సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/ద్విపద రామాయణము
ద్విపద రామాయణము
కవిత్వ విషయము
“ద్విపద కావ్యంబు, ముదిలంజ దిడ్డి కంత” యన్నియు సమమని వేణు గోపాలుఁడు పడఁదిట్టిన వాక్యము గొందఱి సమ్మతమున సమంజసమై యుండును. కాని యీ రామాయణము వంటి కావ్యములఁజదివిన తర్వాత నిట్టి యభిప్రాయము తప్పని తోచక పోదు. ద్విపద కావ్యములన్నింటిలో ద్విపద రామాయణము, గౌరన హరిశ్చంద్రయు శ్రేష్టములైనవి. పాల్కురికి సోమనాథుని బసవపురాణము గూడ వీనికిఁదీసిపోయినది కాదు. భారతమును బ్రథమమున నాంధ్రీకరించిన కీర్తి నన్నయ భట్టుది. రామాయణమును మొదట తెనిగించినది కోన బుద్దుఁడు. భాగవతము బమ్మెర పోతన ఖ్యాతి నిల్పినది. కోన బుద్దుని పిమ్మట భాస్కరుడు, మొల్ల, రఘునాథ రాయులును వేర్వేరు గ్రంథముల వ్రాసిరి. పిమ్మట కాణాదము పెద్దన గద్వాలయందు రామాయణమును వ్రాసెను. అతని గ్రంథ ముత్కృష్టమైనదయ్యును గద్వాల రాజుగారిచేఁ గొందఱి పండితులకే బహుమతిగా నివ్వబడుటచే నా గ్రంథము కన్యాకుమారి నాసిక యందలి సర్పమణి వోలె రాజాగారి భాండాగారమందే ప్రకాశించుచున్నది. పెద్దన తర్వాత గోపీనాథము వేంకటకవియు, నిటీవల శ్రీ వావిలి కొలను సుబ్బారావుగారును దీనిని నాంధ్రీకరించిరి.
కోన బుద్దుని శైలి నాతికఠినమై లలిత పద గుంభితమై, యుచిత స్థలముల వర్ణనములు కలదై, పండితులకును బామరులకును నాదరణీయమై యున్నది. ఇతని గ్రంథము సగము కన్న నెక్కుడుసంస్కత పదములు గలిగి యున్నను, క్లిష్ట దీర్ఘ సమాసములతో నిండినది కాదు. అప్పకవిగారి మహాప్రబంధ లక్షణములన్నియు నిందులేవు. అయోధ్యాపురము గ్రంథాంతమందు శ్రీరాముడు సీతకు విమానమందా యా స్థలముల జూపుచో గొద్దిగా వర్ణింపబడియున్నది. కుమార సంభవములో నన్నెచోడుఁడు జగదీశ్వరుని రహఃక్రీడను హేయముగా వర్ణించెను. ఈ కవి గ్రంథ మందెచ్చటను నాజోలికే పోయినవాఁడు కాడు. ఇక్కవి వర్ణనములందు మూలమునే యనుసరించినందున చిత్ర విచిత్ర గల్పనల మాట యెత్తుకొనలేదు. విశ్వామిత్రు నాశ్రయంబున రాత్రి వర్ణనము చాలా రమణీయముగానున్నది.
“చలియింపకున్నవి సకల వృక్షములు
మెలఁగవు వన భూమి మృగ సమూహములు
నెఱి విహంగములు నీడముల్ చేరి,
మఱిచియున్నవి తను మంజుల ధ్వనులు,
దీఁటుగ చీకటి దెసలు నాకసము,
కాటుక బూసిన కరణి నున్నదియు
నీలాంబరంబున నిండు ముత్తెములు
గీలించి బ్రహ్మాండ గేహ గోళమున
గడునొప్పగా మేలుకట్లైత్తినట్ల
యుడు గణంబులతోడ నున్నది నింగి (పు-35)
సీత యౌవనమునొందు విషయమును వేరుకవు లలంకారశాస్త్రము నంతయు
బోధించి యుందురు కాని ఈ కవి:
“ఇంతయై, యంతయై యెలజవ్వనమున
వింతయై, యీ యింతి వెలయుట జూచి”
యంతటితో విడిచెను, రామలక్ష్మణాదుల భార్యల నలువురి కన్యకల నిట్లు
వర్ణించెను.
శారద పూర్ణిమా చంద్రుని కళలో
చారు వాసంత వాసన పుష్పలతలో
సాన దీరిన మంచి జాతిరత్నములో
శ్రీ నిండఁబట్టి నార్చి కుందనంపుఁ
గమ్మలో కఱిఁబులు గడిగిన ముత్తి
యమ్ములో నెఱతావి నలరు గంధంపుఁ
గొమ్మలోయన బెండ్లికూఁతులొఁప్పారి; (పు. 75)
జ్ఞప్తికిఁదెచ్చును. జీవనస్థితికినై చేనుదున్ను త్రిజటాఖ్య విపు డెందాక రాయి రువ్వునో యందాకయుండు గోవులనిచ్చెదనిన రాముఁడు పల్కగా నతఁడు, కరమున పాషాణ కలితుఁడై.
అఱచి ధోవతి మొల నంట బిగించి,
కురుచైన శిఖముడి గొని యౌడుఁ గఱచి,
నరముల బ్రాణముల్ నరినంటఁబట్టి;
బిరబిర తన ముష్టి బెట్టుగాఁ ద్రిప్పి,
యురమున జందెము నుఱ్ఱూతలూగ
సరయువు దాట విచ్చలవిడి నేసె; (పు. 108)
అరణ్యకాండమందు హేమంతము
దిశలెల్లఁ జలికి భీతిలి వెలిపట్టు,
ముసుకు పెట్టిన యట్లు ముంచెహిమంబు;
వెఱపున వణఁకెడు విరహిణులనగఁ,
దెఱగొప్పఁ గదలు పూఁదీఁగె వీక్షింపు (పు.153)
ఈ వర్ణన మందలి ప్రతి పజ్త్కిని జదివి యానందింపవలయును. అచ్చతెనుగు
పదముల యల్లిక యందంద కాననగును. చుప్పనాతి తనకొడుకు తుంటలై
పడియుండుటం జూచి మునులపై కెగసిన గతిని చిత్తగింపుఁడు.
తలను మోపెడు జడల్ ధరియించి బూది,
యలఁది జన్నంబున నందఱుఁగూడి
తొలఁగక మేకపోతుల మెడల్ విఱచి,
పొలుపార నుడికించి పొట్టలనిండ,
నెట్టన నమలి యెండిన కళాసములు,
గట్టి యేమియు నెఱుంగనియట్ల యుండి,
క్రొవ్వి నాశిశువును గుమతులై పట్టి
యెవ్విధి జంపితిరి? (పు. 157)
వచ్చినవి. విభషణుఁడు శ్రీరాములను,
నిత్య సత్యత్రాణ, నిత్యకళ్యాణ
నిత్య జగత్త్రాణ నిత్యగీర్వాణ. (పు. 301)
యని స్తుతించెను. ఇంద్రజిత్తు భార్య సులోచన యిదే యంత్యప్రాసములతో
రవి కులాంబుధి సోమ, రామాభిరామ,
ప్రవిమల గుణధామ, పరరాజ భీమ,
జలద సన్నిభ గాత్ర, సారస నేత్ర,
విలసిత చారిత్ర, వితత పవిత్ర. (పు. 471)
యనియు నుతించెను. ఈ పద్ధతిని బమ్మెర పోతనరా జనేక స్థలముల ననుసరించెను.
మహా పురాణమగుటచే నీ ప్రబంధ మందతిశయోక్తులుత్ప్రేక్ష లక్కడక్కడ ముఖ్యముగా యుద్ధకాండ యందుఁ జేర్పబడి యున్నవి. శ్రీరాములు సముద్రునిపై బ్రహ్మాస్త్రము ప్రయోగించినపుడు.
బ్రహ్మయు నింద్రుండు భ్రమఁ గానరైరి,
బ్రహ్మాండ మెల్లను బగిలి నట్లయ్యె:
భువనంబు లెల్లను బొగిలి నట్లయ్యె. (పు. 309)
ఇత్యాదులు, కుంభకర్ణుఁడు యుద్ధభూమికి వచ్చినపుడు సహిత మిదే యవస్థ
మనము సాధారణముగా 'పైల్వానుల కుస్తీ' చూచునపుడు కరతాళ ధ్వనులు
చేయుదుము. ఇది రామ రావణయుద్ధము. దేవతలు విమానములందుఁ గూర్చుని
కనుఱెప్ప వేయక చూచుచున్నారు. ప్రతి రాక్షసవీరుడు గూలినపుడు నరులపై
వానరులపై పుష్పవర్షమును గురిపించుచున్నారు.
“ట్రాయి" యుద్ధమందు దేవతలు గూడ పోరాడుచుండిరి. ఇక్కడ మన దేవతలు
చూపరులే. కాని యుభయలోకములకును “రాయిటరు” అయిన నారదుఁడు మాత్ర
మొకతూరి రామదర్శనమునకై వచ్చెను. రెండవ తూరి యింద్రుడు తన విమానమును
బంపెను. ఇమ్మహాకవి యనేక స్థలముల కథాసందర్భములను బ్రకృతి భావములను
దారుణ స్ఫుట రోష దైత్య గర్వాంధ
కారంబుతో నంధకారంబు విఱిసె
నతి మీఱి వానరానన సరోజాత
ములతో సరోజాతములు వికసించె; (పు. 510)
ఈ పద్ధతినే గౌరన తన హరిశ్చంద్ర యందనుసరించెను.
విశ్వామిత్రుఁడు రామలక్ష్మణులతో,
జెలఁగు సారసగణ సేవ్యమై, పుణ్య
సలిలమై, యుత్ఫుల్ల జలజమై మిగుల
ఫేనమై, నిత్య గంభీరమై, చారు
మీనమై, యతి పుణ్య మిళితమై, యమరు
గంగా తటంబున ఘన లతా సంఘ
సంగతంబగు సమ స్థలమున నిలిచి, (పు. 35)
మాధ్యాహ్నికంబు లొనర్చిన ఘట్టమున నితని శైలి గంగా ప్రవాహమువలెనే “నిత్య
గంభీరమై” యున్నది.
ఇట్టి యుత్కృష్ట గ్రంథమందుఁ గొన్ని ఛందో వ్యాకరణ దోషములు గాన
వచ్చుచున్నవి. అవన్నియు నటులుండ నే నిందు రే ఫ ద్వయమైత్రి విషయమును,
క్త్వార్థ కే కార సంధిని గుఱించియుఁ జర్చించెదను. అప్పకవి రే ఫములను ఱాలను
“క్రమ మెఱుఁగక రెండునుం గుకవి గూర్చు కృతిన్” అని రేఫద్వయ మైత్రిఁ వారికి
శాప మిచ్చెను. మఱియు భాగవతమున 'రేఫమ్ములు ఱాలునుం గలిసి ప్రాసములైన
కతంబునం గదా! యిమ్ముల నాది లాక్షణికులెల్లను మాని రుదాహరింపఁగన్” అనియు
వ్రాసిరి. ఈ ద్విపద రామాయణమునఁ బెక్కు తావుల రేఫద్వయ మైత్రి యున్నను నీ
గ్రంథమును లాక్షణీకులంగీకరించి యున్నారు. ఒక కోన బుద్దుడే కాడు, గౌరన,
పిన వీఱన, కూచిమంచి తిమ్మకవి, మున్నగు వార నేకు లీమైత్రిని బాటించి యున్నారు.
వీరిని గూడ లాక్షిణికు లుదహరించినారు. కాని బమ్మెర పోతన మాత్రమే తర్వాతి
వారికి వెఱ బొమ్మయై యున్నాడు. సమాన ధ్వనిగల “లళ” లకు మైత్రి కలదు గాని
యట్టి రఱలకు లేకుండుట యే నియమము? ధ్వని భేదము కలగిన “పుంపులకును”
ముకారమునకును ఋకా రేకారములకును, మైత్రి కలదు కాని “ర ఱ” లకు లేదట. ఈ కవి తిక్కన సోమయాజికిఁ బూర్వుడు. ఇట్టి కవుల ప్రయోగము వలన అప్ప
కవికిఁ పూర్వమే రేఫద్వయ మైత్రి దుష్టముగా నుండినది కాదనియుఁ దానిం బాటించిన
వారు కుకవులు కారనియు విదితమగును. ఏమి చిత్రమో మైత్రి కూడదని గట్టిగాఁ
బల్కిన యప్ప కవియే 'రఱ' లను యతి ప్రాస స్థలమున నుపయోగించినాడు. దీనివలన
నతఁడు తమాషా సూత్రము వ్రాసెనని తెలియును.
క్త్యార్థ కేకారముపై సంధి యీ కవి కొన్నిచోట్లఁజేసినాడు. జైమినీ భారతమం దంతటను నీ సంధి కనఁబడును. నన్నయ సహితము “అందిమ్ము” అని ప్రయోగించి నాడు. ఇట్టి యభ్యాసమున కేవో కొన్ని ప్రబల కారణములుండును. “కొను”నకు “కా” దేశము సహిత మీ గ్రంథమందు సాధారణముగాఁ గలదు. తర్వాతి కవులును వ్రాసి యున్నారు. యతి భంగములున్న స్థలములు కథా భాగమందు సందర్భరహి తార్థముల నిచ్చుటచే లేఖకుల దోషములని తోచెడి.
ఇట్టి దోషములున్న నీ గ్రంథ ప్రశస్తి యావంతయైనను దగ్గినది కాదు. కాని గ్రంథ కర్తృత్వ సందేహమను లోపమొక్కటి యందఱను బాధించుచున్నది. సంస్కృతాంధ్ర భాషా చరిత్రములు మన పూర్వులు వ్రాయనందున నిట్టి లోపములు గలిగెను. ఈ విషయముల నింకను విశేషముగాఁ బ్రజ్ఞావంతు లందఱును శోధించి యథార్థముల బయలు పఱతురు గాక యని నా విజ్ఞాపన.
కర్తృత్వ విషయము
“తోరణాల చొక్క దొంగ కుక్క” యని కొన్ని సంవత్సరములకు బూర్వము చంద్రికా పరిణయకర్త కొల్లాపురము మాధవరాయలు కారనియుఁ దద్గంథ్రకర్త యాస్థానకవియై యుండిన తోరణాల చొక్కయ్య యను నాతఁడే యనియు మహా పండితులు కొందఱుభయపక్షముల విమర్శనలు సేయసాగిరి. ఆంధ్ర భాషయందిట్టి చొక్క యలెందఱో యూహలచేఁ గల్పింపఁబడుచున్నారు. వల్లభరాయల క్రీడాభి రామమును శ్రీనాథుఁడు వ్రాసెనని యందురు. కృష్ణదేవరాయల యాముక్తమాల్యదను పెద్దన వ్రాసెనందురు. భారతమును నన్నయ సహితము వ్రాయలేదందురు. నందితిమ్మన రామరాజభూషణునికి “ముక్కు” అమ్ముకొనెనట! ఇవన్నియు నెంత సత్యములో తెలిసినవి కావు. కాని చిత్రకవి సింగరార్యుఁడు మాత్రము బిల్హణీయమును వ్రాసెనని మనకిప్పుడాశ్వాసాంత పద్యమందలి రహస్యము వలన నిశ్చయముగాఁ దెలిసినది.
ప్రకృతము రంగనాథ రామాయణమసు సుప్రసిద్ధమైన ద్విపద కావ్యమును రంగనాథుఁడను కవి వ్రాసెనని ఇంతవఱకును గొందఱి పండితుల యభిప్రాయమై యున్నది.
ఇటీవల రెడ్లు జాత్యభిమానముచేఁ గాఁబోలు! నీ గ్రంథము కోన బుద్దారెడ్డిదే యని తీర్మానించికొనినారట. ఇట్టి తఱి గ్రంథకర్తృత్వ నిశ్చయ స్థితి గనుఁగొనుట యావశ్యకము. ఈ కార్యమునకుఁ బూనుకొనుట యందు శ్రీ జనమంచి శేషాద్రి శర్మగారి వంటి మహాపండితుల యభిప్రాయముల విమర్శింపవలయునను భీతి యొకప్రక్క, జాతి పక్షపాతముచే సత్యమును గనుఁగొనఁ జాలనేమో యను శంక యొక ప్రక్క నన్ను బాధించుచున్నవి. అయినను నా తోచిన రీతి నిందు విశదీకరించెదను.
1. రంగనాథుడు 'రామాయణమును దెనిఁగించినట్లు గ్రంథమున నెచ్చటను జెప్పుకొనలేదు.' కాని కోన బుద్ధ భూపాలుఁడు గ్రంథమంతటను దన పేరే తగిలించినాడు.
2. అయితే గ్రంథ నామములు కవులనుబట్టి పెట్టఁబడుచుండును. ఇది రంగనాథుని పక్షమునఁ బ్రబలమైన యాధారము. ఆంధ్రమందు మొల్ల రామాయణము, గోపీనాథ రామాయణము మున్నగు గ్రంథములే కాక, ఇతర భాషలందు కంబ రామాయణము, తులసీదాసు రామాయణము అని జగద్విఖ్యాతములై యున్నవి. అయితే మన రంగనాథ రామాయణము రంగనాథుని దేయని చెప్పుట కన్ని విధముల యాధారములు లేవు. బుద్ధభూపాలుఁడు తన తండ్రియగు విఠ్ఠలనాథుని పేర నీ కావ్యమును రచించెనని గ్రంథమువలనఁ దెలియును. ఆంధ్ర మందు నెవరి పేరిట గ్రంథము నంకితము సేయుదురో వారిపేరిట గ్రంథనామ ముండినటుల నరసభూపాలీయము, మల్లభూపాలీయమును సాక్ష్యమిచ్చుచున్నవి. అట్టిచో నిది విఠ్ఠల రామాయణమని యుండిన సందేహమే యుండదు కదా. 'రంగనాథ' యని యేల పేర్కొనఁబడి యున్నది? దీనికి శ్రీ వంగూరి సుబ్బారావు గారిచ్చిన సమాధానము సరియై యుండునా? విఠ్ఠల దేవుఁడు హిందూ లోకమునఁ పాండురంగ విఠ్ఠలుఁడనియు, విఠ్ఠలరంగనాథుఁడనియు సుప్రసిద్ధుడు ఈ బుద్ధ భూపాలుని తండ్రి విఠ్ఠలనాథ యని గ్రంథమందుఁ జెప్పఁబడినాడు. కావున నీ విఠ్ఠలునే రంగనాథునిగాఁ బేర్కొనియుందురా యని సందేహము కలుగుచున్నది.
8. కోనబుద్ధుఁ డాశ్వాసాంతములందుఁదాను భాషాధీశ విభుఁడనియు, వినుత కావ్యగమ విమల మానసుఁడనియు, పాలితాచారుఁడనియు, అపారధీశరధి యనియు నింకయు నేనేమొ, యాత్మస్తుతిని జేసికొనినాడు.
“విద్వత్కవులాత్మస్తుతిని జేసికొనువారు కారు” అని శ్రీ శేషాద్రి శర్మగారు సెలవిచ్చిరి. కాని వారే, కోలాచల మల్లినాథ సూరి, కాళిదాసు, నన్నయ భట్టు, అల్లసాని పెద్దన మున్నగు వారాత్మ స్తుతులఁచెప్పుకొనినారని సూచించిరి. మహారాజుల నాశ్రయించి నిర్గర్వులై యుండిన బ్రాహ్మణోత్తములే తమ బిరుదుల కంచు ఢక్కలపై మ్రోయించినపుడు, “రాజ సర్వజ్ఞుండు రాజ సింహుడు” అయిన విఠలనాథుని పుత్రుడు, సర్వజ్ఞుఁడనఘుండు, చతురవర్తకుఁడు, సర్వపురాణ విచార తత్పరుఁడని” విభుధులచే స్తుతిగన్నవాఁడు, బుద్ధ భూపాలుఁడు, పరిపాలనా స్థానమందుండి యాత్మ స్తుతిని జేసికొనుట యందే చిత్రము కలదు?
4. నిశ్చయముగా గోన బుద్దుడే వ్రాసి యుండిన గ్రంథమందుఁ 'దన తండ్రి విఠల ధరణీశు బేర' యనుటకు మారుగాఁ 'దమ తండ్రి' యను పరులు వ్రాసినట్లేల వ్రాసెను. అని నాలవ యాక్షేపణ. సాధారణముగా నా తండ్రి యనుటకు మారుగా మా తండ్రియని చెప్పికొనుట, పెద్దలయందు గౌరవాతిశయము, తనయణకుఁవ, లోకాచారమునునై యున్నది. ఇంతియే కాక బుద్ధభూపాలుఁ డొకఁడే కాడు విఠ్ఠల సుతుఁడు. విఠ్ఠల నాథుఁడు “సుతులు” రాజులు, బహుశ్రుతులును గొల్వం ” గొలువున దీపించెనని గ్రంథారంభముననే యున్నది. మఱియు, నాతతకృతిపేర, నతి పుణ్యపేర, “మా తండ్రివిఠ్ఠలక్ష్మానాథుపేర” శ్రీరామ చరిత మొప్పఁజెప్పెదనని బుద్ధరాజు వ్రాసియున్నాడు.
5. రంగనాథుఁడు బుద్దుని యాస్థాన కవి యైనందులకు భాస్కరుని కథ యొకటి ప్రబల నిదర్శనమని చెప్పుదురు. రంగనాథుఁడును, భాస్కరుడును వేర్వేరు రామాయణములు వ్రాసి, యొకే తూరి రాజుగారి దగ్గఱకు వచ్చిన రంగనాథుని గ్రంథమును గుడిచేతను, భాస్కరుని రామాయణము నెడమచేతను గ్రహించిన భాస్కరుఁడు కుపితుఁడై రాజుగారి గుఱ్ఱపు రౌతునకు, సాహిణిమారునికిఁ దన గ్రంథ మంకితముగా నిచ్చెనట. ఇట్టి కథ నిజమై యుండినఁగదా మనము నమ్మవలసినది. దీనిని నమ్మినచోఁ దెనాలిరామలింగని కథలన్నింటి నేల నమ్మరాదు? కృష్ణరాయల యాస్థానమందష్టదిగ్గజముల రీతిఁ గవులుండిరను గాథలను గూడ నమ్మవచ్చును. కాని చరిత్ర యిట్టివి నబద్దములని బోధించుచున్నది “కథకు గాళ్ళు లేవు”
6. రంగనాథుడు రామాయణము వ్రాసిన యనంతరము ఉత్తర రామాయణ మును గూడ వ్రాసి బుద్ధరాజు కుమారులైన కాచవిభుడు, విఠ్ఠలుడు, రచించినట్లు ప్రకటించెనని కొందఱి దీర్ఘాలోచన. ఇవి యూహలలోని స్వప్నము. రంగనాథుఁడొక్క చౌర్యము చేసినదే కాక రెండవ దానికిఁ గూడ యంగీకరించెనా? మొదటి గ్రంథమందుఁదన విషయము బహిరంగముగాఁగాక పోయిన యేదో ఒక గూఢవిధమునైన సుంతయైనను దెలుపుకొనని వాఁడైనను, నీ రెండవ గ్రంథ మందైన దెలుపు కొనినాడా?
మొదటి గ్రంథము నొక్కని పేరనే రచించెనట. కాని రెండవ దాని నిద్దఱి పేరట ప్రకటించిన నెక్కువ లాభమని చేసెనా? బుద్ధభూపాలుని కుమారులు వంశపరంపరగాఁ బండితులై, రామాయణమును వ్రాయుటచే ప్రథమ రామాయణ మును బుద్ధ రాజేయని విన్నవించిన సాహసమా?
ఆంధ్ర మందలి యిట్టి ప్రథమ రామాయణమునకు గర్తయై బలవంతముగా వచ్చి కూర్చుని రంగనాథుఁడెవరు? ఏ కులము? ఏ దేశము? ఏ కాలము వాడు ఇంటి పేరేమి? వంశమెయ్యది? అతఁడింకేమైన ప్రబంధముల వ్రాసెనా? ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చు వారెవరు? ఇతర కావ్యముల కర్తృత్వ మెవ్వరి కారోపింపబడినడో యట్టి కవుల స్థితిగతులు కొంచమైనను మనకుఁ దెలిసియున్నవి. కాని యీ రంగనాథుని పేరు మాత్రమే చాటఁబడుచున్నది. స్వవిషయము నేమియు వ్రాసికొనకపోవుటచే నతఁడంతటి నిష్కామకర్ముడా? ధనలోభముచే సత్యము నడఁచువాడు కర్మఫల త్యాగియైయుండునా? చిత్రకవి సింగరార్యునివలె నెదో యొక రీతి నితఁడు తన సంగతిని సూచించి యున్నాడాయని యతిసూక్ష్మముగా గ్రంథమంతటను వెదకితిని. ఎచ్చటను గనఁబడలేదు. శ్రీరామచంద్రుడు యుద్ధమందు మూర్ఛనొందినపుడు
లక్ష్మణుఁడు విలపించుచు,
అర్థంబె విద్యయు, నర్థంబె నేర్పు;
పాయక మంగళ పాఠకానీక
గాయక కులములు గలవారిఁ బొగడు;
లేమియె సకల మాలిన్యంబు దలప;
అను వాక్యములందు రంగనాథుఁడు దన దారిద్ర్యమును నిందించుకొనె
నాయని సంశయించితిని. కుంభకర్ణుఁడు, రావణుఁనకు రాజనీతిఁ జెప్పుచు.
పతి దేశకాల విభాగంబు లెఱిఁగి,
చతురజనద్రవ్య సంపద గలిగి;
కార్యంబు మీఁదగు కార్యమూహించి,
కార్య విఘ్న ప్రతీకారంబు సేసి,
ఫలసిద్ధి గైకొని బహు రాజ్యభోగ,
ముల నిత్యుడై యుర్వి మోదింపవలయు;
నను వాక్యముల రాజ్యభారము వహించు గోనబుద్ధుని యభిప్రాయమై యుండదా
యనియు నూహించితిని. కాని యీ రెండుదాహరణములు అసమంజసములని
నిశ్చయించితిని. పై యంశములన్నింటిని బట్టి చూడఁ గోన బుద్ధుఁడే దీనిని రచించి
యుండనోపునని నాయల్ప విషయామతికిఁ దోచుచున్నది. అయిన నీ యంశములను
బ్రబల పఱచుట కుత్తర రామాయణమందేమైన యాధారములు దొఱకునో
చూడవలయును. విఠ్ఠలాదుల చరిత్రములను, మున్నగు విషయములను సహితము
శోధింపవలయును. రంగనాథుడే దీనిని రచించెనని నిస్సందేహాధారములు మనకు
లభించినచోఁ గోనబుద్ధుని ద్రోసి వేయవలయును. రంగనాథుని గురించిన
విశేషములేమియు లేని యీ పక్షమున గ్రంథకర్త గోన బుద్ధ భూపాలుడే యని
చెప్పనొప్పు.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse