తారకాసురమర్దనుని చరితయందు, సంస్కృతమునలేని “దక్షయజ్ఞ” చరితమును ఈతడు తన కావ్యమున బ్రవేశపెట్టెను. గణపతి జననముసైతమీతని కృతియందు విశేషము.

శ్రీకారముతో బ్రారంభించి (మంగళమహా)శ్రీకారములో ముగించు పద్ధతి గూడ నీతఁడే ప్రవేశపెట్టెను.


“మ' గణము గదియ రగణము
వగవక కృతి మొదట నిలుపు వానికి మరణం
బగునిక్కమండ్రు, మడియఁడే
యగునని యిడి తొల్లి 'టెంకనాదిత్యుడనిన్‌”


నన్నెచోడుఁడు తత్కారణముగ యుద్ధమున మడిసెనని అభిప్రాయపడుచున్నారు. నన్నెచోడునిది వస్తుకవిత. అనగ వస్తు ప్రధాన కవితయని విన్నకోట పెద్దన వచించెను.

ప్రకృతి పరిశీలనము నందును, వర్ణనానైపుణియందును సిద్ధహస్తుడైన చోడుఁడు తనంతతానే తనది వస్తు కవితయని చెప్పుకొనినాడు.


“నింగిముట్టియున్న జంగమ మల్లయ
వరమునందుఁగనిన వస్తుకవిత
దగిలివారి యంద నెగడింతు రవికి దీ
పముననర్చలిచ్చు పగిదివోలె”

“జంగమ మల్లికార్జునుని సర్గకవి స్తవనీయ సూక్తియు
క్తింగొనియాడి సత్కవితఁ గానము లేకసురక్తియైన భా
షాంగనఁ దక్కనేలిన మహత్వము లోకమునం బ్రసిద్ధిగా
భంగిగ విస్తరించెదం బ్రబంధము సద్రసబంధురంబుగాన్‌”


ఆశ్వాసాంతమున కందమును వాడుట పరిపాటికాగా నన్నెచోడు 'మాలినిని” వాడినాడు. తదుపరి కవులెల్లరకును ఇందు మార్గదర్శకుడైనాడు. “వనమయూర' వృత్తమును తృతీయాశ్వాసాంతమున విరచించినాడు. చతుర్థాశ్వాసాంతమున 'వసంత తిలక' వృత్తమును రచించెను. “వసంత తిలకం భాతి సంకరే వీరరౌద్రయోః” అనుటం జేసి పంచమాశ్వాసమును సంభవింపనున్న కంతుని వీరవిక్రమమును, రుద్రుని రౌద్రమును సూచించెనని నుడువ వచ్చును.

శార్దూల విక్రీడితము

శార్దూల విక్రీడితము జెప్పుటలో తిక్కన ప్రసిద్ధుడని చెప్పుటకుదాహృతమున ఈ పద్యమును సూచింతురు.


“సింగం బాఁకటితో గుహాంతరమునం జేట్పాటుమైనుండి మా
తంగ స్ఫూర్జిత యూథ దర్శన సముద్యత్క్రోధమై వచ్చునో
జం గాంతార నివాస ఖిన్నమతి నస్మత్సేనపైఁ వీడే వ
చ్చెం గుంతీసుత మధ్యముండు సమర స్థేమాభిరామా కృతిన్‌”

ఇంతటి నేర్పీతనికి నేర్చినవాడు నన్నెచోడుడుగా నోపును.

“భర్గుండంతక వాహినుల్‌........... మద్బాణ వర్షంబునన్‌”
“వీరేకాదశ రుద్రులష్ట వసువుల్‌
........................ సుమహద్విఖ్యాత కార్తీశ్వరా!


శౌర్య వర్ణనతో నిండియున్న పై పద్యములన్నియును అతనెంత జాగరూకతతో తూచి తూచి వ్రాసినాడో తెలియనగును.

ఒక్క శార్దూలమునకే గాక తక్కిన పద్యముల వాడుట యందు కూఁడ నన్నెచోడుఁడు ఔచిత్య పోషణ గావించినాడు.

కందము

కథాగమనమును శీఘ్రతర మొనర్చుటకీ కందము మిక్కిలి యనుకూలము. చోడుఁడు వాడిన పద్యము లనివియే నెక్కుఁడుగ నున్నవి.


“తగుఁదగదని మనమును
వగవగ నొడబడగ వగవ వగవగ బడయున్‌
దగుదగదని వగవని వగ
వగవగఁ బని గలదె తనకు వగ మఱి జగతిన్‌”


ఇది సర్వ లఘు కందము. దీని నడక చూచిన పోతరాజు “లక్ష్మినడక” మనకు జ్ఞప్తికి రాక దప్పదు. కనుక నీ విషయమునకు ఆతనికీతఁడు మార్గదర్శకుడైనాడు. తన చిత్తము వచ్చినట్లు కందమును నడపించినవాడీతఁడు. ఎన్ని పోకలవలంబించిన నన్ని పోకలంబోయినది. దుష్కర ప్రాసముతోఁ బొల్లు మాటలు లేక వచనమువలె సాగిపోయిన కందములీతని కృతియందనేకములు.


“చక్షు మదనేంద్రియములు ము
ముక్షులు మదిగెలుతు రెఱిఁగిమును శ్రోతృత్వ
కుక్షు ర్జిహ్వాఘ్రాణస
పక్షగ వాక్పాణి పాద పాయూపస్థల్‌”

శ్లేషాభి రామమగు కందము నడచిన తీరు:

“కమలాభి శోభితము హరి
రమణీయము విద్రుమాభి రామము శుకర
మ్యమునై గగనాబ్దులతో
సమమై వనమధ్య జలజషండం బొప్పెన్‌”


చతుర్విధ కందము


“రెండవ చరణంబునకున్‌
రెండవ గణమాది గాగ నిర్మించినచో
దండిఁ జతుర్విధ కందము
పాండవ పక్షా! మెలంగు బ్రాజ్ఞుల సభలన్‌”


నన్నెచోడుని చతుర్విధ కందము

ప్రథమ కందము


“సుజ్ఞాన యోగతత్వ వి
ధిజ్ఞులు భవ బంధనముల ద్రెంచుచు భువిలో
నజ్ఞాన పదముఁ బొందక
ప్రాజ్ఞులు శివుఁగొల్తు రచల భావనఁ దవులన్‌”

ద్వితీయ కందము


భవ బంధనములఁ దెంచుచు
భువిలోన జ్ఞాన పదముఁ బొందక ప్రాజ్ఞులు
శివుగొల్తు రచల భావనఁ
దవులన్‌ సుజ్ఞాన యోగతత్వ విధిజ్ఞుల్‌”


తృతీయ కందము


“అజ్ఞాన పదముఁ బొందక
ప్రాజ్ఞుల్‌ శివుగొల్తు రచల భావనఁ దవులన్‌
సుజ్ఞానయోగతత్వవి
ధిజ్ఞుల్‌ భవబంధనములఁ ద్రెంచుచు భువిలో”


చతుర్థ కందము


“శివుగొల్తు రచల భావన
దవులన్‌ సుజ్ఞాన యోగ తత్వ విధిజ్ఞుల్‌
భవబంధనములఁ ద్రెంచుచు
భువిలోన జ్ఞాన పదముఁ బొందక ప్రాజ్జుల్”


సీసము

కవిరాజు క్రొత్త మార్గమునకుఁ దిప్పి సొగసుగా రచించిన మఱియొక పద్యము సీసము. చోడుని సీసములందు తూఁగు సీసములే మెండు.


“వెలిమిడి నలికంబు చెలుపంగఁ బోవుచోఁ
       దెలుపార మై నిండ నలది కొనుచుఁ
బూవులు దుఱుమంగఁ బోవుచో వెలిగొంత
       దోపంగ నడ్డంబు దురిమికొనుచు
మోవిలత్తుక బూయఁబోవుచో లాలాట
       పట్టిక దిలకంబు వెట్టికొనుచు
కాటుక మెదుచుచు గన్నుల నిడబోయి
       పొల్తుక గళమున బూసికొనుచు


సితరుచీం, దుఖండ, శిఖి నేత్ర గరళంబు
లొడల, దలను, నుదుట, మెడను, దాల్చి
పొల్చు శంభు నోర్తు పొలిచూ పఱుదస
కెఱగుచుండ వచ్చె నీశుజూడ”


సీసము చమత్కారముగా నుండుటకు మరియొక కారణము గీత పద్యమద్దానికి జీవము పోయునట్లు మార్చుట. ఈతడు సీస పద్యమును పెక్కుబాటల నడిపించి తరువాతి వారికి మార్గదర్శకుడైనాడు.

తరువోజ

దేశి పద్యముల ఎడ నభిమానము గల్గిన చోడుఁడు తరువోజ, ఉత్సాహ, లయగ్రాహి లయ హారిణ్యాది పద్యములను సందర్భోచితముగ జెప్పినాడు.


చోడుఁడు తరువోజ పద్యమును దక్షునిచే నల్లునిపై నలిగిన తరుణమున - భార్యకు జెప్పు సమయమున జెప్పించినాడు.


రతీ విలాపమును (పంచమాశ్వాసము) గూడ నీ పద్యముననే జెప్పించినాడు.


“కాయజుఁడాయగ్ని గాలెనో నెఱయఁ
గాలంగ నెడ యెద్దిగడు భీతి బాఱి
పోయెనో? ననుఁ బెట్టిపోవునే కడచి?
పోయిన నీ భస్మపుంజ మెక్కడిది”


విరహావస్థ యందు (పార్వతీ) సైత మీతడు పైని చెప్పిన పద్యమును వ్రాసినాడు.

లయగ్రాహి

వీర రసానుమూలమైన ఈ పద్యము నీతడు మనోహరముగ జిత్రించినాడు.


“ముట్టి గజయూధముల బట్టి రద నాగముల
గుట్టి తెగఁ జీరి పలు తట్టములు వెట్టుం
గట్టి దురదాకి పడఁజెట్ట మొగపెట్టుఁ బెద
ముట్టు సనివాలముల బెట్టుకొని వీడున్‌
బిట్టడరి కేల మెడసుట్టి తెగ నెత్తువడు


నట్టలు శిరంబులును మెట్టలు గొనం బ్రో
పెట్టు జనదట్టు జెడమెట్టు నలిగొట్టుఁ గని
కట్టలుకఁ దారక సురారి కరివారన్‌”


కుమార సంభవములోని వృత్తములకు స్త్రీ పర్వములోని వృత్తము లనుకరణములుగ గన్పట్టును.

స్రగ్ధర - మహస్రగ్ధరలు

చోడుఁడు స్రగ్ధరను రెండు పట్టుల యందే వాడినాడు. (గ్రంథాది మంగళా చరణమందును, దక్షాధ్వర విధ్వంసమునను)

మహాస్రగ్ధరను మాత్రము నూట తొంబది పద్యముల, కుమార సంభవమున జెప్పినాడు.

మంగళ మహాశ్రీ

కావ్యాదిని స్రగ్ధరా వృత్తము నన్నెచోడుని ప్రత్యేక మార్గమయినట్లే కావ్యాంతమున మంగళ మహాశ్రీ వృత్తమును రచించుటయు నీకవి ప్రత్యేక మార్గము.

ఈ మంగళ మహాశ్రీ యనునది కాకతీయ శాసనముల కాననగును.

పదపరికరము

“నన్నెచోడుని కవిత్వ మన్యభాషా దూషణగాదేని యుత్తమ'మని పంతులు గారు జెప్పుటకు అతడుపయోగించిన ప్రాంత పదము లాధారముగా స్వీకరింపవచ్చును. చోడుని కవిత్వమునందాంధ్రేతరములైన తమిళ, కన్నడ భాషా పదములుండుట సత్యదూరము కాదు.

జాను తెనుగు

ఇదమిత్థముగా నిర్ణయించుటక సాధ్యమైన ఈ జాను తెనుగు స్వరూపమెట్టిదో జనసామాన్యమునకు సుదూరముననున్నది.

నన్నెచోడుని యనుగాలములో నొకడైన పాల్కురికి సోమనాథుడు జాను తెనుగునిట్లు నిర్వచించినాడు.

“ఉరుతరగద్య పద్యోక్తుల కంటె సరసమై పరగిన జాను తెనుంగు చర్చింపగా సర్వసామాన్యమగుట” (బ.పు) “పూరిత సంస్కృత భూయిష్ఠ రచన మానుగా సర్వసామాన్యంబుగామి జానుతెనుగు విశేషము ప్రసన్నతకును (పం.ఆ.చ)

తత్కాలమున వ్యావహారికములగు నాంధ్రేతర పదములనే యాతడుపయో గించెనని అంగీకరించుట కాలంబనముగా, ఆతని తరువాతివారు యా పదముల నుపయోగించుట మనము దీసికొనవచ్చును.

శతక వాఙ్మయము

శతకరచనకు బీజములు నాటినవాడు నన్నెచోడుఁడు. దారిద్ర్య విద్రావణాయను మకుటముతో పది పద్యములు వరుసగా నింద్రుఁడు శివుని స్తుతించినట్లు రచించెను.

కుమార సంభవము ప్రథమ ప్రబంధము

ప్రబంధములో నితివృత్తమున వస్వైక్యముండవలయును. తదితివృత్తము పురాణమునుండి గ్రహింపబడినదై, శృంగార రస ప్రధానమై, వీరరసము అంగరసము కాగా వర్ణనాబాహుళ్యత నొప్పుచు నుండవలెను.

ప్రబంధ శబ్దమును తొలిసారిగ నుపయోగించిన చోడుని కృతి యందుగల ప్రబంధ లక్షణా పరీక్షణ.

అష్టాదశ వర్ణన:


“వనజలకేళీ రవిశశి
తనయోదయ మంత్రగతిరతి క్షితి పరణాం
బునిధి మధు ఋతు పురో ద్వా
హ నగ విరహ దూత్య వర్ణనాష్టాదశమున్‌”


వనవిహారము:


“తన్నిన బూచె నెందు గడు దైన్యమ శోకము, బాహుపీడనం
గ్రన్నన బూచె నీకురువకంబును, నెంగిలికల్లు సల్లినన్‌
మన్నన దప్ప పూచె దొరమాయగ గేసరమేము సూచుడుం
గన్నుల సన్న బూచె దిలకంబని దానికి మెచ్చి రంగనల్‌”


ఈ పుష్పాపచయవర్ణన మనంతర కవులు తూ.చా. తప్పక వర్ణించిరి.

సూర్యోదయ వర్ణన:

అష్టాదశ వర్ణనలో ఈత డతిమనోహరముగ జిత్రించిన వానిలో నిదియొకటి. శ్లేషాత్మకముగ జెప్పిన ఈ క్రింది పద్యముదాహరణముగ గైకొనవచ్చును.


“రాజరుచివాయ గువలయ రమణ దఱ గె
గలయ దమ్ముల మొగములు నెలమి మిగిలె
శీతకరుడైన రాజు పాసిన ధరిత్రి
వందుగాకెందు దాయలు వగతు రెట్లు”


ఇట్లు చంద్రోదయ, తనయోదయ, మంత్రాలోచన, యాత్రా, సురత, యుద్ధ, సముద్ర, మధుపాన, ఋతు, నగ, పుర, పరిణయ, విరహ, దూత్య వర్ణనలు మనోహరముగా జేయబడినవి.


షట్త్రింశదలంకారాలంకృతంబై యొప్పు కావ్యకన్య సృష్టికర్తయు, ప్రథమ ప్రబంధ కర్తయు, షష్ట్యంత్య శతక, శ్రీకారాది పద్యములకు మార్గదర్శకుడై మాయని కాంతిని గాంచినప్పటికిని, అటు శివకవుల యొక్కయు, నిటు వైష్ణవ కవుల యొక్కయు ఆదరమును బొందలేమి యాతడు వెలుగు చూడలేదు.


అనేక విషయములం దనేకులకు మార్గదర్శకుడైన ఈ కవిరాజశిఖామణి అనల్ప కల్పనాశక్తితో, అపూర్వ వర్ణనాయుక్తితో, అలతి యలతి అలంకారములతో రమణీయాక్షరముల పొందికతో కథను అందముగ, కర్పూర తాంబూలమువలె మలచి యందించి, సమస్త వస్తు కవీశ్వర నూత్న కావ్య రుచిర రత్న వీధి యెట్లుండవలెనో విశదీకరించి, దశప్రాణంబుల సప్రాణంబై నవరస భావ భరితమైన రచనతో కావ్య కన్యను నిర్మించి చిరస్మరణీయుడైనాడు.


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse