Jump to content

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/తెలుగు వాజ్మయంలో హాస్యరసం

వికీసోర్స్ నుండి

తెలుగు వాఙ్మయంలో హాస్యరసము

నవరసములలో హాస్యరసమొకటియని భరతుని కాలమునుండియు ఆలంకారికులందరున్నూ అంగీకరించినారు. హాస్యమన నేమియో అందరెఱుగుదురు.

“సచ వికృతపరవేషాలంకార దార్ష్ట్య లౌల్య కుహకాసత్ర్పలాప వ్యంగ్య దర్శన దోషోదాహరణాదిభిర్విభావై రుత్పద్యతే”. అది ఆరువిధాలు. 1. స్మితం, 2. హసితం, 3. విహసితం, 4. ఉపహసితం, 5. అపహసితం 6. అతిహసితం అని ఇతరులను అనుసరించుట, వికృతముగా నాచరించుట, వ్యంగ్యముగా సంభాషించుట, పరదోషముల హేళనము చేయుట ఇట్టివన్నియు హాస్యమనబడును.

సంస్కృత వాఙ్మయములోనే హాస్యరసము తక్కువ. అది కావ్యాలలో పరిశోధించితే కాని కనబడదు. నాటకాలలో హాస్యానికిగాను విదూషకుని ప్రత్యేకముగా సృష్టించిరి. కాని వాడెల్లప్పుడును తిండిపోతు బాపడై యుండెను. భాణములలో హాస్యమును ప్రధానముగా పోషించదలచిరి. కాని యదంతయు పచ్చి బూతుల పంచాంగముగా పరిణమించెను. చాటువులలోను బూతులను వదలితే మిగిలిన హాస్యము తక్కువే.

ఇదే మర్యాద తెనుగునకునూ వర్తించునని స్థూలముగా చెప్పవచ్చును. తెనుగు ప్రబంధాలలోను పురాణాలలోను హాస్యము చాలా తక్కువ. నాటకాలు నిన్న మొన్నటివరకు లేకపోయెను. వాటికి బదులుగా శతకాలు వ్రాసిరి. అందులో కొన్నిటియందు హాస్యరసము కనబడుచున్నది. చాటువులలోనే యెక్కువగా హాస్యరసము నిండియున్నది.

హాస్యానికి తెనుగువారు ప్రసిద్ధి. తెనాలి రామలింగడు జగద్విఖ్యాతుడు. మర్యాద రామన్న కూడా తెనుగువాడేమో? అక్బరు చక్రవర్తి విదూషకుడై యుండిన వీరబలుడు (బీర్బల్‌) గోదావరి డెల్టాలో పుట్టి పెరిగిన తెనుగువాడని చాలామందికి తెలియనే తెలియదు. ఇట్లుండినను తెలుగు సాహిత్యములో హాస్యసము విరివిగా కానరాకుండుట యెందులకు? పలువురు తెనుగు విద్వాంసులు హాస్యమంటే పచ్చి శృంగారమని భాణములను చూచి భ్రమపడిరి. అందుచేతనే తెనుగు సాహిత్యములో శృంగారాతిశయ వర్ణనలందును, జుగుప్సా వర్ణనలందును హాస్యమును సాధింపజూచినారు.

శతక వాఙ్మయములో హాస్యము కొంతవరకు కనపడుతున్నది. చంద్రశేఖర శతకము ముఖ్యముగా పేర్కొనదగినది. కాని దాని కర్త యెవరో తెలియదు. భాష నెల్లూరి యాస. రామలింగేశ శతకములోను, కుక్కటేశ్వర శతకములోను కొన్ని మంచి భాగాలు కలవు. వేణుగోపాల శతకము బాగున్నది. కాని తత్కర్త తిట్టనిది నవ్వింపలేడు. కవి చౌడప్ప సరేసరి. పుస్తకమంతా బూతుల బుంగయే. భాషీయ దండకము 200 ఏండ్ల నాటిది. కర్నూలు జిల్లా భాష అందు కలదు. అది బాగానే యున్నది.

ఇక పురాణ ప్రబంధాలను గురించి విచారింతము. పురాణాలు సంస్కృతము నుండి పరివర్తనము చేయబడినట్టి ఇతిహాసాదికములు. అందు హాస్య రసమునకు తావు లేదు. అయినను మన తెనుగు భారతములో అందందు మూలములో లేనట్టి హాస్య రసమును తిక్కన సోమయాజిగారు పోషించినారు. కీచకుని చంపుటకై ద్రౌపదికి మారుగా నర్తనశాలలో చీకటిలో భీముడు కాచుకొనియున్నాడు. కీచకుడు కామావేశముతో ద్రౌపదియే అందు కలదని తన కామ వికారమును ప్రకటించుకొనును. అప్పుడు భీముడిట్లనును.


ఇట్టివాడవు కావున నీవు నిన్ను
బొగడికొనదగు నకట నా పోల్కియాడు
దాని వెదకియు నెయ్యడనైన నీకు
బడయ వచ్చునె యెఱుగక పలికితిట్లు.

నా యొడలు సేర్చి నప్పుడ
నీ యొడ లెట్లగునొ దాని నీ వెరిగెదు న
న్నే యబలల తోడిదిగా
జేయదలంచితివి తప్పు సేసితి గంటే.


నను ముట్టి నీవు వెండియు
వనితల సంగతికి బోవు వాడవె యైనం
దను వేఁ బడసినఫలమే
కనియెద విదె చిత్తభవ వికారములెల్లన్‌.


కీచకుని దౌర్జన్యమును విరాటుని సభలో ద్రౌపది చెప్పుకొనినను ఎవ్వరున్నూ వినలేదు. ధర్మరాజు ఆమెతో నీవేమి నాట్యకత్తెవా? ఇకపో అని మందలింపగా ద్రౌపది నర్మోక్తిగా నిట్లు పలికెను.


“నాదు వల్లభుండు నటుడింత నిక్కంబు
పెద్దవారి యట్ల పిన్నవారు
గాన పతుల విధమకాక యే శైలూషి
గాననంగ రాదు కంకభట్ట.


అట్లగుటం జేసి నాకు నాట్యంబులునుం బరిచితంబ, మత్పతి శైలూషుండ కాడు. కితవుండునుం గావున జూదరియాలికి గరువతనం బెక్కిడిది”.

ఇదంతయూ గూడ మూలములో లేనట్టిది. శ్రీకృష్ణరాయబారమప్పుడు కృష్ణుడు భీమునితో సరసమాడుట, ద్రోణుని భీముడాక్షేపించుట, కర్ణుడు భీముని నిందించుట, ఇట్టి ఘట్టములు భారతములోపలుతావుల కాననగును. నాచన సోముడు ఊర్వశీ నరకాసురుల సంభాషణమందును, హంస డింభకోపాఖ్యాన మందును హాస్యరసమును చాలా యుత్కృష్టముగా పోషించినాడు. తెనాలి రామకృష్ణుని నిగమశర్మోపాఖ్యానములో హాస్యపుజాడ కానవచ్చును. గౌరన తన హరిశ్చంద్రలో కాలకౌశికుడు, వీరబాహువు, నక్షత్రకుడు అనుపాత్రల పోషించునప్పుడు హాస్యమును ప్రదర్శించినాడు. హరిశ్చంద్రుని వీరబాహు విట్లు వెక్కిరించెను.


"...... ... ఈ రాజు
సుకవాసి, పని పంద, చూపు గుఱ్ఱంబు
మామిడి క్రింది సోమరి, మేదకుండు
బూమె తుంటరి, ఎనుబోతుపైన వాన,
మొండరి, చల్లచప్పుడు, గోడ చేర్పు
చండిపోతు నట్టి జాడనున్నాడు -

ఇట్టి శబ్ద చిత్రములు కొంతవఱకు పాలకుర్కి సోమనాథునిలో కూడ

కనబడుచున్నవి. చేమకూర వెంకటకవి రెండు కావ్యాలలోను కొంతవరకు హాస్యము న్ఫురించుచున్నది. కదిరీపతి తన శుకనప్తతిలో తేలికయగు హాస్యమును గ్రంథమంతటను నింపియుండుటచేత దానికి తెనుగు సాహిత్యములో ఒక విశిష్టత యేర్చడుచున్నది. రంకు కథలు కాకుండినచో శుకసప్తతి తెనుగు వాఙ్మయములో అగ్రస్థానము వహించి యుండెడిది. శ్రీనాథునిలో అందందు హాస్యము కానవచ్చును. కాని విశేష భాగము పచ్చి శృంగారమే. బువ్వపు బంతి మున్నగు శృంగార నైషధ ఘట్టములట్టివే, వల్లభరాయని క్రీడాభిరామములోను ఇదే అవస్థ, కోళ్ళ పందెములోను, పొట్టేళ్ళ పందెములోను చచ్చినవాటికై కవి విలపించి శ్రోతల నవ్వించిన భాగాలు అందముగా నున్నవి.

జగ్గకవి తన చంద్రరేఖా విలాపమును హాస్యరస ప్రబంధరాజము అని వర్ణించుకొనెను. కాని గ్రంథమంతయు పచ్చిబూతులతో నిండినది.


నీతులకేమి యొకించుక
బూతాడక దొరకునవ్వు పుట్టదు ధరలో


అన్న కవిచౌడప్ప ఇతని కాదర్శకవిగా కనబడుచున్నాడు. కాని


పదినీతులు పదిబూతులు
పది శృంగారములు గల్గు పద్యములు


చౌడప్ప వ్రాసెను. ఇందునీతులే లేవు. అందుచేత అచ్చన బుచ్చనలోపల అచ్చనయే మేలు అన్నట్లు చౌడప్పయే మేలు రకమువాడు.


ఇక మరొక్కని గూర్చి ప్రశంసింపవలసి యున్నది. అతడు వేమన. అతని పద్యాలలో నీతులును, హాస్యమున్నూ మేళవించి యున్నవి. అతని పద్యాలలోనూ కొన్ని బూతుపద్యాలు ఉన్నవి. అట్టివి అతని పేరుతో స్వార్థులు రచించినట్లున్నది. చాటువులలో మంచి హాస్యమున్నది. హాస్యరసమును గ్రోలదలచిన వారు చాటువులను చదువవలయును కొన్ని యుదహరింతును -


లంక పొగాకును తెచ్చియు
పొంకముగా సున్నమేసి పొడిచేసిరయా


పంకజనాభుడు నూరెను
శంకరుడది పీల్చి పీల్చి శాభాస్‌ అనియెన్‌॥,

మంచిదినమునాడు మంగలి దొరకక
చంద్రశేఖరుండు జడలు దాల్చె
కొండియేమొ కట్టె గోపాలదేవుండు
బ్రహ్మదేవుడెన్ని పాట్లు పడెనొ!

శివుడద్రిని శయనించుట
రవిచంద్రులు మింటనుంట రాజీవాక్షుం
డవిరళముగ శేషునిపై
పవళించుట నల్లిబాధపడలేక సుమీ॥

చాకివానిచేత జగడాలు పడలేక
సిరిగలాడు పట్టుచీర కట్టె
శివుడు తోలుకప్పె సీ! యని మదిరోసి
భైరవుండు చీర పారవైచె.


అన్యాపదేశ పదములను చేర్చి చమత్కరించుట ఒక హాస్యము. హైదరాబాదు అగ్రహారికుడు తన అగ్రహార స్థితిని జంగలాత్‌ అధికారికి తౌరక్యాంధ్ర సంస్కృత భాషల సమ్మేళనముతో కూడిన శ్లోకాలతో ఇట్లు మనవి చేసుకొనెను.


ఫలం లేదు మజ్కూర్ కలం బందుహాల్‌ సాల్‌
అలంమోదగాకుల్‌ క్వచిత్‌ టేకుమాకుల్‌
అవుర్‌కోయ కొంపల్‌ మరీమాల కొంపల్‌
హయేముళ్ళ కంపల్‌ హమారే గ్రహారే.

తుమారా జవానుల్‌ హమారే గ్రహారే
కదాపీహిదంగా సజా చేయకుండన్‌
హుకుందీయతాం నౌహకం చాపిదద్యాత్‌
ఖుదాతే ముదేస్తాత్ సదాజంగలీశ॥

ఆధునిక వాఙ్మయములో వచనములోను నాటకాలలోను హాస్యరసమును

ప్రధానముగా పోషించినవారు పలువురు కలరు. వీరేశలింగంగారి ప్రహసనాలు సాధారణమైనవే. చిలకమర్తివారు తమవి ప్రహసనాలని చెప్పినందున తెలియవచ్చినవి. పానుగంటి వారి సాక్షి ఒక భాగము చదివితే వారి రచనలన్నీ చదివినట్లే. బారిష్టర్‌ పార్వతీశం ఉత్తమోత్తమ హాస్యరస గ్రంథరాజము. కాని అది నేటికి అసంపూర్తిగానే ఉన్నది. మునిమాణిక్యాంగొరక్కరే గృహజీవనమును లలిత హాస్యముతో వర్ణించినారు. వేంకటరాయశాస్త్రిగారి ప్రతాపరుద్రీయము అద్భుత హాస్య రస ప్రపూరితము. ధర్మవరం కృష్ణమాచార్యులందందు హాస్య రంగములను రచించిరి. ఇటీవల మల్లాది అవధానిగారు హాస్యరచనల రచించిరి. కాని తల్లితో వసంత మాడినట్లు వారు గుడిపాటివారి వలె పురాణ పురుషులను అవహేళనము చేయజూచిరి. భమిడిపాటి కామేశ్వరరావుగారి రచనలలో హాస్యమున్నది. వ్యావహారిక భాషా మకుటమగు కన్యాశుల్కాన్ని ఎవరున్నూ మరువకూడదు - కాని ఇంగ్లీషు డొక్కశుద్ధి కలవారే దాన్ని ఆనందించగలుగుతారు. గిరీశాన్ని, పేరిగానిని, యెంకిని, కాంతమ్మను, జంఘాలశాస్త్రిని, పార్వతీశాన్ని కిన్నెరసానిని సృష్టించి ఆంధ్రులను ఆనందసాగర తరంగములపై ఓలలాడించిన కవి కుమారులు అపారమగు భాషాసేవ చేసినట్టి సిద్ధహస్తులు; అయినను ఆధునికాంధ్ర వాఙ్మయములో హాస్యరసము ఇంకా ప్రారంభ దశలోనే యున్నదని చెప్పవలెను.


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse