Jump to content

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/దాక్షిణాత్య లోకోక్తులు

వికీసోర్స్ నుండి

దాక్షిణాత్య లోకోక్తులు

సామెతలలో ఎంతో అర్ధము ఇమిడి యుండును. భాషకు ఒక అలంకార ప్రాయము, చరిత్రకు కొంత ఉపకరణము, కవిత్వానికి తోడు నీడ, భావ ప్రకటనకు పుష్టి, పండిత పామరులకు సంగమస్థానము. ఇవి సామెతలలోని విశేషములు. ప్రతి దేశములోను ప్రతి జాతిలోను, ప్రతి భాషలోను సామెతలకు మంచి స్థానమున్నది. ఒక్కొక్క ప్రాంతములో ఒక విధమైన సామెతలు, అవి జనుల భావములను, ఆచారములను వ్యక్తపరచునవై యుండును.

ఇతరుల మాటయేమోకాని తెనుగువారి సామెతలకు ప్రత్యేక స్థానము కలదు. ప్రాయికముగా సామెతలు యతి ప్రాసయుక్తముగానుండును. ప్రాసతో తిట్టరా పాడు ముండాకొడుకా అని ఎవ్వరో అన్నారట. సామెతలు మూడు నాలుగు విధాలుగా నుండును. హాస్యరసయుక్తమయినవి. బూతులతో నిండినవి. లోకానుభవయుక్తమైనవి యిట్లు పలు తెరగులుగా నుండును.

తెనుగులోని సామెతలను ఒకచోట చేర్చి ఒకటి రెండు గ్రంథాలు ప్రకటించి నారు. అయితే అందు దశాంశమైనా కూర్చలేదని చెప్పవచ్చును. ఒక్కొక్క జిల్లాలో ఒక విధమైన సామెతలు కలవు. ఇవన్నింటిని ప్రతి మండలమువారును కూర్చి వివరములతో కూడినవిగా ప్రకటించుచు వచ్చిన కొంత కాలానికి మరెవ్వరైనా అన్నింటినొకచోట కూర్చుటకు వీలుండును.

మన ఆంధ్రులకు అరవలకు పూర్వకాలము నుండి అదెందుకో సరిపడ కున్నట్లున్నది. అరవలు కూడా తెనుగు వారిని గురించి హేళనముగా సామెతలు చెప్పుకొందురు. తెనుగువారును అదే పద్ధతిపై అరవవారిని గురించి చెప్పుకొందురు.

శ్రీనాథ మహాకవికి అరవ సాంబారు రసము రుచించకపోయెను. ఆంధ్రులకు ఇప్పటికిని సాంబారు రసం అంటే సరిపడదు. శ్రీనాథునికి అరవదేశము మంది కూడా సరిపడినట్లులేదు. “పిళ్ళె” జాతి వారిని వర్ణించినది వింటే ఈ సంగతి అర్థ మౌతుంది, అతని తర్వాత పండిత జగన్నాథ రాయలవారికిని ఇదే విరోధముండినది. ఆయన ప్రౌఢ “మనోరమా కుచమర్దిని”లో ద్రావిడుల దూషణ అచ్చటచ్చట వ్యక్తమగుచున్నది.

దక్షిణ దేశములోని కొన్ని పట్టణాలు, ఆచారాలు ఆంధ్రుల సామెతలలో కెక్కి సాధారణమైపోయినవి. అట్టి సామెత లెన్నియున్నవో కాని నాకు తెలిసిన అయిదారింటిని ఇందు తెలుపుకొంటాను.

అరవ భాష మనవారికి సరిపడినట్లు లేదు, ఎవరైనా మాట్లాడే దానిలో అర్ధము కాకుంటే - ఏమిటదీ “అరవ మొత్తుకోళ్ళు” అని ఎగబడతారు. “అరవ అధ్వాన్నము” అనియు మరొక సామెత కలదు. ఎవరైనా బండచాకిరీ చేస్తే దాన్ని “అరవ చాకిరీ” అంటారు.

భిక్షపతి క్షౌరం అంటే అందరికీ తెలిసిన సంగతే. తిరుపతికి పోయే యాత్రికులెక్కువ. మంగళ్ళు తక్కువ. వేంకటేశ్వరునికి వెంట్రుకలంటే చాలా ప్రీతి. ముత్తైదువలు కూడా నున్నగా బోడి కొట్టించుకొని వెంట్రుకలు సమర్పించుకొని వస్తారు.

అయితే మంగళ్ళు క్షౌరానికి పోయిన వారిని వరుసగా కూర్చొనబెట్టి ప్రతివాని నెత్తిన ఒక పట్టె పెట్టి ఆ మనిషి తనవాడని రిజిస్టర్‌ చేసుకొందురు. ఆ ప్రకారము కాబడ్డ మనిషిని ఇంకొక మంగలివాడు మూడు నాల్గంతల పైకమిత్తునన్నను ముట్టడు. అట్లు ముట్టినా మంగలి కత్తులతో ఘోరయుద్ధము ప్రారంభమైనదన్న మాటే. ఇట్టి పట్టెల క్షౌరానికి మనవారు తిరుపతి క్షౌరం అని ప్రసిద్ధినించినారు.

ఇంకా కాస్త దక్షిణానికి విజయం చేస్తే “చిదంబర రహన్యమును” తెలుసుకొనవచ్చును. చిదంబర క్షేత్రములోని ఒక దేవాలయములో ఒక పర్దా కట్టి యుంటారట. దాని లోపల ఏమిన్ని ఉండదు. అయినా యాత్రికులు అందు దేవుడున్నాడని భావించుకొనవలెనట. ఏమిన్నీ లేని వస్తువును ఉన్నదనడానికి మనవారు చిదంబర రహస్యం అంటారు.

ఇంకా కొంచెము దక్షిణానికి తర్లినామంటే మనకు “పుంగనూరు మనుషులు” కనబడతారు. మనలోని మూర్ఖులను “పుంగనూరు మనిషీ” అని తిట్టుతాము. ఇప్పటికి నీ పుంగనూరు గురుస్థానమొకటి మద్రాసు రాజధానిలోనున్నది. అయితే అచటి మనుషులు మనవలెనే తెలివితేటలు కలవారే కాని యెవ్వరో మహానుభావులు ఈ సామెతను కల్పించి పోయినారు. పుంగనూరులో నౌకరులను విస్తర్లు ఎత్తివేయరా అంటే యెంతమంది తిన్నారు అని అడుగుతారట. ఫలానివాణ్ణి పిలుచుకొని రారా అంటే అతడు లేకపోతే యేమి చేయాలె అని అడుగుతారట. ఉన్నాడు పోరా అంటే “రాకపోతే మరి” అని అడుగుతారట. ఈ కల్పనలు ముచ్చటగానే ఉన్నవి.

తిరుపతికి సమీపంలో “కంచి” అనే క్షేత్రము కలదు. “నగరేషు కాంచీ నారీషు రంభా” అని ప్రాచీనమునుండి దీనికి ప్రఖ్యాతి. “కంచంత కాపురము” అనే సామెత కలదు. తెనాలి రామకృష్ణుడు తన పాండురంగ మాహత్మ్యములో నిట్లు వర్ణించినాడు.


“కాపు కోడలు కంచంత కాపురంబు
బాలవంటి కులంబు కాడ్పరచి యురికె
మగని నటుబెట్టి రెండవ మగనివెంట
నువిదలకు బుద్ధి పెడతల నుండుగాదె”


అంటే కంచి పట్నమంత పెద్ద కాపురము అన్నమాట. ఇక్కడ మాత్రము మనవారు ఒక్కమారైనా మెచ్చుకొన్నారు.


“ద్రావిడ ప్రాణాయామము” అనే సామెత సాధారణము. ద్రావిడులు ప్రాణాయామము చేయవలెనంటే నేరుగా ముక్కు పట్టుకోకుండా కుడిచేతిని నెత్తి వెనుకనుండి పెనవేసుకొని వచ్చి దానితో ముక్కు పట్టించుకొందురట. ఆ ప్రకారము ఎవ్వరును చేయరు కాని సామెత ఏర్పడింది. అంటే ఎవ్వరైనా సూటిగా చెప్పుటకు మారుగా డొంక తిరుగుడులు సవ్యాపసవ్య ప్రదక్షిణాలు చేసి చెప్పదలచిన ఆ రెండు ముక్కలు యిన్నూరు మాటల వరకు పెంచి పావుగంట కాలహరణము చేసి అంతయైనను ఒక్కొక్క మారు తమ అభిప్రాయాన్ని వినే నెత్తిలో పూర్తిగా యెక్కించలేని సందర్భములో ఈ సామెతను చెప్పుతారు.


ఇంకా దక్షిణానికి యాత్ర చేస్తే మనకు కుంభకోణము ప్రత్యక్షమౌతుంది. “వాడు కుంభకోణము చేసినాడురా” అని మన వారిలో నొక సామెత. అనగా మోసము చేసినాడని అర్థము. ఇది కూడా అన్యాయంగా వ్యాప్తి గావింపబడినట్టి సామెతయే అని చెప్పవలసిందే. ఇంకా దక్షిణానికి దిగితే శ్రీరంగం అనే పవిత్ర శ్రీవైష్ణవ క్షేత్రం ప్రత్యక్షం అవుతుంది. “శ్రీరంగనీతులు” అనే సామెత తెనుగు వారిలో చాలా ప్రసిద్ధి. అంటే తాము మాత్రము ఆచరింపక ఏమేమో నీతులు బోధించితే అవి శ్రీరంగనీతులు అని మన వారంటారు.

ఇంకా దక్షిణానికి పోతే “ఆడ మళయాళం” లో పడిపోతాము. ఆ ఆడ మళయాళం అనే దేశాన్ని గురించి మన దేశంలో వ్యాపించినన్ని కథలు, కల్లలు మరెచ్చటను లేకుండ వచ్చును. ఈనాడు కూడా పల్లెలలోని జనులు కట్టు కథల నంతా నమ్ముతారు. ఆడ మళయాళంలో అంతా ఆడవాళ్ళేనట. మగవాడు పోతే దక్కడట. అయితే గాలికి పిల్లలు పుట్టుతారట. “మళయాళ భగవతీ” అని మంత్రం వేసినారంటే రాయినో రప్పనో పశువో అయి పోవలసిందేనట. ఇంకా ఇట్టి చిత్ర కథలు కొల్లలుగా మన దేశములో చెప్పుకొంటూ వుంటారు.

మళయాళ మంత్రాలకు ప్రసిద్ధి అయిపోయింది. పూర్వంలో మంత్రగాండ్లు మళయాళం పోనీ పోకపోనీ తమకేమైనా మంత్రాలు వచ్చి వుంటే వాటిని వారు మళయాళంలో నేర్చుకొన్నామని చెప్పుకొనే వారు. అందుచేతనే మంత్రగాండ్లు యిప్పటికినీ మోడీ గారడీ వంటి ఇంద్రజాలాన్ని ప్రదర్శించే దానికి ముందు, “ఛూ, మళయాళ భగవతీ” అని ఆడ మళయాళ శక్తిని తలచుకొంటారు. ఇంకా ఇట్టి సామెతలు మరెన్ని వున్నవో యేమో.


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse