Jump to content

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/దివాన్‌ బహద్దరు వి. నాగమయ్య

వికీసోర్స్ నుండి

దివాన్‌ బహద్దర్‌ వి. నాగమయ్య

ఆంధ్ర మహాపురుషుల జీవితములు పూర్వమందేమి యాధనిక కాల మందేమి వ్రాయుట యందు, పాశ్చాత్య సంపర్కము గల యిప్పటి కాలమందయిన నీ లోపమును బాపుకొనుటావశ్యకము. ఇందు తిరువాన్కూరు రాజ్యములో నలుబది సంవత్సరములు రాజకీయోద్యమమందు గడిపి, హిందుస్తానమందే కాక ఇంగ్లీషు దీవులయందును ప్రఖ్యాతిగాంచిన యాంధ్ర బ్రాహ్మణుడైన నాగమయ్య జీవితమును సూక్ష్మముగా నివేదించెదను.

దివాన్‌ బహద్దరు వి. నాగమయ్య బి.ఏ., యఫ్‌.ఆర్‌. హెచ్‌.యస్‌. తిరునల్వేలి జిల్లాలో తామ్రపర్ణ నదీతీరమునున్న వీరరాఘవపురమను గ్రామమున 1850వ సంవత్సరం డిసెంబరు నెలలో జన్మించెను. ఇతడారువేల నియోగి. వీరి పూర్వులు కృష్ణా జిల్లాలో బొంపూడి గ్రామమునుండి దక్షిణమునకు వెడలిరి. ఇతని మాతాపితరు లితడు జన్మించిన మూడు సంవత్సరాలకు తిరువనంతపురము (తిరువేండ్రము)లో బోయి చేరిరి. నాగమయ్య యచట మహారాజాగారి స్కూలులోను కాలేజిలోను విద్యాభ్యాసమొందెను. 1886వ సంవత్సరములో మెట్రికు పరీక్షలో గడతేరి 1870లో బి.ఏ. బిరుదమంది సర్‌.టి. మాధవరావు చేతి క్రింద సర్కారీ గుమాస్తాగా నౌకరీ చేయ ప్రారంభించెను. 1890వ సంవత్సరములో మన దేశమున ఇంగ్లీషు విద్యా చాల తక్కువ. అట్టి తరి యీతడే తిరువాన్కూరు సంస్థానములో మొదటి బి.ఏ. బిరుదమందినవాడు. ఇతడు విద్యాభ్యాసము చేయుకాలమున పాఠశాల యందలి బాలురలో నెల్లను బుద్ధి కౌశలమున మించియుండెను. ఇతడుద్యోగమున జేరిన రెండు సంవత్సరాల లోపలనే కొట్టయం భాగమునకు తహసీలుదారుగా తిరువాన్కూరు సర్కారుచే నియోగింపబడెను. ఇతని పై యధికారులు - ఇంగ్లీషువారును, స్వదేశస్థులును - ఇతని చాతుర్యమునకు, గార్యనిర్వాహణమునకును మెచ్చుకొని యతనిని బాల తహసీలుదారు అని పిలుచుచుండెడివారు. గతించిన మహారాజు కూడ యతని శ్లాఘింపదొడగెను. 1894 సంవత్సరమున తిరువాన్కూరు జనాభా (census) పై నతడు సూపరింటెండెంటుగా నుండుటకై యేర్పాటు చేయబడెను. ఈ జనాభా లెక్కలు ముగిసిన వెంటనే మహారాజు, మంత్రి మొదలుగ ఇంగ్లీషువారును, నితరులు నాగమయ్య శక్త్యుత్సాహములతో నొక లోపమైయినను లేక నియుజ్య కార్యమును బూర్తి చేసినందులకు నతనిని బ్రశంసించిరి. ఈ సందర్భమున హైదరాబాదులో మంత్రియైన సర్‌ సాలర్‌జంగ్‌ నాగమయ్యకిట్లు వ్రాసెను. “మీ ఖ్యాతి నేను వినినాడను. మా రాజ్యపు బాలనా పద్ధతులను మీకు స్వయముగా నివేదింప నిచ్చగలదు.” 1880వ సంవత్సరమున ప్రకృతపు మహారాజుగారు సింహాసనా రూఢలైరి. మరుసటి యేటనే నాగమయ్యకు దివాన్‌ పేష్కారి పదవినిచ్చిరి. తిరు వాన్కూరులో నిప్పుడు చాలావఱకు తగ్గినను, బ్రాహ్మణ సత్రములు ధారాళముగా జరుగుచుండును. ప్రతి దివసమెందఱు వచ్చిన నందఱి బ్రాహ్మణులకు అనంతశయన పద్మనాభ దేవాలయములో భోజనము పెట్టబడును. కాని ప్రతి సంవత్సరమును మూరజప తులాభారాద్యుత్సవ సమయములందు నాగమయ్య కార్యక్రమమును జరిపించుచుండెను. ఈ సత్రముల విషయమై నాగమయ్య తన రిపోర్టులో నిట్లు వ్రాసెను.

“మూరజపోత్సవమున సుమారు 4000 బ్రాహ్మణులకు 80 వారముల వఱకు భోజనమిచ్చుచున్నారు. కడపటి వారమున భుజించువారు 10,000 జనులు. ఇట్టి పద్ధతి ప్రపంచమందెందును గమనింపజాలము”.

నాగమయ్య రెండవ తూరి సహితము జనాభా లెక్కలపై నేర్చాటు చేయబడి యందఱి మెప్పు వడసెను. మహారాజాగారు హిందుస్థాన మందెచ్చటికైన బయలుదేరు సమయమున వారి సౌకర్యములకై యేర్పాటు చేయుటకు నాగమయ్యనే కోరుచుండెను 1881వ సంవత్సరమున మహారాజాగారు వీరి యేర్పాటులకు సంతసించి యుంగర మొకటి బహుమతిగా నిచ్చెను.

1890లో నితడు మూడవ తూరి జనాభాపై యధికారము వహించెను. ఈ సందర్భమున నితనిని రిప్పన్‌ గ్రాంటుడఫ్‌ బాల్ఫర్‌ వాచా మున్నగువారు ప్రశంసించుటయేకాక హిందూస్థాన ఇంగ్రీషు స్థానమందలి పత్రికలు బహువిధముల శ్లాఘింపదొడగెను. 1892లో నితడు రాయల్‌ హిస్టారికల్‌ సంఘములో నొక సభ్యుడుగా నెన్నబడెను.

ఇతడు పేష్కారిగా నుండిన కాలములో సత్రములను, బావులను, బాటలను, పాఠశాలలను దేవతాయతనములను కొన్నింటిని నూతనముగా నిర్మించి, యన్నింటిని బాగుచేయించి ప్రజలకేలాటి కష్టములుండిన నివారించు నుపాయములను జేయు చుండెను. ఇతడు మత సంబంధమైన ఎండోమెంటు చట్టమును శాసన రూపము వహించునట్లు దీనికై యతడు తిరువాన్కూరు సభలో ఉపన్యాసములనిచ్చి యాక్షేపణముల కన్నింటికిని సమాధానములనిచ్చి బహు ప్రయాసముతో సభ యొక్కయు రాజాగారి యొక్కయు అనుమతి బొందెను. రమేశచంద్రదత్తు నాగమయ్యకిట్లు వ్రాసెను. “మీ గంభీరోపన్యాసముల జదివితిని. అందు మీరతి ప్రతిభాశక్తిని జూపించినారు. మా సంస్థానములో సహిత మిట్టి చట్టమును శాసింప యోజించు తమరు నాకును జాల సహాయపడినవారై యున్నారు”. నాగమయ్య గంభీరోపన్యాసముల నిచ్చుటలో చాల ప్రవీణుడనుట కతని కంపిన లేఖలే నిదర్శనము, టాస్మేనియా గవర్నరుగానుండిన సర్‌ అర్థర్‌ హావ్లార్‌ ఇట్లు వ్రాసెను. 1897లో నేను తిరువనంతపురము వచ్చినప్పుడు మీతో గలసిన సందర్భము నెప్పటికిని మఅచిపోను. దక్షిణ హిందూస్థానములో నేగలసిన ధీ ప్రజ్ఞాశేఖరులలో మీరొకరని నా దృఢ విశ్వాసము”.

1902లో రాజాగారు మంత్రియు ఢిల్లీలో చక్రవర్తి పట్టాభిషేకోత్సవమున కరిగినపుడు నాగమయ్యను రెండు నెలలు “దివాను”గా నియోగించిరి. మరల 15 మాసముల తర్వాత రెండవ తూరి యితడు దివానయ్యను. పిమ్మట తిరువాన్కూరు నాణెముల యేర్పాటుకై నాగమయ్య “చక్రం కమిటీ కధ్యక్షుడయ్యెను. ఇది ముగిసిన పిమ్మట నాగమయ్యను తిరువాన్కూరు స్టేటు మాన్యుయల్‌ను తయారుచేయుటకై మహారాజాగారు కోరిరి. ఈ పని నాగమయ్యకే తగినట్టిది.

ఇతడు చిన్ననాటను గోలె యనేక శాఖలందు బ్రవీణత నొంది నానావిధ శాస్త్రములను గ్రంథములను ప్రతిదినమెంతటి కార్యముండినను గొంతవఱకవకాశము చేసుకొని యవలోకనము చేయుచుండెడివాడు. సర్కారు భాండాగార మందలి పుస్తకముల జదివినదే కాక తన సొంత లైబ్రరీలో 2500 యుత్కృష్ట పుస్తకముల గూర్చుకొనియుండెను. తన తక్కిన రాజ్య కార్యముల నిర్వహించుచుండియు 2000 ముద్రిత పత్రముల విషయముల నీతడచిరకాలము లోపలనే ముగించి ప్రకటించెను. ఈ గ్రంథములందితడు తిరువాన్కూరులోని జనులకు విదితములైన వాని వెల్లడించుచు నచటి సర్వజనుల చారిత్రములను వృక్ష జంతు లోహాదుల విషయములను భాషా చరిత్ర దేశచరిత్ర మున్నగు వానిని సమగ్రముగా వ్రాసి శేముషీవిశేషములను బ్రకటించెను. మత విషయముల వ్రాయుచో “హిందూ గృహము ప్రపంచములో నుత్తమ నిర్మాణమని యభిప్రాయమిచ్చి ఫాద్రీల యాక్షేపణముల ఖండించెను. తిరువాన్కూరులో మెల్ల మెల్లన ప్రాకి దినదినము ప్రబలమైనట్టి క్రైస్తవ మతమును నిష్పక్షపాత బుద్ధితో బ్రశంసించుటచే ఫాద్రీలు సైతము మిక్కుటముగా హర్షించిరి. చరిత్రకారుడైన “లేకీ? యతనినిట్లు ప్రశంసించెను.

“ఆల్‌ ఫ్రెడులయల్‌” మలబారు మంత్రవాదమును గురించి మాకు గొంత తెలిపెను. కాని వీరు వ్రాసిన దానిలో ననేక నూతాంశములు దొఱకినవి, నాగమయ్య వ్రాసిన మాన్యుయలు నాధారముగా జేసికొనియే ఎన్‌సైక్లోపిడియాలో మలబారు విషయము వ్రాయబడెననుట వీరి యసమానబుద్ధి ప్రభావమును వేనోళ్ళ జాటుటయైనది.

ఇది ముగిసిన పిమ్మట నాగమయ్య 1904 1905, 1907 సంవత్సరములలో వరుసగా మరల దివాను పదవి నందెను. తుదకు 1907లో తన యుద్యోగ పదవి నుండి సెలవు తీసుకొనెను. ఇతడు ముగ్గురు మహారాజుల కాలమునను, ఏడుగురి దివానుల దగ్గర నుద్యోగము చేసెను. మొదటి నాలుగు సంవత్సరములు విద్యాశాఖ యందును, 2 సంవత్సరములు దివాన్‌ కచ్చేరియందును, 2 యేండ్లు తహసీల్దారుగను, 12 యేండ్ల దివాన్‌ పేష్కారీగాను, 11 సంవత్సరములు రెవెన్యూ దివానుగాను, 5 మారులు దివానుగాను, మొత్తము 42 సంవత్సరములు రాజాగారి యుద్యోగమునకు ధారపోసెను. ఇట్లు ప్రపంచమందటను బ్రఖ్యాతి గాంచిన యీ యారువేల నియోగి, నాగమయ్య 1916 ప్రాంతమందు పరమపదించెను. ఇతని కుమారులిప్పుడు తిరువనంతపురములో మహారాజుగారి యున్నతోద్యోగములందు బ్రసిద్ధి వహించి వర్ధిల్లుచున్నారు.


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse