సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/దశకుమార చరిత్రము
దశకుమార చరిత్రము
సంస్కృత వాఙ్మయమందే దశకుమార చరిత్రము వంటి రమ్యమైన కథలు కలిగిన గ్రంథము లేదనిన నింక తెనుగు విషయము జెప్ప నవరసమే లేదు. తెనుగు నేటివరకు నొక యనుకరణ భాషగానున్నది. నాడు సంస్కృతము దీనికి మార్గదర్శకమైన నేడు ఇంగ్లీషు బంగాలీ భాషలా స్థానము వహించినవి. సంస్కృతమందు హితోపదేశ కథాసరిత్సాగర బృహత్కథా కాదంబరీ కథల వంటి వనేకములు కలవు. కాని యవియు నీ దశకుమార చరిత్రలోని కథలలో నొక్కొక్కటి యొక్క నవలకు మూలాధారము కాదగినది. నేటి నవలా కర్తలిట్టి కథలనే పెంచి సాహస కథలనుగా (Novels of Adventure) వ్రాయుచున్నారు. ఈ కథలలో రాజవాహనుడు పాతాళలోకమునకు బోవుట, ఒకమంత్రి యక్ష స్త్రీని వివాహమాడుట, ఒక బ్రాహ్మణ బ్రువుడు యమలోక మేగి వచ్చుట, నిట్టి యంశములు నాలుగైదు ఆవిశ్వసనీయములైన వానిని వదలిన దక్కిన భాగమంతయు నేటి నవలా కర్తలు సమ్మతించునవే యైయున్నవి.
కథలు వ్రాయు కవులకు ముఖ్యముగా గథా మాత్రము నవిచ్చిన్నముగా నడపుట (Narration) దానికనుకూలమగు సులభశైలి యీ రెండును నవసరములు. మన తెనుగు ప్రబంధములలో నూటికి తొంబది తొమ్మిది ప్రబంధములోని కథలు “పిట్టమ్మ కాకమ్మ కథల వంటివి”. మన కవులు కథా చమత్కృతిని చాటింపక శైలి చమత్కృతిని బూజించిరి. సంస్కృతమందును కాదంబరి యిట్టి గ్రంథమే. బాణుడు కథలు జెప్పుచు జెప్పుచు మధ్యన నలుబది యేబది పుటలే సరోవర వర్ణనమునో, యే రాజకుమారోపదేశమునో వర్ణించును. ఈ వర్ణనలును దెగబారెడు సమాసములతో నిండియుండును. చదువు వారికి విసుగు పుట్టుట తుది ఫలితము. మన దశకుమార చరిత్ర మట్లు కాదు. వర్ణనాంశము లిందు తక్కువ. శైలి నాతికఠినము. కథ మనోహరము. స్వాభావికము. ఇది సంస్కృత దశకుమార చరిత్ర సంబంధమగు చర్చ. ఇక మన తెనుగు దశకుమార చరిత్ర గుఱించి యించుక వ్రాసెదను. కేతన తెలుగులో గథలందొక్క చోట కొంచెము మార్పుచేసెను. రాజవాహనుని ప్రేమకథ యంతయు నొక యుచ్ఛ్వాసమున మూల మందుండ దానినే తెలుగున పుష్పోద్భవుని కథలో కొంతయు, చతుర్థాశ్వాసమందు సోమదత్తుని కథ యందు గొంతయు విభాగించి వ్రాసియున్నాడు. ఈ రెండు పద్ధతులవలన కేతన ప్రతిభను గనుగొనవచ్చును. ఈ కేతన ప్రబంధమును కేవలము (తర్జుమా) భాషాంతరీకరణ ముగా భావింపజనదు. ఇతడు స్వతంత్ర వర్ణనములు వ్రాసి తన భావ వైశాల్యమును జూపించినాడు. దండి యెంత రసికుడో, యంతకన్న రసికుడు మనకేతన. దండి వచనము వ్రాసియు “కవిర్దండీ” యని ప్రఖ్యాతి గాంచెను. కావుననే కేతన “యభినవదండి” యను బిరుద మందభిమానము కలవాడయ్యెను. కేతన మూలమున కెందెందు భిన్నముగా వ్రాసెనో యన్నియు నిందు జూప వీలుండదు. కావున గొన్నింటినే కేతన వర్ణనా సామర్థ్యమును జూపుటకై యుదాహరించెదను. ప్రారంభముననే పుర వర్ణనము భిన్నించినది. దాని వెంటనే రాణియగు వసుమతీదేవి సౌందర్య వర్ణనము విపులముగా మూలమందుండ మన కేతన “వసుమతికి సవతియనందగు వసుమతీదేవీ” యనినాడు. మూలమందలి వర్ణనలో విశేషమేమియు లేదు. కవి సంప్రదాయానుసారముగా పద్మములు మీనములు, పూర్ణకుంభములు మున్నగు వస్తువులు యంగముల కుపమానములుగా గైకొనబడినవి. మగధ మాళవదేశ రాజుల యుద్ధము వర్ణించుచో మన కేతన యిట్లు తన సొంత పద్దెమొకటి కలిపినాడు.
చ. ఆ మగధేశ మాళవ ధరాధిపు
లెక్కటిఁ బోరి రాజిలోఁ
గాముడు శంబరుండు శశిఖండ
ధరుండు గజా సురేంద్రుఁడున్
రాముడు రావణుండు సురరాజ త
నూజుడు సింధునాథుడున్
భీముడు దుస్ససేనుడు నుపేంద్రుడు
కంసుడు బోరు నాకృతిన్”
భవానీ పతేర్ముని పత్నీ సహస్రం సందూషణం పద్మనాభస్య షోడశసహస్రాంతః పురవిహారః ప్రజాపతేః స్వదుహితర్యపి ప్రణయ ప్రవృత్తిః శచీపతే రహల్యా జారతాః”
ఈ వర్ణన తెనుగునందు లేదు. దానికి బదులీ పద్యము మూలమందు లేనిది కలదు.
చ. అలరులుఁ బూత లంబరము
లాభరణంబులు దమ్ములంబు నె
చ్చెలులు మృదూపధానములు సెజ్జలుఁ
గేలి గృహంబు లాదిగా
గలుగు పదార్థముల్ నడుపుఁ గామము
దాను మనోహరంబు త
త్ఫల మగు సౌఖ్యసిద్ధిఁ దెలుపన్
యశమే యనుభూతిఁ దక్కంగన్॥
మూలమందొక జైనుఁడు (క్షపణకుడు) వ్యసనియై యొకచో నుండినట్లు వర్ణింపబడినాడు. ఆదర్శంచ... మస్పష్ట సమాధి మాథిక్షీణ మగ్రగణ్య మానభి రూపాణాం కృపణ వర్ణం కమపిక్షపణకం” అనగా నా క్షపణకుడు దీనుడై మానస పీడా దుర్భలుడై కురూపియై యుండెనని దీని అర్థము. ఈ క్షపణకుని వేషమును వాని వ్యసనమును నెట్లు కేతన చిత్రించినాఁడో చిత్తగింపుడు
సీ. భూరేణు పటలంబు పొదవిన వక్షంబుఁ
గన్నీటఁ దోడ్తోడఁగడగు వాని
డాకేలు నెక్కువ దాపిడి తనలోనఁ
తలపోసి తలపోసి యలయువాని
ధరలోన గలుగు నొప్పరి మిండలకు నెల్ల
మొరలు నాఁ జాలిన మూర్తివాని
బరివోవ సూఁచినఁ బలుచనై తల మీద
దూగాడు వెండ్రుక తోకవాని
తే. గూటికుంచెయు వెడచింపి చేటకెలన
దొంతి బుఱ్ఱల చిక్కంబు పొంతఁబెట్టి
వగల బొగిలెడువాని నిర్వాణి నొక్క
తరుణ తాపసిఁ గాంచితి ధరణినాథ.
ఇందు మొదటి పంక్తి మాత్రమే మూలమున కనుకూలము. కేతన ప్రతిభా ప్రభావమే.
మూలములో సూర్యోదయ మయ్యెను అని మాత్రమున్నది. గాని యా భాగమునే కేతన పంచమాశ్వాసమున నిట్లు వర్ణించినాడు.
సీ. ప్రాచీన శైలాగ్ర భాగస్థమగు నశో
కంబునఁ జిగురు జొంపంబనంగ
వర్షాధిపతియని వాసవు గొలువ జే
రిన యింద్రగోపక శ్రేణియనగ
నురుతర పూర్వభూధరము నెత్తంబున
బొలుచు గైరిక గండ శిలయనంగ
కాశ్మీర పటమున గావించి సురపతి
విడిచి యాడెడు వాలుబడగ యనగ
తే. నరుణ కిరణుండు దోతెంచె నంబుజాత
నర్మసచివ స్మితా పాదనంబునందు
జతురుడై యుష్ణకరముల జక్రవాక
తాపముడుపుట నాశ్చర్య ధాముడగుచు.
ఒక ధనికుని ఇంట దొంగతనము కాగా పౌరజనులాచోరుని చాకచక్యము నివ్విధముగా వర్ణించిరని మూలమున లేని విశేషమును దెనుగులో కేతన కల్పించి నాడు చూడుడు.
సీ. ఇమ్మూక లిబ్బంగి నింటిలో దిరుగంగ
సరకు సేయక వచ్చుటరిది కాదె... పంచ ఆశ్వా 130 పద్యము.
మూలమందొక లంజ తల్లి రాజుతో తన కులాచారమును గురించి యిట్లను. నహ్యర్థెర్న్యా యార్జితైరేన పురుషావేశ ముపతిష్టంతి (విటులు ఆన్యాయార్జితమైన ధనములను వేశ్యకిచ్చి వారిని బొందుదురు అని దీని యర్థము) ఈ వాక్యము నాధారముగా విటుల న్యాయార్జితము లెట్టివి తెత్తురో మనకేతన వర్ణించిన విధమిది.
సీ. కన్నంబు వెట్టి తెక్కలి కొని యంకంబు
పలువురితో నాడి బందివెట్టి
జూదంబునకుఁ జొచ్చి చూఱకాండ్రం గూడి
పరదేశముల కేగి తెరువులడిచి....
....ఆ, 6 ప. 95.
షష్టాశ్వాసమందు అపహార వర్మరాజ కన్యను జూచినప్పుడామె సౌందర్య వర్ణనము మూలమందు విశేషముగా కలదు. మన యాంధ్ర దశకుమార చరిత్ర మందది విడువఁబడినది. అపహార వర్మ రాత్రి రాజగృహము కన్నము వెట్టి సృగాలికయను దానిని వెంబడించుకొని వీధులందు బోవుచుండ దలవరులు వచ్చుటయు వారిని జూచి యితఁడు తప్పించుకొను నుపాయము కానక విధి కృతము
తప్పునేయని వారి ఎదుటికిబోయి నేను దొంగను నన్ను పట్టుకొనుడు అని పలికెను. కాని సృగాలిక యిట్లనెను. “అయ్యా! ఇతడు నా కొడుకు. పిచ్చి యెత్తినది. ఇంటిలో బంధించి యుంచ తప్పించుకొని వచ్చి యిట్లు వెఱ్ఱిని మీ యెదుట ప్రకటించుచున్నాడు.
మూలమందింతయ యున్నది. వెఱ్ఱి పట్టినదను విషయమును నాధారము చేసుకొని మనకేతన బహురమ్యముగా హాస్య జనకముగా నీవెఱ్ఱి తనమును వర్ణించిన ఘట్టము ముఖ్యముగా గమనింపదగినది.
సీ. చేసంకు పట్టుచుఁ జిడుపలు వెదకుచు
నొరి గాలదేవుడు నులికి పడుచు
విందులు విందులు విందులంచును బఱ
తెంచి మ్రాకులు కౌగలించి కొనుచు
మునుకుచు వెలుగుతో ముచ్చటలాడుచు
బొరిపొలి గూయుచు బొబ్బలిడుచు
గల మాటలాడుచు మొలపుండ్ల మల్లని
బాడుచు నొడలెల్ల బరికి కొనుచు
తే. నేవమగ ఱొమ్ముపై నిండ ద్రేవు డొలుక
నన్న కుడుములు దినవన్న యనుచు డాసి
గుండ్ర గుడ్లను జూపుచు గునిసి గునిసి
బయలు నవ్వుచు బడుకిళ్ళు వాచి కొనుచు
వ. “అయ్యారె కులదిక్కు మరలి”
తే. నేల జేతులు సమరి మైనిక్కమెల్ల
నఱచి యుంకించి యడువులు గఱచుటయును
వారలద్దిరా! యని వచ్చి నలియబాఱ
దోలికొని వారినిలిపితి సూల వొడచి
వ. “దానికి వారలందరు బెలుచ నవ్వుచు నరిగిన”
మూలమందు ఒక కోమటి నానాదేశములు తిరిగి యొకచోఁ దనకు నచ్చి
నట్టి కన్యను జూచెను. ఆ కన్యక లక్షణములు - అనగా - వివాహయోగ్య కన్యాలక్షణము
లను దండి విశేషముగా వర్ణించినాడు. కేతన యిది వదిలినాడు. కథా సందర్భమునకు
దగినట్లుగా నాయా తావుల కేతన మంచి యుపమానములను సామెతలను జొనిపి
నాడు. మూలమందులేని యొండు రెండు చూపెదను.
క. ఆ రమణీ తిలకమునకు
గారవమున శిశిరవిధులు గావించిన బొం
గారెడు నేతికి బయిపై
నీరలికినయట్లవోలె నిష్పలమయ్యెన్. ఆ.౩
క. ....ఆడబోయిన తీర్ధం
బెదురుగ వచ్చిన క్రియ ఆ. 3
వ. చుంబక శిలాప్రతిమం దగులు నయోరూపంబునంబోలె ముని తన సజ్జ
యరుగుదేరు డరుణి రాజ మందరిమునకుం జని (ఆ.5)
ఉ. తేనియబడ్డ యీగగతి ధీరత గోల్పడి బిట్టు
చొక్కతిన్ (ప్రణయ వర్ణన) (ఆ.6)
ఆ. ఏను జోరవృత్తి నిచ్చితినేనియు
మేలి వస్తువైన తోలుతిత్తి
దక్కునెట్లు మీకు గుక్కకు డెంకాయ
దక్కదనిన పలుకు నిక్కమయ్యె॥
యితడు తిక్కన సమకాలికుడనియు క్రీ.శ. 13వ శతాబ్దమందు జీవించిన వాడనియు పండితులు నిరూపించినారు. ఈ యుభయులకు మధ్య సుమారు 500 సంవత్సరముల యంతరాయమున్నది. దండి యాంధ్రుడో కాడో మనకు తెలియదు. దండి గ్రంథమందు జూదము, కోడిపందెము, సముద్రయానము వర్ణింపబడుటచేత నాతని కాలమున నివి జనులందు వాడుకగా నుండెనని చెప్పవచ్చును. ఈ వర్ణనలు తెనుగులో తర్జుమాయై నందున నివి కేతన కాలమున నాంధ్రదేశమందుండెనో లేదోయని సంశయింపబని లేదు. కేతనకు సుమారు 100-200 సంవత్సరాల తర్వాతివాడగు వల్లభరాయుడు తన క్రీడాభిరామమందు ఓరుగంటి పట్టణములో, జూదము, కోడి పందెములు జరిగినట్లు వర్ణించినాడు. కోడిపందెము మొట్టమొదట మన దేశమందే కనిపెట్టబడినది. అమరసింహుడు క్రీస్తు శకాదిలో నుండినాడు, అతడు నిఘంటువునందు కోడికి పర్యాయపదములనిట్లు వ్రాసినాడు.
“కృక వాకస్తామ్రచూడః కుక్కుటశ్చరణాయుధః” ఇందు కోడికి చరణాయుధః అని చెప్పు మాటను జూచిన - నాతని కాలమందే కోళ్ళ పందెములు జరుగుచుండెనని యూహింపవచ్చును. కోళ్ళ పందెమును గుఱించి యొక శాస్త్రమే యున్నది.
ఆంధ్రదేశమందు పందెగ్రాండు నేటికిని కోళ్ళలో కాకిజాతి డేగజాతి నెమిలి జాతి మున్నగున వున్నవనియు నొక్కొక్క జాతి యొక్కొక్క కాలమందింకొక జాతి కోడిపై జయము పొందుననియు శాస్త్రములో వ్రాసికొని పందెములప్పుడు చూచు కొందురు. దశకుమార చరిత్రయందు ఒక జాతి నారికేళ జాతులు వర్ణింపబడినవి. మూలమందు నారికేళ జాతి ఒకజాతి కోడిని గెలిచెనని మాత్రమున్నది. కాని మన కేతన కోళ్ళ యుద్ధమునే వర్ణించినాడు.
సీ. ఎదిరిన కోడి మున్నెనసి యారెలు మెడ
నెసగాడ నురువడి వ్రేసి వ్రేసి
అది వ్రేయ మదికిన్క నడరి బల్పున బట్టి
కబళించి యందంద కదిమి కదిమి
విశిఖ ముఖంబులు వెనువెంట దగులుచు
నంతంత బోనీక యాగి యాగి
వాగాటులకు వచ్చి వసుమతి నిలువక
యొంటి తన్నున గొసరుడిపియుడిపి
గీ॥ గెలిచె నా మాట దగ నారికేళ జాతి
యగ్గలికనంత బ్రజయెల్ల నార్చుచుండె
జెలగి ఒక జాతి మాత్రోపజీవియైన
బ్రాహ్మణుండు నన్నెంతయు బ్రస్తుతించి.
జూదము ఇరువదియైదు విధములదని దండి వర్ణించినాడు. ఆ జూదమందు
అపహారవర్మ పదివేల దీనారముల గెలిచెనట. దీనిచే దండికాలమున దీనారములు
నాణెములుగా విశేష ప్రచారమందుండెనని తెలిసెడి. కేతన తన భాషాంతరీకరణమున
నెందును దీనారముల పేర్కొనలేదు. దానిచే నితని కాలమందివి లేవని కాదు. ఇతని
తర్వాతవాడగు శ్రీనాథుడు.
“దీనారటంకాల తీర్ధ మాడించితి
దక్షిణాధీశు ముత్యాలశాల”
యని చెప్పికొనినాడు.
దండి కథలలో తలవరుల ప్రాముఖ్యము చాల గనబడుచున్నది. నిజాములో బీటు జవానులీ కాలములో చలాయించు నధికారముకన్న జాల హెచ్చుగా నధికారబలము కలవారై యుండిరనవచ్చును. వారు రాత్రికాలమందు కోల దీవటీలతో గస్తీ తిరుగుచు వీధులందు సంచరించు జార చోరులకు గుండె గాలములై ఉండిరి. మన ఆపహారవర్మ (ఈతని కథయే కథలన్నిటిలో రమ్యము) వీరిచే బలు సంకటముల బడినాడు. వారి నుండి తప్పించికొనుటకై ఒక తూరి పాము కఱచినట్లు నటించినాడు. ఈ తలవరులను మూలమందు రక్షకబలమనియు నాగరక బలమనియు వర్ణించియున్నాడు. మన కేతన వీరిని ఆరెకులు, తలవరులు అని తెనిగించినాడు. అయితే యీ తలవరుల యధికారములు దండి కాలమున నుండెనేమో కాని కేతన కాలమున నాంధ్రదేశమున లేకుండెననజాలము. కేతనకు తర్వాత వాడును క్రీ.శ. 1600 ప్రాంతమున నుండిన కదిరీపతి తన శుకసప్తతిలో తలార్లను ననేక స్థలముల వర్ణించినాడు చూడుడు.
క. చుట్టాలకుఁ దెల్పుదు మది
దొట్టిన కినుకం దలార్లతో జెప్పుదు గూ
పెట్టుదు దొరముందర నను
బట్టకుమని పఱవ నతడు బరువగుభీతిన్.
ఉ. అంత తలారు లాత్మవిభు డచ్చటికిం జనుదేర జార వృ
త్తాంతము దెల్ప బట్టుడని యాతడనం గుడి సొచ్చి దివ్విటీల్
చెంతకు దెచ్చి చూచి....
సీ. చనుజక్కవలుగన్న సన్యాసులైనను
దలవరి వారితోఁ జెలిమిసేయ
కావున కేతనకాలమందును దలవరుల పోలీసుతనము విశేషముగానుండెను.
కావుననే
తే. కోలదివియల వెలుగు దిక్కులకు నిగిడి
తొడరి పురివీధి చీకటి దొలగ దోల
బటురయంబున తలవరి బలమురాక
చూచి యొక్కింత చిత్త సంక్షోభ మెసగ.
అని వర్ణించినాడు.
చోరులనేగాక జారులను గూడ బట్టు నధికారము తలవరులకు నుండెనని
తెలిపితిమి. ఈ యాచారమును గుఱించి యెన్నటి విషయమో త్రవ్వనేల నిన్న మొన్నటి
వఱకు గద్వాల సంస్థానములో గణాచారిగుత్తయని యొకటి రాజు లేర్పాటు
చేసియుండిరి. ప్రతి గ్రామము గుత్తను నొకడు తీసుకొని యా మొత్తమును రాజుగారికి
చెల్లించును. గుత్త తీసుకొన్న వాడా గ్రామమందెవ్వరైనా వ్యభిచరించినట్లు తలార్లవలన
గుర్తెరిగిన వారి నుండి తాను దండుగలు తీసుకొనుచుండెడివాడు. ఈ గుత్తనే గణాచారి
గుత్తాయని వ్యవహరించుచుండిరి.
జైన మతము దండి కాలమునందును కేతన కాలములోను బ్రచార
మందుండెననియు జైనులు బ్రాహ్మణ దూషకులునై యుండిరని దెలియవచ్చెడి. కేతన
జైన వేషమును వర్ణించుటచేత నాతని కాలమందు జైన వేషాచారము లెట్లుండెనో
వివరముగా తెలియవచ్చెడి.
దండి కాలమందును కేతన కాలమందును స్త్రీలు సాధారణముగా నెట్టి
సొమ్ములు పెట్టుకొనుచుండిరో యీ క్రింది యుదాహరణముల వలన దెలియగలదు. “ఆహ మపి మణి నూపుర మేఖలా కంకణ కటక తాటంక హార మరాకజ్జల
వనితా యోగ్యం మండన జాతం నిపుణత యాతత్త స్థానేఘ నిక్షిప్య” అని దండి
వర్ణించినాడు.
సీ. మట్టియ లుజ్జ్వల మణి నూపురంబులు
మొలనూలు వస్త్రముల్ ముత్తియములు
కన్న వడంబులు గట్టి నూళ్ళాను సుద్ద
సరితీగె మినుకులు సంది దండ
నంగుళీయములు హారి కంకణములు
చేకట్టు పాలెలు చెన్ను మెఱుగు
టాకులు సరిపెణ లాలక్తకము పూత
కాటుక తిలకంబు కమ్మపువ్వు
తే. లాదిగా గల మేలిద్రవ్యముల నొప్ప
బసదనము చేసి యుచిత రూపంబు దాల్చి
బాలచంద్రిక బోటినై పజ్జ కరిగి
దారువర్ముని లోగిలి దరియ జొచ్చి.
ఈ పద్యమందు పెద్ద అక్షరాలు మూలమున కనుకూలములు. తక్కినవన్నియు
కేతన చేర్చినవే. ఇవి బాగుగా గమనింపదగినవి. కేతన కాలమందీ యలంకారములనే
ఆంధ్ర స్త్రీలలంకరించుకొనుచుండిరి. భూషణముల పేర్లు విశేషముగా నచ్చ తెనుగు
పదములు. ఈ భూషణములు నేటికిని మన యాంధ్ర స్త్రీలు పాటించుచున్నారు.
ఇది యాంధ్ర దశకుమార చరిత్ర మందు నాకు దోచిన విశేషములు. ఈ
కవి శైలి విషయము నేను ప్రత్యేకముగా నిరూపించనవసరము లేదు. కేతనయే
వ్రాసికొనిన యీ పద్యము నుదాహరించిన జాలును.
ఆ. కవితఁ జెప్పి యుభయ కవి మిత్రు మెప్పింప
నరిది బ్రహ్మకైన నతడు మెచ్చ
బరగ దశకుమార చరితంబు జెప్పిన
ప్రోడ నన్ను వేఱ పొగడనేల.
నుండిన వారు తప్పక యా గ్రంథమునైన దిలకింతురని గోరుచున్నాను. ఈ దశకుమార చరిత్రమున కుత్తమముగా బీఠికను శ్రీ శేషాద్రి రమణ కవులు వ్రాసియున్నారు. దాని నవశ్యము పాఠకులు చదువుదురని మనవి.
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse